కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధి పొందిన సమకాలీకులు కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. శ్యామ శాస్త్రులు వీరి మువ్వురిలో పెద్దవారు. ఈయన సంగీతానికి పుట్టిల్లైన తంజావూరు దగ్గరి తిరువారూరులో విశ్వనాథ అయ్యరు, వేంగలక్ష్మి దంపతులకు 1762 (కొన్ని మూలాల్లో 1763గా ఉంది) జన్మించాడు. వేంకటసుబ్రహ్మణ్య అయ్యరుగా నామకరణం చేయబడినా, శ్యామకృష్ణ అన్న ముద్దు పేరుతో పిలువబడ్డాడు.వీరి కులదైవము తంజావూరులో ఉన్న బంగారు కామాక్షీ దేవి. శ్యామకృష్ణులు పసిప్రాయంలోనే తెలుగు, సంస్కృతము, తమిళ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే నారదులు ఈయనపై అనుగ్రహించి సంగీతస్వామి అనే సన్యాసి రూపంలో వీరి ఇంటికి వచ్చి, ఈ బాలునిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి, శ్యామకృష్ణునికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తంజావూరు శరభోజీ మహారాజు మన్ననలు పొందినా శ్యామశాస్త్రులు పెద్దగా శిష్యవారసత్వాన్ని సమకూర్చుకునే ఆసక్తి చూపలేదు.
శ్యామశాస్త్రులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వలెనే అనేక క్షేత్రాలను దర్శించి అక్కడ వెలసిన దేవతా స్వరూపాలను నుతించారు. మదురై మీనాక్షి, తంజావూరు బంగారు కామాక్షిలపై శ్యామశాస్త్రులు ఎన్నో కీర్తనలు రచించారు. అలాగే, తంజావూరు బృహదీశ్వరుని నాయికయైన బృహన్నాయకీ దేవిపై ఆనందభైరవిలో 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము', మధ్యమావతిలో 'బృహన్నాయకి నన్ను బ్రోవు వేగమే' వంటి అద్భుతమైన కీర్తనలను రచించారు. ఆనందభైరవి ఆయనకు ప్రాణప్రదమైన రాగం. ఆ ఆనందభైరవిలో ఆయన విశేషమైన కృతులను రచించారు. వాటిలో బాగా ప్రచారం పొందినది 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము రావే' అన్న కృతి. దానిని పరిశీలిద్దాం.
హిమాచల తనయ! బ్రోచుటకిది మంచి సమయము రావే అంబా!
కుమార జననీ సమానమెవరిలను!! మానవతి! శ్రీ బృహన్నాయకి!
సరోజముఖి! బిరాన నీవు వరాలొసగుమని నేను వేడితి!
పురారి హరి సురేంద్రనుత! పురాణి! పరాముఖమేలనే తల్లి!
ఉమా! హంసగమా! తామసమా? బ్రోవ దిక్కెవ్వరు? నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు! భారమా? వినుమా దయతోను!
సదా నత వరదాయకి! నిజ దాసుడను! శ్యామక్రృష్ణ సోదరి
గదా! మొర వినవా!! దురిత విదారిణి! శ్రీ బృహన్నాయకి!
ఆది పరాశక్తి రూపమైన బంగారు కామాక్షి సాక్షాత్కారం పొందిన వాగ్గేయకారులు శ్యామశాస్త్రి. అందుకే అమ్మతో సంభాషణలు, ప్రశ్నించే ధోరణి, శరణాగతి మొదలైన అనేక భావనలను ఆయన తన కృతులలో వ్యక్త పరచారు. హిమవంతుని పుత్రిక అయిన పార్వతీ దేవిని ఈ కృతిలో తన మొరలు విని కాపాడుమని వేడుకుంటున్నారు. కుమారస్వామి తల్లి అయిన ఆ పార్వతీదేవికి ఈ విశ్వంలో సమానమెవరు అని నుతించారు. తంజావూరు బృహదీశ్వరాలయం వెళితే అక్కడ అమ్మ బృహన్నాయకిగా దర్శనమిస్తుంది. ఆ తల్లిని ఈ కృతిలో శ్యామశాస్త్రుల వారు పలుమార్లు ప్రస్తావించారు. "కలువవంటి ముఖము గల అమ్మవు, నిన్ను త్వరగా వరములివ్వమని వేడుకున్నాను, శివుడు, విష్ణువు, ఇంద్రులచే నుతించబడిన అమ్మవు, పురాణములలో చెప్పబడిన తల్లివి, నావైపు కరుణతో కూడిన చూపులనెందుకు ప్రసాదించవు" అని ప్రశ్నించారు. "ఓ పార్వతీ దేవి! హంసలా నడిచే తల్లీ! నాపై కోపమా? నువ్వు తప్ప నన్ను బ్రోచే దిక్కెవ్వరు? నిశ్చయముగా నాపై అభిమానము చూపుము తల్లీ! నేనొక భారమా నీకు, నా మొరలను దయతో వినుము" అని వేడుకున్నారు. "వేడుకునే వారికి ఎల్లప్పుడూ వరాలనొసగే తల్లివి! నీ నిజదాసుడను నేను. నువ్వు నల్లనయ్య శ్రీకృష్ణుని సోదరివి కదా! నా మొర వినవా! మా కష్టాలను తొలగించే బృహన్నాయకీ!" అని ప్రస్తుతించారు.
శ్యామశాస్త్రుల వారి సాహితీ వైభవంలో ఆధ్యాత్మికత, తెలుగుదనం గుబాళిస్తాయి. ఇవే ఆయన రచనలకు ఓ ప్రత్యేకతనించ్చి సంగీత త్రయంలో ఒక్కరిగా నిలిచేలా చేశాయి. ఆనందభైరవి రాగం సప్తస్వర సంపూర్ణమై వినేవారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాగానికి ప్రాణం పోసి ప్రాచుర్యానిచ్చింది శ్యామశాస్త్రుల వారే. ఈ రాగానికి రోగాలను నియంత్రించే అపూర్వమైన శక్తి ఉందని సంగీత వైద్యశాస్త్ర నిపుణుల పరిశోధనలు తెలుపుతున్నాయి. రక్తపోటు, కృంగుబాటు మొదలైన రుగ్మతల నియంత్రణకు ఈ రాగం ఉపయోగకరమని వారి అభిప్రాయం. మాధుర్య ప్రధానమైన ఈ రాగం ఆనందదాయకమై సంతృప్తిని కలుగుజేస్తుందని వారి నమ్మకం. వివాహాలలో శుభకరంగా ఈ రాగాన్ని ఆలపించటం ఓ సాంప్రదాయం. ఎన్నో చలన చిత్ర గీతాలు కూడా ఆనందభైరవి రాగంలో వచ్చాయి. శ్యామశాస్త్రి వారిదే మరో రచన మరి వేరే గతి యెవరమ్మా అన్న కీర్తన ఈ ఆనందకరమైన భావనతోనే మనసును ఆహ్లాదపరచేలా ఉంటుంది. అందుకే ఆనందభైరవి అనగానే శ్యామశాస్త్రి వారు గుర్తుకు వస్తారు. ఈ కృతిని సౌమ్య గారి గాత్రంలో వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి