అల్లా...ఇది ఇస్లాంలో దేవుడు అనటానికి ఉపయోగించే పదం. ఈ పదానికి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో శంకరభట్టుగారు అద్భుతమైన వివరణ ఇచ్చారు - అల్ అనగా శక్తి, ఆహ్ అనగా శక్తిని ధరించివాడు. అనగా శివపార్వతుల అర్థనారీశ్వర రూపం ఎలానో అల్లా పదం అంతే. దైవం అంటే ఏ విశ్వాసంలోనైనా ఒకటే అన్నదానికి ఈ అర్థం ఓ మంచి ప్రాతిపాదిక అవుతుంది. కబీర్ దాస్ ఇస్లాం మతాన్ని విశ్వసించే కుటుంబంలో జన్మించినా హిందూ సిఖ్ ఇస్లాంలలోని మంచి
సిద్ధాంతాలను మాత్రమే తీసుకొని దురాచారాలను ఖండించాడు. హిందూ మత సిద్ధాంతాలకు ఆయనకు గురువు స్వామి రామానంద. ఆయన వద్ద తారక మంత్ర ఉపదేశాన్ని పొందిన కబీర్ భారతదేశంలో అనేక చోట్ల పర్యటించారు. అలాగే అల్లా అనే పదం యొక్క అర్థాన్ని సంపూర్ణంగా మతాలకు అతీతంగా ఆకళింపు చేసుకున్న మహానుభావుడు కబీర్. మానవుని జీవితానికి ముఖ్యమైన విలువలను స్పష్టంగా తన దోహాల రూపంలో మనకు అందించారు. వృత్తి రీత్యా చేనేత కార్మికుడైనా, భక్తిలో రాముని దర్శించి తరించిన వాడు కబీర్. తారక మంత్ర సిద్ధిని పొంది ఎందరికో దాని అమృతాన్ని అందించాడు. ఒక రకంగా చెప్పాలంటే కబీర్ 15వ శతాబ్దపు సంఘసంస్కర్త.
కబీర్‌దాసు మన తెలుగునాట జన్మించిన రామదాసుకు తారమంత్రాన్ని ఉపదేశించిన గురువని చెప్పబడింది. ఆ కబీర్-రామదాసుల కలయిక,మంత్రోపదేశ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా శ్రీరామదాసు సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో వారిద్దరు తొలిసారు కలిసే ఘట్టంలో ఓ సుమధుర భక్తి గీతం వెలువడింది. కీరవాణి సంగీతంలో శ్రీవేదవ్యాస గారు రచించగా శంకర్ మహదేవన్ మరియు విజయ్ యేసుదాస్ ఈ పాటను రామదాసు, మరియు కబీర్ పాత్రలకు పాడారు. వివరాలు పరిశీలిద్దాం:
అల్లా ... శ్రీ రామా...
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణఘనుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీరామనామామృతం ఆనామమే దాటించు భవ సాగరం
తాగరా శ్రీ రామనామామృతం ఆనామమే దాటించు భవ సాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలిసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఏ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి
తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...
పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండ రామా
మపనిసరి సానీ పానీపామా సీతారామా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా ఆనందరామా
మా మా రిమరిమరి సరిమా రామా జయరామా
సరిమా రామా సపమా రామా
పా ఆ ఆ ఆ వన రామా
ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు
ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు
ఏ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు
తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...
రాముడెవరు? శుభాన్ని కలిగించే వాడు, అందమైన రూపము కలవాడు, పాపములను హరించే వాడు. సమస్త సద్గుణములను కలిగిన గొప్పవాడు, కరుణ మూర్తీభవించిన వాడు - ఇంతవరకు బానే ఉంది, అందరికీ అర్థమవుతుంది. మరి అల్లా తత్త్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవరు? అన్నాడు కవి. అల్లా తత్వమేమిటి? శక్తియుతమైన శివమని పైన చెప్పుకున్నాం కదా? రాముడి నామంలోనే ఉంది మూలమంతా. మళ్లీ శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రకే వెళితే రాం అనే పదానికి అగ్ని బీజం. ఇదే విషయం రామరహస్యోపనిషత్తులో కూడా చెప్పబడింది. అత్యంత శక్తివంతమైన రామ నామం శివకేశవుల శక్తి సమన్వితమై ఈ విశ్వంలో పరమాత్మ తత్త్వాన్ని ప్రసరింపజేస్తోంది. పరమాత్మ తత్వంలో ప్రకాశించే వాడు రామచంద్రుడు. ఆ రాముడి ఘనత ఎటువంటిది? ఆనందరాముడు, అమృతర్సంతో నిండి యున్న వాడు. ఆ రామ నామమనే అమృతాన్ని త్రాగమని కవి ఘోషిస్తున్నారు. ఆ నామాన్ని నమ్ముకుంటే చాలు, ఈ భవ సాగరాన్ని దాటగలము అని చెప్పారు.
త్రిమూర్తులుగా వెలసిన పరమాత్మ ఆ రాముడు. ఈ మూడులోకాలకు ఆయనే మూలము. ఆయన విశ్వజనీనమైన శక్తి యొక్క చైతన్యరూపము. ఆయనే సమస్త లోకములలోని జీవరాశులకు సత్యము, శాశ్వతము, కారకము. ఆయనే మోక్ష ప్రదాయకుడు. సత్య ధర్మ పాలనలో సమ న్యాయం చూపించే వాడు. ఆ రామచంద్రమూర్తి మూడు లోకాలకు ఏకైక చక్రవర్తి. ఆయన ఘనమైన రూపము కలవాడు, తన గుణములచే కీర్తిని పొందిన వాడు. ఆ రామచంద్రుడు జన్మ జన్మల ఆర్తిని హరించే వాడు. ఒక రూపమంటూ లేని వాడు, సమస్త రసములను మూర్తీభవించిన వాడు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. ఆ రాముని నామమనే అమృతాని త్రాగమని కవి చెబుతున్నారు. ఆ నామం మనలను సంసార సాగరాన్ని దాటించే నావ.
శ్రీరాముడు కోదండరాముడు, సీతారాముడు, ఆనందరాముడు, జయరాముడు. ఆయన ఘంత ఎలాంటిది? సమస్త దేవతలు కొలిచెడి దేవుడు ఆ రాముడు. ఆయన పదునాలుగు లోకాలకు దేవుడు. ఆయన నిట్టూర్పులతో ఈ భువిని నిలిపే దైవము. ఆయనే సమస్త కళ్యానములను ప్రసాదించే దైవము. ఆయన తత్త్వము సమస్త శాస్త్రాలను తెలిపేది. ఆయన నింగి నేల అంతటా వ్యాపించి ఉన్న దైవము. ఆయన మహా ప్రకాశవంతమైన దైవము, ఆయన రూపము మనోహరమైనది. ఆయన విజయాలు అప్రతిహతమైనవి. సీతమ్మ ప్రేమకు, ఆలోచనలను తెలిపేది ఆ రమచంద్రుడు. అటువంటి రాముని నామమనే అమృతాన్ని త్రాగమని కవి ఉద్ఘాటిస్తున్నారు. ఆ నామం మనలను ఈ సంసార బాధలనుండి రక్షిస్తుంది.
ఈ పాటను లోతుగా పరిశీలిస్తే రామతత్త్వం ఎంతటి మహత్కరమైనదో తెలుస్తుంది. ధర్మం మూర్తీభవించిన వాడు రాముడైతే అనుగమించిన సీత లోకపావని. అందుకే ఈ అవతారం శక్తి సమన్వితమై లోకోత్తరమైంది. ప్రతి అడుగులోనూ మానవునికి ఉత్తమ విలువలను నేర్పిన వారు సీతారాములు. తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సేవకులు, శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాలో రామాయణం మనకు చక్కగా వివరిస్తుంది. విలువలనే ఓ చిత్రపటం గీస్తే అది రాముని రూపమై ఆవిష్కరిస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. అలా నడచుకున్నాడు కాబట్టే ఆయన నామం అంత గొప్పది. రామనామంతో తరించిన మహనీయులను మనం ఎంచలేము. మన పాపాలను హరించేది, మనలను తరించేది, మనకు ముక్తిని ప్రసాదించేది అని త్యాగరాజ స్వామి వంటి మహనీయులు ఎందరో తెలిపారు. రామావతారంతో మనకు అవగతమయ్యే సత్యాలు కొన్ని ఉన్నాయి:
1. ధర్మాన్ని తు.చ. తప్పకుండా ఆచరించే మానవుడు దివ్యాత్వన్ని పొంది ముల్లోక వంద్యుడవుతాడు.
2. అటువంటి దివ్యమూర్తుల నామ స్మరణతో మన పాపాలు హరింపబడతాయి.
3. వారి నడవడిక మనకు జీవితంలో సాధనాలుగా తోడ్పడి మనలను స్థితప్రజ్ఞులను చేస్తాయి.
రామ పూర్వతాపిన్యుపనిషత్ రాముడే పరబ్రహ్మమని స్పష్టంగా చెబుతుంది:
రామ ఏవ పరం బ్రహ్మ రామ ఏవ పరం తపః
రామ ఏవ పరం తత్త్వం శ్రీరామో బ్రహ్మ తారకం
రాముడే పరబ్రహ్మము. రాముడే పరమ తపము. రాముడే పరతత్త్వము. శ్రీరాముడే తారక బ్రహ్మము.
అటువంటి రామమంత్రాన్ని మించినది మరొకటి లేదని ఎందరో చెప్పారు. అగస్త్య సంహిత ప్రకారం రామమంత్రమే మంత్రరాజం. అది సర్వోత్తమమైన మంత్రం. దూదికొండలను ఒక చిన్న నిప్పురవ్వ ఎలా దహిస్తుందో అలా కాటుకొండలవంటి పాపములను రామ నామము దహించివేస్తుందని ఈ సంహిత చెప్పింది. స్త్రీపురుష భేదం లేకుండా అందరూ ఈ మంత్రాన్ని జపించవచ్చని ఈ సంహిత తెలుపుతుంది. ఈ సందేశాన్ని వేదవ్యాస గారి ఈ గీతం సామాన్యునికి అర్థమయ్యేలా చాటింది. రామ నామే జీవనంగా, భుక్తిగా, ముక్తిగా భావించి తరించ వారిలో కబీర్ దాసు అగ్రగణ్యులు. అలాగే వాగ్గేయకారులైన త్యాగరాజస్వామి, రామదాసు, అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలలో రామ మంత్ర మహాత్మ్యాన్ని చాటారు. అటువంటి కబీర్-రామదాసుల కలయికలో ఇటువంటి గీతాన్ని ఆవిష్కరించటం వేదవ్యాస గారి ప్రతిభను మనకు తెలియజేస్తుంది.
ఇటీవలి కాలంలో రామునిపై వచ్చిన సినీ గీతాలలో ఈ తాగరా శ్రీరామ నామామృతం అనే పాట అత్యంత మహిమాన్వితమైన సందేశం కలది. రచయిత వేదవ్యాస రంగభట్టర్ గారి కౌశలం ఈ పాటలో ప్రతి ఒక్క అక్షరంలోనూ కనబడుతుంది. శ్రీమంజునాథ చిత్రంలో మహా ప్రాణ దీపం అనే గీతం గుర్తుందా? ఈ వేదవ్యాస గారు రచించిందే. ఇటువంటి గీతం రచించాలంటే తప్పకుండా దైవానుగ్రహం కలిగి ఉండాలి. వేదవ్యాస గారు భగవద్రామానుజుల వారి శిష్యుని వంశంలో జన్మించిన వారు. వీరి పూర్వీకులది శ్రీరంగం. దశాబ్దాల క్రితం వరంగల్‌కు తరలి వచ్చారు. ఈయన హైదరాబాదులోని వేదాంత వర్ధని సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత టీటీడి సంస్కృత ప్రాచ్య కళాశలలో అధ్యాపకునిగా చేరి 36 సంవత్సరాల సర్వీసు తరువాత పదవీ విరమణ చేసి తిరుపతిలోనే స్థిరపడ్డారు. చదువుకునే రోజుల్లోనే కర్ణాటక శాస్త్రీయ సంగీత శిక్షణ పొందారు. తరువాత తిరుపతిలో సంగీతాన్ని అభ్యసించారు. ఆయన స్వరజ్ఞాన వర్ధిని అనే అద్భుతమైన గ్రంథాన్ని కూడా రచించారు. సంగీతంలో ఎందరికో శిక్షణనిచ్చారు. రామదాసు, వేంగమాంబ, ఆదిశంకరాచార్య చిత్రాలకు ఉత్తమ గేయ రచయిత అవార్డులను పొందారు. గతంలో వీరు కేవీ మహదేవన్, సాలూరి రాజేశ్వరరావు గారి వద్ద పని చేశారు. సంగీతంపై ఎన్నో పరిశోధనలు చేసిన వీరు ఇప్పటికీ ఔత్సహిక కళాకారులకు, బాలబాలికాలు శిక్షణనిస్తున్నారు. ఎందరో నటీనటులకు నటనలో శిక్షణ కూడా ఇస్తున్నారు. వేదవ్యాస రంగభట్టర్ గారి కలంలో వెలువడిన ఈ గీతం తెలుగు చలన చిత్ర భక్తి గీతాల్లో ఓ ప్రత్యేక స్థానంలో ఉంటుంది.
రామమంత్ర మహత్తును వేదవ్యాస గారు అద్భుతమైన అక్షర సంపదతో అందించగా కీరవాణి గారు అంతే గొప్ప స్వరాలను అందించారు. తండ్రికి తగ్గ తనయుడిగా విజయ్ యేసుదాస్, మరో ఆరితేరిన సంగీత కళాకారుడు, నేపథ్య గాయకుడు శంకర్ మహాదేవన్ సమఉజ్జీలుగా ఈ పాటను పాడారు. ఇద్దరు గొప్ప గాయకులు, గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప రచయిత కలయికలో వెలువడిన ఈ గీతం రామనామామృతాన్ని అందరికీ పంచింది.
శ్రీరామ జయరామ జయ జయ రామ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి