29, నవంబర్ 2010, సోమవారం

బిలహరి రాగం - కనుగొంటిని శ్రీరాముని



అన్నగారు తన ఇలవేల్పుయైన సీతారాముల విగ్రహాన్ని ఈర్ష్యతో కావేటిలో పడవేస్తే, మన త్యాగ బ్రహ్మంగారు రాముడు లేని ఇంట నేను ఉండనని ఆయనను వెదుకుతూ బయలు దేరుతాడు. అలా తిరుగుతూ, ఎన్నో క్షేత్రాలు తిరిగి అక్కడి వేల్పులను స్తుతించి అద్భుతమైన కీర్తనలు రచిస్తాడు. అటు పిమ్మట కావేరిలో స్నానం చేస్తుండగా ఆ సీతారాముల ప్రతిమ త్యాగరాజుకి లభ్యమవుతుంది. ఆ ఆనందానుభూతిలో త్యాగరాజు రచించిన కీర్తన బిలహరి రాగంలో కనుగొంటిని శ్రీరాముని. ఇదే రాగంలో రుద్రవీణ చలన చిత్రంలో నీతోనే ఆగేనా బిలహరి అని ఏసుదాస్ గారు శ్రావ్యమైన శాస్త్రీయ గీతం ఆలాపించారు. బిలహరి రాగానికి ధన్యత చేకూర్చారు ఏసుదాస్ గారు. 

త్యాగరాజస్వామి వారు కావేరీనదిలో తన ఆరాధ్యమూర్తులైన రామపరివారం తిరిగి లభించగానే వ్రాసిన కృతి కనుగొంటిని శ్రీరాముని అని ఆయన శిష్య పరంపర చెప్పుకుంటారు. తాను నిత్యము కొలిచే స్వామి దూరమైతే ఆయన మనసు ఎంత తల్లడిల్లి ఉంటుందో కదా! సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని సీతారాములను జననీజనకులుగా త్రికరణ శుద్ధిగా భావించిన ఆయన ఆ మూర్తుల తాత్కాలిక వియోగాన్ని భరించలేకపోయారు. చెట్టున పుట్టనా, తటాకాలలో, నదులలో అంతటా వెదుకుతూ చివరకు కావేరిలోనే తిరిగి పొంది ఆనందబాష్పాలు రాలుస్తూ ఈ కృతిని ఆలపించారు. మనం చిన్న వస్తువు కనిపించకపోతేనే ఎంత వెదుకుతామో, అల్లాడిపోతామో, మరి త్యాగరాజస్వామి పరిస్థితి ఊహించండి. తన సర్వసము రాముడే కదా! ఆ మూర్తి తిరిగి దొరికితే ఆయన అస్తిత్వం మొత్తం తిరిగి వచ్చినట్లే కదా! కృతి వివరాలు:

సాహిత్యం
=======

కనుగొంటిని శ్రీ రాముని నేడు

ఇనకులమున ఇంపు గాను బుట్టి 
ఇలలోన సీతా నాయకుని నేడు 

భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ 
పవమాన సుతుడు పాదముల బట్ట 
ధీరులైన సుగ్రీవ ప్రముఖులు 
వినుతి సేయ త్యాగరాజ నుతుని నేడు

భావం
=====

సూర్యవంశమున ఆనందము కలిగించగా పుట్టిన సీతాపతి అయిన రాముని నేడు కనుగొన్నాను. భరతలక్ష్మణశతృఘ్నులు కొలుచుచుండగా, వాయుపుత్రుడైన హనుమంతుడు పాదములు పట్టగా, ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు ప్రస్తుతించగా, పరమశివునిచే నుతించబడిన శ్రీరాముని నేడు కనుగొన్నాను. 

శ్రవణం
=====

బిలహరి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు. 

https://youtu.be/jN1H_s8u6yc?t=1073 

1 కామెంట్‌: