18, నవంబర్ 2010, గురువారం

దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్యము

పరమాత్మ, గురువు, ఆత్మ రూపంలో విశేషంగా వ్యక్తమయ్యే దక్షిణామూర్తిని స్తుతిస్తూ ఆదిశంకరులు ఈ స్తోత్రం రచించారు. వేదాంతాన్ని అభ్యసించటంలో ముఖ్య ఉద్దేశము అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించుకొనుటకు. ఇది ఎలా?  సంకల్పముతో మాయ మీద ఉన్న మోహమును వదులుకోవటం, ఆత్మానందము పొంది భయమును, భీతిని అధిగమించటం వలన. ఆత్మ సాక్షాత్కారము పొందిన ఒక గురువు సహాయముతో, గురుబోధలను అనుసరించి, ఆయనను దైవముగా భావించి సాధకుడు ఈ స్థితిని చేరుకుంటాడు.  ఇదే అద్వైత సారం - గురువునకు, దైవమునకు గల అభేదమును తెలుసుకొనుట. ఈ స్తోత్రమున దక్షిణామూర్తిని గురువు రూపము యందు ధ్యానిన్చినందు వలన కలిగే ఆత్మ ప్రకాశమును మనకు తేట తెల్లము చేసారు. ఈ స్తోత్రము మనకు జీవము, ఈశ్వరుడు, బ్రహ్మ అన్ని ఒకటే అన్న తత్వాన్ని ఎరుగుటకు సహాయపడుతుంది. గురు రూపంలో ఉన్న ఆ దక్షిణామూర్తి మనలను అజ్ఞానమనే అంధకారము నుండి సత్యమనే ప్రకాశము వైపు నడిపించు గాక.  ఇంత అద్భుతమైన ఆత్మ తత్త్వ వివేచనా స్తోత్రమును మనకు అందించిన ఆదిగురువులకు శత సహస్ర వందనములు. యూట్యూబ్ శ్రవణం మలయాళ నేపథ్య గాయకుడు కే. సుకుమార్ గారి గళంలో



ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః



దక్షిణామూర్తి స్తోత్రము
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

నానాచ్ఛిద్రఘటోదరస్థిత్మహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిం స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం
శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

భూరంభాస్యనలోఽనిలోఽంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే 

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి


తాత్పర్యము:

ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.  మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్,  చేతన, సుషుప్తా మొదలగునవి)  వచ్చే మార్పులకు అతీతంగా  ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.

సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి