కార్తీక సోమవారం, కోటిపల్లి గ్రామం. ఉత్తరం వాకిలి పెంకుటిల్లు, చుట్టూ కొబ్బరి చెట్లు, వాటి మధ్య రకరకాల పూల మొక్కలు, కాయగూరల చెట్లు, ప్రధాన ద్వారం గుండా చూస్తే ఇంటికి వెనుక పక్క తులసి కోట, దానిలో ప్రకాశిస్తున్న శ్రీతులసి మొక్క, కోటలో దీపం...మధ్యాహ్నం 12:30 గంటల సమయం. ఇంటికి ఆగ్నేయాన హోమగుండం దగ్గర కంచుకంఠంతో "చతుస్సాగర పర్యంతం గోబ్రాహణేభ్యో శుభం భవతు...ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రః ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ కాశీవిశ్వనాథేశ్వర శర్మ అహం భో అభివాదయే"...అని ప్రవర పఠిస్తూ చెవులను చేతులతో తాకి అభివాదం చేశాడు ఆ బ్రహ్మజ్ఞాని. తాను చేసిన హోమ ఫలాన్ని పరమేశ్వరునికి సమర్పించి, రక్షను ధరించి హోమ గుండం వద్ద నుండి లేచి కృతజ్ఞతా భావంతో మనసులో పరమేశ్వరుని నిలిపి ప్రార్థించాడు.
"ఈశ్వరా! నీ సేవలో జీవితాన్ని గడిపే భాగ్యం కలిగించినందుకు నేను నీకు ఏమి ఇచ్చి నా రుణం తీర్చుకోగలను? నా కర్మఫలాలను నీకు సమర్పిస్తున్నాను. మంచైనా చెడైనా కన్న తండ్రిలా స్వీకరించి నన్ను కరుణించు. అమ్మా సర్వమంగళా! నీ అపారమైన దయావృష్టిని నాపై కురిపించు, నన్ను సన్మార్గంలో నడిపించు".
అడుగు వంటింటి వైపు పడిందో లేదో వరుణుడి వృష్టి పూలవానలా కురిసింది. శర్మ గారి శిరసును తాకి, జల జల శరీరమంతా తడిసి పాదాలను స్పృశించింది. తెల్లని ధోవతీ, నుదుట, భుజాలు, చేతులు, హృదయస్థానంలో తెల్లని విభూతి రేఖలు, నొసట నల్లని రక్ష, దానికి క్రింద అర్థరూపాయి బిళ్లంత బొట్టు. ఆ వర్షం కురిసి ఆయన శిరసుపై పడుతుంటే గంగ శివుని శిరస్సులో దిగి ఆయనకు అభిషేకం చేసినట్లుగా అనిపించింది. మమకారం లేని చిరునవ్వు, తృప్తితో కూడిన ప్రశాంతత, ఈశ్వరుని హృదయంలో దర్శించిన యోగానుభూతి...ఆయన తనువంతా మెరిసిపోతోంది. ఒక పక్క సూర్యుని కిరణాలు, ఇంకోపక్క చల్లని చిరుజల్లు. సూర్యచంద్రులు ఆ శివయోగిని ఆశీర్వదించటానికి వచ్చారా అన్నట్లు.
గాంభీర్యంతో అడుగులు వేస్తూ వంట ఇంట ప్రవేశించాడు యాజులు గారు. అన్నపూర్ణమ్మ వెండి గ్లాసులో మజ్జిగ, రెండు అరటి పళ్లు పళ్లెంలో పెట్టి ఆయనకు అందించింది. "నీకో" అన్నట్లుగా కళ్లతో అన్నపూర్ణమ్మ వైపు చూశాడు విశ్వనాథేశ్వర శర్మ. ముప్ఫై ఏళ్ల వైవాహిక జీవితంలో కష్టంలోనూ సుఖంలోనూ తనతో కలసి నడిచిన ధర్మపత్ని కళ్లలో "మీ తరువాత" అన్న సమాధానం గోచరించింది. ఉద్విగ్నుడై "కార్తీకమాసం ఉపవాసం, ధర్మాలన్నీ ఆచరించావు, ఇంక ఆలస్యం చేయవద్దు. నువ్వు కూడా తెచ్చుకో" అని మృదువుగా ఆమెకు చెప్పాడు. సరే అని వెళ్లి తనకూ మజ్జిగ, ఒక అరటి పండు తెచ్చుకొని ఆయన ముందు కూర్చుంది.
"ఏవండీ! మన విశాలాక్షి నిన్న సాయంత్రం వచ్చి వెళ్లింది. అన్నయ్య గారు వేదపాఠశాల సరిగా నడవటం లేదని సందేశం పంపించారు. దానికి ఏమీ తోచటం లేదు. అల్లుడు గారు మొహమాటంతో మీ ముందుకు రాలేకపోతున్నారు. పాఠశాలను పునరుద్ధరించాలి, లేకపోతే పొట్ట చేతబట్టుకొని విశాఖపట్నమో రాజమండ్రో వెళ్లకతప్పదు అని అన్నాడట"....విశాలాక్షి ఈ దంపతుల కూతురు. ఎంతో పేరుపొందిన శంకర వేద పాఠశాలను నడిపే యజ్ఞనారాయణ శర్మ గారి పుత్రుడు విశ్వేశ్వర శర్మకు విశాలాక్షినిచ్చి పదిహేనేళ్ల నాడు పెళ్లి చేశాడు. కాలం మారింది. ఘనంగా సాగిన వేదపాఠశాల కళ తప్పింది. ఇంగ్లీషు చదువుల మోజులో కొత్త విద్యార్థులు పాఠశాలలో చేరటం మానేశారు. యజ్ఞనారాయణ శర్మగారింట్లో సంసారం భారంగా నడుస్తోంది.
విశ్వనాథేశ్వరశర్మ గారు మడత కుర్చీలో పడుకొని దీర్ఘంగా అలోచించాడు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్న శ్రీకృష్ణుని మాటలు గుర్తుకొచ్చాయి. లేచి నిలబడ్డాడు. "పూర్ణా! నేను అమ్మాయి ఇంటి దాకా వెళ్లి వస్తాను" అని చెప్పి బయలుదేరాడు.
"బావగారూ, నాయనా విశ్వేశ్వరా! పరిస్థితి అర్థం అయ్యింది. పరిస్థితులకు తల వంచి మనలను మనం కుంగదీసుకోకూడదు అన్నది నాకు సనాతన ధర్మంలో అర్థమైన విషయం. వేదాధ్యయనం వజ్రంలాంటిది. దాని విలువ ఎన్నేళ్లైనా తరగదు. తాత్కాలికంగా ఉపాధి లేకపోయినా మనం దిగులు పడకుండా ధైర్యంగా నిలబడాలి. మన విద్యే మనకు దారి చూపిస్తుంది. నాకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి
1. వేదపాఠశాలలో వేదవాఙ్మయం నేర్పటంతో పాటు వాటి అర్థాలను తెలిపి నవీన సాంకేతిక పరిశోధనకు మన వేద సంపద ఎలా ఉపయోగపడుతుందో నేర్పిద్దాం. ఇటీవలే మన ప్రధానమంత్రి వేదాలలో ఆధునిక శాస్త్ర సాంకేత పరిజ్ఞానంతో చేయబడిన ఆవిష్కరణల గురించి వేల ఏళ్ల క్రితం ప్రస్తావించబడ్డాయి అని చెప్పారు. ఆ అంశాలను పాఠ్యాంశాలుగా వయసుకు తగ్గ క్లిష్టతతో నేర్పుదాం. మన వేద సంహితను పరిశోధన చేసి పాఠ్యాంశాలుగా మార్చేందుకు కావలసిన నిధుల కోసం ప్రధానమంత్రికి వినపత్రాన్ని సమర్పిద్దాం. ఒకవేళ నిధులు అందకపోతే నాకున్న 4 ఎకరాలలో రెండు అమ్మి నీకు నిధులు అందజేస్తాను. మన పాఠశాలలో ఒక ప్రణాలిక్గా ఈ పాఠ్యాంశాలను నేర్పి వారిని శాస్త్రజ్ఞులకు దీటుగా తయారు చేసి ప్రభుత్వానికి, ప్రైవేటు పరిశోధనా సంస్థలకు సలహాదారులుగా వెళ్లేలా ప్రయత్నం చేద్దాం. వేదగణితాన్ని మరింత లోతైన వివరాలతో విద్యార్థుల మేధస్సు పెరగటానికి ఉపయోగించే ప్రణాలికను రూపొందించుదాం
2. నేటి చదువులతో వ్యక్తిత్వ వికాసమనేది కల్లగా మరింది. ఏమాత్రం ఒత్తిడిని విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. వారికి మన సనాతన ధర్మం పాటించటం ద్వారా ఎలా ఒత్తిడి అధిగమించగలరో నేర్పుదాం. చిన్న పిల్లలకు మన ధర్మం క్రమశిక్షణను, నిరాడంబరమైన జీవనము ఎలా అందజేసిందో పాఠ్యాంశాలుగా తెలుపుదాం. వారానికి రెండు రోజులు ఇంగ్లీషు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను మన పాఠశాలకు రప్పించి వారిని దృఢమైన పౌరులుగా తీర్చుదిద్దుదాం. దీనికి కావలసిన అంశాలను నేను సిద్ధం చేయగలను. వీటిని కంప్యూటర్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అందజేద్దాం. మన పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ నేర్పి ఈ అంశాలను రూపొందించటంలో భాగస్వాములను చేద్దాం."
విశ్వేశ్వరుడు మామగారి ముందు చూపుకు, మనోనిబ్బరానికి ముగ్ధుడైనాడు. అతని మదిలో సంకల్పం చిగురించింది. మామగారిలో జ్ఞానస్వరూపుడైన దక్షిణామూర్తిని దర్శించాడు. యజ్ఞనారాయణశర్మ గారి కళ్లలో ఆశ చిగురించింది. ఇద్దరూ లేచి విశ్వనాథశర్మ గారికి అభివాదం చేశారు. విశాలాక్ష్మి తండ్రికి నమస్కరించింది. "తల్లీ! నీ సంసారం గురించి భయం లేదు. పరమేశ్వరుడే మనకు మార్గదర్శకం" అని చెప్పి ఆశీర్వదించి ఇంటికి వెళ్లి భార్యతో వివరాలు చెప్పాడు. ఎన్నడూ భర్తలో అధైర్యం చూడలేదు ఆ స్త్రీ. ఈరోజు కూడా అంతే. అందుకే ఆయన సంకల్పం సిద్ధిస్తుందని నమ్మింది. పార్వతీదేవిలా ఆ విశ్వనాథుని వామభాగంలో ఒదిగిపోయింది.
ఏడాది గడిచింది. విశ్వనాథేశ్వరశర్మ సంకల్పం, నమ్మకం, శ్రద్ధ, నేతృత్వం విశ్వేశ్వరశర్మ పట్టుదల, పరిశ్రమ, ఓర్పు, విశాలాక్షీ అన్నపూర్ణల సహకారం, యజ్ఞనారాయణశర్మ గారి ఆశీర్వాదం, వేదపాఠశాలలోని విద్యార్థుల ప్రజ్ఞ, ఉత్సాహం అన్నీ ఫలించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద గణితం, వేద సాంకేతిక విద్యకు పాఠ్యాంశాలుగా గుర్తింపునిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం విశ్వనాథశర్మ-విశ్వేశ్వరశర్మలను మైసూరు వేదపాఠశాలలో ఇదే పాఠ్యాంశాన్ని పొందుపరచటానికి సలహాదారులుగా నియమించింది. చైతన్య-నారాయణ విద్యాసంస్థలు తమ విద్యార్థుల వ్యక్తిత్వవికాసానికి సనాతనధర్మ పాఠ్యాంశాలను నేర్పేందుకు విద్యార్థులను కోటిపల్లి పంపే ఏర్పాట్లు చేసింది. ఆరునెలలు తిరగక ముందే శంకర వేదపాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఐదువందలకు పైగా దాటింది.
రెండేళ్ల తరువాత ఢిల్లీ విజ్ఞానభవన్ ఉపాధాయ దినోత్సవ వేడుకలు - "ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. నేను మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన దేశ భవిష్యత్తుకోసం ఎలా ఉపయోగించాలో అని కన్న కలలు నిజమైన రోజు. ఎక్కడో మారుమూల కోటిపల్లిలో ఉన్న ఇద్దరు వేదపండితులు భుక్తి గడవని పరిస్థితిలో ధర్మంపై తమకు గల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని అద్భుతాలు సాదించారు. ఇటువంటి ప్రణాలికకు సృష్టికర్త అయిన శ్రీ కాశీవిశ్వనాథేశ్వరశర్మ గారికి ప్రతిష్ఠాత్మకమైన బృహస్పతి పరిశోధనా పురస్కారాన్ని అందజేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను"....
అన్నపూర్ణమ్మ, విశాలాక్షిల కళ్లు, చెవులు నమ్మలేకపోతున్నాయి. ఎదురుగా వేదికపై ఎరుపు-ఆకుపచ్చ అంచులు గల పట్టు పంచె ధరించి,కండువా వేసుకొని, నుదుటిపై విభూతి రేఖలు, గంధం, దానిపై కుంకుమ, మెడలో రుద్రాక్షలు, ముచ్చటైన శిఖ...శివయోగి, ఆయన పక్క ఆనందంగా విశ్వేశ్వరుడు, ఆ వెనుక వేదాన్ని వల్లిస్తూ బ్రహ్మతేజస్సు గల విద్యార్థులు వెలిగిపోతున్నారు. విశ్వనాథేశ్వర శర్మను, విశ్వేశ్వర శర్మను కౌగిలించుకున్నాడు ముఖ్య అతిథి...ప్రతి ఒక్క విద్యార్థికి అభివాదం చేసి ఒక శాంత్రి మంత్రం చెప్పించాడు ఆయన. ఇంతలో మైకులో "ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోడీ గారు ఈ బృందాన్ని సత్కరిస్తారు...."..ప్రధానమంత్రి తనమెడలో దండవేసి శాలువా కప్పుతుంటే విశ్వనాథేశ్వర శర్మ ఇలా ప్రార్థించాడు
"ఈశ్వరా! నీ సేవలో జీవితాన్ని గడిపే భాగ్యం కలిగించినందుకు నేను నీకు ఏమి ఇచ్చి నా రుణం తీర్చుకోగలను? నా కర్మఫలాలను నీకు సమర్పిస్తున్నాను. మంచైనా చెడైనా కన్న తండ్రిలా స్వీకరించి నన్ను కరుణించు. అమ్మా సర్వమంగళా! నీ అపారమైన దయావృష్టిని నాపై కురిపించు, నన్ను సన్మార్గంలో నడిపించు".
సభ కరతాళధ్వనులతో మారుమ్రోగింది. కోటిపల్లి దేశప్రసిద్ధమైంది. శంకర వేదపాఠశాల దేశానికి దిశానిర్దేశకమైంది. ఈ సనాతన ధర్మ గంగా ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి