"కావేటి రంగ రంగా మాయన్న కస్తూరి రంగ రంగా" అని కావమ్మ కూని రాగాలు తీస్తూ కళ్లజోడు పైకి కిందకి జరుపుకుంటూ బియ్యంలో రాళ్లు ఏరుతోంది. "అత్తయ్యా! కాఫీ ఇదిగో" అని మహాలక్ష్మి వేడి వేడి కాఫీ గ్లాసు తెచ్చి పక్కన పెట్టి రుస రుసన వెళ్లిపోయింది.
"ఒసేయ్ మహాలక్ష్మీ! కాస్త అత్త అంటే గౌరవం చూపించవే. ఎంత మేనత్తనైతే మాత్రం ఇంత అలుసుటే? మా అత్తగారంటే నాకు ఎంత భయం భక్తి అనుకున్నావ్? ఏ పనైనా ఆవిడ ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అదే నాకు వేదం..నువ్వూ ఉన్నావ్..."
"ఆ ఆపాటి మొహమా అర్ధ సేరు పసుపా అని సామెత. మా పెళ్లిలో మీరు చేసిన గోలకు నేను కాబట్టి కాఫీ పోస్తున్నా..ఇంకోళ్లైతేనా...ఎంతైనా మేనత్తవు. చూడకపోతే లోకం ఆడిపోసుకుంటుందని ఊరుకుంటున్నా"
"ఒసేయ్! ఎంత పొగరే నీకు! ఏదో తమ్ముడు కదా అని మీ నాయన బోడి పదివేల కట్నానికి మా నారాయణకు ఇస్తాను అని వస్తే కాదనలేకపోయాను. మీ అమ్మ ఒక్కగానొక్క ఆడపడుచునైన నా మీద చూపిన జాణతనం, అమర్యాద నేను మర్చిపోయానుటే...వెధవ సంత..."
"ఇదిగో ముసలావిడా! నన్ను ఏమన్నా అను...మా అమ్మను అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎప్పుడో చిన్నప్పుడే మొగుడు పోతే మిమ్మల్ని మీ అబ్బాయిని ఇంట్లోనే పెట్టుకొని పోషించింది మా అమ్మ. ఆవిడ దేవత. మీరు పెట్టిన ఆరళ్లకు ఆవిడ కాబట్టి ఊరుకుంది..ఇంకోళ్లు ఇంకోళ్లు అయితేనా..."
"అవునే..మీ అమ్మ దేవత నేనో కొరివి దెయ్యాన్ని. నా ఖర్మ..."...
నారాయణ వసారాలో కూర్చుని తల్లీ పెళ్లాల మధ్య జరుగుతున్న మహాభారత సంగ్రామం వింటున్నాడు. "ఆ! రోజూ ఉండేదే. నేను తల దూర్చకూడదు" అని మనసులో అనుకున్నాడు పేపరులో మునిగిపోయాడు.
"ఒరేయ నారాయణా! ఏవిటిరా ఇవాళ నీ పెళ్లాం అగ్గిపుల్ల వెలిగించట్లు లేదు...నాకు ఆకలి మండిపోతోంది...ముందే చెబితే ఎదో ఇంత ఎసరు పదేసేదాన్ని కదా..ఏమయ్యిందో కనుక్కో..."
నారాయణ పడక గదిలోకి వెళ్లాడు. అపర కైకలా మహాలక్ష్మి జుట్ట విరబోసుకొని కాటుక కళ్లుదాటి, కళ్లెర్రబడి వల వల ఏడుస్తోంది. "లక్ష్మీ...ఏమయ్యింది?" ఉలుకులేదు పలుకులేదు. ముఖం పక్కకు తిప్పుకుంది. కొంగు బిగించి నోట్లో అద్దుకొని కళ్లకు ఆవిరి పెట్టుకుంటోంది మహాలక్ష్మి. పచ్చని మేని చాయ, కాళ్లకు పచ్చని పసుపు, చేతులకు గోరింటాకు, గల గల లాడే మామిడి పిందెల వెండి గజ్జెలు, చేతులకు ఆకుపచ్చని గాజులు,మధ్య మధ్యన బంగారు గాజులు, పసుపు రంగుకు ఆకు పచ్చ అంచు మడి పట్టు చీర, తలలో చెదరిన మల్లెల మాల...కోపంలో కూడా మహాలక్ష్మి అమ్మవారిలా వెలిగిపోతోంది. ఈ అందం చూసే కదూ నేను పడిపోయింది అని మురిసిపోయాడు నారాయణ.
"లక్ష్మీ! నా బంగారు లక్ష్మీ! ఏమయ్యిందో చెప్పరాదూ! నాకు ఆకలిగా ఉంది..." చర్రున లేచింది మహాలక్ష్మి "అవును! భోజనం అనే సరికి పెళ్లాం గుర్తుకొస్తుంది..ఉందిగా మీ అమ్మ వెళ్లి ఆవిడను అడగక పోయారా"...."అది కాదు లక్ష్మీ...నీ చేతి వంట తిని అమ్మ చేసే వంటలు నచ్చవే..అయినా రోజూ నువ్వే చేస్తున్నావు కదా"..."ఇదిగో చూడండీ...మేనత్త మొగుడు కూడా ఒక మొగుడేనా అని ఒక సామెత. కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని అలా చూడలేదు. మా అమ్మను నానా మాటలంది అత్తయ్య. నా వల్ల కాలేదు..."
"అది కాదు లక్ష్మీ...అమ్మకు నువ్వంటే వల్లమాలిన ప్రాణం...ఏదో చాదస్తంతో రెండు మూడు మాటలంటే ఇంత రాద్ధాంతం చేయాలా.."
"ఏవండీ! మన మనసుకు దగ్గరైనవి, సున్నితమైనవి రెండు మూడు విషయాలుంటాయండీ. అందులో పుట్టిల్లు ఒకటి..మా నాన్న ఆవిడ తమ్ముడే...మా అమ్మ పరాయిదనేగా అంతేసి మాటలు అనటం"..
ఇంతలో డిగ్రీ చదువుతున్న ఇరవై ఏళ్ల వీళ్ల ముద్దుబిడ్డ వాణి పరుగెత్తుకుంటూ వచ్చింది. "అమ్మా! ఎందుకేడుస్తున్నావు?". "ఏమీ లేదమ్మా! మా పుట్టింటివాళ్లు గుర్తుకొచ్చారు...". "నాన్నా! ఏమైంది? నువ్వైన చెప్పు, అమ్మ ఏడుస్తుంటే నాకస్సలు నచ్చటం లేదు". "ఏముంది తల్లీ! మీ బామ్మ చాదస్తం..." అని మొత్తం వివరించాడు.
వాణి మెల్లగా తల్లి వద్దకు వెళ్లి ఆవిడను హత్తుకొని "అమ్మా! మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. బాధపడితే ఎలా? ఒక్కసారి ఆలోచించు. బామ్మకు మనం తప్ప ఎవ్వరూ లేరు. ఎప్పుడో చనిపోయాడు తాతయ్య. నాన్న, అత్తయ్యలను ఎంతో కష్టపడి పెంచింది. నిజమే, తాతయ్య అమ్మమ్మ బామ్మను చేరదీసి ఆశ్రయమిచ్చారు. కానీ, ఆవిడ తన ఖర్చులు, పిల్లలకు అయిన ఖర్చులు లెక్కకట్టి తాతయ్యకు ఏడాదికోమారు ఇచ్చేది అని నువ్వే చెప్పావు నాకు బాగా గుర్తు. అలాగే అమ్మమ్మ చనిపోయినపుడు బామ్మ తాతయ్యకు, నీకు అండగా నిలబడిందని కూడా నువ్వే చెప్పావు. బామ్మకు వృద్ధాప్యము మీరుతోంది, కాబట్టి ఓపిక నశిస్తోంది..దాని వల్ల ఏవో మాటలు అంటూ ఉంటుంది...అంత మాత్రాన నీ మీద, అమ్మమ్మ మీద ద్వేషం ఉందని కాదు కదా? ఆలోచించు"...
"నిజమేనే లక్ష్మీ! నీకు రెండు పురుళ్లు, నీకు సుస్తీ చేసినప్పుడు అమ్మే కదా సమస్తం చూసుకుంది? నువ్వు అత్తయ్యకు బాలేక మూడు నెలలు ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మే కదా పిల్లలకు, నాకు వండి పెట్టింది? మన రామం చదువుకు డబ్బు అవసరం వచ్చినప్పుడు అమ్మే కదా సర్దుబాటి చేసింది? తనకు ఓపికున్నంత కాలం నిన్ను వంటింట్లోకి కూడా రానీయలేదే? అమ్మకు నువ్వంటే ఆపేక్ష...అవును మర్చిపోయా! నువ్వు కట్టుకున్న మడి పట్టు చీర మా బామ్మదని నీకోసం అమ్మ ఇరవై ఏళ్లు దాచి ఉంచి ఇచ్చింది...అలాగే నువ్వు వేసుకున్న గాజులు కూడా...నీ పట్టీలు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన మొదటి శ్రావణ శుక్రవారానికి అమ్మ తన పొలం డబ్బులతో కొన్నవే..ఎన్నేళ్లు వచ్చాయో చూడు..."
మహాలక్ష్మి క్రోధం చల్లారింది.. కళ్లలో తప్పు చేశానన్న భావన కలిగింది. గబ గబ లేచి వంటింట్లోకి వెళ్లి వంకాయ కూర, మామిడికాయ పప్పు, పులిహోర, పాయసం చేయటానికి ఉపక్రమించింది.
నారాయణ వాణిని తీసుకొని అమ్మ దగ్గరకు వెళ్లాడు. "ఏవిట్రా నారాయణా! నీ పెళ్లాం మీ ఇద్దరినీ నా మీద యుద్ధానికి పంపిందా ఏం? నాకేం భయం లేదు. ఈ క్షణం మన వూరు వెళ్లి పోయి నాకు చేతనైంది నేను వండుకు తింటాను. ఈ కోడలు ఆరళ్లు నేను భరించలేను".
"అమ్మా! ఊరికే నోరు పారేసుకోకు...చిన్న చిన్న విషయాలు రాద్ధాంతం చేస్తే ఎలా? లక్ష్మి నీ సొంత మేనకోడలు. నువ్వే తనను కోడలు కావాలని పుట్టినప్పటినుంచి అనుకున్నావు. నాకు బాగా గుర్తు, మామయ్య అడగగనే నువ్వు ఎంత సంబర పడ్డావో? నువ్వు వంటింట్లో జారిపడి నడుము నొప్పితో రెండేళ్లు నడవలేకపోయావు..లక్ష్మి కదూ నీకు సమస్తం అందించింది? పసిపిల్లలా నీకు స్నానం చేయించి, చీరకట్టి, మూడు పూటలా నీ కాళ్లకు మర్దనం చేసింది. నువ్వు రెండ్రోజులు అక్కయ్య దగ్గరకు వెళితే నీ గురించి దిగాలు పడి ఫోన్ చేసిందే..మర్చిపోయావా?"
"అమ్మా! అత్తాకోడళ్ల మధ్య పాతికేళ్ల బంధం మీది, కొత్తగా అరచుకోవటానికి కారణాలు వేరే. నీలో ఓపిక నశించింది, తనకూ ఇంట్లో గుర్తింపు లేదన్న అభిప్రాయం ఏర్పడింది..నువ్వు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఉండు, నీకు నచ్చిన విషయాలను తనతో చెబుతూ ఉండూ. అలాగే, నేను, పిల్లలు తనకు వీలైనంత సహాయం చేస్తాం ఇంటి పనిలో..."
కావమ్మ ఆలోచనలో పడింది. "నిజమేరా నారాయణా! నాకు ఓపిక తగ్గి కోపం పెరిగింది...నేను నా వయసుకు తగ్గ ఆలోచన చేయటం లేదు. పాపం లక్ష్మి ఎంత పని అని చేస్తుంది...నాకు ఒంట్లో శక్తిలేదు. ఎదిగొచ్చిన పిల్లలు రామం వాణి సాయం చేయాలి దానికి..నేను కూడా లక్ష్మిని వదిలి ఉండలేనురా. ఒకటా రెండా, పాతికేళ్ల ముచ్చట్లు మావి. పనిలో పడి లక్ష్మి తిండి సరిగా తినదు. నా చాదస్తంతో నేను ఏదో మాట్లాడతాను..."
"అమ్మా! నీకు కావల్సింది విశ్రాంతితో పాటు, ప్రేమానురాగాలు. తనకు కావలసింది తను పడే కష్టానికి గుర్తింపు, అందులో సాయం...రెండూ మనందరం కలిసి వేసే చిన్న చిన్న అడుగులే అయినా కుటుంబాన్ని ఉత్సాహంగా ఐక్యంగా ఉంచటానికి సహాయపడతాయి"
కొడుకు వ్యక్తిత్వానికి కావమ్మ మురిసిపోయింది. తండ్రిలోని సంతులనకు, సమదృష్టికి వాణికి నారాయణ పట్ల ఆరాధనా భావం మరింత దృఢమైంది. ఇంతలో వంటింట్లోనుండి కేక "ఏవండోయ్, అత్తయ్యా! మీ మాటల్లో పడి భోజనం సంగతి మర్చిపోయారు...అత్తయ్యా మీకిష్టమని మావిడికాయ పప్పు, పులిహోర పాయసం చేశాను, ఏమండోయ్ మీకోసం గుత్తివంకాయ వండాను...త్వరగా వచ్చి తినండి..నాకూ ఆకలి దంచేస్తోంది. సాయంత్రం వదిన వాళ్లింట్లో వ్రతానికి వెళ్లాలి అందరం..."
నారాయణ టీ కప్పులో తుఫాను వెలిసింది అని సంతోషించాడు. అత్తాకోడళ్లు కబుర్లలో మునిగిపోయారు...యత్ర అత్త కోడలు ఓర్పు చూపుతారో, యత్ర ఇంటి మగవాడు సమదృష్టితో వ్యవహరిస్తాడో తద్గృహం స్వర్గమవుతుంది. సర్వే గృహాః స్వర్గో భవంతు"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి