19, సెప్టెంబర్ 2015, శనివారం

ఏమొకో చిగురుటధరమున - అన్నమాచార్యుల మధురభక్తి - శోభారాజు గారి ఆలాపన


భక్తి అనేకరకాలు. అందులో ఒకటి మధురభక్తి. భక్తుడైన కవి తాను నాయికయై, పరమాత్మను నాయకునిగా ఎంచుకొని, ఆ పరమాత్మ, నాయికల నవరసములతో కూడిన లీలలను వర్ణిస్తాడు. ఈ విధంగా నాయికా నాయకుని భావనతో పరమాత్మను కొలిచే భక్తిని మధుర భక్తి అంటారు. ఇటువంటి మధురభక్తిలో శృంగార రసము దేహానికి సంబంధించినది కాదు. పంచభూతములతో కూడిన శరీరానికి సంబంధించిన శృంగారం ఈ మధురభక్తిలోని శృంగారం ఒకటి కాదు. మధురభక్తి ఆత్మ-పరమాత్మలకు సంబంధించినది. అది కూడా అందరికీ లభ్యమయ్యేది కాదు. నిర్మలమైన భక్తి కలిగిన జ్ఞానులకు మాత్రమే అందుబాటులో ఉండేది మధురభక్తి. ఈ మధురభక్తియందు రమించే భక్తుని యొక్క భక్తికి సోపానము మోక్షమే. దీనిని రుచి చూసిన భక్తుడు ఎన్నటికీ దానికి దూరం కాలేడు.

కలియుగంలో నామసంకీర్తనే ఉత్తమ భక్తి మార్గమని ఆగమశాస్త్రములు చెబుతున్నాయి. అందులో మధురమైన గీతములను ఆలపించటం ఎంతో శ్రేష్ఠమైనది. పరమాత్మ నామామృతం చెవులకు సోకగానే శృంగార రస నాయిక కరగి పోయి నిద్రకు దూరమవుతుంది. ఒకవేళ నిద్రించినా కూడా స్వప్నములో కూడా తన కాంతుడైన ఆ పరమాత్మ రూపమునే దర్శిస్తుంది. అతని నామమును తలచుచు, పరవశురాలవుతుంది. ఆ లీలలో మునిగి తేలుచు చటుక్కున స్వప్నావస్థనుండి బయట బడుతుంది. అది కలయని తెలుసుకొని దిగాలు పడుతుంది. స్వామికి దూరమైన ప్రతి నిమిషము ఆవేదన చెందుతుంది. ఈ ఆవేదన త్రికరణ శుద్ధిగా ప్రకటితమవుతుంది. ఆ భక్తితో కూడిన ఆవేశము మధురభక్తి యొక్క ప్రధాన లక్షణము. అటువంటి మధురభక్తిలో ఓలలాడే కవి మరింత ముందుకు వెళతాడు. పరమాత్మ గుణవైభవములను వర్ణిస్తాడు, మధురమైన సంకీర్తనలు అతని నోటినుండి వెలువడుతాయి. మధురభక్తిలో ఉపచారములు, అలుకలు, సరసములు, నయగారములు, అలంకరణలు, ఉత్సవాలు, ఊరేగింపులు, రతిక్రీడలు...అన్నీ భాగమే. కానీ, అవి పరమాత్మ, నాయిక యొక్క ఆత్మకు సంబంధించినవి.


మరి మధురభక్తిని ఎవరు అనుభూతి చెందారు? ద్వాపరయుగంలో గోపికలు, రాధ, కలియుగంలో నమ్మాళ్వారు, గోదాదేవి, మీరాబాయి, జయదేవుడు మొదలైన వారు ఈ మార్గంలో నడిచిన వారే. అలానే, తెలుగు భాషలో తొలి వాగ్గేయకారుడు, పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా మధురభక్తి మార్గంలో ఎన్నో శృంగార సంకీర్తనలను రచించారు. మధురభక్తిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు అన్నమయ్య.

కవి (అనగా నాయిక) ఒక సంకీర్తనలో రాముని తల్లి కౌసల్యగా, ఇంకొక కీర్తనలో కృష్ణుని తల్లి యశోదగా, మరొక కీర్తనలో శ్రీనివాసుని తల్లి వకుళమాతగా తనను తాను భావించుకొనును. ఆయారూపములలో ఉగ్గుపాలు తాగించటం, జోల పాడటం, వెన్నముద్దలు తినిపించటం, ఊయలలూపటం, అల్లరిచేసిన మందలించటం, బుజ్జగించటం, పొగడటం వంటివెన్నో స్వామి సేవలో భాగంగా ఆవిష్కరించారు అన్నమయ్య. సేవకురాలి రూపంలో సేవించటం, చెలికత్తెగా రాయబారం పంపటం, రాధ రూపంలో అలుగుట, గోపికవలె ఆర్తి చెందటం, సత్యభామ వలె మత్సరమును చూపటం, రుక్మిణివలె ఆరాధించటం...ఇంతలోనే అలమేల్మంగ రూపము పొందును, మరంతలోనే అలిగి ఒక మూలన కూర్చొనును. ఈవిధంగా అన్నమయ్య తనను తాను నాయికల రూపంలో ఊహించుకొని స్వామిని మురిపించి మరపించి తాను పరవశము పొందును, విరహముతో దుఃఖము చెందును, ఆవేశపడును, ఆవేదన పొంది, చివరకు ఆయనను పొంది దివ్యమైన సంగమంలో చెప్పరాని అనుభూతిని పొందుతారు. అది విశేషమైన సంయోగము, భగవద్విషయము, అనుభవైకవేద్యము. భౌతికమైన స్త్రీపురుషుల రతి మాయాప్రేరితము కావున ఆ అనుభూతి ఎక్కువ కాలము నిలువదు. కానీ, మధురభక్తి వలన కలిగే భగవద్రతి శాశ్వతమైనది. ఒక్కసారి ఆ స్వామిరూపము మనసులో స్థిరమైన తరువాత ఇతర వికారములేవీ కూడా ఆ భగవదాకారాన్ని తుడిపివేయలేవు. ఆ ఆనందమును హరించలేవు. అందుకే అన్నమయ్య మధురభక్తిలో ఓలలాడి స్వామి రూపమును దర్శించి తనలోనే నిలుపుకొని మోక్షమును పొందారు. ఆయన ఆనందం శాశ్వతం. ఆయన శృంగార రచనలలో భగవద్రతి ప్రస్ఫుటము. అందుకే అవి పాడినప్పుడు మనకు ఏ భౌతిక స్త్రీ-పురుష రతికి సంబంధించిన వికారములు కలుగవు.

సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలలో ఏమొకో చిగురుటధరమున రమణీయమైనది.  సాహిత్యం పరిశీలిద్దాం:

ఏమొకో చిగురుటధరమున యెడనెడ కస్తురి నిండెను 
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుకదా 

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన 
చెలువం బిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన యా కొనచూపులు
నిలువుగ పెరకగ నంటిన నెత్తురు కాదుగదా

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగు లివేమో ఊహింపరె చెలులు
గద్దరి తిరు వేంకటపతి కామిని వదనాంబుజమున 
అద్దిన సురతపు చెమటల అందము కాదుగదా

ఏమో! అలమేలుమంగ లేతపెదవిపై అక్కడక్కడ కస్తూరి నిండియున్నది. ఆ ఇంతి స్వామికి వ్రాసిన పత్రిక కాదు కదా? చెలులారా! చకోరపక్షి వలె అందమైన కనులుగల అలమేలుమంగ కంటి చివరలు కెంపులవలె ఎర్రగా తోచుచున్న ఈ అందమిప్పుడిదేమిటో ఆలోచించండి.అందముగా ప్రాణేశ్వరునిపై నాటిన ఆ కంటి కొన చూపులు నిలువుగా స్వామిని పెరికినప్పుడు  అంటిన రక్తం కాదు కదా? ముద్దైన చెక్కిలి పక్కభాగములు ముత్యాల జల్లువలె అందముగా అనురాగముతో ఒప్పినవివేమో ఊహించరే! నేర్పరి అయిన శ్రీవేంకటేశ్వరుడు తాను వలచిన అలమేలుమంగ యొక్క కలువవంటి ముఖముపై రతితో అద్దిన స్వేదబిందువుల అందము కాదు కదా?

విభుడైన శ్రీవేంకటేశ్వరునితో సంగమించిన తరువాత అలమేలుమంగ  రూపురేఖలను వర్ణించే అద్భుతమైన శృంగార సంకీర్తన ఇది. అమ్మవారి చెలికత్తె ఇతర చెలులతో పలికే వర్ణనగా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనను ఆవిష్కరించారు. స్వామితో రమించిన తరువాత పద్మావతీదేవి లేత పెదవులపై గల కస్తూరిని ఆమె స్వామికి రాసిన పత్రికతో పోల్చారు వాగ్గేయకారులు.  జింకనుండి లభించే ఒక సుగంధము కస్తూరి. ఈ కస్తూరిని తిరుమలలో స్వామి నిత్యపూజలో ఉపయోగిస్తారు. ఆ కస్తూరి స్వామినుండి అమ్మకు అంటగా అది ఆమెకు స్వామిపై గల భావనలను తెలిపేలా ఆమె అధరాలపై నిండి ఉంది అని మనోజ్ఞంగా అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఇది మధురభక్తిలో ఒక లక్షణం. ఆ నాయికా నాయకుల రతిలో పదునైన చూపులతో పెరకినప్పుడు వచ్చే నెత్తుటి చాయలను నాయిక యొక్క కంటిచివరలో గల ఎరుపుదనానికి సామ్యము చూపారు అన్నమయ్య. రతికేళిలో ఇది భౌతికంగా తోచినా మధురమైన భావన కాబట్టి అది పవిత్రంగా నిలచింది. అలాగే,  నాయిక చెంపల పక్క భాగాలు ముత్యాల జల్లులా మెరుస్తున్నాయి అన్న భావనను స్వామితో రతిలో ఆయన అద్దిన చెమట బిందువులతో సారూప్యం చూపారు.

ఈ సంకీర్తన మధురభక్తికి నిఘంటువు. నాయికా నాయకుల మధ్య  జరిగిన మధురమైన సంగమం యొక్క ఆనవాళ్లను నాయిక ముఖముపై గల రకరకాల లక్షణాలతో పోలిక చేయటం. ఇది కేవలం భావన మాత్రమే అయినా వాగ్గేయకారులు తమను తాము నాయికగా ఊహించకుంటే ఆ భావనలు పదప్రవాహంలో ఇంత అందంగా జాలువారవు. శ్రీవేంకటేశ్వరుని నమ్ముకొన్న మధురభక్తుడు అన్నమాచార్యులవారు. లక్ష్మీదేవి నుండి గోపిక వరకు గల అన్ని నాయిక పాత్రాలు ఆయనవే. చివరకు చెలికత్తె కూడే తానెయై ఈ సంకీర్తనను అందించారు.

అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తనను మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవేంకటేశ్వర గీతమాలిక అనే ఆల్బంలో ప్రఖ్యాత భక్తి సంగీత గాయని, అన్నమయ్య మానస పుత్రిక, అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు ఎంతో భావ సౌందర్యంతో, మధురభక్తితో ఆలపించారు. ఒక భక్తి సంగీత కళాకారునికి రససిద్ధి ఎంత ముఖ్యమో శోభారాజు గారు అన్నమయ్య సంకీర్తనలు విన్నప్పుడు అర్థమవుతుంది. అలమేలుమంగకు చెలికత్తెగా ఆ తల్లి స్థితిని అన్నమయ్య కళ్లకు కట్టినట్లు వర్ణిస్తే, ఆ భావాన్ని ఎంతో మృదువుగా, భగవద్రతితో శోభారాజు గారు ఆలపించారు. ఈ సంకీర్తన ఆరంభం ఆలాపనలోనే గాయని సన్నివేశానికి సముచితమైన సందర్భాన్ని ఆవిష్కరించారు. అలమేలుమంగమ్మకు స్వామితో కలిగిన మధురమైన రతి తరువాత ఎటువంటి మానసిక శారీరిక స్థితిలో ఉన్నారో ఈ గీతాలాపనలో శోభారాజు గారు మనకు రమణీయంగా పాడి వినిపించారు. చిగురుటధరము ఎంత మృదువుగా ఉంటుందో ఆ భావనను తన గానంలో ఒలికించారు శోభారాజు గారు.

అలాగే అలమేలుమంగ స్థితిని వర్ణిస్తున్న చెలికత్తె మనోభావాన్ని, చెలులకు చేసే విన్నపాన్ని శోభారాజు గారు చరణాలలో ఎంతో భావగర్భితంగా ఆలపించారు. మొదటి చరణంలో చెలువంబిప్పుడిదేమో చింతించరె చెలులు అన్న పదాలను, అలాగే నలువున ప్రాణేశ్వరుపై అన్న చోట ప్రత్యేకమైన ఆలాపనతో సన్నివేశానికి ప్రాణం పోశారు. తదుపరి పంక్తిలో ఉపమానాన్ని ఎంతో సున్నితంగా ఉచ్చరించి రాగయుక్తంగా ఆలపించారు.

శోభారాజు గారు అన్నమాచార్యుల వారి సాహిత్యంలోని లాలిత్యాన్ని, మాధుర్యాన్ని శాస్త్రీయ సంగీతంతో మేళవించి, ఎక్కడా ఆ సున్నితత్వం కోల్పోకుండా ఆలపించారు. అది వారి ప్రత్యేకత. శాస్త్రీయత పేరుతో భావాన్ని వెనక్కునెట్టి గమకాలతో పాడితే ఆ సంకీర్తనకు న్యాయం చేకూర్చినట్లు కాదు అన్నది నాకు వారి ఈ గీతాలాపనలో అందిన సందేశం. ఈ గీతాలాపనలో మరొక ప్రత్యేకత చరణాల మధ్య గల జతులు. నాయికా నాయకుల వృత్తాంతాన్ని ఆవిష్కరించే భావం కాబట్టి ఈ సంకీర్తన నృత్య ప్రదర్శనలకు ఎంతో అనువైనది. స్వామి, అలమేలుమంగలను మార్చి మార్చి భావానికి ఉపయుక్తంగా ప్రదర్శించటంలో నృత్యకళాకారిణి తన ప్రతిభను ఎంతో అందంగా ప్రకటించ వచ్చు. ఈ గీతాలాపనలో వీణావాదనం, గజ్జెల శబ్దము, తబలా వాద్య సహకారములతో లలితమైన సంగీతాన్ని అంతే లలితమైన శోభారాజు గారి ఆలాపనకు కూర్చారు స్వరకర్త. అలాగే రెండవ చరణంలో కామిని వదనాంబుజమున అద్దిన సురతపు చెమటల అన్న చోట సాహిత్యంలోని సందేశాన్ని, సందర్భాన్ని పరిపూర్ణమైన భావానుభూతితో ఆలపించారు శోభారాజు గారు. సంకీర్తన చివరలో ఆరంభానికి సరిపడే ఆలాపనతో ముగించారు. భావాన్ని నిర్మలంగా పాడగలిగే గాయని శోభారాజు గారు. అందుకే ఈ సంకీర్తన వారి గళంలో ఎంతో సుందరంగా పలికింది. అన్నమాచార్యుల వారి తత్త్వాన్ని సమాజశ్రేయస్సు కోసం ప్రచారం చేస్తున్న డాక్టర్ శోభారాజు గారికి ఇంత చక్కని సంకీర్తనను అందించినందుకు కృతజ్ఞతలు.

ఈ సంకీర్తన ఈ లంకెను  క్లిక్ చేసి, కీర్తనను ఎంచుకొని ప్లే చేసి వినండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి