RightClickBlocker

18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

శ్రీగణనాథం భజరే చిత్త పరాశక్తి యుతంశ్రీగణనాథం భజరే చిత్త పరాశక్తి యుతం

నాగ యజ్ఞ సూత్ర ధరం నాద లయానంద కరం

ఆగమాది సన్నుతం అఖిల దేవ పూజితం
యోగిశాలి భావితం భోగిశాయి సేవితం

రాగద్వేషాది రహిత రమణీయ హృదయ విదితం
శ్రీగురుగుహ సమ్ముదితం చిన్మూల కమలస్థితం

"ఓ మనసా! సకల గణములకు అధిపతియైన, ఆదిపరాశక్తితో యున్న వినాయకుని భజించుము

సర్పమును యగ్జోపవీతముగా ధరించిన వానిని, నాదమును, లయమును ఆనందకరముగా చేయువానిని భజించుము.

వేదములలో నుతించబడిన వానిని, సమస్త దేవతలచే పూజించబడిన వానిని, యోగులలో ఉత్తమునిగా భావించబడిన వానిని, శ్రీమహావిష్ణువుచే సేవించబడిన వానిని, రాగద్వేషములకు అతీతమైన, అందమైన హృదయములలో అగుపించేవానిని, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించే వానిని, చిత్ యొక్క మూలమనే కమలములో నివసించే వినాయకుని భజించుము. "

ముత్తుస్వామి దీక్షితులు పరదేవతానుగ్రహంతో ఆ తల్లిపైనే కాకుండా, సమస్త దేవతలపైనా అద్భుతమైన మంత్ర సమానమైన కృతులను రచించారు. వాతాపి గణపతిం భజే లో విఘ్నేశుని తత్త్వాన్ని పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వికాసంతో ఆవిష్కరిస్తే ఈ శ్రీ గణ నాథం భజరే లో దాని యొక్క సూక్ష్మ రూపాన్ని ప్రతిపాదించారు.

గణపతి జ్ఞానమునకు, బుద్ధి వికాసానికి, అష్టైశ్వర్య సిద్ధికి ప్రతీక అని మనం ఇహములో భావించితే దేహములో మూలాధార చక్రమందు నిలిచే దేవతా స్వరూపమని ఈ కృతిలో ప్రస్తావించారు. పరాశక్తితో కూడి ఉండే గణపతికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీవిద్యా చిద్భవానందుడు అని గణపతికి పేరు. ఆ పరాశక్తి చిత్ నుండి ఆమె ఆనందముగా ఉన్నప్పుడు ఉద్భవించినాడు గనుక ఆమెలోని సచ్చిదానందమునకు గణపతి ప్రతీక. తల్లీ బిడ్డలుగా కన్నా సమస్త జగత్తునందు వ్యాపించి యున్న ఆదిపరాశక్తి, ఆ శక్తిలోని మూలము గణపతిగా భావించితే ఆ గణపతి-పరాశక్తిలను వినాయక చవితితో పాటు దీపావళి వంటి పండుగలలో పూజించే ఆనవాయితీ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. కన్నడ దేశంలో వినాయక చవితిని గౌరీగణేశుల పూజగా వైభవంగా జరుపుకుంటారు. ఈ సాంప్రదాయం ఇతర ప్రాంతాలలో కూడా అనాదిగా ఉంది.

దీక్షితుల వారు ఈ నిగూఢమైన రహస్యాన్ని తన గణపతి కృతులలో ఇనుమడింపజేశారు. నాగయజ్ఞ సూత్రధరం నాదలయానందకరం అని అనటంలో పరమేశ్వరుని వైభవాన్ని గణపతి ఎలా పొందాడో మనకు తెలియజేసే ప్రయత్నం చేశారు కృతికర్త. శంకరుని శక్తితో నాదము, లయములో మనకు కలిగే ఆనందానికి కారకుడు గణపతి. అంటే మనలో ఆయా నాడులను ప్రేరితం చేసి మనలను ఆ దివ్యనాదహేలను రమించేలా చేయువాడు అని అర్థం. ఎంత అద్భుతమైన భావమో చూడండి. వేదములలో నుతించబడిన వాడు, అంటే? సనాతనుడు. వేదములకు ఆద్యంతములు లేవు. కాబట్టి ఆయన శాశ్వతుడు. సమస్త గణములకు అధిపతిగా ఊరకే నియమించబడలేదు. ఆది దంపతుల శక్తి ఏకమై గణపతిరూపంలో ఆవిర్భవిస్తే ఆ రూపము గణములకు అధిపతిగా ఉపయుక్తమైంది. ఆ పార్వతీ పరమేశ్వరుల పట్ల అపారమైన భక్తి కలిగిన గణపతి ఏ విధంగా నారాయణ మంత్రాన్ని జపించి గణాధిపత్యం పొందాడో మనందరికీ తెలిసిందే. ఆదిపరాశక్తి చిత్ నుండి ఉద్భవించిన వాడు, శంకరుని మూలాధారమందు నివసించువాడు కాబట్టే ఉత్తమమైన యోగిగా భావించబడ్డాడు. ఇంతటి యోగి రాగద్వేషములకు అతీతమైన వాడు, అందమైన హృదయములలో కనిపించేవాడు అని దీక్షితులవారు తరువాతి సాహిత్యంలో నుతించారు. అఖరి పంక్తిలో శ్రీగురుగుహ సమ్ముదితం చిన్మూల కమలస్థితం అని ఆయన ప్రస్తుతించారు. ఇక్కడ గురుగుహుడంటే ఆయన ముద్ర కాబట్టి తనకు ఆనందాన్ని కలిగించినవాడు అని అర్థం గోచరించినా, అసలు విషయం కార్తికేయునికి ఆనందం కలిగించినవాడు అని అర్థం. శరీరంలో నడుము క్రింది భాగాన ఉన్న మూలాధార చక్రమునకు అధిదేవత గణపతి. ఈ చక్రము కళంకములేని, నిర్మలమైన, అప్పుడే పుట్టిన బాలుని యొక్క ఆనంద స్థితిని సూచిస్తుంది. సరైన విధంలో జాగృతమైతే రాగద్వేషములకు అతీతమైన జ్ఞానమును కలిగిస్తుంది. ఇదీ గణపతి తత్త్వం. నాలుగు రేకుల కమలంలో 'లం' అనే బీజాక్షరంతో గణపతి ఈ మూలాధార క్షేత్రంలో నివసిస్తాడు.

దీక్షితులవారు కృతులలో దేవతామూర్తి లక్షణాలు, యంత్ర మంత్ర సారములు చాల సూక్ష్మంగా, పవిత్రంగా అవిష్కరించారు. ఈశమనోహరి రాగంలో కూర్చబడిన శ్రీగణనాథం భజరే గణపతి వైభవాన్ని ఇదే లక్షణాలతో రచించబడింది. పిల్లలు నేర్చుకుని పాడేలా ఈ కృతి సాహిత్యం మరియు స్వరాలు ఉంటాయి.

యూట్యూబ్ వీడియో వీక్షించండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి