14, సెప్టెంబర్ 2015, సోమవారం

పాప్ సంగీత మహారాణి - ఉషా ఊతుప్


నిండైన విగ్రహం, పెద్ద అంచు కంచిపట్టు చీర, నుదుటన రూపాయి బిళ్లంత పెద్ద బొట్టు,కళ్లకు కాటుక,మెడలో నగలు, చేతులనిండా గాజులు, చక్కగా అల్లుకున్న జడ, తలలో బోలెడు మల్లెపూలు,ఎక్కడున్నా గుర్తుపట్టే చక్కని నవ్వు...ఏవండోయ్ పాతసినిమాల్లో కథానాయికో లేక ఏ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారో అనుకొని పొరబడేరు...ఆవిడ పాడితే సింహం గర్జించినంతలా నినదిస్తుంది, ఆవిడ పాటలో మధువొలుకుతుంది, ఆవిడ ఉత్సాహం చూస్తే పదహారేళ్ల పడుచు పిల్లా అనిపిస్తుంది. ఆవిడ పేల్చే ఛలోక్తులకు, కనబరచే సమయస్ఫూర్తికి ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వి కరతాళ ధ్వనులతో హాలు మారు మ్రోగాల్సిందే. ఆవిడ వైవిధ్యానికి ప్రతిబింబం, సాంప్రదాయానికి దర్పణం...భారతీయ సంగీత సామ్రాజ్యంలో తొలి పాప్ మరియు జాజ్ సంగీత గాయని శ్రీమతి ఉషా ఊతుప్ గారి గురించి మాట్లాడుతున్నానండీ...

ఇప్పుడే ఆవిడ రెండు గంటలు ఏకధాటిగా పాడిన కచేరీ నుండి బయట పడ్డానండీ. బయట చల్లని గాలి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. నా చెవులలో తుప్పు వదిలిపోయింది. నా చిన్ననాటి ఉత్సాహంతో మనసు నాట్యం చేసింది. రెండు గంటలపాటు నన్ను నేను మరచిపోయాను. శిల్పకళావేదికలో కూర్చున్న వేలాదిమంది లయబద్ధంగా ఆవిడ తో కలిసి జోష్ గా పాడారు.

ఒకటా రెండా? దాదాపు 50 ఏళ్ల సంగీత ప్రస్థానం పద్మశ్రీ బిరుదు పొందిన ఉష ఊతుప్ గారిది. తమిళ కుటుంబంలో ముంబాయిలో పుట్టి, కేరళీయుడిని వివాహం చేసుకొని, బెంగాలులో స్థిరపడిన విశేష గాయన ఆవిడ. సినీ సంగీతంలో ఎన్నో పాప్ మరియు ఉరకలెత్తించే పాటలు పాడటంతో పాటు ఈ ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వము, ప్రేమ, సహనం మొదలైన వాటికోసం తన సంగీతం ద్వారా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆవిడ పాట మొదలు పెట్టగానే చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా, ఆడా మగా ఆలోచన లేకుండా అందరూ నాట్యం చేసేంతగా ఆ గానం ఉత్తేజపరస్తుంది.

ఐ బిలీవ్ ఇన్ మ్యూజిక్ అన్నది ఆవిడ నినాదం. అవధుల్లేని ఆనందాన్ని కలిగించటానికి తన జీవితం చేశానని ఆవిడ చెప్పిన మాటలు కచేరీలలో ఆవిడ పాట శైలి గమనిస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక గాయకుడు ఉన్నాడు. ఆ గాయకుడు తన సంకోచాన్ని విడిచి హాయిగా పాడితే ఒత్తిడి తొలగి శాంతి చేకూరుతుంది అన్న భావాన్ని విశ్వసించి ప్రేక్షకులను తనతో పాటు పాడించి ఆ కార్యక్రమాన్ని ఒక కుటుంబ గానంలాగా చేస్తారు ఉషా ఊతుప్ గారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు, సామాజిక సేవా సంస్థలకు, ప్రకృతి వైపరీత్యాలకు విరాళాల సేకరణకు ఆవిడ గత నలభై ఏళ్లుగా కచేరీలు చేస్తూనే ఉన్నారు.

68 ఏళ్ల వయసులో ఏ మాత్రం గాత్రధర్మం తగ్గని స్వరపేటిక ఆవిడది. 2012 సంవత్సరంలో సాత్ ఖూన్ మాఫ్ అన్న చలన చిత్రానికి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నేపథ్యగాయని పురస్కారం లభించింది. 1970, 80 దశకాలాలో ఆమె ఎన్నో హిందీ చలన చిత్ర గీతాలు పాడారు. వాటిలో హరే రామ హరే కృష్ణ చిత్రంలోని హరే రామ హరే కృష్ణ, డిస్కో డ్యాన్సర్ చిత్రంలోని కోయి యహా నాచె నాచె, అర్మాన్ చిత్రంలోని రంబా హో, ప్యార్ దుష్మన్ చిత్రంలో హరి ఓం హరి, షాలిమార్ చిత్రంలో వన్ టూ చ చ చ, షాన్ చిత్రంలో దోస్తో సే ప్యార్ కియా లాంటి ఎన్నో ప్రాచుర్యం పొందిన పాటలు ఉన్నాయి. ఇవే కాక ఎన్నో ప్రైవేట్ ఆల్బంలు ఎన్నో భారతీయ భాషలలో చేశారు.

ఏ భాషలో పాడితే ఆ భాష ప్రజలు ఆమెకు అభిమానులయ్యారు. సంగీతానికి భాష కుల మత ప్రాంతీయ భేదాలు లేవని నిరూపించారు. ఇతర గాయకులకు భిన్నంగా పాశ్చాత్య సంగీతాన్ని భారతీయతతో కలబోసి, భారతీయతకు పట్టం కట్టి సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన అరుదైన మహిళ ఉషా ఊతుప్ గారు. భారతీయ స్త్రీని ఒక బలమైన శక్తిగా, ఉత్సాహవంతమైన మూర్తిగా, పరిపూర్ణమైన కళాకారిణిగా ప్రపంచానికి ఆవిష్కరించడంలో ఉషా ఊతుప్ గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. భగవంతుడు ఆమెకు ఈ సేవాభాగ్యాన్ని ఎప్పటికీ కొనసాగించాలని ప్రార్థన.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి