మొగల్ సామ్రాజ్యపు రాక్షసరాజులు భరతభూమిని కొల్లగొడుతున్న రోజులవి. నిర్దాక్షిణ్యంగా భవ్యమైన మన ఆలయాలపై దాడి చేసి, విగ్రహాలను ధ్వంసం చేసి, ఆలయాల సంపదను దోచుకొని సనాతన ధర్మానికి తూటాలు పొడిచిన 16వ శతాబ్దపు మొదటి సంవత్సరాలు అవి. ఔరంగజేబు భరతజాతి సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయాలని అతి క్రూరంగా స్త్రీలను చెరబట్టి, మగవారిని మతమార్పిడి చేయించి సనాతన ధర్మం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న గడ్డు కాలం అది. అప్పుడు అవతరించారు ఒక మహనీయుడు. ఆవిరైపోతున్న హిందూ వారసత్వ సంపదను, బలహీనమవుతున్న సనాతన ధర్మ పునాదులను రక్షించి పునరుద్ధరించి ధర్మ సంస్థాపన చేయటానికి అవతరించారు స్వామి సమర్థ రామదాసు.
పవిత్రమైన గోదావరీ తీరాన మరాఠా గడ్డపై ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో 1608 శ్రీరామనవమి నారు సంవత్సరంలో రాణూబాయి మరియు సూర్యాజీ దంపతులకు జన్మించాడు సూర్యతేజస్సు గల బాలుడు. అతనికి తల్లిదండ్రులు నారాయణ్ అని నామకరణం చేశారు. ఎనిమిదవ ఏటనే తండ్రి మరణించటంతో నారాయణుడిలో జీవితం, జనన మరణాలపై ప్రశ్నలు తలెత్తి అంతర్మథనం మొదలైంది. శోధన చేస్తున్న అతనికి మూడేళ్ల తరువాత స్వయంగా రాముడే ప్రత్యక్షమై రామ త్రయోదశాక్షరీ మంత్రాన్ని జపించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. రాముని అనుగ్రహంతో నారాయణుడు ఆ మంత్రాన్ని అహోరాత్రులు జపించటం మొదలు పెట్టాడు. అంతటితో ఆతనికి రామదాసు అన్న నామం వచ్చింది. తల్లిదండ్రులు అతనికి వివాహం చేయతలపెట్టారు. వివాహ సమయంలో పఠించబడే మంత్రాలలో అతనికి 'సావధాన్ ' అనే పదము బిగ్గరగా వినబడింది. అది తనకు మేల్కొలుపుగా గుర్తించి వివాహ స్థలమును వదలి నాసిక్ వెళ్లి అక్కడ 12 ఏళ్లు తపస్సు చేశాడు. ఈ సమయంలో హనుమంతుడు రామదాసుకు వెన్నుదన్నుగా నిలిచి అతనికి అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించారు. ఆ హనుమంతుడే ధర్మ స్థాపన కోసం ఒక ఉద్యమాన్ని ఆరంభించవలసిందిగా సమర్థ రామదాసును ఆదేశించారు.
హనుమంతుని ఆజ్ఞతో సమర్థ రామదాసు దేశాటన మొదలు పెట్టారు. దేశం నలుదిక్కులా తిరిగి సమాజంలో జరుగుంతున్న ఘోరాలను చూశారు, పరిస్థితులకు గల కారణాలను ఆకళింపు చేసుకున్నారు. మొగలాయీల అరాచకాలను అడ్డుకోవాలంటే హిందువులను సంఘటితం చేయాలని సంకల్పం చేసుకొన్నారు. సనాతన ధర్మంలో దేవాలయాలను ప్రజలను ఏకం చేసే గొప్ప సాధనాలు. అందుకే సమర్థ రామదాసు దేశవ్యాప్తంగా హనుమాన్ దేవాలయాలను నిర్మించారు. ఈ దేశంలో ప్రాచీనమైన హనుమాన్ దేవాలయాలలో సింహాభాగం రామదాసు గారి సమయంలో నిర్మించబడినవే. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను ఖండించారు. కులం పేరుతో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారు. మహిళలు సమాజ నిర్మాణంలో పాల్గొనాలని ఉద్బోధించి వారిని ఇళ్లనుండి బయటకు వచ్చేలా చేశారు. రాండుని, హనుమంతుడిని ఎంతో నిష్ఠతో కొలిచిన రామదాసుకు పండరీపురంలోని విఠలుని అనుగ్రహం కలిగింది. ఒక బ్రాహ్మణుని రూపంలో స్వయంగా విఠలుడే వచ్చి ఆయనను పండరీపురం తీసుకువెళ్లి అద్భుతమైన అనుభూతిని ప్రసాదిస్తాడు. అలాగే, మాహూరుగఢ్ దత్తాత్రేయుని అనుగ్రహం కూడా పొందారు సమర్థులు.
మొగల్ రాజుల దాష్టిణ్యాన్ని ఎదుర్కోవటానికి ధైర్యము, శౌర్యము, త్యాగము కల వీరుడు కావాలని తెలుసుకొని మరాఠావీరుడైన శివాజీని తన శిష్యునిగా అంగీకరిస్తారు. అతనికి నిరంతరం సలహాలిస్తూ ధర్మ సంస్థాపన దిశగా శివాజీని ముందుకు నడిపించారు. రాగద్వేషాలు లేకుండా రాజ్యాన్ని పాలించటంలో ఎంతో తోడ్పడ్డారు. శివాజీ నేతృత్వంలో సనాతన ధర్మాన్ని ఇస్లాం రాజుల నుండి కాపాడటంలో కృతకృత్యులయ్యారు సమర్థ రామదాసు.
తన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఆయన ఎన్నో అద్భుతమైన రచనలను చేశారు. వాటిలో ముఖ్యమైనది దాసబోధ. గురు శిష్యుల సంవాదంగా సాగే ఈ దాసబోధ ద్వారా పరబ్రహ్మ తత్త్వము, ఆత్మ, మాయ, జనన మరణాలపై అద్భుతమైన వివరాలను ఆవిష్కరించారు. పామరులకు కూడ అర్థమయ్యేలా, సనాతన ధర్మంలో జీవన శైలిని, వ్యక్తిత్వ వికాసాన్ని తన రచనల ద్వారా తెలియజేశారు. మనాచీ శ్లోకములన్నది ఆయన మరో ప్రసిద్ధమైన రచన. అలాగే హనుమంతుడిపై ఎన్నో రచనలను చేశారు.
మన తెలంగాణా రాష్ట్రంలో ఆయన ద్వార మనకు అందిన సంపదలు నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ హనుమాన్ దేవాలయము, హైదరబాద్ జియాగూడా లోని కేసరి హనుమాన్ ఆలయం. ఇవి స్వయంగా అయ్న నిర్మింపజేసిన మందిరాలు. ఎంతో మహిమాన్వితమైనవి. అలాగే ప్రస్తుత మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఎన్నో భవ్యమైన మందిరాలను ఆయన నేతృత్వంలో నిర్మించారు. తంజావూరులో సమర్థ రామదాసు మఠం అక్కడి శరభోజి మహారాజుల కాలంలో ఎంతో వైభవాన్ని పొందింది.
రామదాసు తన చివరి రోజుల్లో ఎక్కువ సమయాన్ని ఎవరూ లేని అడవి ప్రాంతాల్లో గడపటానికి ఇష్టపడ్డారు. సజ్జన్ గఢ్ వద్ద శివాజీ మహారాజు ఆయనకు ఒక కోటను ఇచ్చి అక్కడ అన్ని వసతులు ఉండేలా ఏర్పాటు చేశాడు. సమర్థ రామదాసు అక్కడే ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సిద్ధి పొందారు. ఆయన శిష్య పరంపర ఎంతో మహనీయమైనది. రామనామాన్ని జపిస్తూ ఆయన దేహాన్ని త్యాగం చేశారు. ఆ సమయంలో ఒక దివ్యతేజస్సు ఆయన దేహాన్ని వీడి రాముని విగ్రహంలో ఐక్యమైంది.
ఆయన బోధలలో శరీర వాంఛలకు దూరంగా ఉండటం, సత్సాంగత్యము, రాముని మనసులో కొలువటం, కోపాన్ని, అహంకారాన్ని, మోహాన్ని జయించటం, అందరిని ప్రేమించటం, అందరిలోనూ పరమాత్మను చూడగలగటం, సర్వస్య శరణాగతి మొదలైనవి ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. ఆయన శిష్య పరంపరలో 20 శతాబ్దంలో కర్ణాటక వరదహళ్లిలో నివసించిన భగవాన్ శ్రీధర స్వామి ప్రముఖులు. వీరు రామదాసు గారి బోధలను, ఆయన ఆధ్యాతిక వైభవాన్ని ఎంతో ప్రచారం చేశారు.
ఈ విధంగా భరతజాతిలో సనాతన ధర్మ పరిరక్షణకు తోడ్పడ్డ వారిలో సమర్థ రామదాసు వారు అగ్రగణ్యులు.
శ్రీరామ జయరామ జయ జయ రామ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి