10, సెప్టెంబర్ 2015, గురువారం

బాధ్యతలు - నిజాలు



చెవులలో ఇయర్ ఫోన్సు, నడుముల క్రిందకు జారే జీన్సు ప్యాంటు, చేతులు లేని టీ షర్ట్, రెండు భుజాలపై ఏ రూపమో తెలియని పచ్చబొట్లు...జుట్టుకు పెయింటు వేశాడా అన్నట్లుగా నిక్కబొడిచిన వెంట్రుకలు, కాళ్లకు చెరో రంగు జోళ్లు, కళ్లకు నల్లని సన్ గ్లాసెస్.."ఓ మధూ ఓ మధూ నా మనసు నాది కాదు ఓ మధూ"....అని బన్నీ పాటను పాడుకుంటూ "మమ్మీ బై" అని చెప్పి ఇంటి బయట ఉన్న హార్లీ ఎక్కి రయ్ రయ్ అనేలా స్టార్ట్ చేసి దూసుకు వెళ్లిపోయాడు 'మ్యాడీ'. గుమ్మం ముందేమో వేంకటేశ్వర్లు, వరలక్ష్మి అని బోర్డు ఉంది,కొడుకు పేరు 'మ్యాడీ' ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? తల్లిదండ్రులు చక్కగా వేణుమాధవ అని పేరుపెడితే స్టైలుగా మ్యాడీ అని మార్చుకున్నాడు. ఇక ఈ 20 ఏళ్ల కుర్రాడి సంగతి అటుంచి, వీడి చెల్లెలు 17 ఏళ్ల సుమ దగ్గరకు వెళదాం. హమ్మయ్య పేరు మటుకు పరవాలేదండోయ్. ఊపిరి పీల్చుకున్నారా? గదిలో చూడండి. నడుము క్రింద ఒక ఆరంగుళాల వరకు బట్టలు వేసుకొని, అదే విధంగా పైన కూడా ఆచ్ఛాదన అరకొరగా వస్త్రాలున్న వీరవనితల ఫోటోలు నలుదిక్కులా..విడిచిన బట్టలు చెల్లాచెదురుగా, ఎంగిలి ప్లేటు, గ్లాసు చదువుకునే బల్లమీద. మడిమలు నాలు అంగుళాల ఎత్తుగల చెప్పులు ఎదురుగా...చెప్పనలవి కాదు ఆ గది రూపం.

ఇదీ నేటి మన కథకు వేదిక. వేంకటేశ్వర్లు ఆగర్భ శ్రీమంతుడు. తండ్రి వారసత్వంగా వచ్చిన రియల్ ఎస్టేటు వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసి నాలుగు చేతులు ఆరు మెదళ్లుగా సంపాయించాడు. భార్య వరలక్ష్మి రాజకీయాల్లో ఆరితేరిన మహిళ. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి. నిరంతరం వచ్చిపోయే వారు, ఫోన్లు, ఎత్తుకు పై ఎత్తులు ఆమె దినచర్య. వేంకటేశ్వర్లు జీవితమంతా కష్టపడి ఒక 10 కోట్లు వెనకేస్తే వరలక్ష్మి రెండేళ్లలో సంపాయించింది ఆ డబ్బును. బంజారాహిల్స్ నివాసం. ఇద్దరికీ మహాభక్తి సుమా. పూజలు, వ్రతాలు, హోమాలు, ప్రపంచంలో కనీ వినీ ఎరుగని దేవుళ్ల ఉపాసనలు...

త్వరలో కొడుకు కాలేజీ చదువు పూర్తవతుంది వాడిని ఎంబీయే చదివించి తన వ్యాపారంలోకి దింపాలని తండ్రి ఆశ. కూతురును తన తరువాత ఎమ్మెల్యేగా తీర్చిదిద్దాలని తల్లి కోరిక. దీనికోసం చేయని పూజలేదు, మొక్కని దేవుడు లేడు. వీళ్లకు కనిపించని దేవుడిదే తప్పు వీళ్ల పూజలందుకోలేకపోతే అన్నట్లు ఉంటుంది వ్యవహారం. వృత్తులు వేరైనా భార్యాభర్తల ఆలోచనా విధానం ఒక్కటే. వీలైనంత సంపాదించాలి, పిల్లలకు ఇవ్వాలి, వారిని తమ వారసులుగా నిలబెట్టాలి.

"జయా! వంట ఏం చేస్తున్నావ్" అని వంటమనిషి జయను అడిగింది 80 ఏళ్ల లక్ష్మమ్మ. ఆవిడ వేంకటేశ్వర్లు తల్లి. గంజాయివనంలో తులసిమొక్క ఆవిడ. ఏం లాభం? పండుటాకులా రాలటానికి సిద్ధంగా ఉంది. కొడుకు కోడలు, మనుమడు, మనవరాలి పోకడలు చూసి కుప్పకూలిపోతుంది ఆమె హృదయం. ఎటు పరుగెడుతున్నారు వీళ్లు? డబ్బు వీళ్లను ఎంతటి హీనస్థితికి తీసుకు వచ్చింది? ఇదేనా నేను, మా ఆయన కోరుకున్నది? అని పరిపరి విధాలా ఆలోచించి ఏమీ చేయలేక దేవుడి ముందు కూర్చుని ప్రార్థించి కన్నీరు కార్చి వెళ్లి పడుకుంది.

"పెద్దమ్మ గారు, ఈరోజు పిల్లలు, అయ్యగారు అమ్మగారు బయట తింటామన్నారు. మీకు నిన్నటి కూర చారు ఉన్నాయి ఫ్రిజ్ లో. ఒక్కరి కోసం వంట ఎందుకు అని ఏమీ చేయలేదు".."మరి వంటింట్లో ఏం చేస్తున్నావే?" లక్ష్మమ్మ ప్రశ్నార్థకంగా అడిగింది. "ఆమ్లెట్ తినాలనిపించింది పెద్దమ్మ గారూ, వేసుకుని తింటున్నా"..."సొమ్మొకడిది సోకోకడిది" అని తలపట్టుకుంది ఆ అవ్వ.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంత్రిగారితో మీటింగులో ఉన్నారు. వేంకటేశ్వర్లు మంత్రిగారితో దీర్ఘ సమాలోచనలో ఉన్నాడు. ఫోను నాలుగైదు సార్లు మ్రోగింది. కొత్త నెంబరు అని పట్టించుకోలేదు. ఒక గంట తరువాత తల్లి లక్ష్మమ్మ నుండి ఫోన్. ఎత్తాడు. ఆవిడా రోదిస్తూ "ఒరేయ్ వేంకటేశ్వర్లూ...మన మాధవ అపోలో హాస్పిటల్ లో ఉన్నాడుట. వేగంగా వెళుతూ ఉంటే లారీ గుద్దిందిట"..ఫోన్ పెట్టేసింది.  హతాశుడైనాడు వేంకటేశ్వర్లు. పరుగు పరుగున అపోలో హాస్పిటల్ చేరుకున్నాడు. భార్యకు ఫోన్ చేస్తే దొరకలేదు. విమాన ప్రయాణంలో ఉంది. పిల్లాడు స్పృహలో లేడు. "సార్! మీ అబ్బాయి హెల్మెట్ పెట్టుకోలేదు. పగలు పూటే తాగి బండి అతి వేగంగా నడుపుతున్నాడు. లారీని చూసుకోలేదు మలుపు దగ్గర. వెళ్లి గుద్దేశాడు...తలకు బలమైన గాయం తగిలింది..48 గంటల వరకు ఏమీ చెప్పలేము" అన్నాడు ఎమర్జెన్సీ డాక్టర్.

వరలక్ష్మి రెండు గంటల తరువాత ఆసుపత్రికి చేరుకుంది. భార్యను చూసి గట్టిగా ఏడ్చేశాడు వేంకటేశ్వర్లు. ఇంతలో వరలక్ష్మికి ఫోను. "మేడం..క్షమించాలి..మీకు నేరుగా ఫోన్ చేస్తున్నాను. మీ అమ్మాయి కాలేజీకి మూడు నెలలుగా సరిగ్గా రావట్లేదు. ఎవరో అబ్బాయితో బయట కనిపించిందని వేరే స్టూడెంట్స్ చెబుతున్నారు. మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యింది. ఆ పరీక్షలు కూడా రాయలేదు. పిల్ల ఆరోగ్యంగా కూడా కనిపించటం లేదు..ఇలా అయితే అమ్మాయి భవిష్యత్తు..." ఫోన్ పెట్టేసింది వరలక్ష్మి.

కళ్లెదుట జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదు. తమ కలలు కరిగిపోతున్నాయా అని ఆలోచనలో పడ్డారు ఆ దంపతులు. ఇంటికి వచ్చారు. లక్ష్మమ్మ దిగాలుగా కూర్చొని ఏడుస్తోంది. కొడుకు కోడలిని చూసింది. దగ్గరకు వెళ్లి "మీ ఇద్దరితో నేను మాట్లాడాలి". "ఏంటమ్మా! ఒక పక్క పిల్లాడు చావుబతుకుల్లో ఉన్నాడు,మధ్యలో నీ గోల ఏంటి?" "ఏంటత్తయ్యా! పిల్లలిద్దరి గురించి తల బ్రద్దలవుతోంది అంత ముఖ్యమైన విషయం ఏమిటి"...

"వాళ్ల గురించే. నాయనా! పిల్లలు చేయి దాటిపోతున్నారు. అలవాట్లకు, డబ్బుకు బానిసలై జీవితంలో క్రమశిక్షణ లేకుండా ఉన్నారు. రండి చూపిస్తాను ఏమి జరుగుతోందో." అని వాళ్లిద్దరినీ  పిల్లల గదుల్లోకి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న చిందరవందర జీవితాన్ని అరాచకాన్ని వివరించింది. కళ్లముందు ఉన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు ఆ భార్యాభర్తలు. సిగరెట్లు, బాటిల్సు, అశ్లీల పుస్తకాలు, డీవీడీలు, గర్భనిరోధక మాత్రలు, విడిచిన బట్టలు...ఇంకా ఇంకా ఎన్నో...

"నాయనా! డబ్బు మనలను నలుగురికి సాయపడేలా, నలుగురికి ఉపాధి కలిగించేలా, ధర్మకార్యాలు చేయటానికి ఉపయోగపడాలి. ఆ డబ్బు మన జీవితంలో బాధ్యతలను విస్మరించి, ధర్మాన్ని విడిచిపెట్టి, తప్పుదారులు పట్టి కూడాబెట్టటానికి కాదు. అమ్మా వరలక్ష్మీ! సమాజ సేవ మంచిది. ఎంతో ఉత్తమమైన సేవ. కానీ, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మీరు కన్న బిడ్డలు వీళ్లు. మీకు సమయం లేకపోతే వారిని కనే హక్కు లేదు మీకు. కన్న తరువాత మీ బాధ్యత నిర్వర్తించకపోతే పరిణామాలు ఏమిటో చూశారు కదా. ఇకనైనా మేల్కొనండి. పిల్లలు ఏమి చేస్తున్నారో, ఎక్కడున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏమి తింటున్నారో ఇవి తెలుసుకోవటం మీ కనీస బాధ్యతలు. ఇవి పూర్తి చేసిన తరువాతే మీ వృత్తులు, సామాజిక బాధ్యతలు."

వేంకటేశ్వర్లు, వరలక్ష్మికి పరిస్థితి అర్థమయ్యింది. జరుగుతున్న ఘోర నష్టానికి కారణం తామే అని తెలుసుకున్నారు. ఆసుపత్రికి బయలుదేరి దారిలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. "స్వామీ! మా బాధ్యతలు విస్మరించి డబ్బు కోసం, పదవులకోసం మేము కన్న పిల్లలపై దృష్టి లేకుండా వ్యవహరించాము. ఇంకొక్క అవకాశం కావాలి స్వామీ! అని నిజాయితీగా ప్రార్థించారు. ఆసుపత్రికి చేరుకున్నారు. "మేడం. మీ అబ్బాయి ప్రాణానికి అపాయం లేదు. ఆపరేషన్ చేశాము. ఒక వారం ఇక్కడే ఉండాలి" అన్నాడు డాక్టర్. తల్లిదండ్రులు భగవంతునికి కృతజ్ఞతగా మొక్కారు.

సాయంత్రం సుమను పిలిచి ప్రక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు "తల్లీ, ఇన్నిరోజులు నీతో సమయం గడప లేకపోయాము, వంటవాళ్లపై, పనివాళ్లపై వదిలేశాము...మమ్మల్ని క్షమించు" అన్నారు. "మమ్మీ, డాడీ! నాకు కూడా మా ఫ్రెండ్స్ లాగా మీతో గడపాలని, మీతో కలిసి తినాలని ఉండేది. మీకు సమయం లేక నేను ఒక అబ్బాయితో చనువుగా ఉంటున్నాను. ఇంట్లో దొరకని రిలాక్సేషన్ అతని దగ్గర పొందుదామని తప్పటడుగు వేశాను...నన్ను ఒంటరి తనం వెంటాడుతోంది. అన్నయ్య మాట్లాడడు, మీకు సమయం లేదు...అందుకని ఇలా ఉంది నా జీవితం. ఇంట్లో వంట మనిషి కూడా మీకు టైం లేదన్న విషయాన్ని అలుసుగా తీసుకుంటోంది...."

వరలక్ష్మి  కళ్ల వెంట నీళ్లు జల జల రాలాయి. వేంకటేశ్వర్లు తలదించుకున్నాడు. పిల్ల ఎంత నలిగిపోయిందో అర్థమై ఇద్దరికీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలన్న సంకల్పం కలిగింది. వేంకటేశ్వర్లు వెంటనే ఆఫీసుకు ఫోన్ చేశాడు. అక్కడ నిజాయితీగా పని చేసే ఇద్దరు ఉద్యోగులను తన ప్రాజెక్టులకు డైరెక్టర్లుగా నియమించాడు. రోజులో సాయంత్రమంతా తనకు సమయం ఉండేలా పనిని వారి మధ్య విభజించాడు. వరలక్ష్మి మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా మాత్రం ఉండాలని నిర్ణయించుకొంది. ప్రతి ఉదయం, సాయంత్రం, వారాంతం పిల్లలతో గడిపి వారి యోగక్షేమాలు చూసుకోవాలని నిర్ణయించింది.

పదిరోజుల తరువాత "మాధవా! పద, నిన్ను నడిపిస్తాను" అని చెప్పి పార్కుకు తీసుకువెళ్లి ఒక చేతిని తన భుజంపై వేసుకొని, రెండో చేయి పట్టుకొని కొడుకును నడిపించే ప్రయత్నం చేశాడు వేంకటేశ్వర్లు. "సుమా! ఈరోజు మీ ప్రిన్సిపాల్ ను కలవాలి. వెళ్లి మనం డిస్కస్ చేసిన ప్లాన్ వివరించి ఇంకో అవకాశం ఇవ్వమని అడుగుదాం. నీకోసం గారెలు, అల్లం పచ్చడి చేశాను తిను" అంది వరలక్ష్మి. లక్ష్మమ్మ పూజా మందిరం ముందు నిలుచుని స్వామికి తన కృతజ్ఞతను తెలిపింది. ఆరు నెలల తరువాత మాధవ పూర్తిగా కోలుకున్నాడు. సుమ మొదటి సంవత్సరం పరీక్షలు పాసై రెండవ సంవత్సరం కోసం కోచింగులో చేరింది. వేంకటేశ్వర్లు, వరలక్ష్మి కేబీఆర్ పార్కులో తేలికపడిన మనస్సుతో వడివడిగా వాకింగ్ చేస్తున్నారు. "ఏవండీ! నాదో ఆలోచన! మనం అక్రమంగా సంపాదించిన డబ్బును దేవస్థానానికి సగం, వృద్ధుల ఆశ్రమానికి సగం ఇచ్చేద్దాం...నాలోని అపరాధ భావం తగ్గుతుంది...వెంటనే వేంకటేశ్వర్లు "అలాగే" అని ఓకే చెప్పి కార్యోన్ముఖుడైనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి