అనంతాళ్వారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు. భగవద్రామానుజుల ఆజ్ఞమేరకు స్వామికి పుష్పమాలా కైంకర్యం చేయటానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. స్వామికి పూలమాలలను అల్లటానికి ఆయన ఒక పూలతోటను పెంచదలచి, దానికి నీరు అందించే ఒక చెరువును త్రవ్వాలని నిశ్చయిస్తాడు. ఇతరుల సహాయము తీసుకోకుండా, తాను, తన ధర్మపత్ని మాత్రమే ఆ చెరువును తవ్వాలని సంకల్పం చేసుకొని కార్యం ఆరంభిస్తాడు. అనంతాళ్వారు గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే అతని భార్య గంపలలో ఎత్తుకొని వెళ్లి దూరంగా ఆ మట్టిని పోసేది.
ఇప్పటికీ స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దటం తిరుమల ఆలయంలో ఆచారంగా కొనసాగుతునే ఉంది. అనంతాళువారు ఉపయోగించిన గునపం శ్రీవారి ఆలయంలో ముఖ్యద్వారం కుడివైపు పైన భాగంలో వేలాడదీసి కనబడుతుంది. ఈ సంఘటనను అన్నమాచార్యుల వారు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అనే ప్రసిద్ధమైన సంకీర్తనలో ప్రస్తావించారు. రెండవ చరణంలో ' అచ్చపు వేడుకతోడ అనంతాళువరికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు ' అని నుతించారు. ఈ సంకీర్తనలో కురువరతినంబి, తొండమాన్ చక్రవర్తి, అనంతాళ్వారు, తిరుమలనంబి, తిరుకచ్చినంబి మొదలైన స్వామి భక్తులను ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఎలా కరుణించి అనుగ్రహించాడో, వేర్వేరు పరిస్థితులలో ఆయన లీలలను అన్నమాచార్యుల వారు అద్భుతంగా తెలియజేశారు. అందుకే అన్నమాచార్యుల వారి కీర్తనలలో అంత మహిమ ఉంది. మంత్రసమానమైన కీర్తనలను మనకు అందించిన మహనీయుడు ఆయన.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేసిన శ్రీవేంకటేశ్వర గీతమాలిక అనే ఆల్బంలో ప్రఖ్యాత గాయని శ్రీమతి శోభారాజు గారు ఈ గీతాన్ని అద్భుతంగా పాడారు. భగవంతుని సేవలో ప్రధానమైనది భక్తిలోని నిజాయితీ, శ్రద్ధ. ఈ లక్షణాలను పరమభక్తుల ఉదాహరణలతో అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలో పొందుపరచగా శోభారాజు గారు ఎంతో సుందరంగా హిందోళంలో ఆలాపించారు.
డాక్టర్ శోభారాజు గారితో గల నాకు పరిచయంలో వారి వ్యక్తిత్వం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. భక్తిలో వారు కనబరచే భావప్రాధాన్యత మరియు తాదాత్మ్యత వారిని నేను అమ్మా అని పిలిచేలా చేసింది. అన్నమాచార్యుల వారి సంకీర్తనల వైభవాన్ని చాటే మహత్కార్యానికి జీవితాన్ని అంకితం చేసిన వారు భక్తి సూత్రాలను పరిపూర్ణంగా పాటిస్తూ తమ గళం ద్వారా సద్గురువుల, వేంకటేశ్వరస్వామి సేవ చేస్తున్నారు. కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు అన్న సంకీర్తనలోని అంతరార్థాన్ని, ఆ మహాభక్తుల వివరాలను శోభారాజు గారి మాటలలో ఎన్నో మార్లు విన్నాను. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి గాత్రంలో కొండలలో నెలకొన్న అనే సంకీర్తనను వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి