నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము పురాణదంపతుల మేలు భజింతు గదమ్మా! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ! నిన్
నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ! ఈశ్వరీ!
శ్రీమదాంద్ర మహాభాగవతము దశమ స్కంధములోని రుక్మిణీ కల్యాణ ఘట్టములో మహాకవి పోతన కురిపించిన అమృత వర్షము ఈ పద్యము. శ్రీమహాలక్ష్మి అంశగా రుక్మిణి భీష్మకుని కుమార్తెగా జన్మిస్తుంది. మాధవుని వలచి, అతనే తనపతి యని, ఆతని కోసమే జీవించి, అతనిని మనసారా నమ్మి కొలిచింది. అన్నలు ఆమెకు శిశుపాలునితో వివాహము నిశ్చయించగా ఆమె అగ్నిద్యోతుడను బ్రాహ్మణునితో శ్రీకృష్ణునికి సందేశము పంపగా, ఆ యదుభూషణుడు ఆమె ప్రేమను స్వీకరించి ఆమె పట్ల తనకు గల మక్కువను ప్రకటించి, వివాహము చేసుకోవటానికి నిర్ణయిస్తాడు. బ్రాహ్మణునితో తాను వచ్చి రుక్మాదులను ఓడించి రుక్మిణిని రాక్షస వివాహమాడుతానని సందేశము పంపిస్తాడు. అప్పుడు ఆ రుక్మిణి కార్యసిద్ధికై లోకానికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను నుతించే పద్యం ఇది. దైవాంశసంభూతులైన వారికి దైవముతో పని ఏమిటి అన్న ప్రశ్నకు ఈ పద్యం మరొకసారి సమాధానం తెలుపుతుంది. ఎంతటివారలైన పరమాత్మను కొలిచి ఈ విశ్వంలో భక్తి, శ్రద్ధ, విశ్వాసము, కృతజ్ఞత చాటారు. రాముడైనా, కృష్ణుడైనా, సీత, రుక్మిణులైనా పరమాత్మను కొలిచి ధర్మ నిష్ఠకు గల ప్రాముఖ్యతను శాశ్వతం చేశారు.
రుక్మిణి ఇలా ప్రార్థించింది. "ఓ పార్వతీ! సనాతనులైన పార్వతీ పరమేశ్వరులను నా మనసులో నమ్మినాను. ఆది దంపతులైన మిమ్ములను నేను శ్రధ్ధతో పూజిస్తున్నాను కదమ్మా! ఓ అమ్మలకు అమ్మవైన పార్వతీ దేవీ! నీవు దయ అనే సాగరానికి రూపము కదా! నిన్ను నమ్మిన వారికి నాశము లేదు కదమ్మా! హరిని నాకు పతిగా చేయుము తల్లీ!
అంత ఆర్తితో, భక్తితో ఆ ధర్మపరాయణ అయిన రుక్మిణి ప్రార్థించగా అమ్మ వినకుండా ఉంటుందా? వెంటనే శ్రీకృష్ణుడు బలరామాదులతో వచ్చి రుక్మిణిని కొనిపోయి వివాహమాడతాడు. ఆమె మనోరథమును సఫలము చేస్తాడు. రుక్మిణి యొక్క హరిభక్తి ఎటువంటిదో పారిజాతాపహరణ వృత్తాంతములో మనకు తెలిసినదే. పదియారువేలమంది సఖులున్నా శ్రీకృష్ణునికి రుక్మిణి అంటే అమితమైన ప్రేమ, ఎందుకంటే ఆమె భక్తి నిర్మలత్వముతో కూడినది. నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామీ బృందావనాలు అన్న భావనను ఆమె నిరంతర హరిధ్యానయై ప్రకటించింది. స్వామి కూడా నీ నయనకమలాల నేనున్న చాలు ఎందుకే ఓ దేవి నందనవనాలు అన్న భావనతో ఆమెకు తన వక్షస్థలంలో శాశ్వత స్థానం కలిగించాడు.
రుక్మిణీ కల్యాణ ఘట్టం కేవలం ఒక గాథ కాదు. ఎంతో మహత్తు కలది. వివాహం కానీ కన్యలు ఈ ఘట్టాన్ని పవిత్రంగా పారాయణం చేస్తే తప్పక వివాహమవుతుందని ఎంతో మంది అనుభవాలు చెబుతున్నాయి. దానికి కారణం ఆ పద్యాలలో గల హరి భక్తి, రుక్మిణికి గల నైర్మల్యం స్త్రీలకు అలది వారు కూడా శుద్ధులై మంచి భర్తను పొందుతారు.
శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో ఈ రుక్మిణీ కల్యాణ ఘట్టంలోని కొన్ని పద్యాలను పొందుపరచారు. వీక్షించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి