జగద్గురువులు ఆదిశంకరులు |
ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. నిర్వాణ షట్కము ప్రకరణగా భావించ వచ్చు. (ప్రకరణ అంటే - శాస్త్రాలలో ఇచ్చిన వివరణలో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేవి అని). ఆత్మ అంటే ఏమిటి అనే దాన్ని ఏవేవి కాదో, ఏవేవి అంటవో, పట్టవో చెప్పి తర్వాత ఏమిటో అద్భుతంగా చెప్తుంది ఈ నిర్వాణ షట్కము. శ్లోకాలు, తాత్పర్యం మీకోసము. యూట్యూబ్ లంకె
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం
నేను (ఆత్మను) - మనసును కాను; బుద్ధిని కాను; అహంకారాన్ని కాను; చిత్తం (మెదడు లోని విషయాన్ని దాచే ప్రాంతం - మతి) కాను; చెవులు కాను; నాలుక కాను; ముక్కు కాను; కళ్ళు కాను; ఆకాశాన్ని కాను; భూమిని కాను; అగ్నిని కాను; వాయువును కాను. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.
న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం
నేను (ఆత్మను) - ఊపిరిని, ఉచ్ఛ్వాస/నిశ్వాసను కాను; పంచప్రాణాలు కాను; ఏడు ధాతువులను (రస, రక్త, మాంస, మేధస్, ఆస్తి, మజ్జ, శుక్ర) కాను, పంచ కోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ) కాను ; వాక్కును కాను, చేతులు కాను, పాదములు కాను; పురుషాంగము/యోని కాను; విసర్జన చేసే అంగమును కాను; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం
నాకు రాగద్వేషాలు, లోభమోహాలు లేవు; నాకు మద మాత్సర్యాలు లేవు; నేను ధర్మార్థకామమోక్షాల వెంట పడను ; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః
చిదానంద రూపః శివోహం శివోహం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః
చిదానంద రూపః శివోహం శివోహం
నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖాలు లేవు; నాకు మంత్రము, తీర్థము, వేదము, యజ్ఞములతో పని లేదు; నాకు ప్రియమైనది, ప్రీతిని కలిగించేది, నా చే ప్రీతి పొందబడేది లేదు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.
న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం
నాకు మృత్యు భయము, జాతిభేదము, తల్లి, తండ్రి, జననము లేవు; నాకు బంధువులు, మిత్రులు, గురువులు, శిష్యులు లేరు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.
అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానంద రూపః శివోహం శివోహం
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానంద రూపః శివోహం శివోహం
నేను అన్ని గుణాలకు అతీతుడను (ఎటువంటి షరతులు లేని వాడిని); నేను నిరాకారుడను, అంతటా వ్యాపించి ఉన్నాను; నాకు ఇంద్రియాలు లేవు; నేను ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటాను; నాకు బంధనాలు, విడుపు లేవు. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి