10, సెప్టెంబర్ 2015, గురువారం

శ్రీనాథుని చాటు పద్యాలు - పల్నాడు విశేషాలు



కవులు దేశకాలమాన పరిస్థితులను, ప్రజల సామాజిక పరిస్థితులను తమ రచనలలో వివరించి ఉండకపోతే మనకు వారసత్వంగా ఏమీ మిగిలేదు కాదు. అన్నీ కాలగర్భంలో నామరూపాలు లేకుండా పోయేవే. పల్నాడు చరిత్ర శ్రీనాథుని రచనల ద్వారా మనకు శాశ్వతమైంది.

శ్రీనాధుడు కవిసార్వభౌముడు అన్న బిరుదు పొందిన గొప్ప కవి. కాకపోతే తన కృతులను అశాశ్వతమైన రాజులకు సమర్పించి, వారి మెప్పు కోసం రచనలు చేసి, భోగభాగ్యాలు అనుభవించి ఆ రాజులు అంతరించాక గర్భదారిద్ర్యంలో పన్నులు కట్టలేక దుఃఖిస్తూ మరణించాడు.

నాగార్జునసాగర్ డాం దిగువ దక్షిణ భాగాన గల గుంటూరు జిల్లాలోని కొంత భాగాన్ని పల్నాడు అంటారు. పొందుగుల, మాచర్ల, వెల్దుర్తి, గురజాల, రెంటచింతల, పిడుగురాళ్ల, గుత్తికొండ,కారంపూడి మొదలైన ప్రాంతాలు పల్నాడుగా పరిగణించబడతాయి. పల్లవరాజులు పాలించిన ప్రాంతం కాబట్టి పల్లవనాడు, అది రూపాంతరం చెంది పల్నాడుగా ప్రసిద్ధి చెందింది. సున్నపు రాళ్లు, మండే ఎండలు, తుమ్మ చెట్లు...అప్పట్లో సాగు నీటి వ్యవస్థ లేక వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రబంధకవి శ్రీనాథుడు ఇక్కడి చరిత్రను పల్నాటి వీరచరిత్రగా అద్భుతంగా రచించాడు.

దాయాదులైన నలగామ రాజు, మలిదేవ రాజుల మధ్య జరిగే పోరాటం ఈ పల్నాటి వీరచరిత్ర ఘట్టం. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు, నాయకురాలు నాగమ్మ మొదలగు వారి ఈ యుద్ధంలో పాల్గొంటారు. పల్నాడులోని కారంపూడి (కార్యమపూడి ఈ విధంగా రూపాంతరం చెందింది) ఈ యుద్ధానికి రణభూమి. ఎందరో వీరులు ప్రాణాలు కోల్పోయి వంశాలు నశించిపోతాయి ఈ యుద్ధంలో.

ఇటువంటి సీమలో శ్రీనాథుడు విస్తృతంగా పర్యటించాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని చాటు పద్యాలలో రచించారు.




జొన్న కలి, జొన్న యంబలి, 
జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్!

కలి అంటే ఈనాటి వారికి తెలియకపోవచ్చు. బియ్యాన్ని కడుగగా వచ్చిన నీటిని పులియబెడితే దానికి కలి అంటారు. పేదలకు బియ్యం ఎక్కడ? అందుకని ఆ కలికి కూడా జొన్నలే, గంజి కూడా జొన్నలదే, అన్నము కూడా జొన్నలతో వండినదే. ఏది తిన్నా జొన్నలతోనే అక్కడ దొరికింది. పల్నాటి సీమలో ప్రజలందరికీ సన్నబియ్యముతో అన్నము దొరకనే లేదుట.

చిన్న చిన్న రాళ్లు చిల్లర దేవళ్లు
నాగులేటి నీళ్లు నాపరాళ్లు
సజ్జ జొన్న కూళ్లు సర్పంబులును దేళ్లు
పల్లెనాటి సీమ పల్లెటూళ్లు

చిన్న రాళ్లతో ఇళ్లు, వైభవంలేని దేవస్థానాలు, నాపరాళ్లు, నాగులేరు నీళ్లు, సజ్జలు, జొన్నల అన్నము, పాములు, తేళ్లతో ఉన్నాయిట పల్నాటిలోని పల్లేటూళ్లు. నాగులేరు దాచేపల్లి దగ్గర ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడ నాయకురాలు నాగమ్మ విగ్రహం కూడా ఉంది. పల్నాడులో ఇప్పటికీ చిన్న చిన్న రాళ్లతో పేర్చిన ఇళ్లు, ప్రహరీ గోడలు, పాములు తేళ్లు బాగా కనిపిస్తాయి.

రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్

ఈ చాటువులో శ్రీనాథుని వ్యంగ్యాన్ని గమనించవచ్చు. రసికుడు ఈ ప్రాంతానికి రాడట, రంభ కూడా ఇక్కడ ఏకులు (నూలు వడకటానికి గింజలు తీసిన మెత్తటి పత్తి) వడుకుతుందట. పత్తి చెట్లు కూడా పల్నాటి ప్రాంతంలో బాగా కనిపిస్తాయి. రాజైనా కూడా ఇక్కడ భూములు దున్నుతాడట, మన్మథుడు కూడా ఇక్కడ జొన్న కూడే తింటాడట. వ్యంగ్యాస్త్రాలు, అతిశయోక్తి చాటు పద్యాలలో చక్కగా వ్యక్తమవుతాయి. దానికి ఉదాహరణ ఈ పద్యము.

సిరిగల వానికి జెల్లును
దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

శ్రీనాథుని ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో ఇది మొదటిది. పల్నాటి సీమలో నీటి ఎద్దడిని చూసి భరించలేక ఈ పద్యాన్ని వ్రాసాడు ఆయన. ఓ పరమేశ్వరా! సిరిని గల ఆ శ్రీకృష్ణునికి పదహారువేలమందిని పెళ్లాడితే చెల్లింది. బిచ్చమెత్తుకునే నీకు ఇద్దరు ఎందుకు, పార్వతి చాలు, గంగను ఈ ప్రాంతపు ప్రజల కోసము విడిచిపెట్టు అని ప్రార్థిస్తాడు.

ఇలా పల్నాటి పరిస్థితులను వివరించాడు శ్రీనాథుడు. ఇంకొన్ని పద్యాలలో కార్యమపూడిని, గురజాలను, మాచర్ల చెన్నకేశవుని గూర్చి కూడా ఆయన వర్ణించాడు. ఆ వివరాలు రెండో భాగంలో.


2 కామెంట్‌లు: