14, జులై 2026, మంగళవారం

నరవరా ఓ కురువరా - జానకమ్మ స్వరలహరి



జానకమ్మ గాత్రం సౌరభం ఎంత మనోజ్ఞమైనదో తెలిపే ఓ అద్భుతమైన నృత్యప్రధాన గీతం ఇంద్రసభలో ఊర్వశి అర్జునుని ఎదుట నాట్యం చేసే సన్నివేశంలో. పద్మిని ప్రియదర్శిని అనే గొప్ప నర్తకిపై ఈ గీతాన్ని నర్తనశాల (1963) చిత్రంలో చిత్రీకరించారు. భీం పలాస్ రాగంలో సుసర్ల దక్షిణామూర్తి గారు స్వరపరచగా, సముద్రాల వారి సాహిత్యాన్ని అతిమధురమైన గమకాలతో, నృత్యశైలికి తగిన గాత్రధర్మంతో ఆలపించారు జానకమ్మ. ముఖ్యంగా రెండు చరణాలలోని ఆఖరి పంక్తులు నిజంగా సురలోకాన్ని తలపిస్తాయి. గీతం పల్లవిలో, చరణాల్లో షడ్జమం తారాస్థాయిని దాటినా శృతి తప్పకుండా ఆలపించారు. ఇది మరెవ్వరికీ సాధ్యం కాని ప్రక్రియ. ఆవిడకు గాత్రంపై ఉన్న పట్టు దైవదత్తం. 

పద్మిని ప్రియదర్శిని గారు నటి కన్నా ముందు గొప్ప నర్తకి. వళవూరు రామయ్య పిళ్లై గారి వద్ద శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుని ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. తరువాత బెంగళూరులో నాట్యప్రియ అనే నృత్య శిక్షణాలయాన్ని స్థాపించారు.

పాటకు తిరిగి వస్తే, జానకమ్మను ఎక్ప్రెషన్ క్వీన్ అని ఊరికే అనలేదు మరి. వీడియోలో పద్మిని ప్రియదర్శింగి గారి మెరుపు నృత్యం, నటన చూస్తూ, సాహిత్యాన్ని అర్థం చేసుకోండి, జానకమ్మ మనకు అందించిన స్వరామృతాన్ని ఆస్వాదించండి. పాటలో ఎన్ని హోయలున్నాయో, నృత్యంలో కూడా అన్నే హోయలను ప్రదర్శించారు పద్మిని గారు. అందుకే ఈ గీతం, చిత్రం అజరామరం అయ్యాయి. 

నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి లేరని
సరసులలో జాణవని
విన్నారా కన్నారా కనులారా

సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి బలాన
సాటి లేని వీరుండన్న యశమును గన్నా
అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదు గొన్న విజయా 

నిను గని తల ఊచే ఉలూచి కొనుమని చేయి సాచే సుభద్ర
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
అలరుల విలుతుని ములుకుల గురియై వలపులమ్ముకొనురా

https://www.youtube.com/watch?v=s7aHgIiG8NI

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి