క్రీ.శ. 1868 ప్రాంతంలో శ్రీరామకృష్ణ పరమహంస కాశీ యాత్రకు వచ్చారు. ఈ యాత్రను మథుర్‌బాబు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు హృదయ్ (హృదయరామ్) సహా సుమారు 125 మంది యాత్రికులు వచ్చారు.
ఆ సమయంలో మణికర్ణికా ఘాట్ వద్ద త్రైలింగస్వామి నివసించేవారు. త్రైలింగస్వామి కాళీ ఉపాసకులు కూడా. మణికర్ణికా ఘాట్‌లో అప్పట్లో నిరంతర శవదహనం వల్ల మెట్లన్నీ కాలిపోయేంత వేడిగా ఉండేవి, ఆయన ఆ వేడిని లెఖ్ఖపెట్టకుండా ఆ రాళ్ల మీదే కూర్చునేవాడు, ఆయన శరీరానికి ఎటువంటి హానీ కలగలేదు కూడా. సాధారణంగా ఆయన ఎవ్వరితోనూ మాట్లాడరు; తన దగ్గరకు వచ్చిన వారిని కూడా ప్రోత్సహించరు. కానీ శ్రీరామకృష్ణులను చూసిన వెంటనే వారికి ప్రత్యేకమైన ఆదరణ చూపారు. సంజ్ఞల ద్వారా తన దగ్గరకు రమ్మని పిలిచి, తన పక్కనే కూర్చోబెట్టారు. అనంతరం తన నస్యపు (స్నఫ్) పెట్టెను వారికి అందించారు.
అప్పుడు శ్రీరామకృష్ణులు ఒక గంభీరమైన ప్రశ్న అడిగారు:
“భగవంతుడు ఒక్కడేనా? లేక అనేక రూపాలలో ఉన్నాడా?”
త్రైలింగస్వామి మాటలతో కాకుండా సంజ్ఞల ద్వారా ఇలా సమాధానం ఇచ్చారు:
“నువ్వు సమాధి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు ఒక్కడే. ప్రపంచ చైతన్యంలో ఉన్నప్పుడు ఆయనే అనేక రూపాలుగా కనిపిస్తాడు.”
ఈ సమాధానం విని శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించి, త్రైలింగస్వామిని పరమహంస స్థితిని పొందిన మహాయోగిగా అభివర్ణించారు.
కాశీలో ఉన్న సమయంలో శ్రీరామకృష్ణులు త్రైలింగస్వామిని అనేకసార్లు దర్శించారు. తరువాత శ్రీరామకృష్ణుల ఆహ్వానంపై త్రైలింగస్వామి మథుర్‌బాబు నివాసానికి కూడా విచ్చేశారు. అక్కడ శ్రీరామకృష్ణులు స్వయంగా పాయసం వండి, అపారమైన భక్తి ప్రేమలతో త్రైలింగస్వామికి తమ చేతులతోనే భోజనం పెట్టారు.
ఈ మహాసంగమం భారత ఆధ్యాత్మిక చరిత్రలో ఇద్దరు మహాజ్ఞానుల పరస్పర గౌరవం, ఆత్మైక్యానుభూతి, మరియు అద్వైత సత్యానికి అద్భుత సాక్ష్యంగా నిలిచింది.
దక్షిణేశ్వర్ తిరిగి వెళ్లిన తరువాత రామకృష్ణ పరమహంస తన శిష్యులతో త్రైలింగస్వామి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయనను సాక్షాత్ పరమశివుని రూపంగా వర్ణించారు. ఇదంతా రామకృష్ణుల వారి శిష్యులు శారదానంద తమ శ్రీశ్రీరామకృష్ణ లీలాప్రసంగ అనే బెంగాలీ పుస్తకంలో ప్రస్తావించారు, దానిలోని కొంత భాగాన్ని తరువాత రామకృష్ణ ది గ్రేట్ మాస్టర్ అని ఆంగ్లంలోకి స్వామి జగదానంద అనువదించారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి