బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ, ఆంగ్లీకరించిన రూపంలో బంకిమ్ చంద్ర ఛటర్జీ, వంగభూమిలో జన్మించిన గొప్ప నవలా రచయిత, కవి, వ్యాసకర్త, పాత్రికేయుడు మరియు ప్రభుత్వ అధికారి. ఆధునిక బెంగాలీ సాహిత్యానికి పునాది వేసిన మహానుభావుడిగా ఆయనను "సాహిత్య సామ్రాట్" అని గౌరవిస్తారు. భారత జాతీయ గీతం "వందే మాతరం" రచయితగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన రచనలు భారత స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి దేశభక్తి భావాలను ప్రజల్లో మేల్కొల్పాయి.
బాల్యం, విద్యాభ్యాసం మరియు వృత్తి:
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ 1838 జూన్ 26న బ్రిటిష్ భారతదేశంలోని బెంగాల్ ప్రెసిడెన్సీలోని నైహటి (కాంతల్పారా) గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి యాదవ చంద్ర చటోపాధ్యాయ బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. తల్లి దుర్గాదేవి. చిన్ననాటి నుంచే బంకిమ్ చంద్రకు చదువుపై, సాహిత్యంపై ఆసక్తి ఉండేది. ఆయనకు ఇద్దరు అన్నలు సంజీవ్‌చంద్ర మరియు విష్ణుచంద్ర. ఆయన హూగ్లీ మోహ్సిన్ కళాశాలలో చదివి, తరువాత కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1859లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బీఏ పట్టభద్రులైన తొలి విద్యార్థులలో ఒకరిగా గుర్తింపు పొందారు.ఆ తరువాత లా కూడా చదివారు.
చదువు పూర్తయిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ మరియు డిప్యూటీ కలెక్టర్్‌గా సుమారు మూడు దశాబ్దాల పాటు సేవలందించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, భారతీయ సంస్కృతి, భాష, సమాజం మరియు జాతీయ చైతన్యం గురించి రచనలు చేస్తూ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించారు.
సాహిత్య ప్రస్థానం:
మొదట ఆంగ్లంలో "Rajmohan's Wife" అనే నవలను రచించారు. తరువాత బెంగాలీ భాషలో రచనలు ప్రారం భించి ఆధునిక బెంగాలీ నవలకు కొత్త దిశను చూపారు. ఆయన ప్రసిద్ధ రచనలు:
దుర్గేశ్‌నందిని (1865) – ఆధునిక బెంగాలీ చారిత్రక నవలకు శ్రీకారం.
కపాలకుండలా (1866) – అత్యంత ప్రజాదరణ పొందిన నవల.
విషవృక్ష (1873) – సామాజిక సమస్యలను ప్రతిబింబించిన రచన.
కృష్ణకాంతుని వీలునామా ((Krishnakanter Will)).
ఆనందమఠ్ (1882) – దేశభక్తిని రగిలించిన అమర రచన.
దేవీ చౌధురాణి (1884) – మహిళా శక్తిని ప్రతిబింబించిన నవల.
సీతారామ్ (1887).
కృష్ణచరిత్ర – శ్రీకృష్ణునిపై తాత్విక విశ్లేషణ.
1872లో ఆయన "బంగదర్శన్" అనే సాహిత్య పత్రికను ప్రారంభించి అనేక రచయితలకు వేదిక కల్పించారు.
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ రచించిన "రాజసింహ" (1881) మరియు "ఆనందమఠ్" (1882) చారిత్రక, రాజకీయ నేపథ్యంతో కూడిన ప్రముఖ నవలలు. 1872లో బంకిమ్ స్థాపించిన "బంగదర్శన్" పత్రికలో ఈ నవల మొదట ధారావాహికగా ప్రచురితమైంది. అదనంగా, ఆయన భగవద్గీతపై వ్యాఖ్యానం రచించడంతో పాటు సాంఖ్య తత్వశాస్త్రంపై లోతైన విశ్లేషణ చేశారు. భారతీయ తాత్విక సంప్రదాయాలపై ఆయనకు ఉన్న పాండిత్యం, సాహిత్యంతో పాటు తత్వచింతనలోనూ ఆయన విశిష్ట స్థానాన్ని చాటిచెప్పింది. రామకృష్ణ పరమహంసతో ముఖ్యమైన అనుయాయులుగా బంకించంద్ర పేరొందారు.
"వందే మాతరం" – భారత జాతీయ గీతం:
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ రచించిన "వందే మాతరం" మొదట ఆయన ఆనందమఠ్ నవలలో ప్రచురితమైంది. ఈ గీతం భారతమాతను తల్లిగా భావించి ఆమెకు వందనం చేస్తుంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఈ గీతం లక్షలాది మంది దేశభక్తులకు స్ఫూర్తినిచ్చింది. సభలు, ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలలో "వందే మాతరం" నినాదం స్వాతంత్ర్య సమరయోధులకు ధైర్యాన్ని ఇచ్చింది. తరువాత దీనికి భారతదేశ జాతీయ గీతం (National Song) హోదా లభించింది.
దేశసేవ:
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ కేవలం రచయిత మాత్రమే కాదు; తన కలం ద్వారా జాతీయ చైతన్యాన్ని పెంపొందించిన మహనీయుడు. ఆధునిక బెంగాలీ నవలకు బలమైన పునాది వేశారు. భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికతను సాహిత్యంలో ప్రతిష్ఠించారు. "వందే మాతరం" ద్వారా దేశభక్తి భావాలను ప్రజల్లో నాటారు. స్వాతంత్ర్యోద్యమ నాయకులకు, యువతకు స్ఫూర్తినిచ్చారు. బెంగాల్ పునరుజ్జీవన (Bengal Renaissance) ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. భారతీయ భాషల్లో సాహిత్య రచనలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పారు.
చివరి రోజులు, వారసత్వం:
జీవితాంతం సాహిత్య సేవలో నిమగ్నమైన బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ 1894 ఏప్రిల్ 8న కలకత్తాలో మధుమేహం వల్ల వచ్చిన సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణించినప్పటికీ ఆయన రచనలు, ఆలోచనలు భారతీయులలో దేశభక్తిని, సాంస్కృతిక గౌరవాన్ని నేటికీ ప్రేరేపిస్తున్నాయి.
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ భారతదేశ సాహిత్య చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తి. ఆయన రచించిన "వందే మాతరం" స్వాతంత్ర్య సమరంలో కోట్లాది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆధునిక భారతీయ సాహిత్య వికాసంలో ఆయన చేసిన కృషి అపూర్వమైనది. బెంగాలీ భాషను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశభక్తి, సాహిత్యం, సంస్కృతి అనే మూడు రంగాలలో ఆయన చూపిన ప్రభావం నేటికీ కొనసాగుతోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి