"ఇంకా ఎన్నాళ్లు మావయ్యా ఇలా మాటల్లేకుండా? ఎప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం, పూర్తిగా భిన్నమైన పరిస్థితులలో, అపోహలు, అపార్థాల వల్ల దూరమైన బంధుత్వాలు ఇప్పటికైనా ఒకటి కావాలి. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? అమ్మ, నాన్నలు కూడా పెద్దవారయ్యారు. మీరు మాట్లాడుకోవటం లేదనే కానీ మీరంటే అమ్మకు చాలా అభిమానం మావయ్యా. ఆలోచించండి..." అన్నాడు విశ్వం. ఆలోచనలో పడ్డాడు 58 ఏళ్ల సత్యం. విశ్వం సత్యం చెల్లెలు గౌరి కొడుకు. తనకూ చెల్లెలిని చూడాలని, మాట్లాడాలనే ఉంది, కానీ పెద్దవాడినన్న అహంకారం ఇంకా ముందడుగు వేయనీయట్లేదు. ఆలోచనలు ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళ్లాయి.
"గౌరీ! చదువు పూర్తైంది, మంచి బ్యాంక్ ఉద్యోగంలో చేరావు. ఇక పెళ్లి చేసుకుంటే మంచిది కదమ్మా! మీ వదిన వాళ్ల దూరపు బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్. నీ ఉద్యోగానికి, చదువుకు అనువైన సంబంధం. వాళ్లు నిన్ను మా పెళ్లిలో చూశారుట. మీ వదినను రెండు మూడు సార్లు అడిగారు...ఏమంటావ్?" అన్నాడు సత్యం. "ఒరేయ్ సత్యం! మనమ్మాయి అదృష్టవంతురాలు, దాన్ని అడిగేదేముంది, వెంటనే వాళ్లను పెళ్లి చూపులకు రమ్మని చెప్పు" అంది సత్యం, గౌరిల తల్లి సావిత్రమ్మ. భర్త చిన్న వయసులోనే మరణిస్తే కష్టపడి పిల్లలను చదివించి పెద్ద చేసింది. సత్యం పెళ్లి ఓ రెండేళ్ల క్రితమే అయ్యింది. సత్యం భార్య రమ గవర్నమెంట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. సత్యం ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటులో మంచి ఉద్యోగస్థుడు. సత్యం, రమలకు గౌరి అంటే చాలా ఇష్టం. ముగ్గురూ స్నేహితుల్లా ఉంటారు.
"సూర్యం! అమ్మ, అన్నయ్య నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రేమ సంగతి ఎవ్వరికీ తెలియదు. అందరూ ఈ సంబంధం నాకు కుదిరినట్లే అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. నాకు ఏమీ తోచటం లేదు...మీ ఇంట్లో పరిస్థితులు మెరుగు పడ్డాక మా ఇంట్లో మన ప్రేమ గురించి చెబుదామని ఆగాను" అంది. "గౌరీ! ఇప్పుడున్న పరిస్థితులలో మన వివాహం వెంటనే జరగటం అసంభవం, నాన్న గారు మంచంలో ఉన్నారు, పెళ్లి ప్రస్తావన తెచ్చే పరిస్థితులు మా ఇంట్లో లేవు..." అన్నాడు. సూర్యం పరిస్థితి తెలిసిన గౌరికి ఏమి చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి చూపుల రోజు దగ్గర పడుతోంది. సూర్యాన్ని వదులుకొని ఈ పెళ్లికి తలవంచే మనస్తత్వం గౌరికి లేదు. ఇప్పటికే మనసా వాచా సూర్యమే తన భర్త అని భావించింది.
"అన్నయ్యా, వదినా! నేను ఈ పెళ్లి చూపులకు సిద్ధంగా లేను. నేను ఇప్పటికే మా బ్యాంకులో సహోద్యోగి సూర్యాన్ని ప్రేమిస్తున్నాను. అతనే నా భర్త కావాలని నా సంకల్పం. నన్ను క్షమించండి. మీకు ఈ విషయం చెప్పలేకపోయాను. సూర్యం ఇంట్లో పరిస్థితుల వలన ఇంకొన్నాళ్లు ఆగి చెబుదామనుకున్నాను" అని ధైర్యం తెచ్చుకుని చెప్పేసింది గౌరి. సత్యం మొహం ఎర్రబడింది. తను అంతగా ప్రేమించే చెల్లెలు తనతో జీవితంలో అతి ముఖ్యమైన విషయం పంచుకోలేదన్న ఆవేదన, రమ బంధువుల వద్ద తన మాటపోయిందన్న ఆక్రోశం అతని మనసును పాషాణం చేశాయి. రమ కూడా తను గౌరితో అంత చనువుగా ఉంటుంది, ఏ ఒక్కరోజు కూడా మనసులోని మాట చెప్పలేదని నొచ్చుకుంది. అంతే, ఆ రోజు నుండి ఆ భార్య భర్తలు గౌరితో మాట్లాడటం మానేశారు. గౌరి ఎంత ప్రయత్నించినా, సావిత్రమ్మ ఎంత చెప్పినా సత్యం మనసు కరగలేదు, ,గౌరి కూడా వెనుకడుగు వేయలేదు. గౌరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి స్నేహితురాలితో కలిసి ఉండటం మొదలు పెట్టింది. బిడ్డల మధ్య ఈ మనస్పర్థలతో సావిత్రమ్మ నలిగిపోయింది. నిస్సహాయతతో మౌనంగా ఉండిపోయింది. ఓ నాలుగు నెలలకు సూర్యం తండ్రి ఆరోగ్యం కుదుటపడింది. సూర్యం, గౌరి వివాహం చేసుకున్నారు. తన వైపు వారెవ్వరూ రాలేదన్న విషయం గౌరిని బాధించినా తన జీవితం సూర్యంతోనే అనుకుని వైవాహిక జీవితం ఆరంభించింది. గౌరికి పిల్లలు పుట్టారని తెలిసినా, సత్యం వెళ్లలేదు. ఎవరి సంసారాలు వాళ్లవి. తీరని అగాథం ఆ అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడింది. "ఒరేయ్ సత్యం, అమ్మా రమా! మీ అందరి పంతాలు, పట్టింపులు ఎలా ఉన్నా, నా కన్న ప్రేమను నేను చంపుకోలేను. గౌరి కాన్పులకు కూడా పెద్దగా సాయం చేయలేకపోయాను. ఇక నావల్ల కాదు. నేను మాత్రం అప్పుడప్పుడు గౌరి వాళ్లింటికి వెళ్లి వస్తూ ఉంటాను. మీరు అడ్డు చెప్పవద్దు" అని గట్టిగానే కొడుకుకు, కోడలికి తన మనసులోని మాట చెప్పింది. పరిస్థితి అర్థమై వారు ఏమీ మాట్లాడలేదు.
శుభకార్యాలలో కలుసుకున్నా, సత్యం-గౌరి ఒకరినొకరు పలకరించుకోకపోవటం, నచ్చజెప్పే పెద్దలను విసుక్కోవటం...ఇద్దరికీ పిల్లలు, స్కూళ్లు బాధ్యతలు. అలా ఓ 15 ఏళ్లు గడిచిపోయాయి. గౌరికి ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు విశ్వనాథ్, చిన్నవాడు ఈశ్వర్. బంధాల మధ్య దూరాలు వచ్చినా రక్తసంబంధపు వాసనలు ఎక్కడకు పోతాయ్? విశ్వం అచ్చం మేనమామ సత్యం పోలికే. రెండు తరాలు ఆ కుటుంబాన్ని చూసినవారు విశ్వాన్ని చూసి సత్యం పోలికలని ఇట్టే గుర్తు పట్టేంత ప్రస్ఫుటం. అందరూ నువ్వు మీ మావయ్య పోలికే అని చెబుతూ ఉంటే మావయ్యను కలుసుకోవాలని, మాట్లాడాలన్న కుతూహలం విశ్వానికి కలిగింది. అమ్మమ్మ సావిత్రమ్మతో తన మాన్సులోని మాటను బయట పెట్టాడు. కొడుకు ఆగ్రహం తెలిసిన సావిత్రమ్మ చాలా సార్లు ఆ ప్రస్తావనను వినీ వినననట్టు ఊరుకున్నా, విశ్వం మొండి పట్టు పట్టాడు. "అమ్మమ్మా! నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను మావయ్యను కలవాల్సిందే" అన్నాడు.
"సత్యం! గౌరి కొడుకు విశ్వం....." అనబోయింది సావిత్రమ్మ. "ఆ విశ్వం?" అని తీక్షణంగా ప్రశ్నించాడు. కూతురు పేరెత్తితేనే కొడుకు రౌద్ర రూపం దాలుస్తున్నాడని భయపడింది. ధైర్యం చేసి "విశ్వం అని గౌరి పెద్ద కొడుకు. వాడు నిన్ను కలవాలనుకుంటున్నాడు..." అంది. "నాతో ఏం పని? వాళ్లమ్మ చేసిన ఘన కార్యానికి వివరణ ఇచ్చుకుంటాడా?" అని తిరిగి ప్రశ్నించాడు సత్యం. "లేదురా, ఒక్కసారి నిన్ను కలుద్దామని అనుకున్నాడు. వాడివి అన్నీ నీ పోలికలే" అని సావిత్రమ్మ. కోపంగా, కుతుహూలంగా అమ్మవైపు చూసి మౌనంగా సరే అన్నాడు. విశ్వం లోపలకి వచ్చాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. చిన్ననాటి సత్యం ఎదుట నిలిచాడా అన్నట్లున్నాడు. తనను పరిచయం చేసుకుని కాసేపు ఉండి వెళ్లిపోయాడు విశ్వం. అతని మాటలు, నడవడిక అంతా సత్యం లాగనే ఉండటంతో అతనిపై అందరికీ వాత్సల్యం వెంటనే కలిగింది. అలా చిగురించటం మొదలైంది విశ్వంతో బంధం.
ఆలోచనల పరంపర నుండి వర్తమానంలోకి వచ్చాడు సత్యం. విశ్వం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. కానీ, వెంటనే చెప్పలేదు. ఓ పది నిమిషాల తరువాత - "విశ్వం! వాళ్లు మా మాట కాదని పెళ్లి చేసుకున్నారు అన్న దాని కన్నా ఈ ఇల్లు వదిలి వెళ్లి ముప్ఫై ఏళ్లైంది, తిరిగి వచ్చి నాతో, మీ అత్తయ్యతో మాట్లాడాలని ఎప్పుడూ మీ అమ్మ, నాన్నలకు అనిపించలేదు అన్న విషయం నన్ను చాలా బాధిస్తుంది. సాటి స్నేహితుల్లా ఉండే వాళ్లం, మాతో ఉన్న అనుబంధానికి పెళ్లైన తరువాత వచ్చి మాట్లాడవలసిన బాధ్యత తనది కదా?" అని ప్రశ్నించాడు సత్యం. "మావయ్యా! మీ మాట కాదని వెళ్లినందుకు అపరాధ భావంతోనే అమ్మ తిరిగి రాలేదు. తన ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు ఎంత కోపం ప్రదర్శించేవారు అమ్మమ్మ ద్వారా తెలుసుకుని ఇక్కడికి రావటానికి మరింత భయపడ్డానని అమ్మ చెప్పింది" అన్నాడు.
ఇదే సమయం అనుకుని సావిత్రమ్మ కొడుకుతో - "నాన్నా సత్యం! నేను పెద్ద దాన్ని అయ్యాను. ఎన్నాళ్లుంటానో తెలియదు. మీరు ఉన్నది ఇద్దరు, మీరు కలిసి మెలిసి ఉండకపోవటం అనేది నా జీవితంలో ఓ పెద్ద వెలితి. ఈ రెండు కుటుంబాలు ఒకటి కావాలి. ఆడపిల్ల ఇంటికి వస్తూ పోతూ ఉంటేనే మనకు కూడా శుభం. ఇన్నాళ్లు ఎలానూ లేదు, ఇకనైనా ప్రయత్నిస్తే బాగుంటుంది" అంది. రమ కూడా "అత్తయ్యగారు చెప్పింది నిజమే, తోబుట్టువులతో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదండీ. తప్పొప్పులు పక్కకు పెడదాం. మనం కూడా రిటైర్మెంట్ దగ్గర పడుతున్నాం. మనస్పర్థలు మరచిపోయి ఆనందంగా ఉండవలసిన సమయం. పిల్లలకు కూడా ఈ బంధాలు ఎంతో అవసరం..." అంది. ఆలోచనలో పడ్డాడు సత్యం. సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు.
ఆదివారం మధ్యాహ్నం. బెల్ మోగింది. తలుపు తెరిచిన గౌరి ఎదుట అన్నయ్య సత్యాన్ని చూసి నోటమాట రాలేదు. "అమ్మా, ఎవరు వచ్చారో చూడు" అని మావయ్య వెనక నుండి పక్కకు వచ్చి హత్తుకుంటూ చెప్పాడు విశ్వం. సావిత్రమ్మ, రమ గౌరికి చెరో పక్క నిలుచుని అన్నాచెల్లెళ్లు మళ్లీ కలుసుకునే అపురూపమైన ఘట్టాన్ని ఆస్వాదించారు.
"అన్నయ్యా, వదినా - నన్ను క్షమించండి. ఆనాడు యుక్తవయస్సులో ఉన్న ఆత్మాభిమానంతో, మీరంటే ఉన్న భయంతో, నేను ముందడుగు వేయలేకపోయాను. పిల్లలు పెద్దై, వయసు మళ్లుతున్న సమయంలో నా వాళ్లు కావాలి అన్నది మరింత తెలిసి లోలోపల కుమిలిపోతున్నాను. విశ్వం పుణ్యమా అని మీరు నా ఇంటికి వచ్చారు. నా పట్ల మీరు చూపించిన వాత్సల్యానికి, సాన్నిహిత్యానికి బదులుగా సూర్యంతో నా ప్రేమను సరైన సమయంలో మీకు తెలుపలేకపోయాను...ఇప్పుడు ఆలోచిస్తే ఎంత చిన్న విషయం అనిపిస్తోంది. నన్ను ఆయన ఎంత బాగా చూసుకున్నా, నా వాళ్లు నా ఆనంద జీవితంలో భాగంగా లేరు అన్నది చాలా పెద్ద లోటుగా ఉండేది. అహంకారం, భయం నన్ను ఆ ఇంట మళ్లీ అడుగుపెట్టనీయకుండా చేశాయి" అని కన్నీళ్లు రాలుస్తూ అన్నా వదినలకు నమస్కరించంది. "గౌరీ! మీ వదిన నీకిష్టమని జీడిపప్పు పాకం తీసుకువచ్చింది" అని నవ్వుతూ చెల్లెలెని దగ్గరకు తీసుకున్నాడు సత్యం. సూర్యం కూడా విశ్వాన్ని అభినందించాడు. ఆ జంటలు మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభించాయి. సావిత్రమ్మ గుండె బరువు తగ్గింది. ఎన్నో ఏళ్ల తరువాత నిజమైన సంక్రాంతి పండుగ వచ్చింది అని పిల్లలను ఆశీర్వదించింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి