28, అక్టోబర్ 2016, శుక్రవారం

చిత్తూరు నాగయ్య గారి నటనా ప్రతిభ - మహానుభావుల పాత్రలు

 





తెలుగు చలనచిత్ర సీమలో వుప్పలదడియం నాగయ్య (చిత్తూరు నాగయ్య) గారు ఒక్కరికే మహా వాగ్గేయకారులైన త్యాగయ్య, రామదాసు, మహాకవి పోతన, యోగి వేమన వంటి మహానుభావుల పాత్రలు వేసే సామర్థ్యం ఉంది. కేవలం పాత్రలను వేయటం కాదు, వాటిలో ఒదిగిపోయి, తన సంగీత మరియు నటనా ప్రతిభతో ఆ పాత్రలకు సార్థకత చేకూర్చారు. త్యాగయ్య, రామదాసుల కీర్తనలను అనర్గళంగా రాగయుక్తంగా పాడటం మాటలు కాదు. ఈనాటి నాగార్జున గారి అరకొర రామదాసు, వెకిలి అన్నమయ్య సినిమాలు చూసి ఆహా ఓహో అనుకునే వారికి నాగయ్య గారి చిత్రాలు ఓ కనువిప్పు. అవి ఆ మహానుభావుల మహనీయతకు ప్రతిబింబాలు.  ఆయన యోగి వేమన చిత్రం చూస్తే అసలు వేమన ఏమిటో అర్థమవుతుంది. నాగయ్యగారి పవిత్రత ఆయన పాత్రలలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఓ పాత్ర వేయాలంటే దాని గురించి రెండు మూడు నెలలు చదివి చేస్తే సరిపోదు. ఆ పాత్రలకు సరిపడే స్వచ్ఛత వ్యక్తిత్వంలో ఉండాలి. అదే నాగయ్య గారి గొప్పతనం.  ఒక్క సోమయాజులు గారు మాత్రమే నాగయ్య గారి దీటుగా త్యాగయ్యగా నటించగలిగారు. దానికి బాపు-రమణల ప్రతిభ మూల కారణం.

అలాగే వాల్మీకిగా, వశిష్ఠునిగా, దధీచిగా, వ్యాసునిగా, హాథీరాం బాబాగా, ధృతరాష్ట్రునిగా, పరమానందయ్యగా, అక్రూరునిగా, మహామంత్రి తిమ్మరుసుగా, మేవార్ రాజుగా, ఆశోకునిగా ఆయన కనబరచిన ప్రతిభ అజరామరం. ఉత్తర రామాయణం ఆధారంగా తీయబడిన లవకుశలో ఆయన వాల్మీకి మహర్షి పాత్ర చిరస్మరణీయం. తిమ్మరుసుగా ఆయన నటనలో కనబడిన రాకీయ పరిపాలనా చాతుర్యం అమోఘం. అక్రూరునిగా ఆయన కనబరచిన కృష్ణభక్తి ప్రశంసనీయం. సనాతన ధర్మ గంగాప్రవాహంలోని ఈ మహానుభావుల పాత్రలు ధరించటం ఆయనకు మాత్రమే చెల్లింది. మీరా చిత్రంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి ప్రధాన పాత్రకు భర్తగా ఆయన నటన అద్భుతం. శ్రీవేంకటేశ్వర మహాత్యంలో హాథీరాం బాబాగా ఆయన భక్తి అనిర్వచనీయం. జయభేరిలో గురువు విశ్వంభర శాస్త్రిగా ఆయన కనబరచిన నిండుతనం సినిమాకే వన్నె తెచ్చింది. అలాగే పరమానందయ్యగా ఆయన శిష్యులపై కనబరచిన వాత్సల్యం, కరుణ అనుపమానం. రాము చిత్రంలో ఘంటసాల గారి గీతం "రారా కృష్నాయ్యా" అనే గీతానికి పరిపూర్ణతనిచ్చింది నాగయ్య గారి భక్తిపూరితమైన నటన. నాగయ్యగారు నటించిన త్యాగయ్య, పోతన, రామదాసు, వేమన చిత్రాలు నటనకు, సంగీత సాహిత్య ఔన్నత్యానికి, నిర్మలమైన మనస్తత్వానికి ప్రతీకలు. పౌరాణిక చారిత్రాత్మక పాత్రలే కాదు. నాగయ్య గారు సాంఘిక పాత్రలలోనూ అదే పరిపక్వతను కనబరచారు. ఆయన నటన నేటి నటులకు పాఠాలు.

ఆయన్ పాడిన పాటలలో పాండురంగ మహాత్మ్యం చిత్రంలోని సన్నుతి సేయవె మనసా ఆపన్న శరణ్యుని హరిని అనే గీతం చాలా ఇష్టం. ఆయనకు నివాళిగా ఈ పాట మీకోసం.

1 కామెంట్‌:

  1. Very happy to see a good post on Nagayya garu. He brought divinity and dignity to the characters he played. The portrayal of Annamayya and Ramadasu by Nagarjuna is superficial. Raghavendra rao handled these films in a shabby, crude and cheap manner. Now he is making Hathiram baba.

    రిప్లయితొలగించండి