రామయ్యా! నీ తారక మంత్రము నాకు భవ తారకము. నా మనసునే మందిరము చేసుకొని నిన్ను ఆ యింటికి ఆహ్వానిస్తున్నాను. వచ్చి నన్ను పావనము చేయవయ్యా! సీతమ్మ! లోకమాతా! నీ చల్లని చూపులే మాకు సకల సౌభాగ్యములు! స్వామితోడ వచ్చి మా గృహమును పావనము చేయవలసినది!! మీ పాదములకు నా హృదయ కమలమును సమర్పించి
రామయ్యా! వచ్చావా నా తండ్రీ! నీ కొరకు నా కళ్లు కాచి ఎదురుచూస్తున్నానయ్యా! అమ్మా సీతమ్మా నా ప్రార్థనలు విని స్వామిని తోడ్కొని వచ్చావా? ఎంత దయ తల్లీ నీది?
ఇదిగోండి మీ పాదాలు కడుగ అర్ఘ్యము. మీ చరణ ధూళి సోకినంత నా ఇల్లు పావనమైంది. నా జన్మ ధన్యమైంది. ఆనందబాష్పాలు కలబోసిన నీటితో మీ పాదాలు కడుగ అనుమతీయండి! రామయ్యా! సీతమ్మా! ఇదిగో మీ చేతులు కడుగ పాద్యము! స్వామీ! ఎంత సుందర చరణములో నీవి? అమ్మా సీతమ్మ! నీ మట్టెలు స్వామి ప్రేమకు సంకెతమే కదా? ఆహా ఏమి నా భాగ్యము? లోకపావని, రఘురాముడు మా ఇంట అడుగు పెడుతున్నారు!
అమ్మా! అయ్యా! లోపలికి రండి! మీ కోసం రత్నఖచిత సింహాసనాలు సిద్ధం చేయలేకపోయాను, కానీ, నా చేతితో నేసిన పట్టు వస్త్రము కప్పిన ఆసనముంచాను! అదిగో! మా పెరట్లో పూచిన మల్లికా జాజి పారిజాత సంపంగులనుంచి మీకై వేచి ఉన్నాను! సుఖాసీనులు కండి! ఓ సౌగంధికా పుష్పములారా! అమ్మకు, అయ్యకు మీ సువాసనలతో సౌఖ్యాన్ని కలిగించండి!
స్వామీ! అమ్మా! ఇదిగో ఆచమనం! ముల్లోకాల సద్భక్తులకు దర్శనమిచ్చి అలసి సొలసి వచ్చి ఉంటారు. ఈ జలంతో మీ గొంతులు కాస్త తడుపుకోండి. ఇదిగిదిగో మధుపర్కం. ఆ తేనె-పెరుగు మీ మధురమైన పలుకులకు ఉపకరిస్తుంది. పలుకు తేనెల తల్లి సీతమ్మా! నీ మాటలే మాకు వరాల మూటలు. స్వామి ఉన్నాడని సిగ్గు పడకమ్మా!
రామయ్యా!సీతమ్మా! పాలు, పెరుగు, తేనె, శర్కర,నెయ్యితో, నారికేళ జలముతో, చక్కగా గంధము అరగదీసి సుగంధ ద్రవ్యములను చేర్చిన నీటితో స్నాననికి అన్నీ సిద్ధంగా ఉంచాను. హాయిగా స్నానం చేయండి. మర్చిపోకండేం! ఆ స్నానపు జలాలను కాస్త నా సేవనకు ఉంచండి. ఇదుగోండి, మీ స్నానాంతరం ధారణకు వస్త్రము, ఉపవీతము.
ఆహా! ఏమి సౌందర్యమయ్యా రామయ్య! ఎంత లావణ్యమమ్మా సీతమ్మ! రెండు కళ్లూ చాలటం లేదు! నను కన్న తల్లీ! నా తండ్రి రామయ్యా! ఇదుగో నా భక్తి అనే గంధపు చెక్కతో అరగదీసిన గంధము...నుదుట ధరించండి! నా హృదయమును ఈ పుష్పము ద్వారా మీకు సమర్పిస్తున్నాను. ధరించండి! ఇదిగిదిగో! మీ సౌకర్యానికై సాంబ్రాణి ధూపము! మీ మందిరమంతా చక్కని సువాసనతో నిండాలి.
రామయ్యా! సీతమ్మా! ఇదుగో! జ్యోతిస్స్వరూపులైన మీకు ఈ దీపం! అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి నాకు జ్ఞానజ్యోతిని ప్రసాదించండి. నా శ్రీమతి ఎంతో శ్రమపడి మీకు నివేదించటానికి భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, పానీయాలు సిద్ధం చేసింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీ రూపమైన ఈ నివేదనమును శుభ్రమైన వెండి పాత్రలో సేవించండి. మీకు ఇష్టమైనవి భుజించండి! మీ చేతులు శుభ్రం చేసుకోవటానికి ఇదిగోండి ఆచమనం! అమ్మా! ఇదిగో లేత తమలపాకులు, మా పెరట్లో పెరిగిన తీగవి, ఆ సున్నం, వక్కలు, ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి స్వామికి తాంబూలం అందించు తల్లీ!
రామయ్యా! సీతమ్మా! అంతా సౌఖ్యమే కదా! మీ దివ్యమంగళ రూపాలను నేను ఏమని పొగడెదను? ఇదిగో నీరాజనం. ఏకహారతి, పంచహారతి అందుకోండి. పంచభూతములలోనూ, సమస్త దేవతామూర్తులలోనూ, ప్రకృతిలోను, నాలోను ఉన్న మీ మహత్తులను తెలిపే మంత్ర పుష్పం పఠిస్తున్నాను. దశరథపుత్రుడైన రాముని తెలుసుకునేందుకు ఆ సీతావల్ల్భుడైన మిమ్ములను ధ్యానిస్తున్నాను. జనకుని పుత్రికయైన సీతమ్మను తెలుసుకునేందుకు ఆ రామపత్నియైన మిమ్ములను ధ్యానిస్తున్నాను. మీరు మమ్ములను అనుగ్రహించెదరు గాక. అన్ని దిక్కులా, ,అంతటా, నా దేహమనే దేవాలయంలో స్థిరమై ఉన్న మీకు ప్రదక్షిణ నమస్కారములు సమర్పిస్తున్నాను. తెలిసీ తెలియక చేసిన పాపములను, ఈ జన్మలోనూ, ఇతర జన్మలలోనూ చేసిన పాపములు నశించుటకు ప్రదక్షిణము చేస్తున్నాను. నేను పాపుడను, పాప కర్మలను చేసే వాడిని, పాపాత్ముడను, పాపము వలన పుట్టిన వాడను. నన్ను తరించటానికి మీ కరుణను కురిపించవలసింది. మీరు తప్ప నాకు వేరే దిక్కెవ్వరూ లేరు. కాబట్టి కరుణతో నన్ను రక్షించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి