RightClickBlocker

15, అక్టోబర్ 2016, శనివారం

సువ్వి కస్తూరి రంగా - దాసం గోపాలకృష్ణ గారి రచన


భారతీయ గ్రామీణ జీవితంలో పని చేసే వారికి అలుపు తెలియకుండా కూని రాగాలు, దరువులు, జానపద గీతాలు మొదలైన సంగీత నృత్యాంశాలు ఉద్భవించాయి. ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని కొసరాజు రాఘవయ్య గారు రాసింది అక్షరాలా నిజం. రోజంతా పొలాలలో, ఇళ్లలో పని చేసే వారికి, ముఖ్యంగా మహిళల జీవితాలలో ఈ గ్రామీణ సంగీతం ఓ విడదీయరాని అంతర్భాగం. దీనిని ఎందరో కవులు, కళాకారులు గుర్తించి దానికి తగినంత ప్రాచుర్యం కూడా తెచ్చారు. జానపద సంగీతంలో అందరికీ అర్థమయ్యే భాషలో, ఆయా జీవితాలను ప్రతిబింబించేలా ఈ కళలు ఎంతో ప్రచారం పొందాయి. అటువంటి కోవకు చెందినవే సువ్వి పాటలు. ఆధునిక పనిముట్లు రాకమునుపు శారీరిక శ్రమ కలిగిన పంటలు కోసి కుప్పలు వేయటం, నీళ్ళు మోయటం, ధాన్యాలు దంచటం, రోట్లో పప్పు రుబ్బటం, పిండ్లు కొట్టుకోవటం, పెద్ద ఎత్తన వంటలు చేయటం వంటి పనులలో స్త్రీ పురుషులు తప్పకుండా ఓ పాట అందుకునే వారు. వాటిలో ఒకింత కష్టాన్ని ప్రతిబింబించే పదాలు, కాస్త ఉత్సాహం, కాస్త శృంగారం, కాస్త చిలిపితనం, కాస్త ఆధ్యాత్మికత కలబోసి ఓ అద్భుతమైన రస సమ్మేళనం మనకు ఆవిష్కరించబడుతుంది. పనిలోనూ లయ అనేది మనకు గ్రామీణ శ్రామికుల జీవితాలలో కనబడుతుంది. ఇది సనాతనమైన కళ.

సువ్వి పాటలలో ప్రత్యేకత అవి దాదాపు అన్నమయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల సంకీర్తనలకు భావ సారూప్యత కలిగి ఉండటం. మన భారతీయ గ్రామీణ జీవితాలలో ఉన్న గొప్పతనం ఇదే.  ప్రతి ఒక్క కోణంలోనూ ఆధ్యాత్మికత తొణికిసలాడుతూ ఉంటుంది. అలాగే, మధురభక్తి. తాను నాయికగా, స్వామి నాయకుడిగా ఆరాధించే భావన మధురభక్తి. సువ్వి పాటలలో ఈ మధురభక్తి నిండి ఉంటుంది. మధురభక్తికి పతాకస్థాయి కృష్ణ తత్త్వం. సర్వం ఆ నల్లనయ్యకు సమర్పించి ఆయనతో సరససల్లాపాలాడే అనుభూతులు ఎందరో వాగ్గేయకారులు తమ సంకీర్తనలలో కనబరచారు. అటువంటి భావనే కలిగిన ఓ సువ్వి గీతం దాసం గోపాలకృష్ణ గారు రచించిన "సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి రామాభిరామ సువ్వి లాలి".

దాసం గోపాలకృష్ణ గారు 1930 ఫిబ్రవరి 13న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని కుముదవల్లి గ్రామంలో సత్యవతి వెంకట్రామయ్య దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం తరువాత పాలకొల్లులో తన నాటక రంగ సేవను మొదలుపెట్టారు. ఆయన సినీ ప్రస్థానం చెన్నైలో 1951లో మొదలైంది. 1955లో వినోదిని పత్రికకు ఆయన స్వాతంత్ర్య పర్వదిన అనే అద్భుతమైన వ్యాసం రాశారు. చిన్నవయసులోనే ఆయన ఎన్నో నాటకాలను రచించారు. రైతు భారతం, సర్వం జగన్నాథం, పున్నమదేవి(చారిత్రాత్మకం) చిలకా గోరింకా, రాగజ్వాల లాంటి నాటకాలు, నాటికలు, బుర్రకథలు రచించారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన సాంఘిక నాటకం 'చిల్లరకొట్టు చిట్టెమ్మ '. 1960లో ఈ నాటిక తణుకులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటకపోటీలలో ప్రథమ బహుమతి పొందింది. 1965లో భక్త పోతన చిత్రానికి సంభాషణలు రాశారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ నవలను దాసరి నారాయణరావు గారు 1977లో చిత్రంగా తెరకెక్కించారు. ఆ చిత్రానికి గోపాలకృష్ణ గారు పాటలు, సంభాషణలు అందించారు. తెలుగు చలన చిత్రాలలో ప్రెసిడెంటు పేరమ్మ, భక్త పోతన, బంగారు సంకెళ్లు, శివరంజని వంటి చిత్రాలకు పాటలు, మాటలు రాశారు. అత్తను దిద్దిన కోడలు, కళ్యాణి, రాణీకాసుల రంగమ్మ, అల్లుడు పట్టిన భరతం, పసుపు-పారాణి, దేవదాసు మళ్లీపుట్టాడు, రౌడీ రంగమ్మ, ప్రణయగీతం వంటి చిత్రాలలో  పని చేశారు. శివరంజని చిత్రంలో ఆయన రచించిన గీతం 'జోరు మీదున్నావు తుమ్మెదా'  అన్న పాట ఎంతో పేరుపొందింది. 50కు పైగా చిత్రాలలో పని చేసి 40 మంచి గీతాలు రచించిన దాసం గోపాలకృష్ణ గారు మరణించారు.


1977లో విడుదలైన చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రానికి దాసం గోపాలకృష్ణ గారు రచించిన 'సువ్వి కస్తూరి రంగ ' అనే గీతం ఎస్.జానకి గారి అద్భుతమైన గాత్రంలో, బాలుగారు మిమిక్రీతో ఎంతో పేరుపొందింది. రమేష్ నాయుడు గారి సంగీతంలో వెలువడిన గీతం శ్రీకృష్ణుడు-గోపికల మధ్య శృంగార  భావనలను, చిలిపి చేష్టలను ప్రతిబింబిస్తుంది.  అర్థరాత్రి నిద్రలో ఆ కొంటె కృష్ణుడు ఆ గోపెమ్మ దగ్గరకు వచ్చి వంగి వంగి చూసి, కొంగు పట్టుకొని లాగాడుట, యమునా తీరానికి తీసుకువెళ్లాడుట. ఆ బృందావనంలో గొల్లభామలలో కలిసి ఆడి పాడిందట. నిద్రలేచి అద్దంలో చూసుకుంటే ఆ కృష్ణుని ముద్దుల ముద్రలు అద్దినట్లుగా ఉన్నాయిట. ఈ భావనలను సువ్వి-ఆహు పద సంపుటితో అందంగా రాశారు దాసం గోపాలకృష్ణగారు. ఈ చిత్రం పాలకొల్లు, పాలకొల్లు పోడూరు ప్రాంతాలలోనే చిత్రీకరించటంతో పాటకు మరింత అందం వచ్చింది. దాసం గోపాలకృష్ణ గారి రచనలు గ్రామాల సంభాషణలలో సహజమైన పదప్రయోగాలు కలిగి తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి. అందుకే, తక్కువ పాటలు రాసినా, అవి ఇప్పటికీ ప్రజల హృదయాలలో స్థానం కలిగి ఉన్నాయి. సువ్వి కస్తూరి రంగ అనే గీతం సాహిత్యం మీకోసం. జానకి గారు ఈ పాటను పాడినట్లు వేరే ఏ గాయని కూడా పాడలేరు అనేలా ఉంటుంది ఈ గానం. రమేష్ నాయుడు గారు మధురమైన సంగీతానికి పెట్టింది పేరు. 1970-80 దశకాలలో ఆయన తెలుగు చిత్రాలకు అందించిన అద్భుతమైన సంగీతం అజరామరం. బాలుగారు, జానకి గార్ల నేపథ్య వైభవంలో ఆయనకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.

సువ్వి ఆ హు సువ్వి ఆ హు ....సువ్వి...సువ్వి

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా ..

అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
నా వద్దకు వచ్చెను ఓ సఖియా

ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...
ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...

వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లాగెనుగా
వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లాగెనుగా
భల్ చెంగున యమునకు సాగెనుగా

అల్లావనమున కొల్లలుగా వున్న గొల్ల భామలను కూడితిని
నే గొల్ల భామనై అడితిని ...నే గొల్ల భామనై అడితినీ...


నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
హబ్బ... అద్దినట్టుంది ఓ సఖియా...

సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

1 వ్యాఖ్య:

  1. దాసం గోపాలకృష్ణ గారు వ్రాసిన పాటలు కవితాత్మకంగా ఉంటాయి. ఉదా. రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది. ఆవులించి చిరుకెరటం ఒళ్ళు విరిచుకుంటోంది. ఒక పాటకు ఇలాంటి ఎత్తుగడతో మొదలు పెట్టడం మంచికవికే సాధ్యం. వ్యాసం బాగుంది.

    ప్రత్యుత్తరంతొలగించు