8, అక్టోబర్ 2016, శనివారం

శరన్నవరాత్రులు - మూల నక్షత్రం నాడు సరస్వతీదేవి అలంకారం


శరన్నవరాత్రులలో నేడు మూల నక్షత్రం, సప్తమి అనంతరం అష్టమి. ఇంద్రకీలాద్రిపై అమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. సకల కళలకు, సమస్త విద్యలకు, వాక్కుకు రూపమైన ఆ తల్లి మానవజాతి జ్ఞానజ్యోతి నిరంతరం వెలిగేందుకు కారణం. మూలా నక్షత్రం నాడు ఆ తల్లిని ఆరాధించటం విశేషం. యా దేవీ సర్వ భూతేషు విద్యా రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అన్నది వేదప్రణీతం. సమస్త భూతములలో విద్య రూపంలో ఉన్న ఆ తల్లికి నమస్కారములు అని దీని భావం.

ఇక సరస్వతీ దేవి స్తుతులకు వస్తే ఎన్నో విశేషమైన సంకీర్తనలు, పాటలు ఉన్నాయి. నాకు బాగా నచ్చే పాట స్వాతికిరణం చిత్రంలోని సి.నారాయణ రెడ్డి గారి సంగీత సాహిత్య సమలంకృతే అన్నది. సంస్కృతంలో రచించబడిన ఈ కృతి ఆ భారతీ దేవి వైభవాన్ని మనకు అద్భుతంగా చాటుతుంది. వివరాలు:

సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతీ! మనసా స్మరామి! శ్రీ భారతీ! శిరసా నమామి!

వేద వేదాంత వనవాసిని! పూర్ణ శశిహాసిని!
నాద నాదాంత పరివేషిణి! ఆత్మ సంభాషిణి!
వ్యాస వాల్మీకి వాగ్దాయిని! జ్ఞానవల్లీ సముల్లాసిని!

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి! భవ్య ఫలకారిణి!
నిత్య చైతన్య నిజరూపిణి! సత్య సందీపిని!
సకల సుకళా సమున్వేషిణి! సర్వ రస భావ సంజీవిని!

సంగీతం, సాహిత్యము, స్వరం, రాగము, పదము, యోగములతో అలంకరించబడిన తల్లిని భారతీ దేవిగా కవి ప్రస్తుతిస్తున్నారు. వేద వేదాంతములనే వనములలో నివసించే తల్లిగా, పూర్ణ చంద్రబింబము వంటి నవ్వు కలిగి, నాదము, దానికి మూలమైన ఓంకారంతో అలంకరించబడి, ఆత్మతో అనుసంధానమైన తల్లిగా ఆ భారతీదేవిని కవి కొనియాడారు. వ్యాసుడు, వాల్మీకి వంటి అవతారపురుషులకు, ఋషులకు అద్భుతమైన వాక్ సంపదనిచ్చి వారి ద్వారా మనకు వెలలేని వాఙ్మయ సంపదనిచ్చిన, జ్ఞానమనే తీగలతో ప్రకాశించే అమ్మగా మనోజ్ఞంగా అభివర్ణించారు. బ్రహ్మ నాలుకపై నడయాడే ఆ తల్లి అద్భుతమైన ఫలాలను అందిస్తూ, సచ్చిదానంద స్వరూపిణిగా సత్యరూపిణిగా శోభిల్లుతూ, సమస్త శుభకళలకు ఆలవాలమై సమస్త రసములకు, భావములకు ప్రాణమైనదిగా నుతించారు.

ఇటువంటి గీతం రచించాలంటే సరస్వతీ అనుగ్రహం ఉంటేనే సంభవం. నారాయణ రెడ్డి గారి రచనా ప్రస్థానం గమనిస్తే ఆ అనుగ్రహం మనకు ఎల్లెడలా కనబడుతుంది. వాగ్దేవి కటాక్షం కలిగిన ఆయన ఈ చిత్రంలో ఈ గీతంతో పాటు ప్రణతి ప్రణతి ప్రణతి వంటి మరో అద్భుతమైన గీతాన్ని కూడా అందించారు. సాహిత్యానికి మూలం పదాలలో ఉండే భావం, సహజమైన పటుత్వం. సంగీత సాహిత్య సమలంకృతే అనే గీతం ఇటువంటీ సర్వ సులక్షణ సమన్వితమైనది. మహదేవన్ గారి సంగీత మాధుర్యంలో బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో ఈ పాట మరింత ప్రకాశించింది.

వీణాపాణిగా, అక్షరరూపిణిగా, శుక వారిజ పాణిగా, వరదాయినిగా, సురలోక గాయనిగా ఆ తల్లి జగత్తును కాపాడుతోంది. ఆమె విపంచి నుండి నిరంతరం షడ్జమ నాదము వెలువడుతూ జగత్తులో శబ్దరస గ్రంథులకు జీవమై నిలుస్తుంది. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచి అనుగ్రహాన్ని పొందుదాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి