శరన్నవరాత్రులలో ఆఖరి రోజు మహా నవమి. బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. దేవీ మహాత్యంలో దుష్టులను సంహరించటానికి ఆది పరాశక్తి దుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలను ధరిస్తుంది. మధు కైటభులు, మహిషాసురుడు, శుంభ నిశుంభులు ఆ తల్లి చేతులలో హతమవుతారు. రాక్షసులంటే ఎక్కడో ప్రయేకంగా కాదు. దుర్లక్షణాలను బట్టి ప్రవృత్తికి రాక్షసత్వం అనే పేరు ఇవ్వబడింది. మనలోనే ఉంటూ మన మధ్య్తే తిరుగుతూ వికృతక్రీడలతో, దౌర్జన్యంతో స్త్రీలను, బలహీనులను హింసించి ఆధిపత్యం పొందే వాళ్లే రాక్షసులు. అటువంటి వారిని దండించటానికి ఆ అదిపరాశక్తి త్రిశక్తి రూపిణిగా అవతరించి మనలను తరింపజేస్తోంది.
ఈ సందర్భంగా నాకు ఇష్టమైన అమ్మను నుతించే గీతం వివరాలు, చివరగా మంగళ హారరి. ఇంతటితో ఈ శరన్నవరాత్రుల శీర్షికతో వచ్చే వ్యాసాలు సంపూర్ణం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
ఓంకార పంజరశుకీం! ఉపనిషదుద్యానకేళి కలకంఠీం !
ఆగమ విపిన మయూరీ! ఆర్యాం! అంతర్విభావయేద్గౌరీం!
అఖిలాండేశ్వరి! చాముండేశ్వరి! పాలయ మాం గౌరీ! పరిపాలయ మాం గౌరీ!
శుభగాత్రి! గిరిరాజపుత్రి! అభినేత్రి! శర్వార్ధగాత్రి!
సర్వార్ధ సంధాత్రి! జగదేక జనయిత్రి! చంద్రప్రభా ధవళకీర్తి!
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని
కుంకుమరాగశోభినీ! కుసుమ బాణ సంశోభినీ!
మౌనసుహాసిని! గానవినోదిని! భగవతి! పార్వతి! దేవీ!
శ్రీహరి ప్రణయాంబురాశీ! శ్రీపాద విచలిత క్షీరాంబురాశీ!
శ్రీపీఠసంవర్ధినీ! డోలాసురమర్దినీ!
ధనలక్ష్మి! ధాన్యలక్ష్మి! ధైర్యలక్ష్మి! విజయలక్ష్మి!
ఆదిలక్ష్మి! విద్యాలక్ష్మి! గజలక్ష్మి! సంతానలక్ష్మి!
సకలభోగసౌభాగ్యలక్ష్మి! శ్రీమహాలక్ష్మి! దేవీ!
ఇందువదనే! కుందరదనే! వీణాపుస్తకధారిణే!
శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే!
సరససాహిత్య స్వరస సంగీత స్తనయుగళే!
వరదే! అక్షర రూపిణే! శారదే! దేవీ!
వింధ్యాటవీవాసినే! యోగసంధ్యాసముద్భాసినే!
సింహాసనస్థాయినే! దుష్టహర రంహక్రియాశాలినే!
విష్ణుప్రియే! సర్వలోకప్రియే! శర్వనామప్రియే! ధర్మసమరప్రియే!
హే బ్రహ్మచారిణే! దుష్కర్మవారిణే! హే విలంబిత కేశపాశినే!
మహిషమర్దనశీల! మహితగర్జనలోల! భయతనర్తనకేళికే! కాళికే!
దుర్గమాగమదుర్గ పాహినే! దుర్గే! దేవీ!
వేటూరి వారి సాహితీ ప్రతిభ దేవీ వైభవంగా ఎలా ఆవిష్కరించిందో చూడండి. ముగురుమ్మల కలయికగా వెలసిన దుర్గ మహిషాసురమర్దినిగా ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లుగా నుతించారు వేటూరి. మొదటి చరణంలో గౌరిని, రెండవచరణంలో మహాలక్ష్మిని, మూడవ చరణంలో సరస్వతిని, చివరి చరణంలో దుర్గను అమోఘమైన పదవిన్యాసంతో ప్రస్తుతించారు. పదప్రయోగంలో వేటూరి వారి పాండిత్యం విలక్షణమైనది. ఈ గీతాన్ని భమిడిపాటి సబిత అనే నృత్యకళాకారిణి నాట్యంగా సప్తపది చిత్రంలో తెరకెక్కించారు. అద్భుతమైన కూచిపూడి విన్యాసంలో, సుశీలమ్మ-బాలు గార్ల సుసంపన్నమైన గాత్రంలో మామ మహదేవన్ గారు మనకు ఈ వేటూరి సాహితీ పారిజాతాన్ని అందించారు.
మొదటి చరణంలో ఆ గౌరిని హిమవంతుని పుత్రికగా, అందమైన ముఖము కల తల్లిగా, నాట్యాభినయంలో నిపుణురాలుగా, శంకరుని సగభాగంగా, సమస్త సంకల్పములను నెరవేర్చే తల్లిగా, మూడులోకాలకు జననిగా, చంద్రుని వలె ప్రకాశవంతమైన కీర్తి కల అమ్మగా, నాలుగు హస్తములతో దుష్టులను శిక్షించి, భక్తులకు అభయమిచ్చి 14 లోకాలను పాలిచే తల్లిగా, కుంకుమతో శోభిల్లుతూ పూలబాణములతో వెలిగే అమ్మగా, మౌనముగా చిరునవ్వుతో, సామగానాన్ని ఆనందిస్తూ ఉండే భగవతిగా పార్వతిని కవి ప్రస్తుతించారు.
రెండవ చరణంలో అమ్మను శ్రీమహావిష్ణువు ప్రేమకు నిలయంగా, పాలకడలిలో ఆ శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉండే అమ్మగా, శ్రీపీఠమున స్థిరమైన తల్లిగా, డోలారుసుని సంహరించిన దేవతగా, ధన ధాన్య ధైర్య విజయ ఆది విద్యా గజ సంతాన లక్ష్ములనే అష్ట రూపములతో లోకాల సమస్త కామ్యములను తీర్చే తల్లిగా, సకల సంపదలనిచ్చే కల్పవల్లిగా శ్రీమహాలక్ష్మిని నుతించారు.
మూడవ చరణంలో చంద్రునివంటి ముఖముతో, అందమైన పలువరసతో, వీణ మరియు పుస్తకములు చేత ధరించిన తల్లిగా, శుకుడు శౌనకుడు, వ్యాసుడు, వాల్మీకి మొదలైన వారిచే పూజించబడిన శుభ చరణముల కల అమ్మగా, రసపూరితమైన సాహిత్యము, రసయుక్తమైన సంగీతములనే స్తనములు కలిగిన అమ్మగా, వరములనిచ్చే తల్లిగా, అక్షర రూపిణిగా, శారదగా ఆ సరస్వతీదేవిని నుతించారు.
నాలుగవ చరణంలో ముగురమ్మలు ఏకమైన మహిషాసుర మర్దిని రూపాన్ని కవి అద్భుతంగా ఆవిష్కరించారు. వింధ్యపర్వత శ్రేణుల వద్ద అడవులలో నివసించే అమ్మగా, యోగము, సంధ్యావందనంలో ప్రకాశించే శక్తిగా, సింహారూఢయై దుష్టులను సంహరించే క్రియలో నిపుణురాలైన ఆదిపరాశక్తిగా, విష్ణువుకు, శివునికి,సమస్తలోకములకు ప్రియమైనదిగా, ధర్మ యుద్ధములంటే ఇష్టపడేదిగా, బ్రహ్మచారిణిగా, దుష్కర్మలను వారించేదిగా, ముడివేయని కేశములు కలదిగా, పాశమును ధరించి గొప్ప గర్జనలు, భయము కలిగించే నృత్యము చేస్తూ చేస్తూ కాళిక రూపంలో మహిషాసురుని మర్దించిన గుణశాలిగా, కష్టతరమైన ఆగమాలకు మూలమైన దుర్గగా కొనియాడారు.
స్త్రీశక్తి జాగృతమై ఈ జగతి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ, ఈ నీరాజనం.
శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం
నెలకొల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం
మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం
చెక్కిళ్ల కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం
పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం
పగడాల మరిపించు ఇనబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం
నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం
తేటిపిల్లలవోలె గాలికల్లలలలాడు మా తల్లి కురులకు నీరాజనం
నీరాల నీరాజనం భక్తి భావాల నీరాజనం
జగదేక మోహినీ సర్వేశు గేహిని మాతల్లి రూపునకు
భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం
బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు భాషలో ప్రావీణ్యం పొంది ఆచార్యులుగా కూడా ఎన్నో ఏళ్లు పని చేశారు. భాషపై పట్టుతో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా వారికి భగవంతుని అనుగ్రహంగా వచ్చింది. తెలుగు మరియు సంస్కృత భాషలలో ఉభయ భాషా ప్రవీణులు వీరు. దేవీభాగవతంపై వీరు విస్తృత పరిశోధన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్ లో తెలుగు విభాగంలో ఎన్నో ఏళ్లు ఆచార్యునిగా భాషాసేవ చేశారు.
వీరి రచన ఈ శీతాద్రి శిఖరాన భక్తి గీతం. లోకమాతకు ఇలా నీరాజనం ఇస్తున్నాడు కవి.
హిమవత్పర్వత శిఖరంపై పగడాలతో తాపినట్లుగా ఉన్న మా తల్లి కాళ్ల పారాణికి కెంపువంటి ఎరుపైన, భక్తితో నిండిన నీరాజనం. యోగుల హృదయాలలో చక్కగా మ్రోగే తల్లి అందెలకు బంగారు, భక్తి రంగరించిన నీరాజనం. హృదయంలో నిలిపిన వారికి ప్రేమ వీణలు మ్రోగించే తల్లి గాజులకు రాగాలతో, భక్తి భావములతో నీరాజనం. మానవాళి హృదయాలలోని అంధకారాన్ని తొలగించే తల్లి నవ్వులకు ముత్యాల మరియు భక్తితో కూడిన నృత్యాల నీరజనం. బుగ్గలపై గల వెలుగుతో క్రిక్కిరిసి అలరారే తల్లి ముక్కు పోగుకు రతనాల, భక్తి ప్రయత్నాలతో కూడిన నీరాజనం. ప్రజలందరినీ పసిబిడ్డలను చేసి పాలించే తల్లి చూపులకు అనురాగంతో, భక్తి కనబరుస్తూ నీరాజనం. పగడాలను మరపించేలా, సూర్యబింబంవలె అనిపించే తల్లి కుంకుమకు నిండైన, భక్తి మెండుగా గల నీరాజనం. తేనేటీగ పిల్లల వలే గాలికి అటు ఇటూ ఊగే తల్లి కురులకు నీటితో మరియు భక్తి భావములతో నీరాజనం. జగములోకెల్ల అతి సౌందర్యవతి, సర్వేశ్వరుని పత్ని అయిన తల్లి రూపమునకు భక్తితో నిలువెత్తు నీరాజనం.
కేవలం ప్రాస కోసం పదాలు కాకుండా మంచి భావ సంపద కూడా ఈ గీతంలో ఉన్నాయి. భక్తి విశ్వాసాలతో కూడిన నీరాజనాలు అమ్మ తప్పకుండా స్వీకరించి అనుగ్రహిస్తుంది.
ఈ మంగళహారతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు. శరన్నవరాత్రులలో ఈ అవకాశం నాకు కల్పించిన ఆ జగన్మాతకు, మీకు అందరికీ ధన్యవాదాలు. లోకాస్సమస్తా సుఖినోభవంతు!!
రెండు గీతాల వివరణ చాలా బాగుంది ప్రసాద్ గారు. అఖిలాండేశ్వరి పాట మొదటి చరణం షణ్ముఖప్రియలోను మూడవ చరణం సరస్వతి రాగంలోను స్వరపరచటం సముచితంగా ఉంది. సాహిత్యం సంగీతం గానం చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండి