దుర్గే దుర్గత హారిణి త్రిజగతాం సర్గాది సిద్ధార్ధకే
స్వర్గాధీష్ట ఫల ప్రదాన నిపుణే త్రాయస్వ న శ్శంకరి
సా త్వం సర్వ జనాంతరాంతర చిదం సానన్య సిద్ధాత్మికా
సారాసార వివేక దృష్టి విదితా సర్వైక సాక్ష్యాత్మనా
ఓ దుర్గా! మానవుల కష్టములను హరించే తల్లీ! మూడు లోకాల సృష్టి స్థితి లయములకు కారకురాలవు నీవు! సమస్త అభీష్టములను తీర్చే నైపుణ్యము గల తల్లీ! శుభకరీ! మా అంతరాత్మవు నీవు! మాకు విచక్షణ, వివేకము, జ్ఞానము కలిగించే తల్లివి! మూడు లోకాలకు సాక్షీభూతవు నీవు!
అని ఆ దుర్గామాతను నారాయణ తీర్థులవారు తమ శ్రీకృష్ణ లీలా తరంగిణిలో యోగమాయ కంసునికి కృష్ణజన్మవృత్తాంతాన్ని తెలిపిన సందర్భంలో దుర్గాదేవిని మునుల నోట నుతింపజేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి మనకు అభయమిచ్చే ఆ సింహవాహినికి పర్వం ఈ దుర్గాష్టమి. దుర్గాసూక్తంలో అమ్మ వైభవాన్ని ఇలా చాటారు:
తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్
దుర్గాం దేవిగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః
అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము.
మానవజన్మకు కష్టసుఖాలలో దుర్గమమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దుర్గాదేవిని శరణు వేడితే అవి తొలగిపోతాయన్నది ఆర్యోక్తి. మరి అటువంటి దుర్గను కొలిచి ఇదివరకు ఎవరు విజయాన్ని సాధించారు? మనలాంటి మానవులే అయిన పంచ పాండవులు. మహాభారతం విరాట పర్వం ఆరంభంలో పాండవులు అజ్ఞాతవాసానికై విరాటుని కొలువుకు వెళ్లేముందు ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించాడు. యుధిష్ఠిరుడి వంటి ధర్మ ప్రభువుకు, సత్యసంధునకు కూడా కష్టాలు తప్పలేదు. అఖండ భారతదేశాన్ని పాలించవలసిన పాండుకుమారులకు తమ నిజస్వరూపం తెలియకుండా మారువేషాలలో ఇంకొకరి పంచన ఉండాల్సిన అగత్యం వచ్చింది. ఎవరు అప్పుడు శరణు? ఆదిపరాశక్తి దుర్గ. ధర్మరాజు ఆ తల్లిని నారాయణుని సోదరిగా, కంసుని మరణానికి కారణమై, దానిని ఆ అసురునికి స్వయంగా తెలిపిన యోగమాయగా గ్రహించి నుతిస్తాడు.
నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం
కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీం
వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం
జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాప్రతం
వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి ఖడ్గఖత్వాంగధారిణి
దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే
దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ
యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః
అనగా,
యశోద గర్భము నుండి పుట్టి, నారాయణునికి ప్రియమైన, నందగోపుని వంశంలో జన్మించి, అందరికీ శుభములిచ్చి వంశాభివృద్ధి కలిగించే తల్లీ! కంసుని పారద్రోలి, అసురులను నాశనం చేసి, రాతిమీద కొట్టబడినా ఆకాశమార్గంలో పయనించిన వాసుదేవుని సోదరీ! దివ్యమైన పూలమాలలు, వస్త్రములు, ఖడ్గమును, డాలు దాల్చిన దేవీ!
నీవే జయవు, విజయవు. యుద్ధములో జయమునిచ్చే దానవు. నాకు కూడ విజయాన్ని ప్రసాదించే వరాన్ని ఇపుడీయుము.
కాళీ! మహాకాళీ! ఖడ్గము, కపాలం కల దండము ధరించి పర్వత శ్రేష్ఠమైన వింధ్య పర్వతాన్ని శాశ్వత నివాసం చేసుకున్నావు.
ఓ తల్లీ! భరింపరాని కష్టాలనుండి తరింప జేస్తావు కాబట్టే నిన్ను ప్రజలు దుర్గ అని కొలుస్తారు. అడవుల్లో చిక్కుకున్న వారికి, సముద్రం దాటే వారికి, దుర్గమమైన మార్గాలలో పయనించే వారికి, క్రూరుల బారిన పడేవారికి నీవే గతి. నిన్ను స్మరించినవారు ఈ కార్యాలలో కష్టాలపాలు కారు.
నీవే కీర్తివి, శుభానివి, ధైర్యానివి, సిద్ధి, లజ్జ, విద్య, సంతానం, బుద్ధి, సంధ్య, రాత్రి, తేజస్సు, నిద్ర, వెన్నెల, కాంతి, ఓర్పు, దయ మొదలైన రూపాలన్నీ నీవే. నిన్ను పూజించే వారి బంధనం, మోహం, పుత్రశోకం, ధననాశం, రోగం, మృత్యువు, భయము తీరుస్తావు. అమ్మా! ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడనయ్యాను. నీ శరణు వేడుతున్నాను.
దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు కలువరేకులవంటి ప్రసన్నమైన కనులు కలదానవు. నన్ను రక్షించు. నీవే సత్యము. మా పట్ల సత్యము కమ్ము!
ఈ విధముగా ధర్మమూర్తి అయిన యుధ్హిస్ఠిరుడు ఆ అమ్మను వేడుకోగానే ఆ తల్లి ప్రసన్నురాలై ప్రత్యక్షమై "నాయనా! నీకు త్వరలోనే విజయం కలుగుతుంది. నా అనుగ్రహం వలన విరాటుని కొలువులో మీరుండగా మీ జాడను కౌరవులతో సహా ఎవ్వరూ తెలుసుకోలేరు. నన్ను స్మరించిన వారికి నేను సదా రక్షగా ఉంటాను" అని ఆశీర్వదిస్తుంది.
ప్రముఖ వాగ్గేయకారులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు దుర్గాదేవిని శ్రీరంజని రాగంలో తిరువారూరు సమీపంలోని కధిరమంగళం వనదుర్గామాతను కొనియాడుతూ ఓ అద్భుతమైన కృతిని రచించారు. ఈ కృతి దుర్గాదేవి మూల మంత్రం యొక్క బీజాక్షరాలతో ఆరంభమవుతుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు సిద్ధపురుషులు. మంత్రసాధన చేసి, అమ్మను దర్శించి ఎన్నో కృతులను రచించారు. ఇది కూడా అటువంటిదే. దాని వివరాలు:
శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిద్రస వర్గే
స్థిరే ఆపవర్గే శ్రీ వనదుర్గే
దుందుభి వాద్య భేద నాద వినోదిని
మోదిని వీణా వాదిని సంవేదిని అభేదిని
సుందరి శ్రీరంజని నిరంజని జయ జనని
కరుణారసాలయే కలికల్మష విలయే
కర విధ్రుత కువలయే కానన నిలయే
చరణ కిసలయే చామీకర వలయే
స్వర సంగీత లయే సురుచిర మలయే
గురుగుహోదయే సదయే విజయే అభయే
సరసమయే షట్సమయే సమయే కలయే
ఓ వనదుర్గా మాతా! శివుని సహచారిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! శాశ్వతమైన సుఖాలను ప్రసాదించే తల్లీ! వివిధరకములైన వాద్యముల నాదములతో ఆనందించే తల్లీ! వీణావాదనము చేసే తల్లీ! నీవు సర్వాంతర్యామివి! భేదింప శక్యము కావు! మనోజ్ఞమైన రూపము కలదానవు! శ్రీమహాలక్ష్మిని అలరించే తల్లీ! దోషరహితవు! అమ్మా! నీకు జయము! కరుణకు నిలయము నీవు, ఈ కలిదోషాలను హరించే తల్లివి, చేతిలో వికసించిన కమలము కలదానవు, అడవులలో నివసించే తల్లివి! చిగురులవలె మృదువైన పాదములు కల తల్లివి! స్వర్ణకంకణములు ధరించిన మాతవు! కార్తికేయుని తల్లివి! దయామూర్తివి, విజయవు, మాకు అభయమునిచ్చే తల్లివి! మృదువైన స్వభావము కల అమ్మవు! ఆరు మతములకు మూలము మరియు కాలానివి నీవు! అంతటా ఉన్న అమ్మవు!
బాలమురళీకృష్ణ గారి గానంలో ఈ కృతి వినండి.
దీక్షితుల వారి సాహిత్యంలో ఉండే దేవతా వైభవం మహోన్నతమైనది. పూర్తిగా దేవతానుగ్రహం పొంది, ఆ దేవతా స్వరూపంతో అనుసంధానమై ఆయన సంకీర్తనలను రచించారు. అందుకే ఆయన రచనలలో పరిపూర్ణత్వం కనబడుతుంది. ప్రస్తుత కాలంలో వనదుర్గ ఆలలయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, మన సనాతన వాఙ్మయం ఈ వనదుర్గ మన కర్మభూమిలో అంతటా కొలువబడినదని చెబుతున్నాయి. తమిళనాడులోని కధిరమంగళం, తెలంగాణాలోని ఏడుపాయల, కర్ణాటకలోని దేంతడ్క, కేరళలోని పోయిల్కవే మొదలైన ప్రాంతాలలో వనదుర్గ వైభవంగా కొలువబడుతోంది. ఈ క్షేత్రాలు మహిమాన్వితమైనవి.
ఈ దుర్గాష్టమి నాడు బెజవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది.
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||
కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి