RightClickBlocker

7, అక్టోబర్ 2016, శుక్రవారం

కాత్యాయనీ కన్నతల్లీ - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన గీతంమొన్న తిథి ద్వయం కావటంతో బెజవాడ దుర్గమ్మ మామూలుగా శరన్నవరాత్రులలో ఐదవనాడు లలితా త్రిపురసుందరి అలంకారానికి బదులుగా కాత్యాయనిగా దర్శనమిచ్చింది.

కాత్యాయని అనగానే నాకు నా చిన్ననాటి లలిత భక్తి గీతం కాత్యాయనీ కన్నతల్లీ గుర్తుకొచ్చింది. దీనిని శ్రీరంగం గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. వింజమూరి శివరామారావు గారు ఆనాటి లలిత గీతాల రచయితలలో ప్రముఖులు. దేవులపల్లి వారికి, వింజమూరి సోదరీమణులకు బంధువు. లలిత సంగీతంలో భక్తిని గుప్పించిన కవుల ప్రతిభలు ఆనాడు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేవులపల్లి వారు రచించిన లలిత భక్తి గీతాలు అనేకం. అలాగే, మరెందరో మహానుభావులు. వింజమూరి శివరామారావు గారు కథలు, పద్యాలు, కథానికలతో పాటు రామాయణాన్ని గేయంగా రచించారు కూడా. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. దానిని తొలుత బాలమురళీకృష్ణగారు ఆలపించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రా యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చారు. ఆకసమున చిరుమబ్బుల చాటున, నల్లనివాడ నే గొల్లపిల్లనోయి, మధురానగరి సమీపంలో, వచ్చెనోయి వసంతము, వినవే చెలి పిలుపు అల్లదిగో వంటి ఎన్నో అద్భుతమైన లలితగీతాలను రచించారు. వీటిని బాలమురళిగారితో పాటు అలనాటి మేటి గాయనీమణులు రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, వేదవతీ ప్రభాకర్ గారు ఆలపించి శాశ్వతం చేశారు. ఆయన కథలు, ఆయన రచించిన గీతాలన్నీ ఎంతో పేరు పొందాయి.

వింజమూరి వారి రచనలలో ఒకటి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కాత్యాయనీ కన్నతల్లి అనే గీతం. శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగుజాతిలో జన్మించిన ఓ సంగీతపు ఆణిముత్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ గానం తేనె జాలువారినట్లు ఉండేది. పద్మశ్రీ బిరుదు పొందిన ప్రఖ్యాత ఆకాశవాణి ఆర్టిస్టు ఆవిడ. తెలుగునాట సంగీత పితామహులు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. ఆవిడ భక్తిరనజనిలో పాడిన పాటలు ఎందరో జీవితాలలో భక్తిని మొలకెత్తించాయి. 1939లో విజయనగరం జిల్లా పుష్పగిరిలో సుభద్రమ్మ వరదాచారి దంపతులకు జన్మించిన వీరు హరికథలు, జావళులు, కూచిపూడి మరియు యక్షగానం వంటి కళలలో గాయనిగా ప్రసిద్ధి చెందారు. హైదరబాదు మరియు విజయనగరంలలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విదుషీమణిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలకు సంగీతాన్నిచ్చారు. సకలం హే సఖి అని ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తన ఎంతో పేరు పొంది నేటికి కూడా ప్రమాణమైంది. కాత్యానీ కన్నతల్లీ వివరాలు.

కాత్యాయనీ! కన్నతల్లీ! మమ్మేలు భక్తావనీ! కల్పవల్లీ!

నీ సేవలే నిత్య సంకీర్తనమ్ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు

శివదేవ సీమంతినీ జేజేలు భువనైక సామంతినీ
నీ చూపు వెల్గులు నీ నవ్వు వెన్నెల
ఏ కాలమూ మూడు లోకాల పైనాడు

ఇంద్రకీలాద్వాసినీ దుర్గమ్మ సాంద్ర తేజోద్భాసినీ
నిన్ను పూజింతుమీ హృదయాల కుసుమాల
మన్నింపుమమ్మ నీ చరణాలే శరణాలు

ఆడియో కోసం ఈ లింకును ఓపెన్ చేయండి. క్రింది భాగంలో 2వ పాట ఇది.

http://eemaata.com/em/issues/201501/6384.html?fmt=rts

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి