తెనుగుదనం వంటి తీయదనము లేదు
తెలుగు కవుల వంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లి రా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
నిన్న తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా ఒక యాభై సామెతలు మీకోసం. సందర్భాన్ని బట్టి మీరు కూడా సామెతలు వాడుతూ ఉండండి. భాష నిలుస్తుంది, మీరు చెప్పాల్సిన మాటలో సందేశం ఎదుటి వారికి బాగా అందుతుంది. తెలుగు భాష పరిస్థితి ఏమిటి నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మన వంతు కృషి చేద్దాం. మాతృభాషను కాపాడుదాం.
- అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని (ఎప్పుడూ నసుగుతూ, అసంతృప్తితో ఉండే వాళ్ల గురించి)
- హనుమంతుని ఎదుట కుప్పి గంతులా (సమర్థులు, తెలిసిన వారి ముందు తెలిసీ తెలియని విద్యని ప్రదర్శించటం)
- అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు (అన్ని అయిన తర్వాత నేను చెప్పిన మాట వినలేదు, అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సిని అనే వాళ్ల గురించి)
- సూదిలా వచ్చి దబ్బనంలా తేలినట్లు (బాగు పడటం గురించి)
- అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడిందిట (నలుగురికి చెప్పేది తనకు పనికి రాలేదు అని)
- శుభం పలకరా పెళ్లి కొడకా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ ఉంది అన్నాడుట (ఎదుటి వాళ్ళు ఏమి చెపుతున్నారు అర్థం చేసుకోలేని మూర్ఖుల గురించి, వాళ్ల ధోరణి)
- అందితే జుట్టు అందకుంటే కాళ్లు (స్వార్థ పరులు)
- శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు (ప్రతి దానికి ఒక పధ్ధతి, సరైన మార్గం ఉంటుంది అని)
- అక్క మనది అయితే బావ మన వాడా? (సంబంధాన్ని బట్టి వ్యవహారం అని)
- విగ్రహ పుష్టి నైవేద్య నష్టి (తిండికి తప్ప దేనికి పనికి రాని దేహ పుష్టి ఉన్న సోమరుల గురించి)
- అడిగేవాడికి చెప్పేవాడు లోకువ (మన మంచి కోరి చెప్పే వాళ్ళను గౌరవించాలి అన్న భావన)
- వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి (భారతం, గారెలు మధ్య ఉపమానం)
- అడగందే అమ్మైనా పెట్టదు (మనకు కావాల్సింది అడిగి తీసుకోవాలి అని)
- వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు (అన్ని మన చేతుల్లో ఉండవు అని)
- అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు (అత్తా కోడళ్ళ మధ్య సంబంధం ఎప్పుడూ ఉత్తమంగా ఉండదు అని వ్యంగ్యం)
- వడ్డించే వాడు మన వాడైతే కడ పంక్తిని కూర్చున్నా ఒక్కటే (ఇచ్చే వాడు మనకు కావలిసిన వాడు అయితే, మనం ఎక్కడ ఉన్నా ఫలం మనకు అందుతుంది అని)
- అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా? (పారాడే వయసులో కొడుకు తల్లి మధ్య ఉండే అనుబంధం, గడ్డాలు, మీసాల వయసులో ఉండదని)
- లోగుట్టు పెరుమాళ్ళ కెరుక (నిజం భగవంతునికి తెలుసు)
- ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గు ఎరుగదు (పరిస్థితిని బట్టి సంతృప్తి, రుచి, సుఖం అని)
- లేడికి లేచిందే పరుగు (ముందు వెనక చూడకుండా, ఆలోచించకుండా, అనుకోగానే రంగంలో దూకే వాళ్ల గురించి)
- ఇంటి కన్నా గుడి పదిలం (భగవంతుని కోవెలలో ప్రశాంతత, భద్రత ఎక్కువ అని)
- లాభం గూబల్లోకి వచ్చింది (దురాశకు పొతే అసలుకే మోసం వస్తుంది అని)
- ఇల్లలకగానే పండగ అవుతుందా (ఏదో ఒక పని అయ్యింది కనా పొంగి పోయి హడావిడి చెయ్యటం కాదు, అన్ని అయ్యేదాకా ప్రణాళికతో, జాగ్రత్తగా ఉండాలి అని)
- లంకలో పుట్టిన వారందరూ రాక్షసులే (కాదు కదా!)
- ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా (మన సామర్థ్యాన్ని బట్టి చేసే పని, కలలు ఉండాలి)
- రౌతు కొద్దీ గుర్రం (చేసే వాడి సామర్థ్యాని బట్టి ఫలితం)
- ఎక్కడైనా బావా అనొచ్చు కానీ వంగతోట దగ్గర మాత్రం కాదు (వంగతోటలో అందరు బావ మరదళ్ళు ఉంటారు, అక్కడ బావా అంటే వేరే ఎవరైనా రావచ్చు. అందుకని, సందర్భాన్ని బట్టి సంబోధన ఉండాలి అని)
- రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు (ఎప్పుడు రోలును రోకలితో బాడుతూనే ఉంటారు, అలాగే మద్దెలను కూడా. కాబట్టి కష్టాలు అందరికీ ఉంటాయి, వాటి గురించి సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద మాత్రమే మాట్లాడాలి)
- ఎలుకకు పిల్లి సాక్ష్యం (నిజ నిర్ధారణలో సరైన వ్యక్తులను సాక్ష్యం కోరాలి అన్న దానికి వ్యంగ్యం)
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు (అదృష్టం కలిసి వస్తే)
- కండ్లార్పినమ్మ ఇండ్లార్పును (నిలకడ లేని స్త్రీ ఉన్న చోట వృద్ధి ఉండదు అన్నదానికి)
- రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి కావాలన్నట్టు (ప్రశ్న ఏదో అడగాలి కాబట్టి అడిగి, చెప్పేది సరిగ్గా వినని వాళ్లకి)
- కందకు లేని దురద బచ్చలికి ఏల (అనుభవించే వాడికి లేని బాధ నీకెందుకు అని)
- మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు వెక్కిరించినందుకు విచారం (ఇంకొక స్త్రీ వలన పొందే అవమానం ఎంత బాధాకరం గా ఉంటుందో అన్న దానికి ఉపమానం)
- బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడుట (మాటలలో కోతలు ఎంతగా ఉండొచ్చో అన్న దానికి ఉదాహరణ)
- కాకి ముక్కుకు దొండ పండు (వధూ వరుల పొందిక గురించి)
- బావ మరిది బ్రతక కోరును, దాయాది చావ కోరును (తోబుట్టువును ఇచ్చాడు కాబట్టి బావమరది నీ మంచి కోరతాడు, నువ్వు చస్తే ఆస్తి వాళ్ళది కాబట్టి దాయాది నీ చావు కోరతాడు).
- భోజనానికి ముందు స్నానానికి వెనక (మొదట భోజనం చేస్తే వేడిగా, అన్ని వంటకాలు అందుతాయి. అలానే, చివరన స్నానం చేస్తే వేడి నీళ్లన్నీ నీవే)
- పిన తండ్రి పెళ్ళాం పిన తల్లి కాదు, మేన మామ పెళ్లాం మేనత్తా కాదు (ప్రేమలు కొన్ని రక్త సంబంధాలలో ప్రత్యేకంగా ఉంటాయి)
- మనిషికో మాట గొడ్డుకో దెబ్బ (మాటను ఒక్క సారే చెప్పించుకోవాలి)
- పితికే బర్రెను ఇచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్టు (తెలిసి తెలిసి తప్పులు చెయ్యటం)
- నిత్యమూ చచ్చే వారికి ఏడ్చే వారెవరు (ఆత్మ స్థైర్యంతో ఉండమని)
- దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే (ఎక్కువ మంది పెద్దరికం చేస్తే ఎలా ఉంటుందో అన్న సందర్భం)
- తా వలచినది రంభ తా మునిగింది గంగ (తన అభిప్రాయమే నిజము, మంచి అనుకునే వాళ్ల గురించి)
- సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది (పెళ్ళిళ్ళలో పని వాళ్లకు ఉండే శ్రమ గురించి)
- తా దూర కంత లేదు మెడకో డోలు (వసతిని, పరిస్థితి, సామర్థ్యాన్ని బట్టి పని చేసుకోవాలి అని)
- దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో (ఎప్పటి పని అప్పుడే చేసుకొని జాగ్రత్త పాడమని)
- తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు (సోమరిపోతుల గురించి)
- తా చెడ్డ కోతి వనమెల్లా చెరచింది (చెడ్డ వాని సాంగత్యం మంచి వాళ్ళను కూడా చెడగొడుతుంది)
- డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు (డబ్బు లేని వాడు ఈ లోకంలో గౌరవించ బడడు)
చాలా బాగున్నాయి :)
రిప్లయితొలగించండి