24, జులై 2020, శుక్రవారం

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప!
నగరాజ ధరుడా! శ్రీ నారాయణా!

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యమునీయ
నోపక కదా నన్నునొడబరచుచు
పైపైని సంసార బంధముల గట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా!

చీకాకు పడిన నా చిత్తశాంతము సేయ
లేకనా నీవు బహులీల నన్ను
కాకు సేసెదవు బహు కర్మముల బడు వారు
నా కొలది వారలా నారాయణా!

వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను
భవ సాగరముల తడ బడ జేతువా
దివిజేంద్ర వంద్య!` శ్రీ తిరువేంకటాద్రీశ!
నవనీత చోరా! శ్రీ నారాయణా!

ఓ నారాయణా! శ్రుతి స్మృతి పురాణములలో వర్ణించబడిన మనోహరమైన రూపము కలవాడవు, మందర పర్వతమును మోసిన వాడవు! నాకు ప్రకాశించే వైరాగ్య సుఖమును ప్రసాదించక నన్ను ఒప్పించి మరీ మరీ సంసార బంధములలో కట్టివేస్తావు, నా మాటలు చెల్లునా నారాయణా! అశాంతములోనున్న నా మనసును శాంతపరచ గలిగే నీవే నన్ను అనేక లీలలతో మరింత అలజడికి గురిచేసెదవు, అనేక కర్మలలో మునిగియున్న వారితో నాకు పోలికా నారాయణా! ఇంద్రాది దేవతలకు పూజ్యుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! వెన్నను దొంగిలించిన శ్రీకృష్ణా! అనేక పాశముల నుండి నన్ను రక్షించక మరిన్ని భవ సాగరములలో కొట్టుమిట్టాడేలా చేసెదవా నారాయణా!

స్వామి వైభవాన్ని నిత్యం కనులారా గాంచి, ఆయనపై అనేక వేల ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలు రచించి, పరమాత్వ తత్త్వాన్ని అనేక విధాల అనుభూతి చెంది, జీవితంలో మలిదశలో అడుగిడే సమయంలో అన్నమాచార్యుల వారు తనకు శాశ్వత సుఖాన్ని కలిగించే వైరాగ్యాన్ని, ప్రశాంతతను, భవబంధములనుండి ముక్తిని కలిగించమని ఆ శ్రీనివాసుని ఈ సంకీర్తనలో అద్భుతంగా వేడుకున్నారు. సాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతి ఒక్క పదం కూడా అర్థవంతమై పరిపూర్ణత్వానికి తోడ్పడేల ఉంటాయి. మానవ జన్మలో పరమాత్మ లీలలే ఈ బంధనాలన్నీ అని మనకు మూడు చరణాలలో అన్నమయ్య ఉదాత్తమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించారు. అన్నిటికీ సూత్రధారి, అన్నీ తెలిసిన స్వామే తన అంతరంగము తెలుసుకొని ఈ బంధనాల నుండి రక్షించగలడని మనకు మార్గం చూపించారు అన్నమయ్య. అందుకే ఆయన సద్గురువు.

ఓ నమో నారాయణాయ!

రామాయణ వైభవం


రామ శబ్దం రం అనే ధాతువునుండి ఏర్పడింది. దీని అర్థం రమించుట, ఆనందపడుట, హాయినిచ్చుట. అయనం అనగా కదలుట, నడచుట, పయనించుట. కాబట్టి రామాయణం అంటే రాముని చలనం, గమనం, స్పందనం అని అర్థం. కాబట్టి రామాయణం అంటే కేవం రాముని కథ కాదు, రాముని నడవడికను సూచించేది అని తేలింది. రామ శబ్దంలోని రమణీయతకు ఆయన శబ్దం కమనీయమైన గమనాన్ని, వేగాన్ని జోడిస్తుంది.

రామాయణంలో ప్రపంచంలో రెండు విధాలైన భౌతిక శక్తుల సమ్మేళన మనకు స్ఫురిస్తుంది - స్థితిజ (potential), గతిజ (kinetic). తదేజతి, తన్నైజతి - అది చలిస్తుంది, చలించదు అనే ఉపనిషత్సూక్తి రామాయణంలో ధ్వనిస్తుంది. నిజానికి రాముడు పుట్టింది మొదలు పట్టాభిషేకం వరకు ఆయన జీవితంలో అయనత్వం, నిరంతర నిర్విరామ నియమనిష్ఠ కనిపిస్తుంది. రాముని జననాన్ని వర్ణించగానే వాల్మీకి మహర్షి అదే సర్గలో విశ్వామిత్రుని ఆగమనాన్ని సూచిస్తాడు. పదహారేండ్లు కూడా నిండని పసివయస్సులో క్రూర రాక్ష సంహారం, యాగ సంరక్షణ, అహల్యా శాపవిమోచనం, శివ ధనుర్భంగం, సీతా స్వయంవరం, పెండ్లి చేసుకు రాగానే అడవులకు పయనం, నానా బాధలు, మహర్షుల మన్ననలు, నెలకో నెలవు. చివరకు పర్ణశాల అంటూ ఒకటి ఏర్పడితే కలలో కూడా ఊహించని సీతాపహరణం, తదుపరి అన్వేషణం, సేతుబంధనం, రావణ సంహారం. ఇలా, ఒక్క క్షణం కూడా జీవితంలో స్థాయి, హాయి లేకుండా సత్య ధర్మాలను మాత్రం వదలకుండా సాగిన రాముని జీవన యాత్ర ఒక గొప్ప ఆయనం. అదే రామాయణం. ఇంతటి సంచలనం, సంక్షోభం జరుగుతున్న రాముడు చలించడు, హిమవత్పర్వతంలా ధైర్యంగా నిలబడి అన్నిటినీ సమర్థించుకుంటాడు. అదే రామాయణంలోని రమణీయత.

మరి రాముడి అయనం రామాయణం కదా? అయితే సీతమ్మదేమీ లేదా అని ప్రశ్నించే వారికి సమాధానం. రామాయణం అన్న దానికి రామస్య అయనం, రామాయాః అయనం అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. రామా అనగా సీతమ్మ. ఇదే రామాయణ శబ్దంలోని చమత్కారం. వాల్మీకి తన రచనకు పెట్టుకున్న పేరులోని పరమరహస్యం కూడా ఇదే. మరి సీతమ్మను రామా అని ఎందుకు పిలవరు? అన్న ప్రశ్నకు సమాధానం, స్వయంగా వాల్మీకే రామాయణంలో అనేకమార్లు రామా అన్న శబ్దాన్ని అమ్మను సంబోధించటం ద్వారా తెలిపారు. సుమంత్రుడు దశరథునికి సీతాదేవి గురించి చెప్పిన సందర్భంలో:

బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
రామా రామేహ్యదీనాత్మా విజనేऽపి వనే సతీ

బాలచంద్రునివంటి ముఖముతో శోభిల్లుతున్న సీతమ్మ పసిపిల్లలా (బాలాత్రిపురసుందరిలా) మహారణ్యంలో కూడా దైన్యత లేకుండా నిబ్బరంగా సంతోషంగా ఉంది అంటాడు. ఇంతటి శక్తి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? రామ పక్కన రాముడుండగా దిగులెందుకు అంటాడు వాక్యవిశారదుడైన వాల్మీకి. ఇక్కడ రామ శబ్దం రామా శబ్దం వెంట వెంటనే జంటగా కనిపిస్తాయి. అందులో కూడా రామ, తరువాత రాముడు. నిజానికి రామాయణానికి వివరణ రామారామయోరయనం రామాయణం (రామా రాముల అయనమే రామాయణం) అని చెప్పటమే సరైనది.

సీతాదేవికి రామచంద్రుని పేరులోనే కాదు, ,తీరులో కూడా సామ్యముంది. హనుమంతుడు లంకనంతా గాలించి చివరకు అశోకవనంలో సీతాదేవి రూపలావణ్యం చూచి నివ్వెరపోతాడు. కారణం ఆమె అతిలోక సుందరి అయినందుకు కాదు, ఆమె ముమ్మూర్తులా రామచంద్రునిలా కనిపించటం వల్ల. ప్రపంచంలో తోబుట్టువులు, తల్లీ పిల్లలు, తండ్రీ బిడ్డలు ఒకలా ఉండటం సహజం. కానీ, ఇక్కడ భార్యాభర్తలు ఒకే రూపున ఉండటం అనేది విశేషం. అక్కడ రామయ్యను చూసి ఇక్కడ సీతమ్మను చూస్తే ఆ రాముడే స్త్రీ రూపంలో ఉన్నట్లు గమనించిన ఆంజనేయుడు మనస్సులో ఇలా అనుకున్నాడు:

అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం
రమస్య చ యథారూపం తస్యేయమసితేక్షణా!

ఆ దేవి నిజరూపం - పోలికలు, అవయవములు, వాటి సౌష్టవం అన్నీ ఆ రాముని రూపానికి ప్రతిరూపంగా అన్నట్టుగా ఉంది.

ఎంత అద్భుతం కదా? ఇది ఎలా సాధ్యమైంది? అదే రామాయణంలోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపంలోనే కాదు, గుణగణాల్లో, ఆలోచనల్లో, ఆనందంలో, ఆవేదనలో దేనిలో కూడా వ్యత్యాసం లేదు.

అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం

ఆమె మనస్సు ఆయనలో లీనమైనట్టుగానే ఆయన మనస్సు ఆమె మనస్సులో లయించి ఉన్నదట. ఇలా ఒకరికొరికరు బింబ ప్రతిబింబంగా ఉన్న సీతారాముల ఆత్మ మనశ్శరీర సామరస్యాన్ని చూసి హనుమంతుడు స్థంభించిపోతాడు. సీతారాముల మధ్య ఉన్న ఈ అన్యోన్యతను, అభిన్నతను, అనుబంధాన్ని అక్షరరూపంలో నిరూపించటమే రామాయణ పర్మావధి. శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడైతే సీతాదేవి పరమాత్మ యందలి పరమ కళ. ఈ కళ ముల్లోకాలకూ మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.

రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా
త్రైలోక్య రాజ్యం సకలం సీతాయావాప్నుయాత్ కలాం!

వాల్మీకి మహర్షి యొక్క అంతర్దృష్టి, అంతరార్థం, రామాయణం మహత్తు, సీతారాముల అభేద్య తత్త్వం ఇంతకన్నా విప్పిచెప్పేదేముంది?

"వందే వాల్మీకి కోకిలం"

భారమైన వేపమాను పాలువోసి పెంచినాను - అన్నమాచార్యుల వారు


భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదే గాక తీయనుండీనా

పాయదీసి కుక్క తోక బద్దలు వెట్టి బిగిసి నాను
చాయకెంత గట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా

ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యీనా
పంచ మహా పాతకాల బారిబడ్డ చిత్తమిది
దంచి దంచి చెప్పినాను దాగి వంగీనా

కూరిమితో తేలుదెచ్చి కోకలోన బెట్టుకున్నా
సారె సారె కుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల శ్రీ వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుగోర సోకీనా

తాత్పర్యం:

ఎంతో పెద్దదైన వేపమాను తెచ్చి పాలు పోసి పెంచినా కూడా అది తీర్చలేని చేదు రుచే ఉంటుంది కానీ తీయగా మారుతుందా? పాయలుగా తీసి చెక్కబద్దలు పెట్టి బిగించి కొయ్యకు ఎంత కాలం కట్టినా వంకర పోయి చక్కగా ఉండునా? నీటిలో మరింత ముంచి మడుగున ఎంత నాన బెట్టినా పెద్ద గొడ్డలి ఏనాటికైనా మెత్తబడుతుందా? పంచమహాపాతకాల (బంగారాన్ని దొంగిలించటం, కల్లు తాగటం, గురుపత్నితో సంగమం, బ్రాహ్మణ హత్య, ఇలాంటివి చేసిన వానితో స్నేహం చేయటం) బారిన పడ్డ మనసిది, ఎంత గట్టిగా చెప్పినా మారి తన గుణాన్ని మార్చుకుంటుందా? ఎంతో ప్రేమగా తేలును తీసుకు వచ్చి చీరలో పెట్టుకుంటే మళ్లీ మళ్లీ కుడుతుందే కాని హానిచేయకుండా ఉంటుందా? ఘోరమైన ఆశలు కలిగిన మనసు లోతు తెలియని మహిమలు గల శ్రీవేంకటేశ్వరుని కృపను కోరనిస్తుందా?

వివరణ:

మాయావశమైన చిత్త ప్రవృత్తిని సద్గురువులు ఈ కృతి ద్వారా అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఆవిష్కరించారు. వేప సహజ గుణం చేదు. దానికి నీళ్ల బదులు పాలు పోసి పెంచినా ఆ చేదు పోదు. దీనికి సారూప్యం ఏమిటి? మన మనస్సు. దాని సహజ గుణం చేదైనా విషయాలలో మునిగి యుండటం. ఇక్కడ చేదు అంటే రుచి అని కాదు, మనకు శ్రేయస్కరమైనవి కానివి అని. ఏది మనకు శ్రేయస్కరం? పరమాత్మయందు ధ్యాసే. కానీ, అలా నిలువదే మనసు? నిరంతరం పాప విషయ లంపటములలో మునిగి తేలుతూ ఉంటుంది. ఈ విషయాన్నే అన్నమయ్య పల్లవిలో ఆవిష్కరించారు. సహజంగా చెడు గుణాలలో పడే మనసు శ్రేయస్కరమైన వాటి పట్ల దృష్టి కలిగి ఉండదు అనేది ఆయన భావన. దీనిని మూడు చరణాలలో ఉదాహరణల ద్వారా మరింత వివరించారు అన్నమయ్య. వంకరగా ఉన్న కుక్క తోకను ఎంతో ప్రయత్నం చేసి గుంజకు కట్టి సరి చేయాలని చూసినా ఆ వంకర పోదు. అలాగే ఈ మనసు శరీరం వల్ల కలిగే అనేక వికారాల వల్ల స్వాధీనమైనట్లే ఉండి పట్టు విడవగానే మళ్లీ పక్క దారులు తొక్కుతుంది. ఎందుకు అలా? అదే మాయ. ఆ మాయకు ఆ దేహం వశపడుతుంది. తద్వారా మనసు ఆధీనము తప్పి వివిధ నీచ ప్రవృత్తులలో కొట్టుమిట్టాడుతుంది. అలాగే, కఠినమైన లోహముతో చేయబడ్డ గొడ్డలిని ఎన్ని మార్లు ఎంత కాలం నీటిలో ఉంచినా అది మెత్తబడదు. పాషాణమైన దాని గుణాన్ని మనసుతో పోల్చారు అన్నమయ్య. తేలు లక్షణం కుట్టటం. దాన్ని తీసుకు వచ్చి ప్రేమగా అందమైన చీరలో చుడితే అది కుట్టకుండా ఉంటుందా? మనసు కూడా అంతే. ఎన్ని అనుకూల పరిస్థితులు కల్పించినా తన సహజ స్వభావం నుండి మారదు. ఇక్కడ తేలును ప్రస్తావించటానికి రెండు కారణాలు 1. అది బాధ కలిగించేది 2. విషపూరితమైనది. రెండూ కూడా మనకు నిజజీవితంలో విషయలోలత్వం, దుర్జన సాంగత్యం వల్ల కలిగేవి. వీటివల్ల భగవత్కృప అనే అమూల్యమైన వరం పక్కనే ఉన్నా మనసు దానివైపు వెళ్లదు. ఈ సంకీర్తన మనకు అన్నమయ్య మనసు గురించి వాపోతున్నట్లు అనిపించినా, మార్గం పరమాత్మ సాన్నిధ్యమే అని కూడా సందేశం ఇచ్చారు.

సరే. చిత్త చాంచల్యం లేని వారెవరు? అర్జునుడంతటి యోధునికే తప్పలేదు. ఆ వీరుడు పరమాత్మను ఇలా ప్రశ్నించాడు:

యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం
తస్యాహి నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం

ఓ మధుసూదనా! నీవు చెప్పిన యోగము ద్వారా స్థిరత్వము, సమభావమనే స్థితిని నా చంచలత్వం వలన తెలుసుకోలేకున్నాను. ఈ మనసు చాలా చంచలమైనది. బాగా విషయ లోలత్వం చెందేది. మనసు యొక్క ఈ పోకడ చాలా దృఢమైనది, బలీయమైనది. దానిని ఆపటం గాలిని ఆపటంవలె అత్యంత కఠినమైనది.

అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు:

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే

నిజమే మహాబాహువువైన కుంతీపుత్రా! నీవు చెప్పిన దానిలో ఏ మాత్రం సంశయం లేదు. మనస్సు చంచలమైనదే, దానిని నిగ్రహించటం చాలా కష్టం. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యముతో మనస్సును స్వాధీనపరచుకోవచ్చు.

మరి ఏమిటా అభ్యాసం, వైరాగ్యం?

అభ్యాసమనగా నిరంతర సాధన. జ్ఞాన కర్మ భక్తి యోగములలో దేనిలోనైనా, కలిపైనా అభ్యాసము చేయటం. ఇది నిరంతరం అచంచలమైన విశ్వాసంతో జరగాలి. మొదట్లో యాంత్రికమనిపించినా కొన్నళ్ల తరువాత మనసు ఆ పరమాత్మ తత్త్వాన్ని కొద్ది కొద్దిగా గ్రహించి ఆ మార్గంపై విశ్వాసం కలుగుతుంది. ఇది ఒంటరి ప్రయాణం కాకూడదు. తప్పకుండా సద్గురువుల సాంగత్యంలోనే జరగాలి. అహంకారం మనిషి సహజ లక్షణం. దాని నియంత్రణకు స్వశిక్షణ సరైన మార్గం కాదు. గురువు మార్గదర్శకంలో అలవడే శిక్షణ వల్ల అహంకారము తొలగుతుంది. అందుకే మనకు సనాతన ధర్మం గురుతత్త్వాన్ని అనేక విధాల బోధించి ఆ గురు సుశ్రూషలో అభ్యసించమని శ్రుతి స్మృతి పురాణాలలో ఉట్టకించింది.

వైరాగ్యమనగా?

ఏ విషయమైనా కూడా రాగద్వేషరహితుడై ఉండటం. అనగా, మమకారము, ద్వేషము లేకుండా ఉండటం. ఇది ఎలా సాధ్యం? జీవితంలో అనేక మార్లు మనకు తాత్కాలిక వైరాగ్యం కలుగుతుంది. అందులో ముఖ్యమైనవి ప్రసూతి మరియు స్మశాన వైరాగ్యం. జనన మరణాల సమయంలో మనుషులకు తప్పకుండా వైరాగ్యం కలుగుతుంది. ఒకటేమో ప్రసవ సమయంలో ఆ తల్లి పడే ఆవేదన చూసి, మరొకటేమో మనకు ప్రియమైన మరో జీవి దేహాన్ని వీడి వెళ్లటం జీర్ణించుకోలేని విరాగం. రెండూ తాత్కాలికమే. ఇక్కడ పరమాత్మ చెప్పింది నిరంతర వైరాగ్యం. దీనికి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవటం చాలా ముఖ్యం. శాశ్వతమైన ఆత్మ, పరమాత్మల జ్ఞానం, అశాశ్వతమైన దేహము, ప్రపంచము యొక్క అవగాహన కలగాలంటే జీవన ధర్మాలను పాటిస్తూ, గురు సుశ్రూష చేస్తూ అనుభూతులను గమనించి తద్వారా కలిగిన జ్ఞానాన్ని ఆచరించటం చాలా ముఖ్యం. అభ్యాస వైరాగ్యాలు రెండిటికీ క్రమశిక్షణ చాలా అవసరం. ఇవి శమదమాది షడ్గుణాల ద్వారా సఫలమవుతాయి.

అన్నమాచార్యుల వారు పంచమహాపాతకాల గురించి ప్రస్తావించటం ఈ సంకీర్తనలో ఓ ముఖ్యమైన అంశం. అరిషడ్వర్గాల ప్రకోపం వల్ల మనిషి మనసు సంతులన కోల్పోయి చేసేవీ పాతకాలు. ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే వానికి వీటితో పనిలేదు. ఇవే కాకుండా మనకు తెలిసీ తెలియక అనేక జీవులకు మనం హాని కలిగిస్తూనే ఉంటాము. వీటికి ప్రాయశ్చిత్తంగా మనకు ధర్మం అనేక కర్మలను ప్రస్తావించింది. జీవకారుణ్యం, నిష్ఠగా కర్మానుష్ఠానం, గురు ముఖత జ్ఞానసముపార్జన, నవ విధ భక్తి మార్గాలు మనలను అరిషడ్వర్గాలను నియంత్రించి షడ్గుణ సంపదను పెంపొందించుకునేలా చేస్తాయి. అటువంటి మనోస్థితిని కలిగించమని, తద్వారా పరమాత్మ కృపకు పాత్రులమయ్యేలా చేయమని ఈ కృతి ద్వారా అన్నమయ్య తెలియజేశారు.

శ్రీగురుభ్యోనమః.

పరాకేల నన్ను పరిపాలింప - శ్యామశాస్త్రి


పరాకేల నన్ను పరిపాలింప
మురారి సోదరి! అంబా!

నిరాదరణ సేయరాదమ్మా శివే!
పరాశక్తి! నా మొరనాలకింప

ధరాద్యఖిలమునకు రాణి! హరి
హరాదులు పొగడు పరాత్పరి!
దురంధర మహిషాసుర దమని!
స్మరాధీనుడౌ శ్యామకృష్ణనుత!

విష్ణు సోదరివైన ఓ అంబా! నన్ను రక్షించుటకు పరాకెందుకు? ఓ శివానీ! నీవు పరాశక్తివి! నన్ను నిరాదరణ చేయకుము, నన్ను రక్షించుటకు పరాకెందుకు? భూమ్యాది సమస్త భువనములకు రాణివి నీవు! హరి హరాదులు పొగడు భగవతివి నీవు! మహాపరాక్రమవంతుడైన మహిషాసురుని సంహరించిన అమ్మవు నీవు, నల్లని వర్ణము గల కృష్ణునిచే నిరంతరము స్మరించబడే అమ్మా! నన్ను రక్షించుటకు పరాకెందుకు?

సనాతన ధర్మం


ఒకరి చేత చెప్పబడనిది, అనుభవైకవేద్యమైనది, కాలాతీతమైనది సనాతనధర్మం.  క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం - ఇవన్నీ కొన్ని వందల ఏళ్ల నాడు ఆయా మత ప్రవక్తలైన వారిచే నిర్వచించబడినవి. ఎవరో కొద్దిమంది గురువులు ప్రచారం చేసినది కాదు సనాతన ధర్మం. గంగాప్రవాహంలా కాలాతీతమై ముందుకు సాగుతూనే ఉంది. స్వయంగా భగవద్రక్షితమై, భగవద్ప్రేరితమై అపౌరుషేయమై ఉద్భవించినవి వేదాలు. మహా ఋషుల అపరోక్షానుభూతులు ఉపనిషత్తులుగా వచ్చాయి. అమిత తపోసంపన్నుడు, శ్రీమహావిష్ణువు అవతారము అయిన వేదవ్యాసునిచే లోకకల్యాణార్థమై రచించబడినవి 18 పురాణాలు. ఇవీ మన ధర్మానికి మూలాలు. ప్రతి యుగంలోనూ వీటి సారములు మనకు గాథలుగా, అనేకానేక దివ్యరచనలుగా అందించబడుతున్నాయి.

నాస్తికవాదులు, పరధర్మ ప్రచారకులు, కుహనావాదులు చేసే ఒక దుష్ప్రచారం మన ధర్మంలో స్వేచ్ఛ లేదు, శాస్త్రీయత లేదు అని. అంతకన్నా పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. మన ధర్మం ఇచ్చినంత స్వేచ్ఛ ఇంకే ధర్మమూ ఇవ్వలేదు. మన ధర్మానికున్నంత శాస్త్రీయత మరే ధర్మానికీ లేదు. విశ్వాసము మరియు ఆరాధనలలో సంపూర్ణ స్వేచ్ఛనిచ్చినది సనాతన ధర్మం. అందుకే మనకు ఎన్నలేనన్ని మార్గాలు, భగవద్రూపాలు. ప్రకృతి, ఆత్మ, దేవ, పరమాత్మ, అర్చనా తత్త్వాలను ప్రశ్నించి సమాధానం తెలుసుకునే స్వేచ్ఛ ఈ ధర్మం ఇచ్చింది. ఫలానా ఒక్క పద్ధతే సరైనది, ఫలానవి చేస్తేనే ఆరాధన సఫలమవుతుంది అన్నది సనాతన ధర్మం చెప్పలేదు. కోట్లాది మార్గాలు, కోట్లాది పద్ధతులు ఈ ధర్మంలో అంతర్భాగం. ఇతర ధర్మాల వారు చేసినట్లు సనాతన ధర్మం నాస్తికవాదాన్ని తప్పుగా పేర్కొనదు. సనాతన ధర్మంలో మానవీయ విలువలకున్న స్థానం మరే ధర్మంలోనూ లేవు. మరొక ధర్మం వారిని నిందించటం, వారిని బలవంతంగా ఈ ధర్మంలోకి మార్పిడి చేయడం అన్నవి లేవు. అసలు ఆ సిద్ధాంతమే సనాతన ధర్మంలో లేదు. అత్యంత ఉదారమైనది, విశాలమైనది సనాతన ధర్మం.

మన ధర్మంలో ఉన్న మొట్ట మొదటి గొప్పతనం - మానవుని నిత్య జీవితంలో ఎదురుకునే ప్రతి సమస్యకు, ప్రతి అలజడికి శాశ్వత, సర్వామోదయోగ్యమైన పరిష్కారం కలిగి ఉండటం. వేదాలు, ఉపనిషత్తుల సారమే మానవుని ఆత్మోద్ధరణ ద్వారా ఆనందాన్ని పొందటం. కాబట్టి, వ్యక్తిత్వ వికాసమనేది ఈ ధర్మంలో సహజ పరిణామం. నీతి, ధర్మం, న్యాయం మొదలైన వాని ద్వారా ఈ వ్యక్తిత్వ వికాసాన్ని మన ధర్మం మనకు ఉచితంగా అందిస్తుంది.

ఇక రెండవ గొప్పతనం - శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే జీవనశైలి, సూత్రాలు అద్భుతమైన యోగము ద్వారా, వైద్యశాస్త్రము ద్వారా మనకు అందించింది సనాతన ధర్మం. ప్రపంచంలో ఏ ధర్మంలోనూ లేనంత శాస్త్ర సాంకేతికత మన ధర్మంలో ఉన్నాయి కాబట్టే అనాదిగా వీనిని ఆచరించిన వారు దేహానికున్న పరిమితులను అధిగమించి దివ్యత్వాన్ని పొందగలిగారు.

మూడవ గొప్పతనం - స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, ధనికులు, పేదలు అని లేకుండా ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అనేది వారి వారి ఉపాధులలో, నిత్యజీవితంలో తెలియకుండానే అబ్బేలా చేసింది మన ధర్మం. బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు, కట్టుబాట్లు మొదలైనవి మనిషిని ఆధ్యాత్మిక సంపన్నునిగా చేసింది ఈ ధర్మం. అందుకే నాస్తికులమని చెప్పుకునే వారు కూడా ఏదో ఒకరకంగా ఆధ్యాత్మికవాదులే.

సనాతన ధర్మమంటే కేవలం సన్న్యాసమూ కాదు, మాయావాదమూ కాదు, అనేక తత్త్వాల సమ్మేళనమూ కాదు. ఇది అగణితమైన ఆధ్యాత్మికానుభూతుల కలయిక. జీవితం గురించిన పరిపూర్ణము మరియు అఖండమైన దృష్టికోణము కలది. అత్యంత సహిష్ణుత, మానవీయత, ఆధ్యాత్మికత కలది సనాతన ధర్మం. అతివాదానికి దూరమైనది, అందుకే ఎన్నో దాడులు జరిగినా ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. సనాతన ధర్మంలో ఉన్న కిటుకు మూలసూత్రాలలోనే. ఇవి పూర్తిగా అనుభవాల మీద, సత్యాల మీద ఆధారపడినవి. అందుకే కాలప్రవాహంలో చెక్కు చెదరకుండా నిలిచింది ఈ ధర్మం.

ధర్మో రక్షతి రక్షితః.

23, జులై 2020, గురువారం

నారాయణ తే నమో నమో - అన్నమాచార్యుల వారు


నారాయణ తే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర నగధర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవ బంధ విమోచన
నర మృగ శరీర నమో నమో

జలధి శయన రవి చంద్ర విలోచన
జలరుహ భవ నుత చరణ యుగ
బలి బంధన గోప వధూ వల్లభ
నళినో ధరతే నమో నమో

ఆది దేవ సకలాగమ పూజిత
యాదవ కుల మోహన రూప
వేదోద్ధర తిరు వేంకట నాయక
నాద ప్రియ తే నమో నమో

నారదునిచే నుతించబడిన ఓ నారాయణా! నీకు నమస్సులు. మురాసురుని సంహరించిన వాడవు, మందర పర్వతమును ధరించిన వాడవు, గరుత్మంతుని వాహనముగా సంచరించేవాడవు, నాభియందు కమలము కలవాడవు, పరమపురుషుడవు, సంసార బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు, నరసింహ రూపుడవైన నీకు నమస్సులు. క్షీరసాగర శయనుడవు, సూర్యచంద్రులను నేత్రములుగా కలవాడవు, కమలము నుండి జన్మించిన బ్రహ్మచేత నుతించబడిన పాదయుగము గలవాడవు, బలిని మర్దించిన వాడవు, గోపికలకు ప్రభువువు, కమలమును ధరించు వాడవైన నీకు నమస్సులు. పరమాత్మవు, సమస్త శ్రుతి స్మృతి పురాణములచే పూజించబడిన వాడవు, యాదవ కులములో జన్మించిన మోహనాకారుడవు, వేదములను కాపాడిన వాడవు, నాదప్రియుడవైన శ్రీవేంకటేశ్వరా! నీకు నమస్సులు.

(చిత్రం నేపాల్ ఖాట్మండు సమీపంలోని జలనారాయణుడు)

గురు పరంపర ఎందుకు ముఖ్యం?


హిందుత్వం పేరుతో నేడు జరుగుతున్న కొన్ని అరాచకాలకు, అమలులో ఉన్న విపరీత సాంప్రదాయాలకు, వామాచారాలకు కారణం వాటిని ప్రచారం చేసే గురువులకు సరైన గురు పరంపర లేకపోవటం. ఉన్నట్టుండి ఒక వ్యక్తి బాబాగా మారి, తనను తానే గురువుగా ప్రకటించుకొని ఓ సంస్థ ఏర్పాటు చేసేసుకుంటున్న ఉదంతాలు గత 10-15 ఏళ్లలో చాలా ఎక్కువయ్యాయి. బలహీనతల వల్లో, లేక వారి అవసరాలను బట్టో ప్రజలు వీరి బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వారి వల్ల హైందవానికి తీవ్ర అప్రతిష్ఠ కలిగి, ఈ ధర్మం గురించి ఘోరమైన దుష్ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యను అరికట్టడానికి మనం గురు పరంపరను పరిశీలించటం చాలా ముఖ్యం. ఒకరు తనను తాను గురువుగా చెప్పుకుంటూ మనకు తారసపడితే మన విచక్షణ ఉపయోగించి, వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న తరువాతే వారిని విశ్వసించాలి. ఎందుకు ఈ గురు పరంపర ముఖ్యం?

1. అర్హత
------------

గురువుగా, ఒక సంస్థ (అనగా పీఠం లేదా మఠం) అధిపతిగా స్వయం ప్రకటితం చేసుకోవటం అనేది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. ఒక గురువు శిష్యుని వెదుక్కుంటూ వచ్చి, శిష్యునికి కావలసిన లక్షణాలను మరింత నిశితంగా పరిశీలించి, ఉత్తరాధికారం ఇవ్వటమే సరైన పద్ధతి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఇలా జరగకపోయినా, బహుళ జనామోద యోగ్యమైన వారే గురువులుగా రాణించగలరు. ఇలా జరిగినప్పుడు వారిని అనుసరించే వారు ఆ గురువుల అర్హతలను మరింత దగ్గరగా గమనించి తీరాలి.

2. సిద్ధాంతాలకు మూలాలు
------------------------------------

ఒక మంచి పరంపర కలిగిన గురుతత్త్వంలో బలమైన సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాలు కాలపరీక్షను తట్టుకుని ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడతాయి. దీనివల్ల ఆ సిద్ధాంతాలకు బలం చేకూరుతుంది. ఏ సిద్ధాంతమైనా ఒక రెండు తరాలన్నా నిలిచి లక్షలాది ప్రజల జీవితాలను మంచి వైపు నడిపిస్తేనే సఫలమైనట్లు. లేకపోతే అది గాలివాటం సిద్ధాంతమనే అనుకోవచ్చు. ఒక తరంలో గురువు కొత్త సిద్ధాంతాలు లేదా మార్గాలను ప్రతిపాదిస్తే, వాటిని గురు పరంపరలో చర్చించి, ఆమోదింపజేసుకుని కార్యాచరణ చేస్తారు కాబట్టి వికృతము, ఆగమ విరుద్ధము, ధర్మ విరుద్ధము, సమాజ విరుద్ధము, చట్ట విరుద్ధమైన సిద్ధాంతాలు పుట్టుకు వచ్చే అవకాశం ఉండదు.

3. అభ్యాసం
---------------

ఒక గురువు వద్ద శిష్యుడు శిక్షణ పొందేవి అనేకాలు - 1. అనాదిగా చెప్పబడిన శ్రుతి స్మృతి శాస్త్ర పురాణాలు 2. గురువుల అనుభవాలు, జీవిత విశేషాలు 3. ఆ సంస్థ యొక్క నియమావళి 4. ఆ సంస్థకు సంబంధించిన దేవతా స్వరూపం యొక్క అర్చనా విధులు 5. ఆ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం జరిపే వ్యవస్థ వివరాలు. ఇవే కాక, మరెన్నో. ఈ అభ్యాసం వల్ల ఆ శిష్యుని వ్యక్తిత్వం కావలసిన మార్పులు చేర్పులు జరిగి వ్యక్తిత్వ వికాసం పొంది, ఉత్తరాధికారానికి సిద్ధుడవుతాడు.

4. సమాజం అమోదం
---------------------------

సమాజం (అనగా పాలకులు, ప్రజల సమూహం) మతంలోని సంస్థలను, వ్యక్తులను, వాటి అధిపతులను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అనగా, మంచి, చెడు, వారి వైశిష్ట్యం, నిబద్ధత, మహత్తు, మార్గంలో విలక్షణత మరియు ఇతర సంస్థాగత విషయాలను సమాజం పరిశీలించి, విమర్శించి, పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో నెగ్గిన సంస్థ/గురు పరంపరలే నాలుగు కాలాలపాటు ఆధ్యాత్మికగా మార్గదర్శకులు కాగలరు.

5. ఆరోగ్యకరమైన అభివృద్ధి
------------------------------------

ఒక గురు పరంపరలో వచ్చిన వ్యక్తుల ద్వారా ఏర్పడిన సంస్థలు కాలపరీక్ష తట్టుకుని, ప్రజల ఆమోదం పొంది, అనేకుల జీవితాలను ప్రభావితం చేయటానికి ఒక జీవితకాలం పడుతుంది. అప్పుడే అది ఆరోగ్యకరమైన పురోగతి అవుతుంది. రాత్రికి రాత్రి వెలసి, కొద్ది కాలంలోనే బాగా విస్తరించి, డబ్బు, ఆస్తులను కూడబెట్టింది అంటే దాని వెనుక అధార్మికమైన చర్యలు తప్పకుండా ఉండి తీరుతాయి. ఇటువంటి అభివృద్ధి సంస్థకు, సమాజానికి మంచిది కాదు. సహజ పరిణామంలో ఎదిగితేనే ఆ సంస్థ, గురుబోధలు కలకాలం నిలిచేది.

6. త్యాగాలు
---------------

ఒక పరంపరలో ఉన్నారంటే ఆ గురువులు అనేక త్యాగాలు చేసి, నిజమైన సన్న్యాసాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. అప్పుడే ఆ పరంపరలో నిలదొక్కుగొనగలరు. సాంసారిక బంధనాలు, బంధుప్రీతి, రాగద్వేషాలు, కామక్రోధాది అరిషడ్వర్గాలు జయించటానికి గురు పరంపర, దాని నియమావళి ఎంతో దోహదపడతాయి. శమదమాది గుణములు, వైరాగ్యం, ఆత్మావలోకనం, ధర్మాధర్మ విచక్షణ ఈ త్యాగాల వల్ల కలుగుతాయి.

ఇవే కాక వేరెన్నో పరంపరలో అబ్బుతాయి. అందుకే మనం గురువులను ఎన్నుకునేటప్పుడు ప్రప్రథమ పరిశీలనాంశంగా పరంపరను తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతలో నాయకత్వం అనగా గురుస్థానం కూడా దేశం లేదా మన వృత్తిలోని నాయకత్వం లాగానే కఠోరమైన పరిశ్రమ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మనం నేటి వికృతాలను పోరాడటానికి ఈ దిశగా మరింత దృష్టి పెట్టాలి. గ్రుడ్డిగా నమ్మి మోసపోతున్న కొద్దీ ఈ దొంగ బాబాలు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉంటారు.

శ్రీగురుభ్యోనమః.

రోజులు మారాయి – 1955: చిత్ర విశేషాలు

1955లో విడుదలైన రోజులు మారాయి సారథి ఫిలిమ్స్ నిర్మించిన సామాజిక చిత్రం. 1939లో రైతుబిడ్డ ద్వారా రైతుల సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన సారథి సంస...