10, సెప్టెంబర్ 2017, ఆదివారం

గడప దాక వచ్చి మరలి పోయావు - డాక్టర్ శోభారాజు గారి మధురభక్తి గీతం


గడప దాక వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

గుడిసెనంతా అలికి ముగ్గులేశాను
తోరణాలను కట్టి తలుపు తెరిచుంచాను
దీపాలు వెలిగించి ధూపమేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

భక్ష్యభోజ్యాదులను ప్రేమార చేశాను
కొసరి నీవు తినగా విస్తరేశాను
విశ్శ్రాంతి గొందువని పానుపేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ!

ఏర్పాట్లలో మునిగి ఏమరను ఇకను
కటిక చీకటిగుంది చిరుదివ్వె చేబట్టి
కాలాన్ని మరచి నే ఎదురు చూస్తున్నాను
వస్తావుగా స్వామి మరియొక్క మారు

కాళ్లు వణకేను కళ్ళు చెదరేను
వంటి చేవంతా కంటి నీరాయెను
పెనుగాలికీ దివ్వె పెనుగులాడేను
వస్తావుగా స్వామి మరి యొక్క మారు

- డాక్టర్ శోభారాజు గారు

పదకవితా పితామహుని సంకీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటంలో అగ్రగణ్యులైన డాక్టర్ శోభారాజు గారి అద్భుతమైన మధురభక్తి గీతం ఇది. కృష్ణభక్తి వారికి చిన్ననాడే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలుగా జీవితంలో అంతర్భాగమై పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళను పరమాత్మ సేవకు అంకితం చేసి  పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి అమూల్యమైన సంకీర్తనా సంపదలోని భావాన్ని ప్రత్యేకమైన మార్గంలో ప్రచారం చేస్తున్నారు పద్మశ్రీ దాక్టర్ శోభారాజు గారు. ఈ మహాయజ్ఞంతో పాటు వారు ఎన్నో సంకీర్తనలను రచించారు. అందులో ఒకటి ఈ గడప దాకా వచ్చి అనే రచన. రాధ, మీరాల మధురభక్తి ఈ గీతంలో స్పష్టంగా కనబడుతుంది. స్వామి వస్తున్నాడన్న ఆనందంలో ఇల్లు అలికి, ముగ్గేసి, తోరణాలు కట్టి, ధూప దీపాలు వెలిగించి, చక్కని భోజనము ఏర్పాటు చేసి, సేదదీరేందుకు పానుపు వేసేలోపు  భక్తురాలు అంతలో స్వామి వెళ్లిపోయాడన్న విచారంలోని మనోభావన ఈ గీతం. ఈ ఏర్పాట్లలో మునిగి స్వామి రాకను ఏమరచేనేమో అని కారు చీకటిలో దివ్వెను చేతబట్టి ఎదురు చూస్తున్న కృష్ణ భక్తురాలి హృదయ సవ్వడులను మనోజ్ఞంగా తెలిపే గీతం ఇది. ఎదురు చూపులో శరీరం బలహీనమై, శక్తి అంతా కన్నీరు ధార కాగా, గాలీ దీపం ఊగిసలాడుతుండగా స్వామిని మరల రమ్మని వేడుకునే గీతం అమ్మ శోభారాజు గారు అద్భుతంగా రచించారు.

భక్తికి శరణాగతి అతి ముఖ్యం. ఈ శరణాగతిని నేను శోభారాజు అమ్మలో పరిపూర్ణంగా గమనించాను. కృష్ణభక్తిలో ఉన్న వారిలో ఈ శరణాగతితో పాటు, ప్రశాంతత, స్థితప్రజ్ఞత, దృఢమైన వ్యక్తిత్వం, పరమాత్మతో ఓ విలక్షణమైన అనుబంధం కలిగి ఉంటారు. శోభారాజు గారు చేస్తున్న సేవ అమూల్యమైనది. ఆధ్యాత్మిక సంపదతో పాటు వ్యక్తిత్వ వికాసంతో కూడిన సామాజిక స్పృహ కలిగిన శోభారాజు గారు మన సమాజాన్ని, నేటి హిందుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యల గురించి సుస్ఫటమైన భావనలు కలిగిన వారు. డొల్లతనాన్ని, ద్వంద్వ ప్రమాణాలను, కుహనా వాదాలను, దురాచారాలను ఖండిస్తూ ఈ సమాజంలో  పోరాటం సాగిస్తున్న యోధురాలు అమ్మ. ఒక్క గీతంలో ఇన్ని భావనలను వ్యక్తపరచటం అనేది ఆ స్వామి అనుగ్రహమే. ఆధ్యాత్మిక సాధనలో, భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే అద్భుతమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్న శోభారాజు గారు ఇటువంటి గీతాలను ఎన్నో రచించారు. వారి భావ సంపద ఈ సమాజంలో మరింత ప్రచారంలోకి రావాలని నా ప్రార్థన.

శోభారాజు గారు ఈ గీతం ఆలపించిన రీతి అత్యంత మధురం. చరణాలు ముందుకు సాగిన కొద్దీ భావనలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చి వేర్వేరు రసాలను పండించారు. స్వామీ అని పిలిచే రీతి మనసును కరగించి వేస్తుంది. బద్ధుడై స్వామి రావలసిందే అని మనసు నిశ్చయమయ్యేలా గానం చేశారు. చివరి చరణంలో శృతిని మార్చి ఆర్తితో వారు పాడిన పద్ధతి మధురభక్తికి నిదర్శనం. గీతాన్ని లలితంగా, భావనలకు అనుగుణంగా స్వరపచటంలో శోభారాజు గారి సాధన ప్రతిబింబిస్తుంది. ఈ గీత భావం అనుభవైకవేద్యం.  అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ఈ గీతానికి రమణీయమైన, సముచితమైన చిత్రాలను పొందుపరచి వీడియో రూపొందించిన పార్థసారథి గారికి నా అభిననందలు, కృతజ్ఞతలు.

1 కామెంట్‌: