సాలూరి రాజేశ్వరరావు గారు ఎంతటి మహా సంగీత దర్శకులో, ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతటి మధుర గాయకులో తెలుసుకోవటానికి కొన్ని పాటలు వింటే చాలు. సాహిత్యకారుల ప్రతిభ ఒక ఎత్తైతే దానికి తగ్గ సంగీతం అందించటం సంగీతకారుల ప్రతిభ. మేరు పర్వతమంత ఎత్తైనది సాలూరి వారి సంగీత విద్వత్తు. లలితమైన పాటలకు అత్యంత మధురమైన సంగీతాన్ని అందించటంలో ఆయన మేటి. అటువంటి పాటను ప్రతిభామూర్తి ఆరుద్ర గారు రచించగా రసాలూరించే సాలూరి వారు స్వరపరచగా మధుర గాయకులు ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతో మధురంగా పాడారు. ఇది 1964లో విడుదలైన దేశద్రోహులు చిత్రంలోని జగమే మారినది మధురముగా ఈ వేళ అన్న పాట. ఇది చిత్రంలో రెండు సందర్భాలలో వస్తుంది. మొదటిది సుశీలమ్మ, ఘంటసాల మాష్టారు యుగళ గీతంగా పాడగా, రెండవది భగ్న ప్రేమికునిగా నాయకుడు అన్న ఎన్‌టీఆర్‌పై కాస్తంత బరువైన సన్నివేశంలో చిత్రీకరించబడి ఘంటసాల మాష్టారు అత్యద్భుతంగా పాడిన గీతం. యుగళ గీతం ఉత్సాహంగా సాగేదైతే సోలో గీతం కాస్త గంభీరంగా సాగుతుంది. సంగీతకారులు మరియు గాయకుల ప్రతిభ విలక్షణంగా తెలుస్తుంది. కళ్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ గీతం అజరామరమై నిలిచింది. పాట మొత్తం అద్భుతమైన స్వరాలతో సితార్, తబలా వాద్య నాదాలతో రాజేశ్వరరావు గారు స్వరపరచారు.
ఆరుద్ర గారి గీతంలోని భావాన్ని పరిశీలిస్తే, లలితమైన పదాలతో ఎంతటి మధురమైన భావనలను పండించారో అర్థమవుతుంది. మనసు నెమలిలా ఆడిందట, పావురాలు పాడాయట, జగమంతా ఎంతో మధురముగా మారిందట. గొరవంక, రామచిలుక చెంత చేరగా అవి అందమైన జంటగా కనబడ్డాయట. ప్రేమ, స్నేహము కలిసి జీవితము పండగా ఓ చిత్రమైన పులకింత కలిగిందట. విరజాజి పూవుల సువాసన స్వాగతము పలుకగా, తుమ్మెద ఆ జాజులలోని మధువు యొక్క తీయదనాన్ని కోరి ప్రేమలో తేలుతూ తిరిగాడిందట. ప్రేమలో పడిన వారికి కలలు, కోరికలు తీరినప్పుడుండే భావనలను ఈ గీతం తెలుపుతుంది. గీతమంతా ఒకే సాహిత్యాన్ని ఉపయోగించి ఒక్క ఆఖరి పంక్తిలో సందర్భోచితంగా సాహిత్యాన్ని మార్చి పాట భావం ఏ మాత్రం చెదరకుండా రచించిన ఆరుద్ర గారి ప్రతిభ అమోఘం.
మాధుర్యానికి మారు పేరు సుశీలమ్మ, అంతే గొప్పగా ఘంటసాల మాష్టారు స్వరయుక్తంగా పాడారు. ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు దశాబ్దాల పాటు పాడారు. వారిరువురూ తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని మధురమైన గీతాలతో అలరించారు. ఒకరకంగా సాలూరి వారు, ఘంటసాల, సుశీలమ్మల బృందం ఆనాడూ ఈనాడూ కూడా టాప్ క్లాస్ అని చెప్పుకోవాలి. సంగీతానికి, మాధుర్యానికి, భావసంపదకు ఆనాడు ఎంత ప్రాధాన్యముండేదో, వాటికి తగినట్లు గాయకులు కూడా తమలోని ప్రతిభ పాటను మరింత ప్రేక్షకుల మనసులను దోచుకునేలా పాడే వారు. అందరూ పరిపూర్ణమైన న్యాయం చేసేవారు. అందుకే ఇటువంటి పాటలు దశాబ్దాల పాటు నిలిచి మనుషుల హృదయాలను రంజిల్లజేస్తూనే ఉంటాయి.
యుగళ గీతం
సోలో
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
మనసాడెనే మయూరమై పావురములు పాడే! ఎల పావురములు పాడే!
ఇదే చేరెను గోరువంక రామచిలుక చెంత! అవి అందాల జంట!
నెనరు కూరిమి ఈనాడే పండెను! జీవితమంతా చిత్రమైన పులకింత!!
విరజాజుల సువాసన స్వాగతములు పలుక! సుస్వాగతములు పలుక!
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరి! అనురాగాల తేలి!
ఎదలో ఇంతటి సంతోషమెందుకో! ఎవ్వరికోసమో! ఎందుకింత పరవశమో! (యుగళ గీతం)
కమ్మని భావమే కన్నీరై చిందెను! ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి!! (సోలో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి