22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

వావిళ్ల రామస్వామి శాస్త్రులు-వేంకటేశ్వర శాస్త్రులు - వావిళ్ల ప్రెస్



వావిళ్ల రామస్వామి శాస్త్రులు - వీరు తెలుగు వారికి అందించిన సాహితీ సంపద వెలకట్టలేనిది. ఈనాటికీ మనకు శుద్ధమైన తెలుగులో పుస్తకాలు, పురాణేతిహాసాలు, వ్రతకల్పాలు అందుబాటులో ఉన్నాయంటే అది వీరి చలవే. విఖ్యాతమైన సంస్థ వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వ్యవస్థాపకులైన వీరు సంస్కృతాంధ్ర పండితులుగా, వేదవిద్యా కోవిదులుగా పేరొందారు. 1826వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో వీరు జన్మించారు. వీరు చిన్న వయసులోనే ఉభయభాషలలో ప్రావీణ్యం పొంది తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి టీకా తాత్పర్యం వ్రాసి, వాటిని ముద్రించి శాశ్వతంగా సాహిత్యాభిమానులకు అందుబాటులో ఉండేలా చేశారు. వీరి సేవను గుర్తించిన బ్రౌన్ మహాశయుడు చేతి వ్రాత పుస్తకాలు చదువుకునే రోజుల్లో శ్రీవావిళ్ల రామస్వామి శాస్త్రుల వారు ముద్రణాలయం స్థాపించి పాఠకులకు ఎంతో సౌకర్యం కలిగించారు అని కొనియాడారు. వావిళ్ల రామస్వామి శాస్త్రులు వారు ముద్రించి ప్రకటించిన గ్రంథములు 1876 సంవత్సరంలో ప్రచురితమైన లండన్ మ్యూజియంలోని గ్రంథాలయ పట్టికలో నమోదు చేయబడినవి. శ్రీమద్రామాయణమునకు టీకా తాత్పర్య విశేషార్థములతో మొట్ట మొదట ప్రచురించింది వీరే. వీరి సంపాదకత్వంలో అనేక సంస్కృతాంధ్ర గ్రంథములు పరిష్కరించి ముద్రణా భాగ్యమును పొందాయి.

1851వ సంవత్సరంలో రామస్వామి శాస్త్రులు గారి హిందూ భాషా సంజీవని అనే ప్రెస్ ద్వారా ఈ సంస్థను స్థాపించారు. తరువాత ఆది సరస్వతీ నిలయాన్ని కూడా ఆయనే స్థాపించారు. 50కి పైగా పుస్తకాలను తన జీవిత కాలంలో ఆయన ప్రచురించారు. 1891వ సంవత్సరంలో వీరు కాలం చెందారు. వీరికి వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు 1884 జన్మించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారు 1906లో ఈ సంస్థకు నేతృత్వం వహించి వావిళ్ల ప్రెస్‌గా పేరు మార్చారు. ప్రచురణా పద్ధతికి మెరుగు దిద్ది సంస్థను అభివృద్ధి చేశారు. గోరఖ్‌పూర్ వారి గీతా ప్రెస్, వారణాసి వారి చౌఖంభా ప్రెస్‌తో అనుసంధానం చేసుకొని మనకు అమూల్యమైన వాఙ్మయాన్ని ముద్రిత రూపంలో అందజేశారు. ఉత్తమ ప్రమాణాలు గల ముద్రణంతో, సంపాదకీయ ప్రతిభతో వారు 900కు పైగా సంస్కృతాంధ్ర తమిళ ఆంగ్ల భాషలలో పుస్తకాలను ప్రచురించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారి మహా దేశభక్తులు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఎన్నో దేశభక్తిని కలిగించే పుస్తకాలను ప్రచురించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి చేత ప్రభావితులైనారు. అలాగే బంకించంద్ర ఛటర్జీ గారి ఆనందమఠాన్ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్రకేసరి ప్రకాశం గారికి ఎస్. సత్యమూర్తిగారికి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. మహాభారతం, రామాయణం, పోతన భాగవతం మొదలైన వాటిని ప్రచురించారు. వీరి సమయంలో ఈ సంస్థను ఇంగ్లాండులోని మెక్‌మిలన్ మరియు లాంగ్‌మాన్ సంస్థలతో పోల్చారు.



1916లో వీరు మా పూర్వీకులు, ఉభయ భాషా పారంగతులు అయిన అక్కిరాజు ఉమాకాంతం పంతులు గారితో కలిసి త్రిలింగ అనే పత్రికను స్థాపించారు. 1941లో ఈ పత్రిక రజతోత్సవం కూడా జరుపుకుంది. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు గారు 1927లో ఫెడరేటెడ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికను కూడా స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు నడిపించారు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారితో కలిసి బాలవినోదిని అనే తమిళ మాస పత్రికను నడిపారు. వీరి షష్టిపూర్తి సమయంలో అభిమానులు వీరికి స్మారక ముద్రణను కూడా బహుమతిగా అందజేశారు. ప్రజా జీవితంలో ఎంతో పేరు పొందిన వీరు 1938లో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సభకు అధ్యక్షునిగా పని చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. పచయప్ప ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా, హానరరీ మెజిస్ట్రేటుగా, మద్రాస్ పోర్ట్ ట్రస్ట్, కాస్మోపాలీటన్ క్లబ్, మాసోనిక్ లాడ్జ్, సుగుణ విలాస సభలతో అనుబంధం కలిగి సేవలు చేశారు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకులు వీరే. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యునిగా కూడా పని చేశారు. వీరు సెమ్మంగూడి మరియు అలగప్ప మొదలైన ప్రముఖులకు సన్నిహితులు.

శ్రీనాథుని శృంగార సాహిత్యాన్ని వీరు ప్రచురించగా పిఠాపురం రాజావారు, జయంతి రామయ్య గారు వీరిపై అవి అసభ్యంగా ఉండే సాహిత్యం అని దావా వేసినా అది నిలబడలేదు. తరువాత వీరు వాత్సాయన కామసూత్రాలను కూడా ప్రచురించారు. 1931-33 మధ్య 18 భాగాల మహాభారతాన్ని వీరు సంస్కృతంలో ముద్రించారు.  వారణాసి పండితులు వీరికి శాస్త్ర ప్రచార భూషణ అనే బిరుదునిచ్చారు. వీరు చేసిన భాషా సేవకు భాషోద్ధారక బిరుదు కూడా వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వీరిని 1955లో కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించారు. ధనవంతురాలైన భార్యతో విభేదాలతో వీరి సంసార జీవితం మాత్రం ఒడిదుడుకులు గానే నడించింది. 1942లో పక్షవాతం పాలైన వీరు 1956లో తన 67వ ఏట మరణించారు. వీరికి సంతానం లేదు. ఆయన తరువాత వీరి ఆస్తులకై ఎన్నో న్యాయ పోరాటాలు నడిచాయి. ప్రచురణ సంస్థ మూత పడింది. చెన్నైలో వీవీస్ ట్రస్ట్ నామమాత్రంగా నడుస్తోంది. దీనికి అల్లాడి స్వామినాథన్ గారు ట్రస్టీ. కొన్నేళ్ల క్రితం హైదరాబదులో ముద్రణను పరిమితిగా ఈ ట్రస్ట్ ప్రారంభించింది.

ఈ తండ్రి-కొడుకులు తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ఇటీవలే వావిళ్ల వారి సహితీ సంపదల 150వ జయంతి కూడా జరిగింది. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి