తిరువారూర్ త్యాగరాజస్వామి, కమలాంబ క్షేత్ర వివరాలు:
తిరువారూరు - కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న ఓ పురాతన పట్టణం. ఇక్కడ త్యాగరాజస్వామి (శివుడు) దేవస్థానం ప్రసిద్ధి. ఉత్తరాన సుకుమార నది, దక్షిణాన వలైయార్ నది, నగరం మధ్య నుండి ఓడంబొక్కి నది ప్రవహిస్తాయి. కావేరీ ఉపనదులైన వెన్నార్, వెట్టార్ నదులు కూడా ఇక్కడైకి దగ్గరలోనే ఉన్నాయి. తిరువారూరు చోళులకు రాజధాని. ఈ నగరంలో పురాతన దేవాలయమైన త్యాగరాజస్వామి సన్నిధిని తొలుత ఆదిత్య చోళుడు క్రీస్తు శకం 871-801 సంవత్సరాల మధ్యలో నిర్మించగా, తరువాత రాజ రాజ చోళుడు, రాజేంద్ర చోళుడు మరియు పాండ్య రాజులు పునరుద్ధరించారు. తిరువారూరు కులోత్తుంగ చోళుని (కీ.శ 1070-1120) రాజధాని కూడా. ఆ సమయంలోనే శైవం బాగా వ్యాపించింది. చోళుల తరువాత పాండ్యులు, అటు తరువాత విజయనగర రాజులు, నాయక రాజులు, మరాఠా రాజులు పరిపాలించారు. కళలకు, సంస్కృతికి తిరువారూరు ఆలవాలమైంది. శైవ నాయనార్ గురువులు, కవి ఆయన జ్ఞాన సంబంధర్ తిరువారూరు గురించి ప్రస్తావించారు.
ఇంతటి భవ్యమైన చరిత్ర గల తిరువారూరు పట్టణంలో ఉన్న త్యాగరాజస్వామి దేవస్థానంలో ఆదిపరాశక్తి కమలాంబగా వెలసింది. ఆ అమ్మ పేరుతోనే తిరువారూరు కమలాలయక్షేత్రంగా కూడ పిలువబడింది. ఈ దేవస్థానం సమీపంలో కమలాలయ తటాకం ఉండటం విశేషం. ఈ కమలాంబ ప్రత్యేకతలు ఎన్నో. అమ్మవారు సుఖాసీనురాలుగా కాకుండా యోగ ముద్రలో ఒక కాలి మీద మరొక కాలు మెలిక వేసి కూర్చొని ఉంటుంది. తన చేత కమలము, పాశాంకుశము, రుద్రాక్ష ధరించి యోగినిగా దర్శనమిస్తుంది. శ్రీవిద్యా ఉపాసనా పద్ధతిలో ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ కమలాంబ శ్రీ విద్యా ఉపాసనతో జ్ఞాన దృష్టి కలిగి ఈ అమ్మపై 9 కీర్తనలను రచించారు. వీటిని నవావరణ కృతులు అంటారు. శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలకు ఈ తొమ్మిది కృతులను దీక్షితుల వారు రచించారు. ధ్యానము, మంగళము కలుపుకొని మొత్తం 11 కమలాంబ కృతులు ఆయన జ్ఞాన ధారగా వెలువడ్డాయి. తోడి రాగంలో ధ్యాన కృతి కమలాంబికే, తరువాత ఆనందభైరవిలో కమలాంబ సంరక్షతు, కళ్యాణి రాగంలో కమలాంబాం భజరే, శంకరాభరణ రాగంలో శ్రీ కమలాంబికాయ రక్షితోహం, కాంభోజి రాగంలో కమలాంబికాయై, భైరవిలో శ్రీ కమలాంబాయాః పరం, పున్నాగవరాళి రాగమలో కమలాంబికాయాస్తవ, శహానా రాగంలో శ్రీ కమలాంబికాయాం, ఘంట రాగంలో శ్రీ కమలాంబికే, ఆహిరి రాగంలో శ్రీ కమలాంబా జయతి, శ్రీ రాగంలో శ్రీ కమలాంబికే అనే 11 కృతులను రచించారు.
ఈ కీర్తనలలో విభక్తి అవరోహణ ప్రత్యేకత. కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ నవావరణ కీర్తనలు గానానికి క్లిష్టతరమైనవిగా చెప్పబడతాయి. దీక్షితుల వారు చాలా గొప్ప శ్రీ విద్యా ఉపాసకులు. లోకానికి ఈ ఉపాసనలోని గొప్పతనాన్ని చెప్పటానికి ఆయన దేవతల, యోగినుల వివరాలతో ఈ కృతులను రచించారు. చక్రాలను, ఆయా దేవతల వలన కలిగే సిద్ధులను ఆయన వర్ణించారు. శ్రీవిద్యా ఉపాసన అందరికీ కాదు. చాలా నిష్ఠగా, అర్హులైన గురువుల అనుగ్రహంతో చేయవలసినది. ఈ ఉపాసన సరిగ్గా తెలిసిన గురువులు కూడా చాలా తక్కువ. ఈ నాటి కాలంలో ఇటువంటి ఉపాసన తాంత్రికంగా భావించబడుతుంది. కానీ, దీక్షితుల వారు సిద్ధులైన వారు. తిరువారూరులో అమ్మను ఉపాసన చేస్తూ ఈ కృతులను రచించారు.
కమలాంబ నవావరణ కృతులలో మొదటిది కమలాంబా సంరక్షతు మాం. సాహిత్యం, భావం వివరాలు:
కమలాంబా సంరక్షతు మాం హృత్కమల నగర నివాసినీ
సుమనసారాధితాబ్జ ముఖీ సుందర మనః ప్రియకర సఖీ
కమలజానంద బోధ సుఖీ కాంతాతార పంజర శుకీ
త్రిపురాది చక్రేశ్వరీ అణిమాది సిధ్ధేశ్వరీ నిత్య కామేశ్వరీ క్షితి
పుర త్రైలోక్య మోహన చక్రవర్తినీ ప్రకట యోగినీ సుర
రిపు మహిషాసుర మర్దనీ నిగమ పురాణాది సంవేదినీ
త్రిపురేశీ గురుగుహ జననీ త్రిపుర భంజన రంజనీ మధు
రిపు సహోదరీ తలోదరీ త్రిపుర సుందరీ మహేశ్వరీ
మా హృదయ కమలములలో నివసించే ఓ కమలాంబా! మమ్ములను రక్షింపుము. మంచి మనసులు కలిగిన వారిచే ఆరాధించబడుతూ కలువ వంటి ముఖము కల అమ్మా! నీవు పరమశివునికి మనసును రంజిల్ల జేసే సఖివి. కమలమునుండి జన్మించి జ్ఞానమయివై సుఖిణే తల్లివి! తారా చక్రమనే పంజరములో నివసించే చిలుకవు! త్రిపురాది చక్రములకు అధిదేవతవు, అణిమాది సిద్ధులకు ఈశ్వరివి,నిత్య కామేశ్వరివి నీవు! ముల్లోకాలను శాసించే మహారాజ్ఞివి, యోగినిగా ప్రకటితమైన అమ్మవు. మహిషాసురుని సంహరించిన ఆదిపరాశక్తివి, వేద పురాణములలో తెలుపబడిన అమ్మవు. నీవు ఆ పరమశివుని ఈశ్వరివి, కుమారుని తల్లివి. త్రిపురాసురుల సంహారాన్ని ఆనందించిన తల్లివి, శ్రీహరి సహోదరివి, త్రిపుర సుందరివి, మహేశ్వరివి. మమ్ములను రక్షింపుము.
దీక్షితుల వారి వివరాలు:
దీక్షితుల వారు సంగీతమే కాకుండా వేద వేదాంగాలు, యోగ, మంత్ర, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. భారతదేశమంతటా సంచారము చేసిన మహాజ్ఞాని. కర్ణాటక హిందూస్థానీ సంగీత శాస్త్రాలే కాకుండా పాశ్చాత్య సంగీతములో కూడా పరిశోధన చేసి నైపుణ్యము పొందిన వారు. తెలుగును ప్రోత్సహించిన సీపీ బ్రౌను గారితో కలిసి పాశ్చాత్య సంగీత బాణీలలో కూడా కృతులను స్వరపరచారు. సంస్కృతము, తెలుగు, తమిళములలో పారంగతులు. మణిప్రవాళ శైలిలో రచనలు చేసిన మహా నిష్ణాతులు. వీరి తండ్రి రామస్వామి దీక్షితులు శ్రీవిద్యా ఉపాసకులు. వీరు తిరువారూరులోని కమలాంబికను నవావరణ ఉపాసాన చేశారు. వైదీశ్వరన్ కోయిల్‌లోని బాలాంబికను ఉపాసన చేయగా ఆ తల్లి నలభై రోజుల తరువాత అనుగ్రహించి ఓ ముత్యాల హారాన్ని ప్రసాదించింది. 1776లో తిరువారూరులోని త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల సమయంలో కృత్తికా నక్షత్రమున సుబ్బలక్ష్మి అమ్మాళ్-రామస్వామి దంపతులకు కుమారుడు జన్మించెను. అతనికి ముత్తుకుమారస్వామి అని నామకరణం చేయగా ఆ బాలుడు ముత్తుస్వామి దీక్షితులుగా పేరుగాంచాడు. రామస్వామి దీక్షితులకు శ్రీవిద్యా ఉపాసనను అందించిన సద్గురువులు చిదంబరనాథ యోగే ముత్తుస్వామి దీక్షితుల వారికి కూడా దానిని ఉపదేశించారు. ఇది కాశీ నగరంలో జరిగింది. అక్కడే యోగులు దీక్షితుల వారికి శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతాలను బోధించారు. కాశీలో కొన్నేళ్ల పాటు సూర్యోదయమునకు పూర్వమే గంగా స్నానము, అనుష్ఠానము, అన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనము, శ్రీచక్రార్చన దీక్షితుల వారి దిన చర్య. అక్కడినుండే ఆయన నేపాల్ వెళ్లి పశుపతినాథుని, బదరీ వెళ్లి నారాయణుని కూడా సేవించారు. ఒకసారి చిదంబరనాథ యోగులు "ముత్తుస్వామీ! నీవు గంగానదిలో స్నానం చేయుటకు వెళ్లినపుడు కాలికి ఏ వస్తువు తగిలితే దానిని తీసుకొని రా" అని చెప్పారు. ముత్తుస్వాముల వారి కాలికి వీణ దొరుకుతుంది. ఆ వీణ తలభాగం పైకి తిరిగి ఉండి, దానిపై రామ అని రాసి ఉంటుంది. యోగులు శిష్యుని ఆశీర్వదించి "ఇది నీకు గంగమ్మ తల్లి అనుగ్రహము. నీవు గొప్ప సంగీత విద్వాంసుడవు, వైణికుడవు కాగలవు" అని దీవించారు. ఈ వీణ ఇప్పటికీ దీక్షితుల వారి వంశస్థుల వద్ద ఉంది. ఒకసారి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపములో కుమారస్వామి దీక్షితుల వారిని అనుగ్రహించగా తన కృతులకు గురుగుహ అనే ముద్రను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
దీక్షితుల వారు అనేక వందల క్షేత్రాలలోని దేవతలను ఉపాసన చేసి కృతులను రచించారు. పంచభూత లింగ క్షేత్రాలు, తిరుత్తణి, పళని, కంచి కామాక్షి, వరదరాజ స్వామి, మదురై మీనాక్షి, తిరుమల వేంకటేశ్వరుడు, గురువాయూరు కృష్ణుడు, రామేశ్వరంలోని శివునితో పాటు తిరువారూరులోని త్యాగరాజస్వామి, కమలాంబికలను నుతించారు. కమలాంబ గురించి ఆయన రచించిన నవావరణ కీర్తనలు జగత్ప్రసిద్ధములు. ఈ కీర్తనల కూర్పులో వారి ప్రతిభ పతాక స్థాయిలో కనబడుతుంది. ఈ కృతులు దేవతా మూర్తులకు కట్టిన ఆలయాలవలె ప్రకాశించాయి. ఈ కీర్తనలలో తంత్ర విద్య, శ్రీచక్ర వర్ణన, యంత్ర తంత్ర మంత్ర పూజా సాంకేతిక వైభవాలు ఉట్టిపడతాయి. 1835వ సంవత్సరములో నరక చతుర్దశి నాడు ఆయనకు అన్నపూర్ణా దేవి తేజొమయ రూపము దర్శనమయ్యింది. ఆ దర్శనములో ఆయనకు తనకు సమయమాసన్నమైనదని కూడా గ్రహించారు. ఏహి అన్నపూర్ణే అని తన ఆఖరి కృతిని ఆలపించి, శిష్యులను మీనాక్షి మేముదం దేహి అనే కృతిని పాడమన్నారు. మీనలోచని పాశమోచని అన్న పదాలు వారు ఆలపించుచుండగా శివే పాహి అని జీవన్ముక్తులైనారు దీక్షితుల వారు.
భారతీయ సనాతన ధర్మంలో దీక్షితుల వారి పరంపర వారి సోదరుల కుమారుల ద్వారా, శిష్యుల ద్వార కొనసాగుతూనే ఉంది. తిరువారూరులోనే దీక్షితుల వారి బృందావనం ఉంది. వారి ఉపాసనా బలం భారతదేశమే కాదు ప్రపంచమంతటా సంగీత సాహిత్యం ద్వారా, కళాకారుల గానం ద్వారా ప్రకాశిస్తూనే ఉంది.
రంజని-గాయత్రి సోదరీమణుల గాత్రంలో పైన వివరించబడిన నవావరణ కృతి వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి