3, సెప్టెంబర్ 2017, ఆదివారం

శ్రీ విష్ణు గీతం - భారతీతీర్థ మహాస్వామి రచన


శృంగేరి శారదా పీఠ జగద్గురువు భారతీతీర్థ మహాస్వామి వారు రచించిన అద్భుతమైన విష్ణు గీతం. వారి సాహిత్యానికి ఆ చిన్నారి హరిప్రియ చేసిన నృత్యం చూస్తే మనసు ఉప్పొంగుతుంది. శ్రీహరిని శరణాగతితో పరిపరి విధాల వేడుకునే ఈ గీతం ఆది శంకరుల స్తుతులను గుర్తు చేస్తుంది. గీతం వివరాలు:

శ్రీ విష్ణు గీతం 

గరుడగమన తవ చరణకమలమిహ  మనసి లసతు మమ నిత్యం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

జలజ నయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ 
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భుజగశయన భవ మదన జనక  మమ జనన మరణ భయహారీ
మమ తాపమపా కురు దేవ  మమ పాపమపా కురు దేవ

శఙ్ఖ చక్రధర దుష్ఠ దైత్య హర సర్వలోక శరణ
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

అగణిత గుణగణ అశరణశరణద విదళిత సుర రిపు జాల
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

 ఓ గరుడ వాహనుడవైన శ్రీహరీ! నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!  కలువలవంటి కన్నులు కలిగిన శ్రీహరీ! బ్రహ్మ,ఇంద్రుడు, జ్ఞాన గణముచే నుతించించబడిన పదపద్మములు కలవాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా!  ఆదిశేషునిపై శయనించే శ్రీహరీ! మన్మథుని తండ్రీ! నా జనన మరణ భయములను తీర్చువాడా  నా తాపమును, పాపమును హరింపుము దేవా!  శంఖ చక్రములని ధరించిన నారాయణా! దుష్టులైన రాక్షసుల హరించినవాడా! సర్వలోకములకు రక్షణ కలిగించే వాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! ఎనలేని సుగుణములు కలిగిన నారాయణా! దీనులకు దిక్కైనవాడా! దేవతల వైరులను సంహరించువాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! నీ భక్తుడనైన ఈ భారతీతీర్థుని అపారమైన కరుణతో రక్షించుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!

జగద్గురు భారతీతీర్థస్వామి వారి సంగ్రహ చరిత్ర:



1951వ సంవత్సరం ఏప్రిల్ 11న (ఖర నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్టి నాడు) గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి సమీపంలో నాగులేరు ఒడ్డున అలుగుమల్లిపాడులో తంగిరాల వేంకటేశ్వర అవధాని, అనంతలక్ష్మమ్మ దంపతులకు నోముల ఫలంగా బాలుడు జన్మించాడు. అవధాని గారు నిత్యము భవానిశంకరునికి రుద్రాభిషేకం చేసే వారు. అలాగే రామనవమి సమయంలో నవరాత్రి ఉత్సవాలు చేసేవారు. అనంతలక్ష్మమ్మ హనుమంతుని ధ్యానించేది. నలుగురు ఆడపిల్లల తరువాత మగపిల్లవాడు పుడితే సీతారాముల పేరు, ఆంజనేయుని పేరు పెట్టుకోవాలని ఆ దంపతులు సంకల్పించారు. అందువలన ఆ బాలునికి తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని నామకరణం చేశారు. మూడేళ్ల వయసు నుండే శివనామాన్ని ఆ బాలుడు స్మరించాడు. నిరంతరం స్వామి నామ స్మరణలో తనను తాను మరచే వాడు. ఐదేళ్ల వయసుకే సంస్కృతాన్ని ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద నేర్చుకోవటం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వయసుకే సంస్కృతంపై పట్టు సాధించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మొదలైన పండితుల మన్ననలు పొందారు. ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాలలో పాల్గొనటానికి సీతారామాంజనేయులును పిలిచారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక చిన్న వయసులోనే చదివిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా వేదప్రవర్ధక విద్వత్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు.

1961వ సంవత్సరంలో సీతారామాంజనేయులును ఉపాధ్యాయుడు విజయవాడలో పర్యటిస్తున్న శృంగేరి శారదా పీఠం అధిపతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి ముందు సంస్కృతంలో సంభాషించ వలసిందిగా కోరాడు. సుస్పష్టంగా సంస్కృతంలో మాట్లాడటంతో ఆ బాలుడికి ప్రత్యేక బహుమతి లభించింది. అప్పుడు స్వామి దర్శనంతో ఆ బాలుడి మనసులో ఆయనే తనకు దారి, గురువు అని నిశ్చయమైంది. 1966వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్యం చేస్తున్నారు. అక్కడికి స్వామి ఆశీస్సులకై సీతారామాంజనేయులు తల్లిదండ్రులతో వెళ్లి తనకు శాస్త్రాలను బోధించవలసిందిగా కోరాడు. క్షిప్రా నదిలో స్నానమాచరించి వస్తున్న స్వామి ఆ బాలుని వైరాగ్యము, భక్తి చూసి ఎంతో సంతోషించి శిష్యునిగా స్వీకరించారు. ఎక్కడ నరసరావుపేట? ఎక్కడ ఉజ్జయిని? ఉన్నత పాఠశాల విద్య చదువుతున్న బాలుడు మంచి చదువులు చదవాలని తండ్రి అభిలాష. మరి ఏమిటీ అనుకోని మలుపు? ఇదంతా ఆ శారదాంబ అనుగ్రహమే అన్నారు భారతీతీర్థ స్వామి వారు. చిన్ననాటి దర్శనం తరువాత అభినవ విద్యాతీర్థ స్వామి వారే తన మనసులో నిలిచి తనను ముందుకు నడిపారని, తన సమస్యలకు పరిష్కారం చూపారని, ఆ గుర్వనుగ్రహమే తనను అంత బలీయంగా ఉజ్జయినికి తీసుకు వెళ్లిందని అన్నారు.



అప్పటినుండి సీతారామాంజనేయులు స్వామితోనే ఉన్నారు. ఎనిమిదేళ్లలో కృష్ణ యజుర్వేదం, పూర్వ ఉత్తర మీమాంసలు, న్యాయశాస్త్రముతో పాటు మరెన్నో శాస్త్రాలను అధ్యయనం చేశారు. సంస్కృతంలో రచనలు కూడా చేశారు. 1974వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థస్వామి వారు సీతారామాంజనేయులుకు సన్యాస దీక్షనిచ్చి వారిని భారతీతీర్థస్వామిగా నామకరణం చేశారు. స్వామి వారు అప్పటికే మాతృభాష తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలలో కూడా ప్రావీణ్యం పొందారు. సన్యాస స్వీకారం వెంటనే గురువులతో కలసి విజయయాత్ర చేశారు. గురువులతో కలసి ఉత్తరభారత దేశంలో పర్యటించినప్పుడు సంస్కృత హిందీ భాషలలో అక్కడి పండితులు, యోగులు, స్వాములతో సంభాషించి వారి మన్ననలు పొందారు. భారతీతీర్థ స్వామి వారికి అమితమైన గురుభక్తి. నిరంతరం గురువులను అనుసరిస్తూ, గమనిస్తూ వారి సుశ్రూషలో గడిపేవారు. 15 ఏళ్ల పాటు ఆ విధంగా తన గురువులైన మహాస్వామి వద్ద అమూల్యమైన సమయం గడిపి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పొందారు.

1989లో గురువుల మహాసమాధి తరువాత భారతీతీర్థస్వామి శృంగేరి శారదా పీఠానికి 36వ మహాస్వామిగా పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. వేద విద్యను అభివృద్ధి చేయటానికి, సనాతన ధర్మ పరిరక్ష్ణకు విశేషమైన సేవలు అందిస్తూ అమిత తపోబల సంపన్నులై, పరమ నిష్ఠా గరిష్ఠులై దేశంలోనే అతి పవిత్రమైన పీఠంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. శారదా ధన్వంతరి ఆసుపత్రి స్వామి వారి సంకల్పబలంతో సాకారమైంది. ఈ ఆసుపత్రి ద్వారా శృంగేరి మరియు చుట్టు పక్కల గ్రామాలకు వైద్య సేవలందిస్తున్నారు. వేదపండితుల దయనీయ పరిస్థితి గ్రహించిన స్వామి వారు పండితులకు జీవనభృతిని కలిగించే ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదపాఠశాలలో అత్యుత్తములైన పండితులను విద్యార్థులకు బోధించేలా నియమించి వేదవిద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. లోక కళ్యాణార్థం పీఠం ఆధ్వర్యంలో శత, సహస్ర చండీ హోమాలు, అతిరుద్ర యాగాలు నిరంతరం నిర్వహించేలా స్వామి ఏర్పాటు చేశారు. పీఠాన్ని దర్శించుకునే భక్తుల కోసం శారదా కృప, యాత్రి నివాస్‌ల పేరిట వసతి గృహాలను నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా చాతుర్మాస్య దీక్షా సమయంలో బ్రహ్మసూత్ర భాష్యాల వివరణ చేస్తూ సనాతన ధర్మ ప్రచారానికి తొడ్పడుతున్నారు.

2015 జనవరి 22న తిరుపతికి చెందిన యువ బ్రహ్మజ్ఞాని కుప్పా వేంకటేశ్వర ప్రసాద్ గారిని తన శిష్యునిగా స్వీకరించి అతనిని సన్యాసాశ్రమంలోకి ప్రవేశ పెట్టారు. భారతీతీర్థస్వామి వారి అనంతరం ఈ విదుశేఖర భారతీస్వామి వారు శృంగేరి పీఠాన్ని అధిరోహిస్తారు. శృంగేరి పీఠంలో తెలుగు స్మార్త బ్రాహ్మణులు పీఠాధిపతిగా పరంపర ఈ విధంగా కొనసాగబోతోంది. శ్రీ గురుభ్యో నమః.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి