నిను వినా నామదెందు నిలువదే శ్రీహరి హరి
నిను వినా నామదెందు నిలువదే శ్రీహరి హరి
కనులకు నీ సొగసెంతో గ్రమ్మి యున్నది గనుకను
నీదు కధలు వీనులందు నిండి యున్నది
శ్రీద నీ నామము నోట జెలగి యున్నది గనుక
నేను ఎచట జూచినను నీవై యున్నది
భాను వంశ తిలక నీదు భక్తుడనుచు పేరు గనుక
కపటమౌ మాటలెల్ల కమ్మనైనది
తపము యాగ ఫలము నీవె త్యాగరాజ సన్నుత
ఓ శ్రీహరీ! నీపైన కాకుండా వేరే ఏ దానిపై నా మనసు నిలువదు. నీ రూపవైభవమంతా నా కళ్లకు కమ్మి యున్నది, నీ కథలు నా చెవుల యందు నిండి యున్నవి, నీ నామము నా నోట నిరంతరము యున్నది, నేను ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు. ఓ సూర్య వంశ తిలకమా! నీ భక్తుడనని నాకు పేరు. కపటమైన మాటలు తీయగా ఉండవచ్చు. కానీ, నావి అటువంటి మాటలు కావు. నా తపస్సు, యోగ ఫలము నీవే శ్రీరామా!
త్యాగరాజస్వామి రామునిపై గల భక్తిని ఆయనతోనే ఈ సంకీర్తనలో విన్నవిస్తున్నారు. ప్రహ్లాదుడు నిరంతరం హరి ధ్యాసతో ఎలా తరించాడో అలాగే త్యాగరాజ స్వామి రామతారక మంత్ర జపంతో పరిపూర్ణ చైతన్య స్థితిని పొందారు. దాదాపు ముప్ఫై ఎనిమిదేళ్ల వయసుకే కోటి రామ మంత్రానుష్ఠానాన్ని పూర్తిజేసి, మంత్ర సిద్ధి, తదుపరి రామసాక్షాత్కారం పొందారు. అటు తరువాతనే 24వేల సంకీర్తనలను రచించారు. జీవనోపాధికి ఉంఛవృత్తిని ఎన్నుకొని విషయలోలుడు కాకుండా అతి నిరాడంబరంగా జీవించి జీవబ్రహ్మైక్యం పొందాడు త్యాగయ్య.
ఈ సంకీర్తనలో త్యాగయ్య రామునిపై గల నిరంతర దృష్టిని తెలుపుతున్నారు. పంచేద్రియములను విషయ వాంఛలపై, ప్రాపంచిక విషయాలపై కాకుండా అణువణువున నిండిన శ్రీహరిపై నిలిపి అపర రామభక్తుడిగా పేరొందాడు త్యాగయ్య. ఆ భక్తికి కలికితురాయి ఈ కీర్తన.
త్యాగయ్య ఎంతటి భక్తితో రచించారో ఈ కీర్తనను అంతే అద్భుతంగా గానం చేశారు సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు. నవరస కన్నడ రాగంలో త్యాగరాజ హృదయావిష్కరణ హృద్యంగా, మనోజ్ఞంగా, రమ్యంగా మనకు అందించారు ఆమె.
సంగీతానికి భక్తి ఆయువు పట్టు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు భక్తితో వచ్చిన తాదాత్మ్యతకు దర్పణం. అందుకే ఈ కీర్తన ఆమె గొంతులో త్యాగయ్య భావాన్ని అక్షరాలా ప్రతిబింబింపజేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి