రామజోగి మందు గొనరే ఓ జనులారా
రామజోగి మందు మీరు ప్రేమతో భుజియించరయ్యా
కామక్రోధములనెల్ల కడకు పారద్రోలే మందు
కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు
సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు
కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు
సాటిలేని భాగవతులు స్మరణజేసి తలచు మందు
వాదుకు చెప్పిన గాని వారి పాపములు గొట్టి
ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి మందు
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచే మందు
ఓ జనులారా! రామనామమనే ఔషధాన్ని సేవించండి. ఈ మందు ప్రేమతో భుజించండి. కామక్రోధాదులను పూర్తిగా పారద్రోలే మందు ఇది. నల్లని కొండల వంటి కర్మఫలములనుండి విముక్తి కలిగించే మందు ఇది. ఈ మందుకు ప్రపంచంలో సాటి లేదు. కోట్ల ధనమిచ్చి కొందామనుకుంటే దొరకని మందు, సాటిలోని భగవద్భక్తులు స్మరణ జేసి నిత్యము తలచే మందు ఇది. వాదంకోసం చెప్పినా సరే వారి పాపాలను పోగొట్టి సంతోషముగా మోక్షమిచ్చే ముద్దైన మందు ఇది. ఆనందముతో భద్రాచలములో మోక్షాన్ని ప్రసాదించే మందు ఇది, సహృదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు ఇది. ఈ మందును పొందండి.
రామజోగి మందు అనే పేరుతో రామ నామ వైశిష్ట్యాన్ని పామరులకు కూడా అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు వాగ్గేయకారులు భక్త రామదాసు గారు. రామ నామ మహిమను తెలిసిన యోగులు దానిలో తరించటమే కాకుండా లోక కళ్యాణార్థమై దానిని ప్రజలకు అనేక విధాలుగా తెలియజేసిన పుణ్యభూమి మనది. అటువంటి మహనీయులలో మన వాగ్గేయకారులు అగ్రగణ్యులు. రామమంత్రామృత పానం చేసిన త్యాగయ్య, రామదాసు దానిని కోట్లాది జనులకు తరతరాల పాటు తమ సంకీర్తనల ద్వారా అందజేస్తున్నారు. ఈ గంగా ప్రవాహంలో తరించి ముక్తిని పొందిన మానవులు ఎందరో. అందుకే ఈ వాగ్గేయకారులు దివ్యమైన అవతారపురుషులుగా భావించబడుతున్నారు.
సంగీతంలో నామ మహిమను తెలియజేసే బృహద్కార్యాన్ని పరమాత్మ ఇటువంటి వాగ్గేయకారుల అవతారానికి కారణంగా చేశాడు. మహారామభక్తుడైన కబీరు వద్ద రామతారక మంత్రోపదేశం పొంది నిరంతరం రామభక్తిలో ఓలలాడిన రామదాసు ఆ మంత్ర రుచిని తన కీర్తనలలో ఎంతో మనోజ్ఞంగా వర్ణించారు. తారక మంత్రము కోరిన దొరికెను, ఓ రామ నీ నామమెంత రుచిరా, రామనామమే జీవనము వంటి ఎన్నో కీర్తనల ద్వారా అయన మనకు దివ్యౌషధమైన రామ మంత్ర మహాత్మ్యాన్ని తెలియజేశారు. అందులో ఈ రామజోగి మందు గొనరే ఒకటి.
అరిషడ్వర్గాలను, ఎంతో కఠినమైన కర్మఫలాలను పోగోట్టే మహత్తరమైన ఔషధం ఈ రామనామం. ఎలా? రామ అనే అక్షరాలు నారాయణాయ, నమశ్శివాయలోని కీలకాక్షరాలైన రా మరియు మ కలిస్తే ఏర్పడినది. రామనామాన్ని జపిస్తే శ్రీహరి వేయినామాలు పఠించినట్లు అని శివుడు పార్వతితో స్వయంగా విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో తెలియజేశాడు. అంత శక్తివంతమైన రామ మంత్రానికి ఓం బీజం, ధర్మబద్ధత శక్తి, శౌర్యం కీలకం.
దీనిని సాధన చేసి సిద్ధి పొందాడు రామదాసు. ఆ రాముని అనుగ్రహంతో భద్రాద్రిలో ఒక దివ్యక్షేత్రాన్ని నెలకొల్పి మానవాళికి భవతారకాన్ని ఇచ్చాడు. భవసాగరాన్ని దాటడానికి రామ నామము అద్భుతమైన నావ. ఆ మంత్రాన్ని ఔషధమని రామదాసు తెలుపటంలో ఆంతర్యం మనలోని మాలిన్యాలను తొలగించే సాధనమని చెప్పటం. అరిషడ్వర్గాలు, పాపసంచయాలు, కర్మఫలాలు తొలగించుకోవటానికి రామనామం సంజీవని.
రామ నామమృత పానం చేసి అందరమూ తరిద్దాం. రామదాసు చెప్పిన మాటలు సత్యపు మూటలు. అనుభవైకవేద్యములు.
రామజోగి మందు గొనరే బృందగానం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి