17, జూన్ 2015, బుధవారం

గజేంద్ర మోక్షము

గజేంద్ర మోక్షము



(పోతన విరచిత శ్రీమదాంధ్రమహాభాగవతము అష్టమ స్కంధము నుండి)

నీరాటవనాటములకున్
పోరాటంబెట్లు గలిగెన్ పురుషోత్తముచే
నారాటమెట్లు మానెను
ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్

పరీక్షిత్తు మహారాజు శుకుని ఇట్లు ప్రశ్నించెను. ఓ మహాత్మా! నీటిలో సంచరించే మొసలికి, వనములో తిరిగే ఏనుగుకు పోరాటమెలా, ఎందుకు జరిగింది? ఆ ఘోరారణ్యములో ఆ మదగజమునకు శ్రీహరివలన వ్యథ ఎలా తొలగెను?

అన్యాలోకనభీకరంబులు జితాశానేకపానీకముల్
వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరిభూదరదరీద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాల్వివడిన్ కాసారావగాహార్థమై

శుకుడు ఇలా అన్నాడు:

అతి భీకరముగా కనిపించు అడవి ఏనుగుల మంద ఒకటి మదించిన శరీరములతో, పెద్ద పెద్ద కొండ గుహలనుండి విహారము కొరకై బయటకు వచ్చి చల్లని గాలి, నీరు అనుభవించుటకై, నీటిలో మునిగి జలక్రీడలనాడుకొనుటకు ఒక పెద్ద మడుగులో ప్రవేశించెను.

తొండంబుల మదజలవృత
గండంబులన్ కుంభములను ఘట్టనసేయం
కొండలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు సూచి బెగడున్ జగముల్

ఆ మదపుటేనుగులెలా ఉన్నాయి? తొండములను, చిమ్ముతున్న కొవ్వుతో నిండియున్న చెక్కిళ్లను, మిక్కిలి పటిష్ఠమైన కుంభములను కదిలించుకొనుచు, ఒరిపిడి చేసుకొనుచు, కొండలు బెండులై పడునా, లోకాలు దిక్కులు చూచుచు భయముతో హడలిపోవునా అన్నట్లుగా సంచరించుచున్నవి.

ఎక్కడ జూచిన లెక్కకు
నెక్కువయై యడవినడచు నిభయూథములో
నొక్కకరినాథుడెడతెగి
చిక్కెనొక్క కరేణుకోటి సేవింపంగన్

ఎక్కడ చూచినను లెక్కించలేనన్ని ఏనుగుల మందలు అడవి అంతా నిండి ఇటు అటు నడుచుచుండగా ఒక కరిరాజు మాత్రం వానినుండి విడిపడి ఒక ఆడఏనుగుల సమూహంలో చేరి సరససల్లాపములతో వానిచే సేవింపబడుచుండెను.

ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభమార్గంబున కెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప నా
రాభటిన్ నీరములోన బెల్లెగసి నక్రగ్రాహపాఠీనముల్
నభమందాడెడు మీనకర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాంపడన్

ఆ గజేండ్రుడు తొండమునిండా నీరు నింపుకొని, ఆకాశము వైపు యెత్తి, ఇటు అటు కదిలించి నీరు చిమ్మగా ఆనీటితో పాటు తాబేళ్లు, చేపలు, పీతలు, మొసళ్లు పైకెగసి జ్యోతిష్య చక్రమునందలి మీన కర్కాటకములను పట్టుచున్నవా అన్నట్లు కనబడుచుండగా అది జూసి దేవతలు ఆశ్చర్యచకితులైనారు.

భుగ భుగాయిత భూరి బుద్బుదచ్ఛటలతో గదలుచు దివికి భంగంబు లెగయ
భువన భయంకరపూత్కారరవమున ఘోరనక్రగ్రాహకోటి బెగడ
వాలవిక్షేపదుర్వారఝంఝానిలవశమున ఘుమఘుమావర్త మడరన్
కల్లోలజాలసంఘట్టనంబుల దటీతరులు మూలములతో ధరణి గూల

సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానున్ కబళించి పట్టుస్వర్భానుపగిది
నొక్కమకరేంద్రుడిభరాజు నొడిసిపట్టె

భుగభుగ ధ్వనులతో పెద్ద పెద్ద నీటి బుడగల ప్రవాహమును కలిగించుచు, ఆకాశమునంటునట్లు అలలను రేపుచు, భువనములకు భయము కల్గించి పూత్కార శబ్దములు చేయుచు, మొసలి సమూహములు కూడా హడలిపోవుచుండ, తోక కదలికలచే ఝంఝామారుతముల సుడిగాలులుద్భవించగా, ఆ తాకిడికి ఒడ్డున ఉన్న వృక్షములు సమూలముగా పెకలిపోగా, సరస్సునుండి, కరి రూపమును చూసి, ఊపిరి బిగపట్టి, వేగముగా ఎగిరి హుంకరించి, సూర్యుని కబళించిన రాహువువలెనొక మకరేంద్రుడు వచ్చి గజేంద్రుని ఒడిసి పట్టుకొనెను.

కరి దిగుచు మకరి సరసికిన్
కరి దరికిని మకరి దిగుచున్ కరకరిబెరయన్
కరికి మకరి మకరికిన్ కరి
భరమ్న నిట్లతలకుతలభతు లదరిపడన్

ఏనుగును మొసలి నీటిలోనికి లాగును, మొసలిని ఏనుగు సరస్సూ ఒడ్డునకు లాగును. ఇట్లు కరిమకరులు పరస్పరము భయముతోను, బరువైన మనస్సుతోను అతలాకుతలమగుచు తమతమ భృత్యులు భయముతో అదిరిపోవునట్లుగా పోరాడుచుండిరి.

జీవనంబు తనకు జీవనంబై యుంట
నలవు చలమునంతకంతకెక్కి
మకరమొప్పె డస్సె మత్తేభమల్లంబు
బహుళపక్షశీతభానుపగిది

జలమే తనకు జీవనమై యుండుటచేత, మొసలికి స్థానబలముచుఏ శక్తి, సులువు, అంతకంతకు యెక్కువై, ధైర్యము కలిగెను. కరికి నిలకడ తప్పి, యలసట వచ్చి, కృష్ణపక్ష చంద్రునివలె శక్తి సన్నగిల్లెను.

పృథుశక్తిని గజమాజలగ్రహముతో బెక్కేండ్లు పోరాడి సం
శిథిలంబై తనలావు వైరి బలముంజింతించి మిథ్యా మనో
రథమింకేటికి దీనిగెల్వ సరి పోరంజాలరాదంచు స
వ్యథమై యిట్లను పూర్వపుణ్యఫలదివ్యజ్ఞానసంపత్తితోన్ 

గొప్పశక్తితో ఆ గజరాజు ఘోరమైన మొసలితో అనేక సంవత్సరములు పోరాడి బాగా శిథిలమై తన బలము, శత్రు బలము సరిపోల్చుకొని, మకరిని గెల్చేది తన మిథ్యావాంచ ఇక యేల, దీనిని గెలువలేను సరికదా యుద్ధమైనను చేయలేను అని వ్యథతో కూడిన మనసుతో, పూర్వ జన్మల పుణ్యఫలముచే కల్గిన దివ్య జ్ఞానము వలన ఇట్లు తెలిసికొనెను.

ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానెయైన వా
డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్

ఈ విశ్వము ఎవని వలన ఉద్భవించినదో, ఎవ్వనియందు లీనమై యుండునో, ఎవ్వనియందు లయించునో, పరమేశ్వరుడెవ్వడో, అన్నిటికీ మూలకారణమైన వాడెవ్వడో, ఆది మధ్య అంత్యములు లేని వాడెవ్వడో, సర్వమూ తానేయైయున్నవాడెవ్వడో, అట్టి స్వయంభువైన ఈశ్వరుని నేను శరణు వేడుచున్నాను

ఒకపరి జగములు వెలినిడి
యొకపరి లోపలికి గొనుచున్ ఉభయముదానై
సకలార్థ సాక్షియగు న
య్యకలంకుని నాత్మమూలునర్థి దలంతున్

లోకములను ఒకసారి తననుండి ఉద్భవింపజేసి, ఇంకొకమారు తనలోనికి తీసుకొనుచు, వెలుపల, లొపల తానేయై ఉంటూ, సర్వమునకు సాక్షిగా ఉంటూ, నిర్మలుడైన ఆ పరమాత్మను (నా ఆత్మకు మూలమును) నేను ఆసక్తితో ధ్యానించెదను.

లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుదిలోకంబగు పెం
జీకటి కవ్వలనెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్

ఈ లోకములు, లోకులు, లోకపాలకులందరూ కూడ అంతమైన పిమ్మట, లోకములేవీ లేని శూన్యస్థితిలోని గాఢాంధకార తమస్సుకు అవతల ఎవ్వడు ఏకైక పరంజ్యోతి రూపములో నుండునో వానిని నేను సేవింతును.

నర్తకుని భంగి బెక్కగు
మూర్తులతో నెవ్వడాడు మునులును దివిజుల్
కీర్తింపనేరరెవ్వని
వర్తన మొరులెరుగరట్టి వాని నుతింతున్

నటుని వలె అనేకమైన ఆకృతులతో ఎవ్వడు నటించుచుండునో, ఋషులు, దేవతలు ఎవ్వరిని సంపూర్ణంగా కీర్తించలేరో, ఎవ్వని చేష్టల గురించి ఎవ్వరును ఎరుగలేరో అట్టి ప్రభువును నేను స్తుతించెదను.

కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో

మకరి కాటు బాధ ఎక్కువవుచుండగా గజేంద్రుడు నిస్పృహ చెంది ఇట్లనెను. దేవునికి నా మొర వినబడలేదా? దీనులయెడల దయగలిగి యుండునని యందురు కదా? పరమయోగుల చెంతనే నుండునని యందురు కదా? భగవంతుడంతటా అన్ని దిక్కులలో యుండునని చెప్పెదరు కదా! ఉన్నడున్నాడని అందరూ చెప్పే ఆ భగవంతుడు నిజముగా ఉన్నాడో? లేడో?

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవేతప్ప నితః పరంబెరుగ మన్నింపదగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

ఓ భగవంతుడా! నాలో శక్తి ఏమాత్రమూ లేదు, ధైర్యము సడలి పోయి ఊగిసలాడుచున్నది. ప్రాణములు నిలకడ తప్పినవి. మూర్ఛ వచ్చెను. శరీరము డస్సిపోయినది, అలసట ఆవరించినది. నీవే తప్ప నాకిక వేరేదియు తెలియదు. ఈ దీనుని నీవే ఆదుకొనుట సమంజసము. ఓ ఈశ్వరా రావా! ఓ వరములిచ్చె ప్రభూ నన్ను కాపాడవా! ఓ జగద్రక్షకా నన్ను రక్షింపవా! నా భయమును బాపవా ప్రభూ!

ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వరమనోహర! యో విపుల ప్రభావ! రా
వే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే

ఓ కమలప్రియా! వరదాతా! శత్రువులపట్ల కూడా శత్రుత్వము లేని దయామయా! కుయ్యో! ఓ కవులచేత, యోగుల చేత ఆరాధించబడు స్వామీ! సుగుణోత్తమా! శరణాగతులకు కల్పవృక్షమైన వాడా! ఓ మునిమానస చోరా! ఓ అనంతమైన ప్రభావము కలవాడా! రావా! నన్ను కరుణింపవా! నా ఆర్తిని గురించి తలంపవా! శరణార్థియైన నన్ను కావవా!

అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబుదా
పల మందారవనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంకరమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై

అక్కడెక్కడో ఉన్న వైకుంఠ ధామంలో, దూరముగా నున్న సౌధమునకు ఆవలనున్న మందార వనములోనున్న అమృత సరోవర ప్రాంతమున చంద్రకాంత శిలలతోను, కలువలతోను అమర్చబడిన శయ్యపై లక్ష్మీదేవితో వినోదించుచు, ఆపదలోనున్నవారి పట్ల అనుగ్రహము చూపు శ్రీహరి, భయకంపితుడైన గజేంద్రుడు పాహి పాహి అని మొరపెట్టుచుండగా, ఆ ఆర్తనాదము విని అతి శీఘ్రముగా వెడలుటకుపక్రమించెను.

సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

గజేంద్రుని ప్రాణములను రక్షింపవలెనను ఉత్సాహము ఉరకలు వేస్తుండగా ఆ శ్రీహరి, శ్రీదేవికైన చెప్పడు, శంఖచక్రములను ధరించడు, అనుచరులనెవ్వరిని పిలువడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడుమని తెలుపడు. చెవుల వరకు జాలువారిన కేశములనైనను సవరించడు. తనవ్రేళ్లకు చుట్టుకొనిన శ్రీదేవి యొక్క పైటచెంగును కూడా విడిచి పెట్టకుండా అట్లే లేచి వడి వడిగా ఆకాశ మార్గమున నడచి పోసాగెను

తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వెన్
కను బక్షీంద్రుడు వానిపొంతను ధనుఃకౌమోదకీశంఖచ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చిరొ
య్యన వైకుంఠపురంబునం గలుగువారాబాలగోపాలమున్

శ్రీహరి వెంట లక్ష్మీదేవి, ఆమెవెంట అంతఃపుర స్త్రీ జనము, వారి వెంట గరుడుడు, ఆతని ప్రక్కనే ధనుస్సు, గద, శంఖ చక్ర పరికరములు, వాని వెంట నారదుడు, విష్వక్సేనుడు బయలుదేరగా వారి వెంట వైకుంఠములోనున్న వారందరూ ఆబాలగోపాలముగ వెంట వచ్చిరి.

చనుదెంచెన్ ఘనుడల్లవాడె హరిసజ్జం గంటిరే లక్ష్మి శం
ఖనినాదంబదె చక్రమల్లదె భుజంగ ధ్వంసియున్ వాడె క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం చక్రికిన్

అడుగో మహనీయుడగు మహావిష్ణువు వచ్చుచున్నాడు. వెనువెంటనే లక్ష్మిని చూచితిరా? అదిగో శంఖ నినాదము, సుదర్శన చక్రమదిగో! అదిగో సర్ప సంహారకుడైన గరుత్మంతుడు కూడా శీఘ్రముగా వచ్చుచున్నాడు చూడండీ ఆ దివ్యదర్శనము "ఓం నమో నారాయణాయ" యని దేవతలు ప్రణామములు జేశారు.

కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె స
త్వరితాకంపితభూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబరశుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తర నిర్వక్రమున్ పాలితాఖిలసుధాంధశ్చక్రముం జక్రమున్

కరుణాసాగరుడైన శ్రీహరి మకరిని ఖండించుటకు తన సుదర్శన చక్రమును పంపెను. ఆ చక్రము సాధుజనులను రక్షించునట్టిది. భూమండలములను కంపింపజేయగల వెగము గలది, తననుండి వెలువడే అగ్ని కణములతో ఆకాశమును చుట్టివేయగలది. అనేక బ్రహ్మాండ భాండములను కాంతిపుంజముతో నింపివేయగలది. తిరుగులేనట్టి ఆ సుదర్శన చక్రము పోయి పర్వతము లాంటి మేనుగల మకరి తలను త్రుంచి వేసెను.

తమముంబాసిన రోహిణీవిభుక్రియన్ దర్పించి సంసార దుః
ఖము వీడ్కొన్న విరక్తచిత్తునిగతిన్ గ్రాహంబుపట్టూడ్చి పా
దము లల్లార్చి కరేణుకావిభుడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీకరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుడై

రాహువు విడిచిన చంద్రుని వలె, వైరాగ్యము పొంది, సంసార దు@ఖమును తొలగించుకున్న గృహస్థుని వలె, మొసలి పట్టు నుండి విడుదల పొందిన కరిరాజు, పాదములను ఇటు అటు కదిలించి, స్వస్థుడై, సుందరుడై, ఆడ యేనుగులు స్నానము చేయించి సేవలు చేయగా విశ్రాంతుడయ్యెను.

పూరించెన్ హరి పాంచజన్యమున్ కృపాంభోరాశిసౌజన్యమున్
భూరిధ్వానచలాచలీకృతమహాభూతప్రచైతన్యమున్
సారోదారసితప్రభాచకితపర్జన్యాదిరాజన్యమున్
దూరీభూతవిపన్న దైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్

అప్పుడు శ్రీహరి పాంచజన్య శంఖమును పూరించెను. ఆ శంఖమెట్టిది? ఆయన యొక్క కరుణారస సముద్రమునుండి మంచితనమును స్రవింపజేయునట్టిది. దానియొక్క మేఘగర్జనవంటి ధ్వనిచే పంచమహాభూతములను చైతన్యవంతం చేసి కదలికలను కలిగించునట్టిది, మిక్కుటమైన తేజోపుంజముతో ఇంద్రాది దేవతలను కూడఆ ఆశ్చర్యపరచునట్టింది, ఆపన్నుల భయమును, దైన్యమును దూరము చేయునట్టిది. శత్రుసైన్యమును తొలగించునట్టిది.

నిడుదయగుకేల గజమును
మడువున వెడలంగ దిగిచి మదజలరేఖల్
దుడుచుచు మెల్లన పుణుకుచు
నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథా!

పొడవైన తొండమును పట్టుకొని, శ్రీహరి గజేంద్రుని మడుగునుండి వెలికిదీసి చెక్కిళ్లపై కారిన మదజల రేఖలను తుడిచి చేతితో నిమురుచు, దాని బాధను, దుఃఖమును బాపెను.



దీనులకుయ్యూలింపను
దీనుల రక్షింప మేలుదీవెన బొందన్
దీనావన! నీ కొప్పును
దీనపరాధీన! దేవదేవ మహేశా!

గజేంద్రుడు రక్షింపబడిన పిమ్మట తన వెంట వచ్చిన లక్ష్మితో పరిహాసమాడిన విష్నువు లక్ష్మి ఇట్లనెను: ఓ దీనపరాధీన! దేవదేవా! మహేశా! దీనులయొక్క మొరలనాలకించుటకును, వారిని రక్షించుటకును, వారి స్తుతులను పొందుటకును, నీకే తగును స్వామీ!

గజరాజ మోక్షణంబును
నిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్
గజరాజ వరదుడిచ్చును
గజతురగస్యందనములు కైవల్యంబున్

ఈ గజేంద్రమోక్షమను గాథను శ్రద్ధగా పఠించు నిష్ఠాపరులకు, కరిరాజ వరదుడైన శ్రీహరి సర్వకామ్యములనే గాక, కైవల్యపదమును కూడా అనుగ్రహించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి