30, జూన్ 2015, మంగళవారం

కొలువుడీ భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధియైన వాని

కొలువుడీ భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధియైన వాని 



కొలువుడీ భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధియైన వాని 

ఆది దేవుని అభవుని సామవేద నాద వినోదుని 
నెరవాది జితప్రియుని నిర్మల తత్వవాదుల జీవనమైన వాని

దేవదేవుడైన దివ్యుని సర్వభావాతీత స్వభావుని
శ్రీవేంకటగిరి దేవుడైన పరదేవుని భూదేవ తత్పరుని

ఏడుకొండలలో కోనేటి సమీపాన వెలసి సిరితో కూడిన వేంకటేశ్వరుని భక్తితో కొలవండి!

ఆదిదేవుడైన, పుట్టుకలేని, సామగానప్రియుని, సమర్థుడైన వాని, ద్వేషాన్ని జయించిన వాని, నిర్మలమైన మనసులు కలిగిన వారికి జీవనమైన వేంకటేశుని భక్తితో కొలువండి!

దేవతలకే దేవుడైన వాని, దివ్యమైన వాని, అన్ని భావనలకు అతీతమైన స్వభావము కలవాని (ఆలోచనకు, దృష్టికి, వర్ణనకు అందని స్వభావము కలవాడు), శ్రీవేంకటగిరికి దేవుడైన వాని, పరమేశ్వరుని, భూమికి ప్రభువైన శ్రీవేంకటేశ్వరుని భక్తితో కొలువండి!

అన్నమాచార్యులంటే శృంగార సంకీర్తనలు అని అనుకునే వారికి ఈ సంకీర్తన ఒక కనువిప్పు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక భావాన్ని తన ఎన్నో సంకీర్తనలలో సద్గురువులు పొందుపరచారు. అందులో ఈ కొలువుడీ భక్తి ఒకటి. ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యమైనది భక్తి.   శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం ఆత్మనివేదనం అనేవి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు అని ఆర్యోక్తి.  వీటిలో కలియుగంలో కీర్తనం అత్యుత్తమమైనది. ఆ కీర్తన భక్తి మార్గానికి అన్నమాచార్యుల వంటి వాగ్గేయకారులు సంకీర్తనలను సాహిత్యంగా అందించి వాటిని భగవంతునికి నివేదన చేసి వాటిని మంత్రసమానం చేశారు. నిగమాలలో పొదిగిన దివ్యమంత్రాలకు ఈ సంకీర్తనలు ఏమాత్రమూ తగ్గవు. భాష, సందర్భం, కాలం వేరైనా, వాగ్గేయకారుల కృతులు మనిషికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకాలు.

మరి ఆ భక్తిలో కావలసినది ఏమిటి? జ్ఞానం. పరమాత్మ తత్త్వాన్ని   ఎరిగి కొలిచితే అది అనుభవైకవేద్యము. సంకీర్తనల ప్రధాన లక్ష్యం ఆ తత్త్వాన్ని వర్ణించి చాటటం.

ఏడుకొండలలో నివాసం ఏర్పరచుకున్న శ్రీవేంకటేశ్వరుని మహిమలను ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఆయన తన సంకీర్తనలలో స్వామి పుష్కరిణిని కోనేటి గా సంబోధించారు. యోగులు, సిద్ధులు ఇప్పటికీ తమ దివ్య దేహాలతో అక్కడ నిత్యము స్నానమాచరించే పుణ్య తీర్థం తిరుమలలోని దేవాలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణి. అంతటి పవిత్రమైన పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యమైనది. తిరుమలలో స్వామి విగ్రహంలో సిరి ఆయన వక్షస్థలంలో కనిపిస్తుంది. కాబట్టి ఆయనకు శ్రీనిధి అని పేరు వచ్చింది.

ఆదిదేవుడు అంటే? మొట్టమొదటి వాడు. సృష్టి అంతటా తానే అయినవాడు, సృష్టిని చేసేవాడు మరి ఆది దేవుడే కదా? సనాతనుడైన ఆద్యంతములు లేవు కాబట్టి ఆయనను అభవుడు అని అన్నమాచార్యులు కొలిచారు. ఓంకారమునుండి ఉద్భవించిన నాదం సామ గానరూపంలో స్వామిని అలరిస్తుంది. అందుకనే ఆయన సామగాన ప్రియుడైనాడు. శ్రీవేంకటేశ్వరుడే కాదు, ఏ పరదేవతా రూపానికైనా సామగానం ప్రియమైనదే. అన్నమాచార్యుల వారు స్వామియొక్క సమర్థతకు సూచికగా నెరవాది అన్న పాదం వాడారు. భాషలో జనుల నోట నానే పదాలు ఉపయోగిస్తే వారికి భావం తొందరగా అంది సందేశం మరింత ప్రభావవంతంగా హత్తుకుంటుంది. అందుకే నెరవాది అన్నాడు స్వామిని. జితప్రియు అన్న పదంలో అన్నమయ్య ఎంతో నిగూఢమైన భావాన్ని నింపారు. ద్వేషాన్ని జయించిన వాడు అని దీనికి అర్థం.  ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణభగవానుడు చెప్పినట్లు  ప్రతియుగంలోనూ ఎన్నో మార్లు ద్వేషం వలన విశ్వంలో కలిగే అశాంతిని జయించటానికి పరమాత్మ ఎన్నో అవతారాలను ఎత్తాడు. దానికి సూచిక ఈ జితప్రియు అన్న పదం. నిర్మలమైన మనస్సు కలవారి జీవన తత్త్వమే ఆయన అన్నారు అన్నమయ్య. నిర్మలంగా జీవించటం అంటే కల్మషం లేకుండా అని అర్థం. దానికి ఎంతో త్యాగం, జ్ఞానం, సత్సాంగత్యం కావాలి. వీటన్నిటిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు అని చెప్పి అన్నమయ్య పరమాత్మ ఏదో ఒక లక్షణమని కాకుండ ప్రతి క్షణమూ ఆయనే అన్న సందేశాన్ని అందించారు.

దేవతలకు దేవుడు అన్నదానిలో పరమాత్మయొక్క పరమేశ్వర స్వరూపాన్ని మనకు తెలుపుతున్నారు. దివ్యమైన వాడు ఎందుకు? అగణిత గుణ గణ మహిమా వైభవాలను సృష్టి ఆదినుండి అంత్యము వరకు మనకు ప్రకటితం చేస్తూనే ఉన్నడు కాబట్టి. సర్వభావాతీత స్వభావుడు ఎల అయినాడు? ఆది అంత్యము లేని వాడు, దేని యందు లేని వాడు, అన్నీ తానే అయిన వాడిని ఏ భావజాలంతో ఒక రూపం ఇవ్వగలం. ఆయన లక్షణాలను ఏ భావమూ సంపూర్ణంగా ప్రతిబింబించలేదు. వేంకటాద్రిపై వెలసిన స్వామి పరదేవుడని అన్నాడు అన్నమాచార్యుల వారు. ఇహములో మన పాపసంచయాన్ని తీసుకొని పరము వైపు మార్గాన్ని సూచిస్తున్నాడు కాబట్టి ఆయన అన్ని దివ్యశక్తులను మించిన పరమేశ్వరుడు. భూదేవి భారాన్ని కాలానుగుణంగా అవతారాలతో తగ్గిస్తూ, మానవాళికే కాక భూమాతకు ప్రభువైనాడు ఆయన. ఆ సంకల్ప తత్పరుడు స్వామి.

మొత్తంగా, ఈ సంకీర్తనలో పరమాత్మ తత్త్వాన్ని ఒక భక్తిగుళికలో అందించారు అన్నమయ్య.

వాగ్గేయకారుల సంకీర్తనలకు సార్థకత వాటిలోని భావాని తెలుసుకొని, పాడి, సమాజాన్ని ప్రభావితం చేసే గాయకులు లభించటం. భక్తి ప్రాధాన్యమైన గాత్ర ధర్మానికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నిలువుటద్దం. ఆ మహాగాయని ఈ సంకీర్తనను భావగర్భితంగా, భక్తిరసధారగా ఆలపించారు. ఆమె గళంలో ఈ సంకీర్తన వినండి

1 కామెంట్‌:

  1. మంచి కీర్తన పరిచయం చేసి,.దాని అర్ధాన్ని, అంతరార్ధాన్ని ఎంతో చక్కగా వ్యాఖ్యానించిన ప్రసాద్ గారికి అభినందనలు. ఆ చరాచర జగత్తంతా తానయిన వాడు, అద్వితీయుడు, అనంతుడు, అభావుడు , నెరవాది, నిర్మల మనస్కులనే తన నెలవు చేసుకున్న ఆ శ్రీ నిధి వేంకటేశ్వరుని అన్నమయ్య వర్ణించిన దానికి మించి భాష్యము చెప్పారిక్కడ. ధన్యవాదాలు మంచి బ్లాగుకి.

    రిప్లయితొలగించండి