RightClickBlocker

29, జూన్ 2015, సోమవారం

శ్రీకృష్ణ జనన సమయమున దేవకీ వసుదేవుల స్తుతి - పరమాత్మ తత్వము, సృష్టిరహస్యము

శ్రీకృష్ణ జనన సమయమున దేవకీ వసుదేవుల స్తుతి - పరమాత్మ తత్వము, సృష్టిరహస్యము

(పోతన విరచిత శ్రీమదాంద్ర మహాభాగవతం దశమస్కంధము నుండి)సుతుగనె దేవకి నడురేయతి శుభగతిన్ తారలును గ్రహంబులు నుండన్
దితిసుతనిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్

అర్థరాత్రియందు దేవకీదేవి శ్రీమన్నారాయణుని పుత్రునిగా కనెను. ఆ ప్రభువు దానవుల మదమును అణచేవాడు, తనను శరణు కోరిన వారిని ఆదుకొని వారి మనసులలో ఆనందము నింపెడివాడు. ఆ సర్వవ్యాపకుడు సకలశుభలక్షణ సంపన్నుడు. ఆయన అవతరించినప్పుడు అశ్వని మొదలగు నక్షత్రములు సూర్యచంద్రాది గ్రహములు ఉచ్చ స్థానములో శుభయోగకారకములై ఉండెను.

జలధరదేహున్ ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షున్
చారు గదా శంఖ చక్ర పద్మ విలాసున్ కంఠ కౌస్తుభమణి కాంతిభాసున్
కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారున్
ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు

బాలున్ పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలున్ కృపావిశాలున్ 
చూచి తిలకించి పులకించి చోద్యమంది యుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించె

అప్పుడు ఆ శిశువు దేహము నీలమేఘ కాంతులతో ప్రకాశించుచుండెను. అతను ఆజానుబాహువై, కలువల వంటి కన్నులతో, విశాలమైన వక్షముతో, నాలుగు చేతులయందు శంఖము, చక్రము, గద, పద్మము శోభిల్లుచుండెను. కంఠమున కౌస్తుభమణి కాంతులను వెదజల్లుతుండెను. ఆ పసిబాలునికి అలంకృతమైన మొలత్రాడు, కంకణములు, భుజకీర్తులు అందముగానుండెను.  శ్రీవత్స చిహ్నము అద్భుతముగా ఉండెను. ఉత్తమజాతికి చెందిన కుండలముల వెలుగులు, నుదుటిపైకి యున్న ముంగురులు ఎందో అందముగా ఉండెను. కిరీటమునందు వైఢూర్యముల ప్రకాశములు నిండు పున్నమి చంద్రుని వలె ప్రకాశించుచున్నవి. భక్తుల పాలిటి కల్పవృక్షము, సమస్త సద్గుణములకు నిధి, కృపాసాగరుడు అయిన ఆ అద్భుత శిశువును చూసి వసుదేవుడు పులకించిపోయెను. ఆయన మనసు ఉబ్బితబ్బిబ్బై ఎంతో ఆశ్చర్యపడెను. ఆయనలో ఉత్సాహము పొంగి పొరలెను.

ఆ శిశువుని చూసిన వసుదేవుడు ఇలా స్తుతించెను:

ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతునపరా
ధీనుని మాయాదూరుని సూనునిగా గంటి నిట్టి చోద్యము గలదే

అచ్చుగ నీ మాయను మును చెచ్చెరన్ త్రిగుణాత్మకముగన్ చేసిన జగముం
జొచ్చిన క్రియన్ చొరకుందువు చొచ్చుటయును లేదు లేదు చొరకుండుటయున్

ప్రభూ! నీవు అన్నిలోకాలను దర్శింపగలవాడవు, జ్ఞానమునకు, ఆనందమునకు ఆకృతివి. శాశ్వతుడవు, సర్వ స్వతంత్రుడవు, మాయ నీకు దూరము, అటువంటి నీవు నాకు కుమారునిగా జన్మించుట వింతగా ఉన్నది. నీ యోగమాయచే ఈ జగములో సత్వరజస్తమోగుణములతో ప్రాణులను సృష్టించినావు. నీవు ఆ ప్రాణులయందు ప్రవేశించియున్నట్లుగా ప్రకాశించుచున్నావు. కానీ, యదార్థముగా వాటికి అతీతుడవు. నిజము చెప్పాలంటే నీవు వాటి యందు ప్రవేశించినట్లున్నను ఆ గుణములు నీకు అంటవు.

ఆదియునెట్లన మహదాదులన్ పోలెడిదై వేరువేరయై యన్ని విధము
లగు సూక్ష్మభూతంబులమర షోడశ వికారములతోన్ కూడి విరాట్టనంగన్
పరమాత్మునకు నీకున్ పరపైన మేను సంపాదించి యందులోన్ పడియున్ పడక
యుండు సృష్టికి మున్న యున్న కారణమున వానికి లోని భవంబు గలుగ

దట్లు బుద్ధి నెరుగననువైన లాగునన్ కలుగు నింద్రియముల కడలనుండి
వాని పట్టులేక వరుస జగంబులన్ కలసియుండియైనన్ కలియవెపుడు

అది ఎట్లనగా - ఈ ప్రపంచములో మహత్తత్వము నీ నుండే ఉత్పన్నమగుచున్నది. దానినుండి అహంకారము, అహంకారము నుండి పంచతన్మాత్రలైన శబ్దస్పర్శరూపరసగంధములు, వాటినుండి పంచమహాభూతములు కలుగుచున్నవి. అవి మహదాదులుగా చెప్పబడినవి. ఈ మహదాదులు షోడశవికారములతో (పంచ ప్రాణములు, ప్రంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, అంతఃకరణము) కూడి విరాట్స్వరూపము నీవలననే ఏర్పడుచున్నది. ఈ విరాట్స్వరూపము నీకు శరీరముగా ప్రకాశించుచున్నది. ఈ విరాట్ స్వరూపమునందు నీవు ఉండియు దీనికి అతీతముగా వెలుగుచున్నావు. నీవు ఈ మహదాదులకంటే ముందు ఉన్నందున నీకు జన్మ లేదు. ఈ విషయములను ఇట్లు తెలుసుకొనుటకు, ఊహించుకొనుటకు అనువైన విధముగా ఇంద్రియములకు అతీతుడవై యున్నావు. పదునాలుగు లోకములలో ఉండియు వాటికి అతీతుడవు నీవు.

సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై
సర్వమయుడవగు నీకును సర్వేశ్వర! లేవు లోను సందులు వెలియున్
ఆత్మవలనన్ కలిగి యమర దేహాదుల నాత్మకంటె వేరులవి యటంచున్
తలచువాడు మూఢతముడు గావున నీశ! విశ్వమెల్ల నీవ వేరు లేదు

సర్వేశ్వరా! ఈ ప్రపంచమంతయూ నీలోనే ప్రకాశించుచున్నది. అంతటా నీవే వ్యాపించియున్నావు. సర్వపరిపూర్ణుడవైన నీకు పుట్టుక, ఉనికి, మృత్యువు అన్నవి లేవు. చరాచరాత్మకమైన ప్రాణులన్నీ పరమాత్మవైన నీవలనే సృష్టించబడియున్నవి. అవి అన్నియు నీకంటే వేరు అని పలుకువాడు మూర్ఖుడు. తర్కించి చూడగా విశ్వమంతయు నీవే. నీకంటే వేరైనది ఏదియులేదు.

గుణము వికారంబున్ కోరికయును లేని నీ వలన జగములు నెరి జనించున్
ప్రబ్బు లేదగు నంచున్ పలుకుట తప్పుగా దీశుండవై బ్రహ్మమీవ యైన
నినున్ కొల్చు గుణములు నీ యానతులు సేయ భటుల శౌర్యంబులు పతికి వచ్చు

నీవు రక్త ధవళ నీల వర్ణంబుల జగము సేయన్ కాన సమయన్ చూడన్
తనరునట్లు నేడు దైత్యుల దండింపన్ పృథివి గావ నవతరించి తీశ!

అంతేగాక, నీవు త్రిగుణములు గాని, జననమరణములు మొదలైన వికారములు గాని, ఎటువంటి కోరికలుగాని లేని వాడవు. అట్టి నీవలన ఈ జగత్తు యొక్క  సృష్టిస్థితిలయములు జరుగుచున్నవి అని పలుకుట తప్పుకాదు. త్రిగుణములు పరబ్రహ్మవైన నీ ఆనతి ప్రకారమే ఈ జగములో ప్రవర్తించుచుండును. భటులయొక్క శౌర్యపరాక్రమ లక్షణములు రాజునందే ఆపాదించబడునట్లు ఈ గుణముల వైభవములన్నియు  నీకు చెందినవే అని తోచుచుండును. నీవు నీ మాయతో గూడి త్రిగుణాత్మకమైన జగత్తును సృష్టించి, పాలించి, లయింపజేసెదవు. కావున దేవా! నీవు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయుటకు అవతరించితివి.

అప్పుడు దేవకి ఇలా పలికెను:

అట్టిట్టిదనరానిదై మొదలై నిండుకొన్నదై వెలుగుచు గుణము లేని
దై యొక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియ లేక చెప్పరాని
దే రూపమని శ్రుతులెప్పుడు నొడివెడి నా రూపమగుచు నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవ యర్థంబు తుది జగంబులు నశింపగన్ పెద్ద భూత గణము

సూక్ష్మ భూతమందున్ చొరగ నా భూతంబు ప్రకృతిలోన చొరగన్ ప్రకృతి వోయి
వ్యక్తమందున్ చొరగ వ్యక్తమడంగను శేషసంజ్ఞ నీవు చెలువమగుదు

దేవా! నీ రూపము అట్టిది-ఇట్టిది అని వర్ణించుట అసాధ్యము. అది సృష్టికి మూలమైనది. అంతటను వ్యాపించి వెలుగొందునది. త్రిగుణముల స్పర్శలేనిది, సర్వకాలములయందు వృద్ధి క్షయాది వికారములు లేనిది. శబ్దస్పర్శాది పంచతన్మాత్రల ఊసు లేనిది, పుణ్యపాపప్రక్రియలు లేనిది, వాక్కునకు, మనసునకు అందనిది. వేదములు కూడా నీ రూపము వర్ణించుటకు అలవికానిదని తెలుపుచున్నవి. ఈ రూపము దివ్యమైన ఒక ఆధ్యాత్మిక తేజస్సు, చతుర్ముఖ బ్రహ్మయొక్క ద్వితీయపరార్థమునకు అంత్యమున జగములన్నీ నశించును. ప్రంచమహాభూతములైన పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అహంకారమందు ప్రవేశించును. ఆ సూక్ష్మభూతమైన అహంకారము మొలప్రకృతియందు (మహత్తత్త్వము) లయమును పొందును. ఆ మహత్తత్త్వము వ్యక్తమందు లీనమగును. ఆ వ్యక్తము కూడా అవ్యక్తమగు పరమాత్మలో విలీనము చెందును. అప్పుడు పరబ్రహ్మమైన నీవు శేషసంజ్ఞతో విరాజిల్లుచుందువు.

విశ్వము లీలన్ త్రిప్పుచున్ అవిద్యకున్ చుట్టమువైన నీకున్ తా
శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందురట్టి వి
శ్వేశ్వర మేలుకుప్ప నినునెవ్వడు గొరి భజించువాడె పో
శాశ్వత లక్ష్మి మృత్యుంజయ సౌఖ్యయుతుండభయుండు మాధవా


మాధవా! నీవు విశ్వేశ్వరుడవు. శుభములకు నిధివి. ప్రళయానంతరము ఈ విశ్వమును సృష్టి స్థితి లయముల రూపములో లీలగా త్రిప్పుచుందువు. సకల ప్రాణులు నీ మాయకు లోనై పరిభ్రమించుచుండును. యదార్థముగా నీవు జన్మలేనివాడవు, కానీ లోకకల్యాణమునకై అవతారములను దాల్చుట నీకొక వేడుక. అని విజ్ఞులు పేర్కొనుచుందురు. త్రికరణశుద్ధిగా అనన్యభక్తితో నిన్ను సేవించువాడే నిర్భయుడై మృత్యువును జయించును. శాశ్వతమైన పరమపద సౌఖ్యమును అనుభవించును.

ఒంటిని నిల్చి పురాణయోగులు యోగమార్గ నిరూఢులై 
కంటిమందురు కాని నిక్కము కానరీభవదాకృతిం
గంటి భద్రమున్ కంటి మాంసపున్ కన్నులంగనబోలదీ
తొంటి రూపున్ తొలంగబెట్టుము తోయజేక్షణ! మ్రొక్కెదన్

కమలాక్షా! పూజ్యులైన ప్రాచీన యోగులు ఏకాంతప్రదేశములో నిలిచి తపస్సమాధుల ద్వారా నిన్ను చూచినట్లుగా పలుకుచుందురు. కానీ, నిజముగా నీ అలౌకిక రూపమును చూచియుండరు. కల్యాణప్రదమైన నీ దివ్యాకృతిని నా చర్మచక్షువులతో దర్శించితిని. వాస్తవముగా నీ చతుర్భుజ రూపమును చూచుట అసాధ్యము. కనుక ఈ రూపమును ఉపసంహరించి లౌకిక శిశువుగా మారుము. నేను నీకు ప్రణమిల్లుచున్నాను.

విలయకాలమందు విశ్వము నీ పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి
నటుడ నీవు నేడు నా గర్భజుడవౌట పరమపురుష వేదబంబు గాదె

పురుషోత్తమా! నీవు ప్రళయకాలమందు ఈ సమస్త విశ్వమును నీ పొట్టలో దాచుకొనగల సమర్థుడవైన గొప్ప నటుడవు. అట్టి నీవు నా గర్భమున అవతరించుట నీకు ఒక లీలావిలాసమే కదా!

నలినలోచన నీవు నిక్కము నాకు బుట్టెదవంచు నీ
ఖలుడు కంసుడు పెద్దకాలము కారయింట నడంచె దు
ర్మలినచిత్తుని నాజ్ఞ సేయుము మమ్మున్ కావుము భీతులన్
నులుసులేక ఫలించె నోచిన నోములెల్లను నీవయై 

కలువలవంటి కన్నుల కల ప్రభూ! నీవు నిజముగా నాకు పుత్రునిగా జన్మించెదవని తలచి దురాత్ముడైన కంసుడు మమ్ములను చాలా కాలముగా ఈ చెరసాలలో బంధించియుండెను. దుష్టస్వభావము గల ఈ కంసుని శిక్షించుము, భయముతో వణికిపోవుచున్న మమ్ము కాపాడుము. నీవు నాకు కుమారుడవై జన్మించుటవలన నేను నోచిన నోములన్నీ పూర్తిగా ఫలించినవి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి