శ్రీరామకర్ణామృతం ద్వితీయాశ్వాసము
సకలభువనరత్నం సచ్చిదానందరత్నం
సకలహృదయరత్నం సూర్యబింబాంతరత్నం
విమలసుకృతరత్నం వేదవేదాంతరత్నం
పురహరజపరత్నం పాతు మాం రామరత్నం
ఇక్ష్వాకువంశార్ణవజాతరత్నం
సీతాంగనాయౌవనభాగ్యరత్నం
వైకుంఠరత్నం మమ భాగ్యరత్నం
శ్రీరామరత్నం శిరసానమామి
నిగమశిశిరరత్నం నిర్మలానందరత్నం
నిరుపమగుణరత్నం నాదనాదాంతరత్నం
దశరథకులరత్నం ద్వాదశాంతస్థరత్నం
పశుపతిజపరత్నం పాతు మాం రామరత్నం
శతమఖసుఖరత్నం షోడశాంతస్థరత్నం
మునిజనజపరత్నం ముఖ్యవైకుంఠరత్నం
నిరుపమగుణరత్నం నీరజాంతస్థరత్నం
పరమపదవిరత్నం పాతు మాం రామరత్నం
సకలసుకృతరత్నం సత్యవాక్యార్థరత్నం
శమదమగుణరత్నం శాశ్వతానందరత్నం
ప్రణయనిలయరత్నం ప్రస్ఫుటద్యోతిరత్నం
పరమపదవిరత్నం పాతు మాం రామరత్నం
నిఖిలనిలయమంత్రం నిత్యతత్త్వాఖ్యమంత్రం
భవకులహరమంత్రం భూమిజాప్రాణమంత్రం
పవనజనుతమంత్రం పార్వతీమోక్షమంత్రం
పశుపతినిజమంత్రం పాతు మాం రామమంత్రం
ప్రణవనిలయమంత్రం ప్రాణినిర్వాణమంత్రం
ప్రకృతిపురుషమంత్రం బ్రహ్మరుద్రేంద్రమంత్రం
ప్రకటదురితరాగద్వేషనిర్నాశమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రం
దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం
విబుధవినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రం
మునిగణనుతమంత్రం ముక్తిమార్గైకమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రం
సంసారసాగరభయాపహవిశ్వమంత్రం
సాక్షాన్ముముక్షుజనసేవితసిద్ధమంత్రం
సారంగహస్తముఖహస్తనివాసమంత్రం
కైవల్యమంత్రమనిశం భజ రామమంత్రం
జయతుజయతుమంత్రం జన్మసాఫల్యమంత్రం
జననమరణభేదక్లేశవిచ్ఛేదమంత్రం
సకలనిగమమంత్రం సర్వశాస్త్రైకమంత్రం
రఘుపతినిజమంత్రం రామరమేతిమంత్రం
అన్నిలోకములలోను ఉత్తముడైనట్టి, సత్యజ్ఞానాంద శ్రేష్ఠుడైనట్టి, అందరి హృదయములలో రత్నదీపమైనట్టి, సూర్యబింబము యొక్క మధ్యభాగమందు రత్నమువలె వెలుగుచున్నట్టి, నిర్మలమైన సత్కర్మలలో శ్రేష్ఠుడైనట్టి, వేదవేదాంతములకు రత్నమైనట్టి, ఈశ్వరుడు జపించే ఉత్తమమైనట్టి శ్రీరామ అనే రత్నం నన్ను రక్షించుగాక.
ఇక్ష్వాకు వంశమనే సాగరమందు పుట్టిన రత్నమైనట్టి, సీతయొక్క యౌవన భాగ్యమునకు రత్నమైనట్టి, నా భాగ్యమునకు రత్నమైనట్టి, శ్రీరామునిరూపంలో ఉన్న రత్నమునకు శిరసుతో నమస్కరించుచున్నాను.
వేదములకు చల్లని రత్నమైనట్టి, స్వచ్ఛమైన ఆనందము వలన శ్రేష్ఠమైనట్టి, సామ్యములేని గుణములనెడు రత్నములు కలిగినట్టి, నాదమునకు మూలమైన ప్రణవము యొక్క మధ్యమందు రత్నమైనట్టి, దశరథ వంశములో ఉత్తముడైనట్టి, ద్వాదశదళపద్మమందు రత్నమైనట్టి, ఈశ్వరుడు జపించే ఉత్తముడైనట్టి రాముడనే రత్నము నన్ను రక్షించు గాక.
ఇంద్రునిచే స్తోత్రము చేయబడు వారిలో శ్రేష్ఠుడైనట్టి, షోడశదళపద్మమందు రత్నమైనట్టి, మునులజపమునకు రత్నమైనట్టి, వైకుంఠానికి ముఖ్యమైన రత్నమైనట్టి, సామ్యములేని రత్నములవంటి గుణములు కలిగినట్టి, హృదయమనే పద్మమునందలి రత్నమైనట్టి, పరమపదమునకు రత్నమైనట్టి రాముడనే రత్నము నన్ను రక్షించు గాక.
సమస్తపుణ్యములు గలవారిలో ఉత్తముడైనట్టి, సత్యము జ్ఞానము మొదలైన వాక్యార్థములలో శ్రేష్ఠమైనట్టి, శమదమాది గుణములనెడి రత్నములు కలిగినట్టి, శాశ్వతమైన ఆనందము గలవారిలో ఉత్తముడైనట్టి, ప్రేమకు నిలయమైన రత్నమైనట్టి, ప్రస్ఫుటంగా ప్రకాశించు రత్నమైనట్టి, పరమపదమునకు రత్నమైనట్టి రాముడనే రత్నము నన్ను రక్షించు గాక.
అన్నిటానిలయమైనట్టి మంత్రము, నిత్య తత్త్వమును (మోక్షమునిచ్చేది) గలిగిన మంత్రము, సంసారభారాన్ని హరించే మంత్రము, సీతకు ప్రాణమైనట్టి, ఆంజనేయునిచే స్తోత్రము చేయబడునట్టి, పార్వతికి మోక్షమిచ్చునట్టి, ఈశ్వరునికి ముఖమైన మంత్రమైనట్టి రామ మంత్రము నన్ను రక్షించు గాక
ఓంకారము నిలయమైనట్టి, ప్రాణులకు మోక్షమిచ్చునట్టి, ప్రకృతిపురుషుల రూపమైనట్టి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు జపించే మంత్రము, దుష్కరమైన పాపములను, రాగద్వేషములను నశింపజేయునట్టి, రామ రామ యనే మంత్రము, రాముని యొక్క ముఖ్యమైన మంత్రము.
దశరథపుత్రుడైన రాముని మంత్రమైనట్టి, రాక్షసులను సంహరించునట్టి, దేవతలచే స్తోత్రము చేయబడినట్టి, లోకమున ప్రసిద్ధమైనట్టి, మునిసముదాయముచే స్తోత్రము చేయబడినట్టి, మోక్షమార్గమునకు ముఖ్యమైనట్టి, రామ రామ యను మంత్రము రాముని ముఖ్య మంత్రము.
సంసారమనే సాగర భయాన్ని పోగొట్టునట్టి, సమస్త మంత్ర రూపమైనట్టి, మోక్షమును కోరుకునే వారిచే సేవింపబడు సిద్ధమంత్రమైనట్టి, ఈశ్వరుడు మొదలైన వారి హస్తములయందు నివాసము గల మంత్రము, మోక్షమంత్రమైన రామ మంత్రమును ఎల్లపుడు సేవింపుము.
జన్మకు సాఫల్యము కలిగించునట్టి, జననము మరణము మొదలగు భేదములు గల కష్టములను నాశనము చేయునది, సర్వవేదములలో ప్రధానమైనట్టిది, సర్వశాస్త్రములలో ముఖ్యమైనట్టి, రామ రామ అనునట్టి, రాముని ప్రధాన మంత్రము సర్వోత్కృష్టమై యుండు గాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి