నిరాశ నిస్పృహల నుండి బయటపడే హనుమంతుడు - సుందరకాండ 13వ సర్గ
జీవితంలో అనుకున్న పని జరుగక, లక్ష్యం నెరవేరనప్పుడు నిరాశ నిస్పృహలు కలిగి మనిషి నకారాత్మకమైన ఆలోచనలలో మునిగి దుఃఖించటం సహజమే. మరి అలాంటప్పుడు ఎలా బయట పడటం? జీవితం యొక్క విలువను, తన లక్ష్య సాధన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని నమ్మిన దైవాన్ని తలచితే ధైర్యం అదే పుడుతుంది అని మనకు హనుమ సుందరకాండలో తెలియజేస్తాడు. వాల్మీకి మహర్షి రాసిన మహాకావ్యం రామాయణం. ఇది మనస్తత్త్వ శాస్త్రజ్ఞులకు ఒక నిఘంటువు.
సీతను వెదుకుతూ ఉత్సాహంగా సాగర లంఘనం చేసి, లంకిణిని జయించి, లంకా వైభవాన్ని దర్శించిన హనుమ అంతఃపురాలలో ఎంత వెదికినా సీత కనిపించదు. సంపాతి చెప్పినట్లుగా సీత ఆ రావణుని లంకలో లేదేమో అన్న అనుమానం కలిగి నిస్పృహ చెందుతాడు. సీతమ్మ లేదేమో అన్న భయం అతని ఆలోచనలను ఎంతో దూరం పరిగెత్తిస్తుంది. ఈవిధంగా చింతిస్తుంది:
"అయ్యో! సీతమ్మ రావణుడు ఆకాశ మార్గములో తీసుకొని పోవుచున్నప్పుడు క్రింద పడిపోయుండవచ్చు! లేదా సముద్రము దాటుచున్నప్పుడు బెదరి సముద్రమున పడియుండవచ్చు! రావణుడు గట్టిగా పట్టుకొనుట చేత ప్రాణములు విడిచియుండవచ్చు! రావణుడిచే భక్షించబడియుండవచ్చు! లేదా దుష్ట స్వభావము కల రావణుని భార్యలు తినియుండవచ్చు! సీతమ్మ రాముని తలచుచు అయ్యో రామా! లక్ష్మణా! అని దుఃఖించుచు మరణించియుండ వచ్చు! నేను రామునికి, సుగ్రీవునికి, వానరులకు ఏమని చెప్పాలి?
సీత కనుపించలేదని తెలిసి రాముడు బ్రతుకడు. రాముడు మరణించిన లక్ష్మణుడు బ్రతుకడు. రామలక్ష్మణులు మరణించిన భరతుడు శత్రుఘ్నులు బ్రతుకరు. తమ కుమారులు మరణించగా తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి జీవించరు. రాముని దురవస్థ చూసి సుగ్రీవుడు ప్రాణములు విడుచును. అప్పుడు అతని భార్య రోమ, తదుపరి తార, అంగదుడు కూడా జీవించరు. ఇది అంతా చూసి వానరులంతా మరణింతురు.
కావున నేను కిష్కింధకు అమ్మ జాడ తెలియక పోవుట వలన ఇక్ష్వాకు వంశము, వానర వంశము నాశనమవుతాయి. నేను ఇక్కడినుండి పోకున్నచో వారంతా సీతమ్మను చూడగలమనే ఆశతో జీవింతురు. సీతాదేవి కనబడనిచో నేనిక్కడే చేతికందినది, నోట పడినది తిని, వృక్షమూలమున వానప్రస్థుడనయ్యెదను. లేదా సముద్ర తీరము చేరి చితిపేర్చి అగ్నిలో పడెదను. లేదా ఒకచోట కూర్చుండి సన్యాసము స్వీకరించిన నా శరీరమును కాకులు, పక్షులు భక్షించును. సీతను చూడకున్నచో నీట మునిగియైనా మరణింతును.
ముందుగా లంకాధిదేవతను జయించుట వలన ఉత్తమ ప్రారంభము కలిగినది. ఏ చెట్టుక్రిందైనను తపస్సు చేసుకొనుచు ఉండెదను. సీతాదేవిని చూడకుండా ఇక్కడినుండి వెనుకకు పోజాలను."
ఈ విధముగా చింతాక్రాంతుడైన హనుమ ఆ ఆలోచనలనుండి బయటపడకుండెను. అప్పుడు హనుమ:
"సీత విషయమట్లుండనీ. మహాబలుడైన రావనుని వధింతును. లేదా రావణునెత్తుకొని సముద్రము మీదుగా వెడలి అగ్నిహోత్రమునకు పశువును సమర్పించినట్లు రావణుని రామునికిత్తును. అని ఈవిధముగా సీతను గానక విచారించుచు హనుమంతుడు మరల ఇట్లాలోచించెను:
కీర్తిశాలియగు సీత కనిపించునంతవరకు నేను మరల మరల లంకాపురిలో వెదకెదను. ఈ అశోకవనము పెద్ద పెద్ద మ్రానులతో కూడియున్నది. సీత ఇందున్నదేమో వెదకెదను.
వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ
నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోక వర్ధనః
జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కుల నందినీం
సంప్రదాస్యామి రామాయా యథా సిద్ధిం తపస్వినే
స ముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేంద్రియః
ఉదతిష్ఠన్ మహాతేజా హనూమాన్ మారుతాత్మజః
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః
దిశస్సర్వాస్సమాలోక్య హ్యశోక వనికాం ప్రతి
వసువులను, రుద్రులను, ఆదిత్యులను, అశ్వినులను, వాయువును నమస్కరించి, రాక్షసుల శోకమును పెంచే అశోకవనమున ప్రవేశించెదను. సకల రాక్షసులను జయించి, తపస్సిద్ధికి తపస్వి వలె, ఇక్ష్వాకు వంశమును ఆనందింపజేయు సీతాదేవిని రామునకర్పింతును."
మహాతేజశ్శాలి వాయుపుత్రుడగు హనుమంతుడు చింతతో ఇంద్రియములు కలతనొందగా ఒక్క ముహూర్తకాలమిట్లు తలచి లేచి నిలబడెను:
"రామలక్ష్మణులకు నమస్కారము; సీతాదేవికి నమస్కారము; రుద్ర, ఇంద్ర, యమ, వాయువులకు నమస్కారము; చంద్రసూర్యులకు, మరుద్గణములకు నమస్కారము".
అని హనుమ వారికి ప్రణామము చేసి, రాజైన సుగ్రీవునకు నమస్కరించి, అశోకవనమెంత విశాలమైనదో తెలియ కోరి అన్ని దిక్కులను పరిశీలించెను. ఆ విధంగా హనుమంతుడు ముందుగా మనస్సు చేతనే శుభకరమగు అశోకవనమున ప్రవేశించి అనంతరము కర్తవ్యమాలోచించెను.
"ఈ అశోకవనమున తప్పక చాలామంది రాక్షసులుందురు. వృక్షములు, నీరు విస్తారముగా యుండును. ఈ వనమును నేను తప్పక వెదుక వలసినదే. సర్వాత్మకుడగు వాయువు కూడా ఇక్కడ మెల్లగా వీచునే కాని అమితముగా కదల్పడు. రామకార్యమును సాధించుకొనుటకు, రావణునకు కనిపించకుండుటకు నా శరీరమును సూక్ష్మముగా చేసికొంటిని. ఇంక నాకు కార్యసిద్ధిని దేవతలు, ఋషులు చేకూర్చెదరు గాక. బ్రహ్మాది దేవతలు, అగ్ని, వాయువు, దేవేంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, శివుడు నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక. సకల భూతములు, ఆ భూతములకు ప్రభువగు విష్ణువు నాకు సిద్ధిని కలిగించెదరు గాక. నాకు కనిపించని, మార్గదర్శకులగు తక్కిన దేవతలు కార్యసిద్ధిని కలిగింతురు గాక. "
ఈ ఘట్టంలో మనకు హనుమంతుని ఆలోచనా పరంపర మరియు కర్మలనుండి ముఖ్యమైన పాఠాలు:
1. నిరాశ చెందినా కూడా, కార్యసిద్ధికై యజమాని మరియు హితుల మంచి కోసం లోతుగా ఆలోచించి ఏమి చేయాలో నిర్ణయించాలి. తనకు ఎంత కష్టమైనా, స్వామి హితమే పరమావధిగా ఆ కష్టాన్ని, తన మనోవికారాలను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి.
2. మంచి జరగాలి అన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించాలి. ఆ సంకల్ప సాధన కోసం దేవతలను ప్రార్థించాలి. దీనివలన సమస్త భూతములు దేవతలు ఈ సంకల్పానికి జయం కలిగిస్తారు.
3. సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకోవాలి. కార్యసిద్ధి, స్వరక్షణ వ్యూహానికి పునాదులు కావాలి.
4. ఆలోచనలు ఎంత పరిగెత్తినా లక్ష్యంపైకి దృష్టి మరల్చుకునే మనోబలం, ధ్యాస పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ కార్యం సఫలమయ్యేదాక వెనుదిరుగకూడదు.
5. నమ్మిన దైవంపై, కార్యంపై స్థిరమైన శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండాలి.
ఇవన్నీ హనుమకు స్వామి భక్తి, కార్యసిద్ధిపై గల ఏకాగ్ర దృష్టి మరియు తదేకమైన ప్రాధాన్యత, దైవంపై నమ్మకం వలననే కలిగాయి. ఇవన్నీ మనకు చాలా ముఖ్యమైన పాఠాలు. చాలా సార్లు మనం నిరాశలో లక్ష్యాన్ని మరచి తప్పుదారి పడతాము. అలాగే, మధ్యలో వెనుదిరుగుతాము. దైవంపై పూర్తినమ్మకముండదు. వ్యూహంలో సమాజశ్రేయస్సు కన్నా స్వలాభంపైనే దృష్టి ఉంటుంది. అటువంటి అపజయంపాలు జేసే లక్షణాల నుండి బయట పడాలంటే శ్రధ్ధ, భక్తితో కూడిన సాధన ఎంతో అవసరం. దానికి ఆత్మశోధన, శారీరిక మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యం. అందుకే రామాయణంలోని ప్రతి పాత్ర మనకు ఒక ఉదాహరణ. క్లిష్టమైన పరిస్థితులలో వారు ఎలా స్పందించారో మనకు నిత్యం ఎంతో ఉపయోగకరమైన వివరాలను అందజేస్తాయి. మానవాళి సోపానానికి, అభ్యుదయానికి రామాయణం అందుకే ఒక దిక్సూచి.
శ్రీరామ రామ! జై వీర హనుమాన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి