RightClickBlocker

30, జులై 2011, శనివారం

గాయత్రీ మంత్ర వైశిష్ట్యం

వేద మాత గాయత్రి

ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే

తాత్పర్యము:

ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను - సంధ్యావందనము

(గుంటూరు జగద్గురు పీఠం, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ వారి పర్యవేక్షణలో డాక్టర్ జి.ఎల్.ఎన్. శాస్త్రి గారు వివరించిన 'గాయత్రి మంత్రము' అనే ప్రచురణ నుండి)

భారతదేశమందు పూర్వకాలములో ఐదు దేవతారాధనములుండేవి. 1. గాణాపత్యము 2. సౌరము 3. శాక్తేయము 4. శైవము 5. వైష్ణవము.  వీటిని అనుసరించే వారి మధ్య అవగాహన కన్నా పరస్పర విద్వేషమే ఎక్కువగా ఉండేది. ఒకరి దేవతను ఇంకొకరు ఆరాధించే వారు కాదు. కానీ, వీరందరూ ఆరాధించుటకు అభ్యంతరములేని ఒకే ఒక దేవత గాయత్రి. అట్టి వైశిష్ట్యము గాయత్రీమాతకు ఉన్నది. (దీనికి కారణం గాయత్రీ మాత ధ్యానమునకు సంబంధించిన  "ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయైః ముఖైః.." అనే శ్లోకములో పంచ వర్ణముల పంచముఖములను ఈ ఐదు దేవతలకు ప్రతీకగా తీసుకొనినప్పుడు పరస్పర విద్వేషము తొలగి సమన్వయము, అవగాహన కలిగినదేమో. ఋషులు, పురాణోపనిషత్తులు తెలిపే ఈ క్రింది శ్లోకపాదములను బట్టి గాయత్రీ మాత వైశిష్ట్యం మరింత స్పష్టమవుతుంది.

గాయత్రీం చింతయేద్యస్తు హృద్పద్మే సముపస్థితాం
ధర్మాధర్మ వినిర్ముక్త స్సయాతి పరమాంగతిం

భావము: గాయత్రిని హృదయములో ఉపాసించువాడు లేదా ధ్యానించువాడు ధర్మాధర్మ విచికిత్స చేత బంధింపబడకుండా మోక్షమును పొందును - వేదవ్యాస మహాముని

గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ
న గాయత్ర్యాః పరం జప్యం ఏతద్విజ్ఞానముచ్యతే

భావము: గాయత్రియే వేదమాత, త్రిలోకవాసులకు జ్ఞానమును ప్రసాదించే పావని. సర్వోత్కృష్టమైన గాయత్రీమంత్ర జపమును మించినది మరొకటి లేదు - కూర్మపురాణము

గాయత్ర్రీంచైవ వేదాంశ్చ తులయో సమతోలయన్
వేదా ఏకత్ర సాంగాస్తు గాయత్రీచైకత స్థితా

భావము: నాలుగు వేదములను, ఆరు వేదాంగములను త్రాసు యొక్క ఒక పళ్లెమందు, గాయత్రీ మంత్రమును రెండవ పళ్లెమునందు ఉంచి తూచినచో గాయత్రి వైపే త్రాసు మొగ్గును - యాజ్ఞవల్క్యుడు

న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్

భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు - ఆర్యోక్తి

చత్వారో వేదాస్సాంగాస్యోపనిషదస్సేతిహాసాః సర్వే గాయత్ర్యాః ప్రవర్తంతే

భావము: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, ఇతిహాసములన్నియు గాయత్రి వలననే ప్రవర్తించును - గాయత్రీ ఉపనిషత్తు

గాయత్రీ మాత్ర నిష్ఠస్తు కృతకృత్యో భవేద్విజః

భావము: ఒక్క గాయత్రీ మంత్రమును నిష్ఠతో ఉపాసించిననూ ఇతర ఉపాసనల ప్రమేయము లేకుండానే ద్విజుడు కృతార్థుడగును - గాయత్రీ రహస్యం

సర్వాత్మనాహి యాదేవీ సర్వ భూతేషు సంస్థితా
గాయత్రీ మోక్షహేతుర్వై మోక్షస్థానక లక్షణమ్

భావము: సర్వభూతములందు  అంతర్యామినియై వర్తించు గాయత్రియే మోక్షస్వరూపము, మోక్షప్రసాదినియై యున్నది - ఋష్యశృంగుడు

యా వేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీ మహేశ్వరీ
ఋగ్యజుస్సామధర్వైశ్చ తన్మేమన శ్శివ సంకల్పమస్తు

భావము: అన్ని వేదములలో ప్రతిపాదింపబడిన గాయత్రి సర్వ మానవుల బుద్ధులయందు మంగళకరములైన సంకల్పములు కలిగించును.- మహాన్యాసము

గాయత్రీ అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ

ఇతర మంత్రములకన్నా గాయత్రీ యేల విశిష్టమైనది?

ఏ మంత్రమైనా కూడా బుద్ధి జీవి యైన మానవునకు మాత్రమే ఉపయోగపడును. బుద్ధిని పెట్టి మననము చేసినప్పుడు మాత్రమే మంత్రమగును. బుద్ధిని ఉపయోగించి ఉచ్చరించిన అక్షరము బీజాక్షరమగును.

ఉదాహరణ: క్రీం అన్నది కాళీ సంబంధమైన బీజాక్షరం. వేసవికాలంలో ఐస్ క్రీం అమ్ముకునే వాడు రోజులు వేయిమార్లైనా "క్రీం" అన్న అక్షరాన్ని ఉచ్చరించును. అయినను అది అతనికి బీజాక్షరమవదు. బుద్ధి పెట్టినప్పుడు మాత్రమే అది బీజాక్షరమై కాళీమాతతో సంబధమేర్పడును. అలాగే, ప్రెస్ లో మంత్రశాస్త్రమును అచ్చు వేసే కంపోజర్, ప్రూఫ్ రీడర్ కూడా ఈ అక్షరాన్ని చదువుతారు. కానీ అది వారికి బీజాక్షరముగా పనిచేయదు. కాబట్టి, బీజాక్షర మగుటకు, మంత్రము వలె పనిచేయుటకు బుద్ధి అవసరమని తెలియుచున్నది. ఈ బుద్ధి కూడా పెడదోవ పట్టనిదై యుండవలెను. బుద్ధులు పెడదోవ పట్టకుండా ప్రచోదనము చేయనది గాయత్రీ మంత్రము. కాబట్టి, ముందుగా సద్బుద్ధికై గాయత్రీ మంత్ర పఠనము చేసి అటుపైన కలిగిన సద్బుద్ధితో మిగిలిన ఇతర మంత్రములను పఠించిన ఫలితము కలుగును. ఈ కారణము వలన మిగిలిన మంత్రముల కన్నా ముందుగా గాయత్రీ మంత్ర పఠనము చేయవలెనని చెప్పబడినది. అంతేకానీ, గాయత్రి ఒక్కటియే మంత్రము, మిగిలినవి పనికిరానివి అని కాదు.

అదే విధముగా తల్లిని దైవముగా ఆరాధించిన తరువాత మిగిలిన ఏ దైవమును ఆరాధించినను ఫలితముండును. దైవముగా చూడవలసిన వారిలో మొదటి స్థానము మాతృమూర్తిదే. ధ్యాన, జప, సంకీర్తన, స్తోత్ర పూజాదులలో ఏ విధముగానైనా దైవారాధన చేయవలెనన్న కావలసినది పంచ జ్ఞానేంద్రియములతో కూడిన దేహమే కదా! ఆ దేహమును ఇచ్చునది తల్లియే కదా! కాబట్టి అన్ని దైవారాధనలకన్నా ముందు తల్లిని దైవముగా భావించి పూజించుట ఆవశ్యకము, ఉత్తమము. అందుచేత, మంత్రములలో గాయత్రిని తల్లిగా పోల్చిరి. నవమాసాలు మోసి, కని పెంచి, కంటికి రెప్పలాగా కాపాడి ఎలాగైతే తల్లి బిడ్డను పెంచునో అలాగే గాయత్రీ మాత కూడా ఉపాసకుని కాపాడును.

మంత్రము:

గాయతాం త్రాయతే ఇతి గాయత్రి - గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను కానీ నసుగుతూ సణుగుతూ వినబడీ వినబడనట్లు ఉచ్చరించుట సరైన పద్ధతి కాదు. కాబట్టి గాయత్రీ మంత్రం గొంతెత్తి బిగ్గరగా గానం చేయవచ్చునని గాయత్రీ పద నిర్వచనం, వ్యుత్పత్యర్థములు చెప్పుచున్నవి. మరియు, ఇది స్వరయుక్త మంత్రము. వైఖరీ వాక్కుతో పైకి ఉచ్చరించినపుడే స్వరభేదము స్పష్టముగా తెలియును కాబట్టి గాయత్రిని సుస్పష్టముగా, స్వరయుక్తముగా ఉచ్చరించవచ్చును. గాయత్రీ మంత్రములో నిర్దిష్టమైన అర్థవంతమైన వాక్య నిర్మాణము కలదు. "ఎవరు మా బుద్ధులను ప్రచోదనము చేయుచున్నారో అట్టి సవితృ మూర్తి యొక్క దివ్యమైన తెల్లని తేజస్సును మేము ధ్యానించుచున్నాము. ఒక నిర్దిష్టమైన అర్థము, అభ్యర్థనము వుండి ప్రార్థన, మంత్రము ఒకదానిలో ఒకటి అంతర్లీనమై వుండుటచే గాయత్రి మంత్రము మరియు ప్రార్థన కూడా యగును.

ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్|
భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|

గాయత్రీ మంత్ర పదవిభాగము:

ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య.
ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్

పదక్రమము:

వరేణ్యమ్, నః, ధియః,ప్రచోదయాత్ యః
తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి

అర్థములు:

వరేణ్యమ్ = కోరదగినదియు (అందరికీ శ్రేయస్సును కలిగించుటలో)
నః = మన
ధియః = బుద్ధులను
ప్రచోదయాత్ = ప్రేరేపించునదియు,
యః = ఎవరో
ఓం = ప్రణవ ప్రతీకమైన
తత్ = ఆ
సవితుః దేవస్య = వెలుగుల సవితృ మూర్తి యొక్క
భర్గః = స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన తేజస్సును
ధీమహి = ధ్యానించుదుము (గాక)

తాత్పర్యము: 

అందరికి శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియు, మన బుద్ధులను ప్రేరేపించునది ఎవరో - ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తియొక్క(స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము గాక!

ఇది ఒక వర్ణము, వర్గము, కులము, మతము, లింగము (స్త్రీ పురుషులు అందరు పఠించవచ్చు), జాతికి చెందిన మంత్రము కాదని, సమస్త మానవాళి శ్రేయస్సు కోరేవారు ఒంటరిగానైనను, సామూహికముగా నైనను ఈ మంత్రమును ఉచ్చరించవచ్చునని దీని తాత్పర్యమువలన తేటతెల్లమగుచున్నది. ఇది సూర్యుని నుండి సౌరశక్తిని సూటిగా పొందుటకు భారతీయ ఋషులు దర్శించిన మంత్రము. భారతీయుల సర్వ మంత్రములు, ప్రార్థనలు ఇలాగే స్వార్థరహితముగా, సర్వజనహితముగా ఉండునని అందరూ గ్రహించవలెను.

లోకాస్సమస్తాః సుఖినో భవంతు | ఓం శాంతిః శాంతిః శాంతిః|

5 వ్యాఖ్యలు:

 1. This pada kramam, pada vibhagam, pada ardham, summary can be adopted to write about few important mantrams, slokams

  it educates people better and naturally enables people learn sanskrit; this used to be way languages are learnt, along with some intro on grammer

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Chaala rojula tharvatha I have read this again mamayya. It gives more meaning to why we do Sandhyavandanam.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా మంచి పని చెస్తున్నారు. అందుకు మనసారా అభినందనలు. అయితే ఓం భూర్భువ...దగ్గరనుంచి ప్రతి పదానికి అర్థం మిగిలిన పదాలకు చెప్పినట్లే చెప్తే మరింత తృప్తిగా వుండేది. దయచేసి ఆపని చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుందని నా అభిప్రాయం. (వరేణ్యం= కోరదగినది అని రాసి అర్థం చెప్పారు కద అలా మొత్తం మంత్రానికి అర్థం సింపుల్ గా ఇంకా బావుండేది అని నా అబిప్రాయం సర్ - డా. గౌతమ్ కశ్యప్

  ప్రత్యుత్తరంతొలగించు