10, సెప్టెంబర్ 2017, ఆదివారం

గడప దాక వచ్చి మరలి పోయావు - డాక్టర్ శోభారాజు గారి మధురభక్తి గీతం


గడప దాక వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

గుడిసెనంతా అలికి ముగ్గులేశాను
తోరణాలను కట్టి తలుపు తెరిచుంచాను
దీపాలు వెలిగించి ధూపమేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

భక్ష్యభోజ్యాదులను ప్రేమార చేశాను
కొసరి నీవు తినగా విస్తరేశాను
విశ్శ్రాంతి గొందువని పానుపేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ!

ఏర్పాట్లలో మునిగి ఏమరను ఇకను
కటిక చీకటిగుంది చిరుదివ్వె చేబట్టి
కాలాన్ని మరచి నే ఎదురు చూస్తున్నాను
వస్తావుగా స్వామి మరియొక్క మారు

కాళ్లు వణకేను కళ్ళు చెదరేను
వంటి చేవంతా కంటి నీరాయెను
పెనుగాలికీ దివ్వె పెనుగులాడేను
వస్తావుగా స్వామి మరి యొక్క మారు

- డాక్టర్ శోభారాజు గారు

పదకవితా పితామహుని సంకీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటంలో అగ్రగణ్యులైన డాక్టర్ శోభారాజు గారి అద్భుతమైన మధురభక్తి గీతం ఇది. కృష్ణభక్తి వారికి చిన్ననాడే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలుగా జీవితంలో అంతర్భాగమై పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళను పరమాత్మ సేవకు అంకితం చేసి  పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి అమూల్యమైన సంకీర్తనా సంపదలోని భావాన్ని ప్రత్యేకమైన మార్గంలో ప్రచారం చేస్తున్నారు పద్మశ్రీ దాక్టర్ శోభారాజు గారు. ఈ మహాయజ్ఞంతో పాటు వారు ఎన్నో సంకీర్తనలను రచించారు. అందులో ఒకటి ఈ గడప దాకా వచ్చి అనే రచన. రాధ, మీరాల మధురభక్తి ఈ గీతంలో స్పష్టంగా కనబడుతుంది. స్వామి వస్తున్నాడన్న ఆనందంలో ఇల్లు అలికి, ముగ్గేసి, తోరణాలు కట్టి, ధూప దీపాలు వెలిగించి, చక్కని భోజనము ఏర్పాటు చేసి, సేదదీరేందుకు పానుపు వేసేలోపు  భక్తురాలు అంతలో స్వామి వెళ్లిపోయాడన్న విచారంలోని మనోభావన ఈ గీతం. ఈ ఏర్పాట్లలో మునిగి స్వామి రాకను ఏమరచేనేమో అని కారు చీకటిలో దివ్వెను చేతబట్టి ఎదురు చూస్తున్న కృష్ణ భక్తురాలి హృదయ సవ్వడులను మనోజ్ఞంగా తెలిపే గీతం ఇది. ఎదురు చూపులో శరీరం బలహీనమై, శక్తి అంతా కన్నీరు ధార కాగా, గాలీ దీపం ఊగిసలాడుతుండగా స్వామిని మరల రమ్మని వేడుకునే గీతం అమ్మ శోభారాజు గారు అద్భుతంగా రచించారు.

భక్తికి శరణాగతి అతి ముఖ్యం. ఈ శరణాగతిని నేను శోభారాజు అమ్మలో పరిపూర్ణంగా గమనించాను. కృష్ణభక్తిలో ఉన్న వారిలో ఈ శరణాగతితో పాటు, ప్రశాంతత, స్థితప్రజ్ఞత, దృఢమైన వ్యక్తిత్వం, పరమాత్మతో ఓ విలక్షణమైన అనుబంధం కలిగి ఉంటారు. శోభారాజు గారు చేస్తున్న సేవ అమూల్యమైనది. ఆధ్యాత్మిక సంపదతో పాటు వ్యక్తిత్వ వికాసంతో కూడిన సామాజిక స్పృహ కలిగిన శోభారాజు గారు మన సమాజాన్ని, నేటి హిందుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యల గురించి సుస్ఫటమైన భావనలు కలిగిన వారు. డొల్లతనాన్ని, ద్వంద్వ ప్రమాణాలను, కుహనా వాదాలను, దురాచారాలను ఖండిస్తూ ఈ సమాజంలో  పోరాటం సాగిస్తున్న యోధురాలు అమ్మ. ఒక్క గీతంలో ఇన్ని భావనలను వ్యక్తపరచటం అనేది ఆ స్వామి అనుగ్రహమే. ఆధ్యాత్మిక సాధనలో, భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే అద్భుతమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్న శోభారాజు గారు ఇటువంటి గీతాలను ఎన్నో రచించారు. వారి భావ సంపద ఈ సమాజంలో మరింత ప్రచారంలోకి రావాలని నా ప్రార్థన.

శోభారాజు గారు ఈ గీతం ఆలపించిన రీతి అత్యంత మధురం. చరణాలు ముందుకు సాగిన కొద్దీ భావనలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చి వేర్వేరు రసాలను పండించారు. స్వామీ అని పిలిచే రీతి మనసును కరగించి వేస్తుంది. బద్ధుడై స్వామి రావలసిందే అని మనసు నిశ్చయమయ్యేలా గానం చేశారు. చివరి చరణంలో శృతిని మార్చి ఆర్తితో వారు పాడిన పద్ధతి మధురభక్తికి నిదర్శనం. గీతాన్ని లలితంగా, భావనలకు అనుగుణంగా స్వరపచటంలో శోభారాజు గారి సాధన ప్రతిబింబిస్తుంది. ఈ గీత భావం అనుభవైకవేద్యం.  అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ఈ గీతానికి రమణీయమైన, సముచితమైన చిత్రాలను పొందుపరచి వీడియో రూపొందించిన పార్థసారథి గారికి నా అభిననందలు, కృతజ్ఞతలు.

9, సెప్టెంబర్ 2017, శనివారం

జగమే మారినది మధురముగా ఈ వేళ - మధుర గీతం (దేశద్రోహులు చిత్రం - 1964)




సాలూరి రాజేశ్వరరావు గారు ఎంతటి మహా సంగీత దర్శకులో, ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతటి మధుర గాయకులో తెలుసుకోవటానికి కొన్ని పాటలు వింటే చాలు. సాహిత్యకారుల ప్రతిభ ఒక ఎత్తైతే దానికి తగ్గ సంగీతం అందించటం సంగీతకారుల ప్రతిభ. మేరు పర్వతమంత ఎత్తైనది సాలూరి వారి సంగీత విద్వత్తు. లలితమైన పాటలకు అత్యంత మధురమైన సంగీతాన్ని అందించటంలో ఆయన మేటి. అటువంటి పాటను ప్రతిభామూర్తి ఆరుద్ర గారు రచించగా రసాలూరించే సాలూరి వారు స్వరపరచగా మధుర గాయకులు ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతో మధురంగా పాడారు. ఇది 1964లో విడుదలైన దేశద్రోహులు చిత్రంలోని జగమే మారినది మధురముగా ఈ వేళ అన్న పాట. ఇది చిత్రంలో రెండు సందర్భాలలో వస్తుంది. మొదటిది సుశీలమ్మ, ఘంటసాల మాష్టారు యుగళ గీతంగా పాడగా, రెండవది భగ్న ప్రేమికునిగా నాయకుడు అన్న ఎన్‌టీఆర్‌పై కాస్తంత బరువైన సన్నివేశంలో చిత్రీకరించబడి ఘంటసాల మాష్టారు అత్యద్భుతంగా పాడిన గీతం. యుగళ గీతం ఉత్సాహంగా సాగేదైతే సోలో గీతం కాస్త గంభీరంగా సాగుతుంది. సంగీతకారులు మరియు గాయకుల ప్రతిభ విలక్షణంగా తెలుస్తుంది. కళ్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ గీతం అజరామరమై నిలిచింది. పాట మొత్తం అద్భుతమైన స్వరాలతో సితార్, తబలా వాద్య నాదాలతో రాజేశ్వరరావు గారు స్వరపరచారు.

ఆరుద్ర గారి గీతంలోని భావాన్ని పరిశీలిస్తే, లలితమైన పదాలతో ఎంతటి మధురమైన భావనలను పండించారో అర్థమవుతుంది. మనసు నెమలిలా ఆడిందట, పావురాలు పాడాయట, జగమంతా ఎంతో మధురముగా మారిందట. గొరవంక, రామచిలుక చెంత చేరగా అవి అందమైన జంటగా కనబడ్డాయట. ప్రేమ, స్నేహము కలిసి జీవితము పండగా ఓ చిత్రమైన పులకింత కలిగిందట. విరజాజి పూవుల సువాసన స్వాగతము పలుకగా, తుమ్మెద ఆ జాజులలోని మధువు యొక్క తీయదనాన్ని కోరి ప్రేమలో తేలుతూ తిరిగాడిందట. ప్రేమలో పడిన వారికి కలలు, కోరికలు తీరినప్పుడుండే భావనలను ఈ గీతం తెలుపుతుంది. గీతమంతా ఒకే సాహిత్యాన్ని ఉపయోగించి ఒక్క ఆఖరి పంక్తిలో సందర్భోచితంగా సాహిత్యాన్ని మార్చి పాట భావం ఏ మాత్రం చెదరకుండా రచించిన ఆరుద్ర గారి ప్రతిభ అమోఘం.

మాధుర్యానికి మారు పేరు సుశీలమ్మ, అంతే గొప్పగా ఘంటసాల మాష్టారు స్వరయుక్తంగా పాడారు. ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు దశాబ్దాల పాటు పాడారు. వారిరువురూ తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని మధురమైన గీతాలతో అలరించారు. ఒకరకంగా సాలూరి వారు, ఘంటసాల, సుశీలమ్మల బృందం ఆనాడూ ఈనాడూ కూడా టాప్ క్లాస్ అని చెప్పుకోవాలి. సంగీతానికి, మాధుర్యానికి, భావసంపదకు ఆనాడు ఎంత ప్రాధాన్యముండేదో, వాటికి తగినట్లు గాయకులు కూడా తమలోని ప్రతిభ పాటను మరింత ప్రేక్షకుల మనసులను దోచుకునేలా పాడే వారు. అందరూ పరిపూర్ణమైన న్యాయం చేసేవారు. అందుకే ఇటువంటి పాటలు దశాబ్దాల పాటు నిలిచి మనుషుల హృదయాలను రంజిల్లజేస్తూనే ఉంటాయి.

యుగళ గీతం
సోలో

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా

మనసాడెనే మయూరమై పావురములు పాడే! ఎల పావురములు పాడే!
ఇదే చేరెను గోరువంక రామచిలుక చెంత! అవి అందాల జంట!
నెనరు కూరిమి ఈనాడే పండెను! జీవితమంతా చిత్రమైన పులకింత!!

విరజాజుల సువాసన స్వాగతములు పలుక! సుస్వాగతములు పలుక!
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరి! అనురాగాల తేలి!
ఎదలో ఇంతటి సంతోషమెందుకో! ఎవ్వరికోసమో! ఎందుకింత పరవశమో! (యుగళ గీతం)
కమ్మని భావమే కన్నీరై చిందెను! ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి!! (సోలో)


3, సెప్టెంబర్ 2017, ఆదివారం

శ్రీ విష్ణు గీతం - భారతీతీర్థ మహాస్వామి రచన


శృంగేరి శారదా పీఠ జగద్గురువు భారతీతీర్థ మహాస్వామి వారు రచించిన అద్భుతమైన విష్ణు గీతం. వారి సాహిత్యానికి ఆ చిన్నారి హరిప్రియ చేసిన నృత్యం చూస్తే మనసు ఉప్పొంగుతుంది. శ్రీహరిని శరణాగతితో పరిపరి విధాల వేడుకునే ఈ గీతం ఆది శంకరుల స్తుతులను గుర్తు చేస్తుంది. గీతం వివరాలు:

శ్రీ విష్ణు గీతం 

గరుడగమన తవ చరణకమలమిహ  మనసి లసతు మమ నిత్యం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

జలజ నయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ 
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భుజగశయన భవ మదన జనక  మమ జనన మరణ భయహారీ
మమ తాపమపా కురు దేవ  మమ పాపమపా కురు దేవ

శఙ్ఖ చక్రధర దుష్ఠ దైత్య హర సర్వలోక శరణ
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

అగణిత గుణగణ అశరణశరణద విదళిత సుర రిపు జాల
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

 ఓ గరుడ వాహనుడవైన శ్రీహరీ! నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!  కలువలవంటి కన్నులు కలిగిన శ్రీహరీ! బ్రహ్మ,ఇంద్రుడు, జ్ఞాన గణముచే నుతించించబడిన పదపద్మములు కలవాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా!  ఆదిశేషునిపై శయనించే శ్రీహరీ! మన్మథుని తండ్రీ! నా జనన మరణ భయములను తీర్చువాడా  నా తాపమును, పాపమును హరింపుము దేవా!  శంఖ చక్రములని ధరించిన నారాయణా! దుష్టులైన రాక్షసుల హరించినవాడా! సర్వలోకములకు రక్షణ కలిగించే వాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! ఎనలేని సుగుణములు కలిగిన నారాయణా! దీనులకు దిక్కైనవాడా! దేవతల వైరులను సంహరించువాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! నీ భక్తుడనైన ఈ భారతీతీర్థుని అపారమైన కరుణతో రక్షించుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!

జగద్గురు భారతీతీర్థస్వామి వారి సంగ్రహ చరిత్ర:



1951వ సంవత్సరం ఏప్రిల్ 11న (ఖర నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్టి నాడు) గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి సమీపంలో నాగులేరు ఒడ్డున అలుగుమల్లిపాడులో తంగిరాల వేంకటేశ్వర అవధాని, అనంతలక్ష్మమ్మ దంపతులకు నోముల ఫలంగా బాలుడు జన్మించాడు. అవధాని గారు నిత్యము భవానిశంకరునికి రుద్రాభిషేకం చేసే వారు. అలాగే రామనవమి సమయంలో నవరాత్రి ఉత్సవాలు చేసేవారు. అనంతలక్ష్మమ్మ హనుమంతుని ధ్యానించేది. నలుగురు ఆడపిల్లల తరువాత మగపిల్లవాడు పుడితే సీతారాముల పేరు, ఆంజనేయుని పేరు పెట్టుకోవాలని ఆ దంపతులు సంకల్పించారు. అందువలన ఆ బాలునికి తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని నామకరణం చేశారు. మూడేళ్ల వయసు నుండే శివనామాన్ని ఆ బాలుడు స్మరించాడు. నిరంతరం స్వామి నామ స్మరణలో తనను తాను మరచే వాడు. ఐదేళ్ల వయసుకే సంస్కృతాన్ని ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద నేర్చుకోవటం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వయసుకే సంస్కృతంపై పట్టు సాధించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మొదలైన పండితుల మన్ననలు పొందారు. ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాలలో పాల్గొనటానికి సీతారామాంజనేయులును పిలిచారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక చిన్న వయసులోనే చదివిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా వేదప్రవర్ధక విద్వత్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు.

1961వ సంవత్సరంలో సీతారామాంజనేయులును ఉపాధ్యాయుడు విజయవాడలో పర్యటిస్తున్న శృంగేరి శారదా పీఠం అధిపతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి ముందు సంస్కృతంలో సంభాషించ వలసిందిగా కోరాడు. సుస్పష్టంగా సంస్కృతంలో మాట్లాడటంతో ఆ బాలుడికి ప్రత్యేక బహుమతి లభించింది. అప్పుడు స్వామి దర్శనంతో ఆ బాలుడి మనసులో ఆయనే తనకు దారి, గురువు అని నిశ్చయమైంది. 1966వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్యం చేస్తున్నారు. అక్కడికి స్వామి ఆశీస్సులకై సీతారామాంజనేయులు తల్లిదండ్రులతో వెళ్లి తనకు శాస్త్రాలను బోధించవలసిందిగా కోరాడు. క్షిప్రా నదిలో స్నానమాచరించి వస్తున్న స్వామి ఆ బాలుని వైరాగ్యము, భక్తి చూసి ఎంతో సంతోషించి శిష్యునిగా స్వీకరించారు. ఎక్కడ నరసరావుపేట? ఎక్కడ ఉజ్జయిని? ఉన్నత పాఠశాల విద్య చదువుతున్న బాలుడు మంచి చదువులు చదవాలని తండ్రి అభిలాష. మరి ఏమిటీ అనుకోని మలుపు? ఇదంతా ఆ శారదాంబ అనుగ్రహమే అన్నారు భారతీతీర్థ స్వామి వారు. చిన్ననాటి దర్శనం తరువాత అభినవ విద్యాతీర్థ స్వామి వారే తన మనసులో నిలిచి తనను ముందుకు నడిపారని, తన సమస్యలకు పరిష్కారం చూపారని, ఆ గుర్వనుగ్రహమే తనను అంత బలీయంగా ఉజ్జయినికి తీసుకు వెళ్లిందని అన్నారు.



అప్పటినుండి సీతారామాంజనేయులు స్వామితోనే ఉన్నారు. ఎనిమిదేళ్లలో కృష్ణ యజుర్వేదం, పూర్వ ఉత్తర మీమాంసలు, న్యాయశాస్త్రముతో పాటు మరెన్నో శాస్త్రాలను అధ్యయనం చేశారు. సంస్కృతంలో రచనలు కూడా చేశారు. 1974వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థస్వామి వారు సీతారామాంజనేయులుకు సన్యాస దీక్షనిచ్చి వారిని భారతీతీర్థస్వామిగా నామకరణం చేశారు. స్వామి వారు అప్పటికే మాతృభాష తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలలో కూడా ప్రావీణ్యం పొందారు. సన్యాస స్వీకారం వెంటనే గురువులతో కలసి విజయయాత్ర చేశారు. గురువులతో కలసి ఉత్తరభారత దేశంలో పర్యటించినప్పుడు సంస్కృత హిందీ భాషలలో అక్కడి పండితులు, యోగులు, స్వాములతో సంభాషించి వారి మన్ననలు పొందారు. భారతీతీర్థ స్వామి వారికి అమితమైన గురుభక్తి. నిరంతరం గురువులను అనుసరిస్తూ, గమనిస్తూ వారి సుశ్రూషలో గడిపేవారు. 15 ఏళ్ల పాటు ఆ విధంగా తన గురువులైన మహాస్వామి వద్ద అమూల్యమైన సమయం గడిపి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పొందారు.

1989లో గురువుల మహాసమాధి తరువాత భారతీతీర్థస్వామి శృంగేరి శారదా పీఠానికి 36వ మహాస్వామిగా పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. వేద విద్యను అభివృద్ధి చేయటానికి, సనాతన ధర్మ పరిరక్ష్ణకు విశేషమైన సేవలు అందిస్తూ అమిత తపోబల సంపన్నులై, పరమ నిష్ఠా గరిష్ఠులై దేశంలోనే అతి పవిత్రమైన పీఠంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. శారదా ధన్వంతరి ఆసుపత్రి స్వామి వారి సంకల్పబలంతో సాకారమైంది. ఈ ఆసుపత్రి ద్వారా శృంగేరి మరియు చుట్టు పక్కల గ్రామాలకు వైద్య సేవలందిస్తున్నారు. వేదపండితుల దయనీయ పరిస్థితి గ్రహించిన స్వామి వారు పండితులకు జీవనభృతిని కలిగించే ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదపాఠశాలలో అత్యుత్తములైన పండితులను విద్యార్థులకు బోధించేలా నియమించి వేదవిద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. లోక కళ్యాణార్థం పీఠం ఆధ్వర్యంలో శత, సహస్ర చండీ హోమాలు, అతిరుద్ర యాగాలు నిరంతరం నిర్వహించేలా స్వామి ఏర్పాటు చేశారు. పీఠాన్ని దర్శించుకునే భక్తుల కోసం శారదా కృప, యాత్రి నివాస్‌ల పేరిట వసతి గృహాలను నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా చాతుర్మాస్య దీక్షా సమయంలో బ్రహ్మసూత్ర భాష్యాల వివరణ చేస్తూ సనాతన ధర్మ ప్రచారానికి తొడ్పడుతున్నారు.

2015 జనవరి 22న తిరుపతికి చెందిన యువ బ్రహ్మజ్ఞాని కుప్పా వేంకటేశ్వర ప్రసాద్ గారిని తన శిష్యునిగా స్వీకరించి అతనిని సన్యాసాశ్రమంలోకి ప్రవేశ పెట్టారు. భారతీతీర్థస్వామి వారి అనంతరం ఈ విదుశేఖర భారతీస్వామి వారు శృంగేరి పీఠాన్ని అధిరోహిస్తారు. శృంగేరి పీఠంలో తెలుగు స్మార్త బ్రాహ్మణులు పీఠాధిపతిగా పరంపర ఈ విధంగా కొనసాగబోతోంది. శ్రీ గురుభ్యో నమః.

2, సెప్టెంబర్ 2017, శనివారం

కమలాంబ నవావరణ కీర్తనలు - ముత్తుస్వామి దీక్షితుల ఆధ్యాత్మిక వైభవం



తిరువారూర్ త్యాగరాజస్వామి, కమలాంబ క్షేత్ర  వివరాలు:

తిరువారూరు - కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న ఓ పురాతన పట్టణం. ఇక్కడ త్యాగరాజస్వామి (శివుడు) దేవస్థానం ప్రసిద్ధి. ఉత్తరాన సుకుమార నది, దక్షిణాన వలైయార్ నది, నగరం మధ్య నుండి ఓడంబొక్కి నది ప్రవహిస్తాయి. కావేరీ ఉపనదులైన వెన్నార్, వెట్టార్ నదులు కూడా ఇక్కడైకి దగ్గరలోనే ఉన్నాయి. తిరువారూరు చోళులకు రాజధాని. ఈ నగరంలో పురాతన దేవాలయమైన త్యాగరాజస్వామి సన్నిధిని తొలుత ఆదిత్య చోళుడు క్రీస్తు శకం 871-801 సంవత్సరాల మధ్యలో నిర్మించగా, తరువాత రాజ రాజ చోళుడు, రాజేంద్ర చోళుడు మరియు పాండ్య రాజులు పునరుద్ధరించారు. తిరువారూరు కులోత్తుంగ చోళుని (కీ.శ 1070-1120) రాజధాని కూడా. ఆ సమయంలోనే శైవం బాగా వ్యాపించింది. చోళుల తరువాత పాండ్యులు, అటు తరువాత విజయనగర రాజులు, నాయక రాజులు, మరాఠా రాజులు పరిపాలించారు. కళలకు, సంస్కృతికి తిరువారూరు ఆలవాలమైంది. శైవ నాయనార్ గురువులు, కవి ఆయన జ్ఞాన సంబంధర్ తిరువారూరు గురించి ప్రస్తావించారు.


ఇంతటి భవ్యమైన చరిత్ర గల తిరువారూరు పట్టణంలో ఉన్న త్యాగరాజస్వామి దేవస్థానంలో ఆదిపరాశక్తి కమలాంబగా వెలసింది. ఆ అమ్మ పేరుతోనే తిరువారూరు కమలాలయక్షేత్రంగా కూడ పిలువబడింది. ఈ దేవస్థానం సమీపంలో కమలాలయ తటాకం ఉండటం  విశేషం. ఈ కమలాంబ ప్రత్యేకతలు ఎన్నో. అమ్మవారు సుఖాసీనురాలుగా కాకుండా యోగ ముద్రలో ఒక కాలి మీద మరొక కాలు మెలిక వేసి కూర్చొని ఉంటుంది. తన చేత కమలము, పాశాంకుశము, రుద్రాక్ష ధరించి యోగినిగా దర్శనమిస్తుంది. శ్రీవిద్యా ఉపాసనా పద్ధతిలో ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు  ఈ కమలాంబ శ్రీ విద్యా ఉపాసనతో జ్ఞాన దృష్టి కలిగి ఈ అమ్మపై 9 కీర్తనలను రచించారు. వీటిని నవావరణ కృతులు అంటారు. శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలకు ఈ తొమ్మిది కృతులను దీక్షితుల వారు రచించారు. ధ్యానము, మంగళము కలుపుకొని మొత్తం 11 కమలాంబ కృతులు ఆయన జ్ఞాన ధారగా వెలువడ్డాయి. తోడి రాగంలో ధ్యాన కృతి కమలాంబికే, తరువాత ఆనందభైరవిలో కమలాంబ సంరక్షతు, కళ్యాణి రాగంలో కమలాంబాం భజరే, శంకరాభరణ రాగంలో శ్రీ కమలాంబికాయ రక్షితోహం, కాంభోజి రాగంలో కమలాంబికాయై, భైరవిలో శ్రీ కమలాంబాయాః పరం, పున్నాగవరాళి రాగమలో కమలాంబికాయాస్తవ, శహానా రాగంలో శ్రీ కమలాంబికాయాం, ఘంట రాగంలో శ్రీ కమలాంబికే, ఆహిరి రాగంలో శ్రీ కమలాంబా జయతి, శ్రీ రాగంలో శ్రీ కమలాంబికే అనే 11 కృతులను రచించారు.

ఈ కీర్తనలలో విభక్తి అవరోహణ ప్రత్యేకత. కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ నవావరణ కీర్తనలు గానానికి క్లిష్టతరమైనవిగా చెప్పబడతాయి. దీక్షితుల వారు చాలా గొప్ప శ్రీ విద్యా ఉపాసకులు. లోకానికి ఈ ఉపాసనలోని గొప్పతనాన్ని చెప్పటానికి ఆయన దేవతల, యోగినుల వివరాలతో ఈ కృతులను రచించారు. చక్రాలను, ఆయా దేవతల వలన కలిగే సిద్ధులను ఆయన వర్ణించారు. శ్రీవిద్యా ఉపాసన అందరికీ కాదు. చాలా నిష్ఠగా, అర్హులైన గురువుల అనుగ్రహంతో చేయవలసినది. ఈ ఉపాసన సరిగ్గా తెలిసిన గురువులు కూడా చాలా తక్కువ. ఈ నాటి కాలంలో ఇటువంటి ఉపాసన తాంత్రికంగా భావించబడుతుంది. కానీ, దీక్షితుల వారు సిద్ధులైన వారు. తిరువారూరులో అమ్మను ఉపాసన చేస్తూ ఈ కృతులను రచించారు.

కమలాంబ నవావరణ కృతులలో మొదటిది కమలాంబా సంరక్షతు మాం. సాహిత్యం, భావం వివరాలు:

కమలాంబా సంరక్షతు మాం హృత్కమల నగర నివాసినీ

సుమనసారాధితాబ్జ ముఖీ సుందర మనః ప్రియకర సఖీ
కమలజానంద బోధ సుఖీ కాంతాతార పంజర శుకీ

త్రిపురాది చక్రేశ్వరీ అణిమాది సిధ్ధేశ్వరీ నిత్య కామేశ్వరీ క్షితి
పుర త్రైలోక్య మోహన చక్రవర్తినీ ప్రకట యోగినీ సుర 
రిపు మహిషాసుర మర్దనీ నిగమ పురాణాది సంవేదినీ 
త్రిపురేశీ గురుగుహ జననీ త్రిపుర భంజన రంజనీ మధు 
రిపు సహోదరీ తలోదరీ త్రిపుర సుందరీ మహేశ్వరీ

మా హృదయ కమలములలో నివసించే ఓ కమలాంబా! మమ్ములను రక్షింపుము. మంచి మనసులు కలిగిన వారిచే ఆరాధించబడుతూ కలువ వంటి ముఖము కల అమ్మా! నీవు పరమశివునికి మనసును రంజిల్ల జేసే సఖివి. కమలమునుండి జన్మించి జ్ఞానమయివై సుఖిణే తల్లివి! తారా చక్రమనే పంజరములో నివసించే చిలుకవు! త్రిపురాది చక్రములకు అధిదేవతవు, అణిమాది సిద్ధులకు ఈశ్వరివి,నిత్య కామేశ్వరివి నీవు! ముల్లోకాలను శాసించే మహారాజ్ఞివి, యోగినిగా ప్రకటితమైన అమ్మవు. మహిషాసురుని సంహరించిన ఆదిపరాశక్తివి, వేద పురాణములలో తెలుపబడిన అమ్మవు. నీవు ఆ పరమశివుని ఈశ్వరివి, కుమారుని తల్లివి. త్రిపురాసురుల సంహారాన్ని ఆనందించిన తల్లివి, శ్రీహరి సహోదరివి, త్రిపుర సుందరివి, మహేశ్వరివి. మమ్ములను రక్షింపుము.

దీక్షితుల వారి వివరాలు:



దీక్షితుల వారు సంగీతమే కాకుండా వేద వేదాంగాలు, యోగ, మంత్ర, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. భారతదేశమంతటా సంచారము చేసిన మహాజ్ఞాని. కర్ణాటక హిందూస్థానీ సంగీత శాస్త్రాలే కాకుండా పాశ్చాత్య సంగీతములో కూడా పరిశోధన చేసి నైపుణ్యము పొందిన వారు. తెలుగును ప్రోత్సహించిన సీపీ బ్రౌను గారితో కలిసి పాశ్చాత్య సంగీత బాణీలలో కూడా కృతులను స్వరపరచారు. సంస్కృతము, తెలుగు, తమిళములలో పారంగతులు. మణిప్రవాళ శైలిలో రచనలు చేసిన మహా నిష్ణాతులు. వీరి తండ్రి రామస్వామి దీక్షితులు శ్రీవిద్యా ఉపాసకులు. వీరు  తిరువారూరులోని కమలాంబికను నవావరణ ఉపాసాన చేశారు. వైదీశ్వరన్ కోయిల్‌లోని బాలాంబికను ఉపాసన చేయగా ఆ తల్లి నలభై రోజుల తరువాత అనుగ్రహించి ఓ ముత్యాల హారాన్ని ప్రసాదించింది. 1776లో తిరువారూరులోని త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల సమయంలో కృత్తికా నక్షత్రమున సుబ్బలక్ష్మి అమ్మాళ్-రామస్వామి దంపతులకు  కుమారుడు జన్మించెను. అతనికి ముత్తుకుమారస్వామి అని నామకరణం చేయగా ఆ బాలుడు ముత్తుస్వామి దీక్షితులుగా పేరుగాంచాడు. రామస్వామి దీక్షితులకు శ్రీవిద్యా ఉపాసనను అందించిన సద్గురువులు చిదంబరనాథ యోగే ముత్తుస్వామి దీక్షితుల వారికి కూడా దానిని ఉపదేశించారు. ఇది కాశీ నగరంలో జరిగింది. అక్కడే యోగులు దీక్షితుల వారికి శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతాలను బోధించారు. కాశీలో కొన్నేళ్ల పాటు సూర్యోదయమునకు పూర్వమే గంగా స్నానము, అనుష్ఠానము, అన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనము, శ్రీచక్రార్చన దీక్షితుల వారి దిన చర్య. అక్కడినుండే ఆయన నేపాల్ వెళ్లి పశుపతినాథుని, బదరీ వెళ్లి నారాయణుని కూడా సేవించారు. ఒకసారి చిదంబరనాథ యోగులు "ముత్తుస్వామీ! నీవు గంగానదిలో స్నానం చేయుటకు వెళ్లినపుడు కాలికి ఏ వస్తువు తగిలితే దానిని తీసుకొని రా" అని చెప్పారు. ముత్తుస్వాముల వారి కాలికి వీణ దొరుకుతుంది. ఆ వీణ తలభాగం పైకి తిరిగి ఉండి, దానిపై రామ అని రాసి ఉంటుంది. యోగులు శిష్యుని ఆశీర్వదించి "ఇది నీకు గంగమ్మ తల్లి అనుగ్రహము. నీవు గొప్ప సంగీత విద్వాంసుడవు, వైణికుడవు కాగలవు" అని దీవించారు. ఈ వీణ ఇప్పటికీ దీక్షితుల వారి వంశస్థుల వద్ద ఉంది. ఒకసారి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపములో కుమారస్వామి దీక్షితుల వారిని అనుగ్రహించగా తన కృతులకు గురుగుహ అనే ముద్రను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.


దీక్షితుల వారు అనేక వందల క్షేత్రాలలోని దేవతలను ఉపాసన చేసి కృతులను రచించారు. పంచభూత లింగ క్షేత్రాలు, తిరుత్తణి, పళని, కంచి కామాక్షి, వరదరాజ స్వామి, మదురై మీనాక్షి, తిరుమల వేంకటేశ్వరుడు, గురువాయూరు కృష్ణుడు, రామేశ్వరంలోని శివునితో పాటు తిరువారూరులోని త్యాగరాజస్వామి, కమలాంబికలను నుతించారు. కమలాంబ గురించి ఆయన రచించిన నవావరణ కీర్తనలు జగత్ప్రసిద్ధములు. ఈ కీర్తనల కూర్పులో వారి ప్రతిభ పతాక స్థాయిలో కనబడుతుంది. ఈ కృతులు దేవతా మూర్తులకు కట్టిన ఆలయాలవలె ప్రకాశించాయి. ఈ కీర్తనలలో తంత్ర విద్య, శ్రీచక్ర వర్ణన, యంత్ర తంత్ర మంత్ర పూజా సాంకేతిక వైభవాలు ఉట్టిపడతాయి. 1835వ సంవత్సరములో నరక చతుర్దశి నాడు ఆయనకు అన్నపూర్ణా దేవి తేజొమయ రూపము దర్శనమయ్యింది. ఆ దర్శనములో ఆయనకు తనకు సమయమాసన్నమైనదని కూడా గ్రహించారు. ఏహి అన్నపూర్ణే అని తన ఆఖరి కృతిని ఆలపించి, శిష్యులను మీనాక్షి మేముదం దేహి అనే కృతిని పాడమన్నారు. మీనలోచని పాశమోచని అన్న పదాలు వారు ఆలపించుచుండగా శివే పాహి అని జీవన్ముక్తులైనారు దీక్షితుల వారు.

భారతీయ సనాతన ధర్మంలో దీక్షితుల వారి పరంపర వారి సోదరుల కుమారుల ద్వారా, శిష్యుల ద్వార కొనసాగుతూనే ఉంది. తిరువారూరులోనే దీక్షితుల వారి బృందావనం ఉంది. వారి ఉపాసనా బలం భారతదేశమే కాదు ప్రపంచమంతటా సంగీత సాహిత్యం ద్వారా, కళాకారుల గానం ద్వారా ప్రకాశిస్తూనే ఉంది.

రంజని-గాయత్రి సోదరీమణుల గాత్రంలో పైన వివరించబడిన నవావరణ కృతి వినండి

26, ఆగస్టు 2017, శనివారం

నీ లీల పాడెద దేవా - జానకమ్మ గీతం మరియు చిత్ర విశేషాలు




నీ లీల పాడెద దేవా - 1962లో విడుదలైన మురిపించే మువ్వలు చిత్రంలో జానకమ్మ పాడిన అద్భుత గీతం. తమిళంలో కొంజుం సాలంగై అనే చిత్రం డబ్బింగ్ ఈ చిత్రం. సంగీత దర్శకులు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు గారు. నాయకుడు జెమినీ గణేశన్, నాయిక మహానటి సావిత్రి. సింగార వేలనే దేవా అనే పాటకు ఎవరు నాదస్వరానికి దీటుగా పాడగలరు అని సుబ్బయ్యనాయుడు గారు ఆలోచిస్తూ అప్పటి గాయనీమణులను అడిగితే పి. లీల గారు నాదస్వరం స్థాయి స్వరాలను పాడగలిగే గాత్రం జానకమ్మ గారికి ఉందని వారి పేరును సుబ్బయ్య నాయుడు గారికి ప్రతిపాదించారుట.  అంతే. ఓ అద్భుతం ఆవిష్కరించబడింది. ఊహించలేని గమకాలు, ఆ వేగం. సంగీతం పెద్దగా ఏమీ నేర్చుకోని శిష్ట్లా జానకమ్మ గారి గాత్రంలో నాదస్వర స్థాయికి దీటైన స్వరాలు పలికాయి. ఆ గీతం అజరామరమైంది. తమిళంలో వచ్చిన సింగార వేలనే దేవా అన్న పాటను ఆరుద్రగారు తెలుగులోకి నీ లీల పాడెద దేవా అని అనువదించారు. సుబ్బయ్య నాయుడు గారు శ్రీరాములు నాయుడు గారి పక్షిరాజా స్టూడియోలో పని చేసేవారు. తమిళ సినీ పరిశ్రమలో తొలి సంగీత దర్శకులు వీరు. ఎమ్మెస్ విశ్వనాథన్ గారు వీరి శిష్యులు. అరుణాచలం గారు ప్రఖ్యాత నాదస్వర విద్వాంసులు టీఎన్ రాజరత్నం పిళ్లై గారి శిష్యులు. ఈ చిత్రంలో నాదస్వరం వాయించే సమయానికి ఆయన వయసు 41 సంవత్సరాలు. తరువాత రెండేళ్లకే ఆయన మరణించారు.


కొంజుం సాలంగై రాజుల కాలం నాటి కథ. ఈ చిత్రంలో భరత నాట్య నృత్యాంశాలు కూడా ప్రత్యేకం. నర్తకీమణులు కమలా లక్ష్మణ్, కుచలకుమారి గార్ల మధ్య పోటీగా సాగే నృత్య గీతం ఈ చిత్రానికి మరో ముఖ్యాంశం. జానకమ్మ గారి పాటను ముంబై రామన్ స్టూడియోలో రికార్డు చేయగా అరుణాచలం గారి నాదస్వరాన్ని చెన్నైలో రికార్డు చేశారు. సాంకేతికంగా పెద్దగా వసతులు లేకపోయినా రెండిటినీ అద్భుతంగా మిక్స్ చేసి ఓ రసగుళికను ఆవిష్కరించారు సుబ్బయ్యనాయుడు గారు. కొంజుం సాలంగై అద్భుతమైన సంగీతానికి, నృత్యాలకు, కళ్లకు మిరుమిట్లు గొలిపే సెట్లకు ప్రసిద్ధి. మంచి విజయం సాధించిన ఈ చిత్రం మహానటి సావిత్రి 100వ చిత్రం కావటం విశేషం. ఈ చిత్రం పోలిష్ భాషలో కూడ విడుదలైంది. ఈ చిత్రంలో సుశీలమ్మ, లీలమ్మ, సౌందర్‌రాజన్ గారు, రాధ-జయలక్ష్మి, శూలమంగళం రాజ్యలక్ష్మి గార్లు కూడా పాడారు. ఆద్యంతం సంగీత నృత్య ఘట్టాలతో సాగే 3 గంటల రసరమ్య కావ్యం కొంజుం సాలంగై.



ఇటువంటి ప్రయోగాన్నే 1969లో విడుదలైన హిందీ చలన చిత్రం సచ్చాయీలో ఆశాభోస్లే గానంలో తిరుచెరై శివసుబ్రహ్మణ్య పిళ్ల్లై గారు నాదస్వరం వాయించగా మోరే సైయ్యా పక్డే బైయ్య అన్న గీతంగా చిత్రీకరించారు. దీనికి సంగీత దర్శకులు శంకర్ జైకిషన్.



నీ లీల పాడెద దేవా ఆభేరి రాగంలో కూర్చబడింది. వల్లీదేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని నుతించే గీతం ఇది. జానకమ్మ ప్రతిభను శాశ్వతం చేసిన గీతం ఇది. అవలీలగా పాడేశారు ఆవిడ. క్లిష్టమైన సంగతులు కలిగిన ఈ గీత సాహిత్యము.


ఆ ఆ ఆ ఆ
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా

నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా

సింధూర రాగంపు దేవా
 ఆ ఆ ఆఆ  ఆ ఆ ఆ ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా
వల్లి చెలువాలు నిను కోరు నీవు రావా
ఎలమి నీ లీల పాడెద దేవా

అనుపమ వరదాన శీల ఆ
అనుపమ వరదాన శీల
వేగ కనుపించు కరుణాలవాల
ఎలమి నీ లీల పాడెద దేవా

నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా
సగమపని నీ లీల పాడెద దేవా
నిసనిదపమ గామగరిసని పానిసగమపా మగరిస నిదమప గరిని
నీ లీల పాడెద దేవా

సా రీ సా నిసరిసా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా
నినిప మమప నీపనీప సాపనీపసా నిదపమగరి సగసా
గామపనిసా నిసగరిసరిని సాసనీ నిసదని సాసని
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ ఆ ఆ ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ ఆ ఆ
సానిపాని సాసనీ సాసనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిసనిదపా పనిమప సనిదపమ పమగరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని

దక్షిణ భారత మీరా - గాయని వాణీ జయరాం గారి విశేషాలు



ఆమె రూపం నిండైన వ్యక్తిత్వానికి నిలువుటద్దం. ఆమె గానం సమ్మోహనం. ఆమె గళంలో భక్తి, రక్తి అంతే మధురంగా పండుతాయి. "పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను..." - పాట ఆమె గళంలో వింటే సప్తస్వరాలను సరస్వతీ దేవి పలికించినట్లే ఉంటుంది. ఆ స్వామి గుడి తలుపులు తీయవలసిందే. "తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ" అంటే ఆ సూర్యనారాయణుడు వెనువెంటనే ఒప్పుకోవలసిందే. "ఆనతినీయరా హరా" అంటే ఆ హరుడు అనుమతి ప్రసాదించి తీరాలి. "బోల్ రే పపీహరా" అని పాడితే ఆ వసంతకోకిల మన ఎదుట నిలిచి పలుకవలసిందే. "మానస సంచరరే" అనే కృతి పాడితే ఆ శ్రీకృష్ణుడు ఆమె మదిలో నిలిచి తీరుతాడు. "ఒక బృందావనం సోయగం" అని వలపు గీతమాలపిస్తే పాడితే యువత ఉర్రూతలూగారు. ఆ స్వరరాణి కలైవాణి నుండి వాణీ జయరాంగా పేరొందింది.  ఆ మధుర గాయని వివరాలు ఈ బ్లాగుపొస్టులో.

30 నవంబర్ 1945వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలోని వెల్లూరులో జన్మించిన కలైవాణికి ఐదుగురు సోదరీమణులు, ముగ్గురు సోదరులు. తల్లి పద్మావతి కర్నూలులో జన్మించినవారు కావటంతో తెలుగులో పాడటం అలవాటైంది. ఆవిడే వాణి గారి తొలి గురువు. తల్లి రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆయన వద్దే వాణిని తల్లి కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారు. అయిదేళ్ల వయసులోనే ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు అపూర్వమైన రాగాలలో వాణి నేర్చుకుని పాడగలిగారు. తరువాత కడలూరు శ్రీనివాస అయ్యంగారు గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. వెల్లూరులో నాలుగవ తరగతి వరకు చదువుకున్న తరువాత వాణి గారికి మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లారు. అక్కడ వాణి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారికి శిష్యులైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఎన్నో జీఎన్‌బీ కృతులపై పట్టు సాధించారు. తరువాత శెమ్మంగూడి శ్రీనివాస అయ్యరు గారి శిష్యులైన ఆరెస్ మణి గారి వద్ద స్వాతి తిరునాళ్ కీర్తనలు నేర్చుకున్నారు. ఎనిమదవ ఏటనే ఆకాశవాణి మద్రాసులో పాడారు. పదేళ్ల వయసునుండే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారు. చిన్ననాటి నుండే హిందీ సినీ గీతాలంటే ఎంతో మక్కువ కలిగిన వాణి గారు స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన విద్యార్థిగా అవార్డును పొందారు. బీఏ ఎకనామిక్స్ చదువ్తున్నప్పుడు కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాలలో బహుమతులు పొందారు.  చదువు పూర్తైన తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్రాసు బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు. తరువాత 1967లో ఉద్యోగరీత్యా హైదరాబాదుకు బదిలీ చేయబడ్డారు. కొన్నాళ్లకే జయరాం గారిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ముంబై వెళ్లారు.

ముంబైలో వాణి గారు భర్త జయరాం గారి ప్రోద్బలంతో పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ గారి వద్ద హిందూస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. ఆ సమయంలోనే గురువు గారి సలహాతో బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు తన సమయాన్ని అంకితం చేశారు. అప్పుడు ప్రఖ్యాత సంగీత దర్శకులు వసంత్ దేశాయి గారు ప్రఖ్యాత గాయకులు కుమార గంధర్వ గారితో ఒక మరాఠీ ఆల్బం చేస్తున్నారు. ఆ ఆల్బంలో గంధర్వ గారితో కలిసి రుణానుబంధచ అనే గీతం వాణీ జయరాం పాడారు. 1971వ సంవత్సరం వాణీ జయరాం గారి జీవితంలో ఓ ముఖ్యమైన మైలురాయి. హృషీకేశ్ ముఖర్జీ గారి దర్శకత్వంలో వచ్చిన గుడ్డీ అనే చిత్రంలో వసంత దేశాయి గారు వాణీ జయరాం గారికి అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని బోల్ రే పపీహరా, హరి బినా కైసే జీయూ, హంకో మన్ కీ శక్తి అనే పాటలు అద్బుత విజయం సాధించాయి. వాణీ జయరాం గారికి తాన్సేన్ సమ్మాన్ అవార్డు, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్ అవార్డు, ఆలిండియా సినీగోయర్స్ అవార్డు పొందారు. ఈ పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల హృదయాలలో నిలిచే ఉన్నాయి. 1972లో హిందీలో ఎంతో పేరొందిన మీనాకుమారి గారి పాకీజా చిత్రంలో నౌషాద్ గారి సంగీతంలో మోరా సాజన్ అనే పాట పాడారు.  తెలుగు సినీ చిత్రాలలో తొలి అవకాశం 1973లో అభిమానవంతులు చిత్రానికి ఎస్పీ కోడండపాణి గారి సంగీతంలో వెంపటి చిన సత్యం గారు నృత్య దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడు గారు నర్తించగా ఎప్పటివలె కాదురా అన్న జావళిని వాణీజయరాం గారు పాడారు. హిందీలో చిత్రగుప్త, మదన్‌మోహన్, ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్, జైదేవ్, కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్  మొదలైన మహామహులైన సంగీత దర్శకుల వద్ద పాడారు. మహమ్మద్ రఫీ, ముకేశ్, మన్నా డే, కిశోర్ కుమార్, ఆశా భోస్లే గార్లతో యుగళ గీతాలు పాడారు. 1974 ప్రాంతంలో ముంబై నుండి చెన్నై వచ్చి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినిమాలలో గాయనిగా స్థిరపడ్డారు.

1974లో విడుదలైన అమ్మాయిల శపథం అనే చిత్రంలో నీలి మేఘమా జాలి చూపుమా అనే గీతం వాణీ జయరాం గారి తెలుగు సినీ ప్రస్థానంలో మెరిసిన గీత రాజం. 1975లో విడుదలైన కే బాలచందర్ గారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్‌లో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో పాడిన పాటలకు వారికి తమిళంలో ఉత్తమ గాయనిగా జాతీయస్థాయి అవార్డును పొందారు. 1978వ సంవత్సరంలో విడుదలైన మల్లెపూవు చిత్రంలో చక్రవర్తిగారి సంగీత దర్శకత్వంలో నువ్వు వస్తావని బృందావని అన్న అద్భుతమైన ఆరుద్ర గారి పాటను పాడారు. అదే సంవత్సరంలో వచ్చిన మరోచరిత్ర అనే బాలచందర్ గారి మరో చరిత్ర చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో విధి చేయు వింతలెన్నో అనే అద్భుతమైన పాటను పాడారు. అదే సంవత్సరంలో తెలుగులో వయసు పిలిచింది అనే చిత్రంలోని నువ్వడిగింది ఏనాడైనా వద్దన్నానా అనే గీతం వాణీ జయరాం గారి విలక్షణమైన గీతాలలో ఒకటి. 1979లో విడుదలైన మీరా అనే హిందీ చలనచిత్రం వాణీ జయరాం గారి సినీ జీవితంలో మరచిపోలేని మైలురాయి. పండిట్ రవిశంకర్‌గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా 12 మీరా భజనలను వాణీ జయరాం గారు పాడారు. మోరేతో గిరిధర్ గోపాల అనే గీతానికి 1980వ సంవత్సరానికి ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు. అలాగే 1979లో విడుదలైన కే విశ్వనాథ్ గారి ఆణిముత్యం శంకరాభరణంలో పాటలకు తెలుగులో ఉత్తమ గయని అవార్డును పొందారు. బ్రోచేవారెవరురా, మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ వంటి అద్భుతమైన గీతాలను కేవీ మహాదేవన్ గారి దర్శకత్వంలో పాడారు. 1979లోనే కే బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన గుప్పెడు మనసు చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి నేనా పాడనా పాట అన్న విలక్షణమైన గీతాన్ని గానం చేశారు. 1981లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రం వాణీ జయరాం గారికి ఎంతో పేరు తెచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా, అలలు కలలు, సాగర సంగమమే అన్న సంగీత ప్రధానమైన ప్రేమ గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.



1980వ దశకంలో ఇళయరాజా వంటి ప్రముఖ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో వాణీ జయరాం గారు పాడారు. తరువాతి కాలంలో వాణీ జయరాం గారికి తెలుగు సినీ జగత్తులో పేరు రావటానికి ప్రధాన కారణం కళాతపస్వి విశ్వనాథ్ గారి చిత్రాలే. 1987లో విడుదలైన శృతిలయలు చిత్రంలో కేవీ మహాదేవన్ గారి సంగీతంలో ఇన్నిరాశుల యునికి (బాలు గారితో), ఆలోకయే శ్రీబాలకృష్ణం, శ్రీ గణనాథం భజామ్యహం (పూర్ణచందర్ గారితో) అనే పాటలు తెలుగు సినీ అభిమానుల నోట మారు మ్రోగాయి. 1988లో విడుదలైన స్వర్ణ కమలం చిత్రంలో ఇళయరాజా గారి సంగీతంలో బాలుగారితో కలసి వాణీ జయరాం గారు పాడిన అందెల రవమిది పదములదా అనే గీతం ఎంతో ప్రజాదరణ పొందింది. భానుప్రియ గారి నాట్యకౌశలానికి వాణీ జయరాం గారి గానం వన్నె తెచ్చింది. 1991లో బాపు గారి చిత్రం పెళ్లి పుస్తకంలో త్యాగరాజస్వామి వారి జగదానంద కారక అనే కృతిని పాడారు. 1992లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతి కిరణం చిత్రం వాణీ జయరాం గారి తెలుగు సినీ నేపథ్య గాన ప్రస్థానంలో పతాక స్థాయి అనుకోవచ్చు. ఆ చిత్రంలో ఆనతినీయరా హరా అనే పాటకు వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయానిగా అవార్డు వచ్చింది. ఈ చిత్రంలొ వారు పాడిన తెలిమంచు కరిగింది, ప్రణతి ప్రణతి, శివాని భవాని, జాలిగా జాబిలమ్మ, వైష్ణవి భార్గవి, కొండ కోనల్లో పాటలు అనే పాటలు అజరామరమై నిలిచాయి. మొత్తం మీద విశ్వనాథ్ గారి చిత్ర గీతాలతో వాణీ జయరాం గారికి ఎంతో పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. 1980,90 దశకాలలో తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినీ గీతాలను వాణీ జయరాం గారు పాడారు.

జాతీయ స్థాయిలోనే కాకుండా, గుజరాతీ, ఒడియా, తమిళ, తెలుగు భాషలలో ప్రాంతీయ స్థాయి ఉత్తమగాయని అవార్డులను పొందారు. కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం వారి ఎం కే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఇలింఫేర్  జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, రేడియో మిర్చి మరియు రెడ్ ఎఫెం జీవన సాఫల్య పురస్కారం, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు మొదలైన ఎన్నో పురస్కారాలను, గుర్తింపులను పొందారు. సినీ గీతాలే కాకుండా ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు. దూరదర్శన్‌లో కూడా పాడారు. వీరు పాడిన లక్షీ, దుర్గా స్తోత్రాలు, స్కంద షష్టి కవచం, శృంగేరి శారదాదేవి గీతాలు, పరాశక్తి గీతాలు మొదలైనవి ఎంతో పేరు పొందాయి. భారత దేశంలో ఉన్న దాదాపు ముఖ్యమైన భాషలన్నిటిలోనూ వాణీ జయరాం గారు 8000కు పైగా పాటలు పాడారు. వీరి భర్త జయరాం గారు సితార్ విద్వాంసులు. నిరాడంబరమైన జీవితం క్రమశిక్షణతో జీవిస్తున్న వాణీ జయరాం గారు తనకు ఇష్టమైన పాటలలో ఒకటిగా మొరటోడు చిత్రంలోని హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే అన్న గీతాన్ని పేర్కొన్నారు. గానానికి భాషాజ్ఞానం చాలా ముఖ్యమని భావిస్తారు వాణీ జయరాం గారు. ప్రేమలేఖలు చిత్రంలోని ఈరోజు మంచిరోజు అని సుశీలమ్మ గారితో కలసి అద్భుతంగా పాడిన గీతం వాణీజయరాం గారి ఇష్టమైన మరో పాట. క్యాన్సర్ ఆసుపత్రులలో, అనాథాశ్రమాలలో పాటలు పాడి ప్రేమను పంచుకునే మనస్తత్వం వారిది. కర్ణాటక సంగీతంలో పరిశోధన చేసి కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకు వస్తున్న విదుషీమణి వీరు. దొరకునా ఇటువంటి సేవ అన్న త్యాగయ్య భావనను వేటూరి గారు శంకరాభరణంలో గుర్తు చేయగా వాణీ జయరాం గారు పవిత్రమైన నాద సాధనతో కొనసాగిస్తున్నారు. వారి సంగీత ప్రస్థానం ఇలాగే వైభవంగా ఓ యజ్ఞంలా సాగాలని ప్రార్థన. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

వాణీ జయరాం గారికి జాతీయ స్థాయి అవార్డును తెచ్చిపెట్టిన  ఆనతినీయరా హరా (స్వాతి కిరణం - 1992) గీతం వీక్షించండి.

20, ఆగస్టు 2017, ఆదివారం

నా కోసం - కథానిక



"యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచియున్నది కాదా!"...అరవై ఐదేళ్ల రామారావు శ్రావ్యంగా పాడుతూ భార్య కనకం దగ్గరకు వచ్చి "వేయి కనులతో కనకం వేచియున్నది కాదా" అని ఆమె చెంగు లాగుతూ పాడాడు. "ఇదిగో! మా అమ్మా నాన్న ఎంచక్కా కనకమహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి అని పిలుచుకునే వాళ్లు. నేను పుట్టాక మా నాన్నకు వ్యాపారంలో బోలెడు కలిసి వచ్చిందిట. పెళ్లయ్యాక మీ పుణ్యమా అని నా పేరు మోటుగా కనకం చేసేశారు...మహాలక్ష్మీ అని పిలవకూడదూ"...అంది. "కనకం! పెళ్లై 38 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు కొత్తగా నీ పేరు మహాలక్ష్మి అని ఎలా పిలవను? నా పాలిట బంగారం నువ్వు. అందుకే కనకమే నాకిష్టం" అని నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. "అబ్బో! ఈ మాటలకేమి? పోనీలేండి. నా పేరు మీకు మంచి చెస్తే మనకు మంచి చేసినట్లే కదా!" అని నవ్వుతూ భర్త కళ్లలోకి చూసింది. "ఏవండీ! పిల్లలు దూరంగా ఉన్నారు, మీరు రిటైర్ అయ్యారు. ఇదివరకంటే వాళ్ల అవసరాలు, మీ అవసరాలలో నా జీవితం తీరిక లేకుండా ఉండేది. ఇప్పుడు పెద్దగా పని ఉండటం లేదు. పిల్లల దగ్గరకు వెళ్లి ఉండే వయసు కాదు. వాళ్ల సంసారాల్లో వాళ్లు నిలదొక్కుకొని స్వతంత్రంగా ఉండవలసిన సమయం. మనం ఎక్కువ జోక్యం చేసుకోకూడదు. అందుకనే నా ఆలోచనలలో, నా జీవితంలో ఓ పెద్ద అగాథంలా ఉంది ఈ ఖాళీ సమయం. రోజు చాలా భారంగా గడుస్తోంది..." అని నిట్టూర్పుగా అంది కనకం.

"నిజమే కనకం! ఇన్నేళ్ల నుండి పిల్లల పెంపకం, నా అభివృద్ధి అనే సుదీర్ఘ సేవలో నీ సమయమంతా గడిచిపోయింది. నువ్వన్నట్లు పిల్లలు వాళ్ల జీవితాలు వాళ్లు వెళ్లబుచ్చుతున్నారు. మన ప్రమేయం ఇప్పుడు అనవసరం. ఏదో పిల్ల పాప అవసరానికి వెళ్లటం తప్ప ఇప్పుడప్పుడే మనం వాళ్లతో కలిసి జీవించకపోవటమే అందరికీ మంచిది. మనం ఎంత నవీన దృక్పథంతో ఉన్నామనుకున్నా, తరాల మధ్య అంతరం ఉంటుంది. మన ఆలోచనలు, చేసే పనులు వాళ్లకు నచ్చక పోయే అవకాశమే ఎక్కువ...." అని అన్నాడు. "కనకం! నిన్న వాకింగ్ చేస్తున్నపుడు వేంకటేశ్వర్లు గారితో సంభాషణల్లో నేను నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను అని అర్థమైంది. నేను, నా ఉద్యోగాభివృద్ధి, పరపతి మీద ధ్యాసతో నీ ఆశలు, ఆశయాలను విస్మరించాను. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నీకు కూడా జీవితంలో తృప్తిగా ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది అని ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు" అని కళ్లలో నీళ్లు నిండగా అపరాధ భావనతో కనకం చేతులు పట్టుకున్నాడు. తన మనసులో ఉన్న వేదనకు మూల కారణం భర్త గ్రహించి అంత తొందరగా, అంత పరిపూర్ణంగా స్పందిస్తాడని ఊహించని కనకం కరిగి పోయింది. "ఏమండీ! నిజమే! నాకు కూడా జీవితంలో ఏదో సాధించాలి అన్న భావన ఎన్నో ఏళ్లు ఉండేది. కొన్నేళ్లు మరుగున పడిపోయినా మళ్లీ ఇప్పుడు అది చిగురెత్తి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ మాట మీతో చెప్పలేక అగాథంలా ఉంది అన్నాను. మీరు నా మనసులోని మాట కనుక్కున్నారు. గతం గురించి అనవసరం. మీరు కావాలని చేయాలేదు కదా!! మీరు పిల్లలు నా జీవితంలో మూడింట నాలుగ వంతు. మిగిలిన ఆ పావు భాగాన్ని ఇప్పటికైనా నా స్వావలంబనకు ప్రతిబింబంగా చేసుకొవాలని, నా ఆశయాలకు మార్గదర్శకంగా ఉండాలని మనసు పరి పరి విధాలుగా కోరుకుంటోంది..." అంది కనకం.

"కనకం! ఓ వారం సమయం తీసుకో. నీకు ఏమి చేయాలనుందో, ఏమి చేస్తే నీ మనసులోని వెలితి కొంతైనా పూడుతుందో బాగా ఆలోచించి నాకు చెప్పు. మనకున్న ఆర్థిక పరిమితులలో నేను తప్పకుండా నీ ఆశయాలను నెరవేర్చటానికి వందశాతం నా వంతు ప్రయత్నం చేస్తాను" అన్నాడు రామారావు. కనకం ఆలోచనలో పడింది. "ఏదో సాధిద్దాము అనే కానీ, ఏమి సాధించాలో తెలియదే. బాధ్యతల సాగరం దాటే సరికి అస్తిత్వమే కోల్పోయానా ఏమిటి?" అని గాభరా పడింది. అంతలో సర్దుకొని తన మాతృత్వపు మధురిమలు, రామారావు భార్యగా పొందిన గుర్తింపు నెమరు వేసుకొని కర్తవ్యం గురించి మనసు దృఢపరచుకుంది.

మర్నాడు కనకం అమీర్‌పేట్ షాపింగుకు వెళ్లింది. అక్కడ రోడ్డు మీద నడుస్తుంటే తన వయసు మనిషే ఎదురై "మీ పేరు కనకమహాలక్ష్మి కదూ!" అని అడిగింది. ఎవరో వెంటనే గుర్తుపట్టని కనకం "అవునండీ! మీరు?...". "నేను పీయుసీలో క్లాస్స్మేట్ వనజను" అంది. "వనజా! నువ్వా! ఎంతలా మారిపోయావ్? అసలు గుర్తుపట్టలేకపోయాను. ఎన్నేళ్లయ్యింది...." అని సంభ్రమంగా అంది కనకం. "నువ్వు మాత్రం అలాగే సన్నగా రివటలా ఉన్నావే అందుకే గుర్తుపట్ట గలిగాను" అంది. ఆ తరువాత ఇద్దరు పిచ్చాపాటీ, అలనాటి కబుర్లు ఓ గంటసేపు. మాటల మధ్యలో వనజ "అవునూ! నీకు గుర్తుందా? ఎన్సీసీలో నీకు మంచి పేరొచ్చింది. నీకు సర్టిఫికేట్ ఇస్తూ నువ్వు దేశసేవ చేయాలమ్మా అని ఆనాడు ముఖ్య అతిథి అన్నారు. ఏమైనా సేవ చేయగలిగావా లేక పతి-బిడ్డల సేవేనా" అంది. కనకానికి అసలు తాను ఎన్సీసీ శిక్షణ పొందినట్లు, అందులో తనకు విశిష్ట పతకం లభించినట్లు అసలు గుర్తే లేదు. తన జీవితంలో అంత ముఖ్యమైన ఘట్టం ఎలా మరచాను అనుకుంది. ఓ రెండు గంటల ఆత్మీయ సంభాషణ తరువాత "వనజా! మేము కూకట్‌పల్లిలో ఉంటాము. తప్పకుండా మా ఇంటికి రా. టచ్‌లో ఉందాము" అని చిన్ననాటి స్నేహితురాలిని ఆలింగనం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లింది.

రాత్రికి కనకంలో అంతర్మథనం తీవ్రమైంది. ఆలోచనా తరంగాలు ఓ నలభై ఏళ్లు వెనక్కి వెళ్లాయి. తాను పీయుసీ చదివే రోజులు అవి. ఎంతో ఉత్సాహంగా, దేశమంటే అత్యున్నత భావాలు కలిగి, దేశభక్తి గీతాలు పాడుతూ, కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నప్పుడు మహిళా క్యాడెట్‌గా ఎన్సీసీలో చేరాలని ప్రగాఢమైన కోరిక. కాలేజీలో డ్రిల్ మాష్టారు సత్యం గారు కూడా కనకాన్ని ఎన్సీసీలో చేరటానికి ప్రోత్సహించారు. ఇంట్లో అమ్మనాన్న ఒప్పుకోలేదు. వారికి చెప్పకుండా ఎన్సీసీలో చేరింది. తరువాత ఇంట్లో తెలిసి తిట్టినా మౌనంగా భరించింది. "ఆడపిల్లవు, చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండక ఈ దేశసేవ నీకెందుకు చెప్పు? " అని వాళ్లు నీరుగార్చటానికి ప్రయత్నించినా గట్టిగా పట్టు పట్టి ఎన్సీసీ శిక్షణ మంచి గుర్తింపుతో పూర్తి చేసింది. నాన్న గారి ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన నలుగురు ఆడపిల్లలున్న సంసారం వలన చదువు పీయూసీ పూర్తవుతూనే వివాహం చేసుకుంది కనకం. ఇన్నాళ్లకు మళ్లీ తనకు అ విషయం గుర్తుకు చేసినందుకు వనజకు మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది. తనకు భర్త ఇచ్చిన వారం రోజుల సమయంలోపే తన ఆలోచనలను దృఢ పరచుకుంది.

"ఏవండీ! మానవ సేవే మాధావ సేవ అని ఎందరో పెద్దలు చెప్పారు. ఇన్నాళ్లూ నాలో మరుగున పడ్డ ఓ కోణాన్ని నిన్న నా కాలేజీ స్నేహితురాలు వనజ సమయానికి గుర్తు చేసింది. నాకు నిజంగా ఈ సమయంలో స్ఫూర్తినిచ్చేది ఈ సమాజానికి సేవ చేయటం. నేను ఆ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయం ఏమిటి? " అని పక్క మీద నిద్రపోతున్న రామారావుతో కనకం అంది. రామారావు సమాధానం చెప్పలేదు.

కనకం భర్తతో మాట్లాడుతున్నా అతని దగ్గరినుండి సమాధానం లేదు. రామారావు నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఊహించలేని ఆ ఆకస్మిక మరణానికి కనకమహాలక్ష్మి ప్రపంచం తల్లక్రిందులైంది. పిల్లలు వచ్చారు, అంత్యక్రియలు, కర్మకాండ జరిగిపోయాయి. "అమ్మా! మేము ఇక్కడ నెలల తరబడి ఉండలేము కదా! మాతో పాటు అమెరికా రా, కొన్నాళ్లు నీకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది" అని కొడుకు కూతురు కనకంతో అన్నారు. కానీ కనకం భర్త మరణం షాక్‌నుంచి తేరుకోలేదు. పైగా తనకు భర్తతో ఉన్న అనుబంధాన్ని పిల్లలతో పంచుకోవాలని కూడా ఎన్నడూ అనిపించలేదు. ఇప్పుడు తాను అమెరికా వెళ్లి నిరంతరం తన మానసిక పరిస్థితితో వారికి అసౌకర్యం కలిగించకూడదు అన్న భావనతో "నేను ఇప్పుడు రాలేనులేరా. కొన్నాళ్లు నా అంతట నేను ఉండాలి. నా పయనమెటో నిర్ణయించుకోవాలి" అని మృదువుగా చెప్పి పిల్లలను పంపించేసింది.

మనసులో ఎన్నో ప్రశ్నలు. తన ఆశయానికి ఓ రూపం వస్తోంది అనే సమయంలో భర్త మరణించటం ఏమిటి? పిల్లలకు తన మధ్య ఉన్న ఈ దూరాన్ని ఒంటరిగా ఎలా దాటటం? అని దుఃఖం, "మీకేం? హాయిగా దాటిపోయారు, మీ సుఖాలన్నీ చక్కగా అమరిపోయాయి..నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారు" అని రామారావు మీద కోపం. వచ్చిపోయేవాళ్ల సానుభూతిని కూడా భరించలేని పరిస్థితి..ఇలా, ఎన్నో వికారాలు. ఏమీ తెలియని స్థితి ఒకరోజైతే ఎక్కడలేని ధైర్యం మరో రోజు.ఒక్కోసారి మనుషులు కావాలి అన్న భావన, మరెన్నో సార్లు అబ్బ, ఎవరూ వద్దు, నా మానాన నేను జీవించాలి అన్న భావన.

కొన్నాళ్లు శూన్యం ఆవరించిన జీవితం కనకమహాలక్ష్మి. మొదట్లో పలకరింపులకు బంధువులు, ఇరుగు పొరుగు. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఓ మూడు నెలలు కనకం ఒంటరి జీవితం అనుభవించింది. ఏ పని చేసినా తన ఒక్క దానికోసమే చేసుకోవాలి. ఇన్నాళ్లూ రామారావు కోసం వచ్చిపోయే స్నేహితులు, బంధువులు వాళ్ల కోసం ఏర్పాట్లు. ఇప్పుడు కేవలం తన కోసమే వంట. ఇలా మొదలైంది ఆమె సత్యాన్వేషణ. పిల్లలు, భర్త ప్రపంచంగా జీవితంలో సింహభాగం గడిచిపోయింది. అంతకుముందెన్నడూ బయట పనులలో తనను రామారావు భాగస్వామిని చేయలేదు. ఇప్పుడో? పూర్తిగా భిన్నమైన జీవితం. కరెంటు, ఫోను వగైరా బిల్లులు, పెన్షన్ పనులు, బ్యాంక్ పనులు ఇంటి పనులు...ప్రతిదీ తనదే బాధ్యత. ఇంటర్నెట్ ఎలా వాడాలి అన్నది కూడా ఇప్పుడే శ్రీకారం. అలా తప్పటడుగులతో కనకం తన జీవితంలోని తరువాయి భాగాన్ని మొదలు పెట్టింది. పీయూసీ చదువుకుంది కాబట్టి వ్యవహారాల్లో అంత కష్టపడకుండానే విషయాలను అవగాహన చేసుకుంది.

కొన్నాళ్లకు వనజ ఫోన్ చేసింది. విషయం తెలిసి తనతో పాటు మరో ముగ్గురు చిన్ననాటి స్నేహితులను తీసుకుని కనకం ఇంటికి వచ్చింది. పలకరింపులు, నిట్టూర్పులు పూర్తయ్యాయి. ఎక్కువ శాతం మంది స్నేహితులు, బంధువులు కనకానికి పిల్లల దగ్గరకు వెళ్లమని సూచించినా ఆమెకు ఆ సలహా నచ్చలేదు. తాను తిరిగి నిలదొక్కుకొని తనకు వెళ్ళాలి అన్న భావన కలిగినప్పుడే తన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో వెళ్లాలని తీర్మానించుకుంది. స్నేహితులతో తన ఆశయాన్ని చర్చించింది.

"నువ్వున్న పరిస్థితులలో ఇవన్నీ అవసరమా! నీకు పెన్షన్ వస్తుంది, దానితో నీ జీవితానికి ఢోకా లేదు, అమెరికా వెళ్లి ఎంచక్కా పిల్లలతో సమయం గడిపేయవచ్చు. ఈ సమాజ సేవలో ఎన్ని లొసుగులో  ఎన్ని కష్టాలో నీకు తెలియట్లేదు.." అని ఒక స్నేహితురాలు. "సమాజసేవలో నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయి నువ్వు రోడ్డు మీదికోస్తే పిల్లలు దానిని హర్షించరు కనకమహాలక్ష్మి" అని మరో స్నేహితుడు..."ఆడదానివి, అందులోనూ ఒంటరిగా ఉంటావు, ఈ సమాజసేవ వల్ల నీకు ఒరిగేదేమిటి?" అని ఇంకో స్నేహితురాలు...తలా ఓ నిరుత్సాహపరచే సలహా లేదా కామెంటు. ఒక్క వనజ మాత్రం "కనకమహాలక్ష్మీ! జీవితం తల్లక్రిందులైంది అన్న పరిస్థితిలో నీ స్థానంలో ఉండే చాలా మంది స్త్రీలు పిల్లల దగ్గరకు వెళ్లిపోతారు లేదా ఎటూ కదలని స్తబ్దైన జీవితంలోకి వెళతారు. కానీ, నీ నిర్ణయం అలా లేదు. జీవిత భాగస్వామిని కోల్పోవటం అనేది చాలా పెద్ద దెబ్బ, అయినా నీ అస్తిత్వం కోసం పాటుపడే దిశగా నువ్వు ఆలోచిస్తున్నావు. అది మన దేశానికి చాలా శుభ పరిణామం. నీకు నా పూర్తి సపొర్ట్" అని కనకం ఆలోచనలను దృఢపరచింది.

స్నేహితులు వెళ్లిపోయిన తరువాత కనకం రీడింగ్ టేబుల్ దగ్గర లైటు పెట్టుకొని తన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టింది.

"వ్యక్తిత్వ వికాసం - నేటి భారతీయులలో కొరవడిన అది ముఖ్యమైన లక్షణం. ఈ వ్యక్తిత్వ వికాసాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు అలవాటు చేస్తే? ఆలోచనే ఆహా అనిపిస్తోంది. అమలు చేయగలిగితే? కొంతమంది బాలబాలికలైనా స్వావలంబన, మానసిక దృఢత్వంతో నేటి సమాజపు సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వం పొందగలరు. ఎందరో బాలబాలికలు మానసిక బలం లేక చదువుల్లో పోటీ ప్రపంచంలో నిలువలేకున్నారు, యువతీయువకులు వైవాహిక మరియు ఉద్యోగ జీవితాలలో సమస్యలను ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. కొద్ది మంది బాలబాలికలు మరియు యువతీ యువకులకైనా జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వాన్ని శిక్షణ ద్వారా, అవగాహన ద్వారా అందించ గలిగితే నాకు ఎంతో ఆత్మ సంతృప్తి. ఇదే నా మిగిలిన జీవిత లక్ష్యం. దానికి ముందు నేను దృఢ సంకల్పంతో ఉండాలి. దానికి సాధన నేడే ప్రారంభం".

రాసుకున్న అక్షరాలను పదే పదే చదువుకుని, రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకుంది  కనకం. మరునాడు ఉదయమే లేచి తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది. మూడు నెలల సమయంలో ఆర్కే (రామారావు - కనకం) పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ అని పాఠశాల, కళాశాల విద్యార్థులకు వారి వయసును బట్టి ప్రణాలిక సిద్ధం చేసి దానికి ఇద్దరు మనస్తత్వ నిపుణులు, ఇద్దరు విద్యావేత్తల సేవలను వినియోగించుకొని విద్యాసంస్థలతో అనుసంధానం ఏర్పరచుకోవటంలో కనకం సఫలమైంది. రెండేళ్ల కఠోర శ్రమ తరువాత ఆర్కే ఇన్స్టిట్యూట్ హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాలలో కూడా పేరొందింది. ప్రముఖుల జీవిత పాఠాలు, చరిత్రలోని ఘటనలు, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తకాలు, శిక్షణా కార్యక్రమాలను తన ప్రణాలికలో విద్యార్థుల తరగతి, వయసు మరియు అవగాహనకు తగినట్లుగా రూపొందించి ఆ ప్రణాలికల అమలులో తాను ముందుండి నడిపించింది కనకం. ఓ ఐదేళ్లలో ర్యాగింగ్, యాసిడ్ అటాక్, బాలికలపై అత్యాచారం, గృహ హింస వంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కునే ప్రణాలికలు విస్తృతంగా ప్రచారం చేసింది ఆర్కే ఇన్స్టిట్యూట్.

"విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనే ముఖ్యమైన అంశంపై ప్రభావవంతమైన, విజయవంతమైన శిక్షణను, ప్రణాలికలను అందిస్తున్న ఆర్కే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంస్థ అధినేత్రికి తెలంగాణా ప్రభుత్వం వారి విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేయవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నాము..."...క్రిక్కిరిసిన రవీంద్రభారతి ఆడిటోరియం హాలులో గవర్నర్ చేతుల మీదుగా సేవా పురస్కారాన్ని అందుకునే వేళ కనకం మనసులో భావోద్వేగం, ఏదో సాదించానన్న ఆత్మ సంతృప్తి, మరో పదేళ్లు సేవ చేయాలన్న ఉత్సాహం కలిగాయి. ఎదురుగా కూర్చొని చప్పట్లు కొడుతూ ఆనందబాష్పాలు తుడుచుకుంటున్న స్నేహితురాలు వనజ, అమెరికా నుండి మర్నాడు ఇంటర్నెట్‌లో తల్లి గురించి వచ్చిన వార్తలను చూసి పొంగిపోయిన బిడ్డలు ఆమె ఆనందంలో, ఆ స్థాయికి చేరటంలో పడ్డ కష్టాలలో భాగస్వామ్యులు. నేడు వంటింటికి పరిమితం కాని వనిత కనకమహాలక్ష్మి. ఆ ఇంకేముంది పెన్షన్ వస్తుంది జీవితం గడిచిపోతుంది అని అనుకునే అగమ్యగోచరమైన వితంతువు కాదు. పిల్లలే జీవితం అనుకుంటూ పిల్లలపై ఆధార పడని సాధికరత పొందిన తల్లి ఆమె. ఆర్కే అనే ఒక బ్రాండ్‌కు మారుపేరు కనకం. సమాజ సేవ చేస్తూ ఆర్థిక స్వావలంబన కలిగిన ధీర వనిత. ఆమె ఒక మార్గదర్శి. స్ఫూర్తిప్రదాత.

"నా కోసం" అని పరితపిస్తూ ముందడుగు వేయలేకపోతున్న ప్రతి మహిళకు ఈ కథానిక అంకితం!

- ప్రసాద్  అక్కిరాజు 

పాండురంగ మహత్యం – 1957: భక్తి రస కావ్యం

1957 నవంబర్ 28న విడుదలైన పాండురంగ మహత్యం తెలుగు భక్తి చిత్రాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్...