10, జనవరి 2021, ఆదివారం

ఎదుటనున్నాడు వీడే - అన్నమాచార్యుల కృతి


పరబ్రహ్మమైన శ్రీహరి దేవకి కడుపున అసాధారణమైన పరిస్థితులలో అవతారం దాల్చి, అటువంటి అసాధారణ పరిస్థితులలోనే దేవకి చెంతకు చేరి ఆ తల్లితో అపురూపమైన బంధాన్ని పంచుకున్నాడు. బ్రహ్మాండమును బాలుని నోట జూచినా, వైష్ణవమాయలో ఆ తల్లి పరమాత్మను బిడ్డగానే భావించి అవ్యాజమైన ప్రేమను పంచింది. ఇక పెరుగుతున్న కొద్దీ ఆ బాలుని లీలలు అన్నా ఇన్నా? వెన్నముద్దలు దొంగిలించాడు, పశువులను గాచాడు, రాక్షసులను సంహరించాడు, శాపగ్రస్తులకు మోక్షాన్ని కలిగించాడు, కాళీయుని పొగరణచాడు, రాసలీలలో పాల్గొన్నాడు.... అడుగడుగునా వైనమంత వల్లించలేని లీలలు, నమ్మశక్యం గాని చేష్టలు. వీటిని అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలెన్నిటో అద్భుతంగా ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి ఎదుటనున్నాడు వీడే. వివరాలు:

సాహిత్యం
========

ఎదుటనున్నాడు వీడే! ఈ బాలుడు!
మది తెలియమమ్మ ఏమరులో గాని!!

పరమపురుషుడట పశుల గాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని

వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూలమీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కతలో గాని

అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిపి శ్రీవేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంతో కరుణో గాని

భావం
=====

ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా! ఇతడే పరమపురుషుడట, మరి పశువులను గాస్తున్నాడుట, ఈ తీరులను లెక్కించిన అర్థమయ్యే సంగతులు కావు. ఇతడే శ్రీహరియట, అందరికీ మురిపాలు అందిస్తున్నడట, ఇవేమి మాటలో గానీ స్థిరమై నిలిచాయి. ఇతడు వేదాలకు ప్రభువట, మరి వెన్నలు దొంగిలించిన వాడు కూడా ఇతడేయట, శ్రద్ధగా విన్న వారికైనా ఇది నమ్మదగినదేనా? అన్నిటికీ మూలము ఇతడేనట, ఇతడివి కొంటె చేష్టలట, ఇవి కథలే తప్ప మంచి మాటలు కావు. ఇతడు బ్రహ్మకు తండ్రియట, మరి యశోదకు బిడ్డ కూడా అట, మనపై ఎంత కరుణో ఉందో, అందుకే తన మహిమలను తెలిపేందుకు శ్రీవేంకటాద్రిపై దేవుడై నిలిచినాడట, ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా!

శ్రవణం
=======

భుజంగిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి