RightClickBlocker

29, జులై 2017, శనివారం

ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! - వేటూరి గీతం


ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! సాంద్రకళాపూర్ణోదయ! లయ నిలయ!

పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా! నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ!

త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై 
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస! నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయ!

- వేటూరి సుందరరామ్మూర్తి గారు

కవుల ఆధ్యాత్మిక దార్శనికత వారి రచనలలో తేటతెల్లమవుతుంది అన్నదానికి వేటూరి వారి ఓం నమశ్శివాయ అనే గీతం ప్రత్యక్ష నిదర్శనం. కళాతపస్వి ఆలోచనలను, శైలిని ప్రేక్షకుల హృదయాలలో నిలిపేలా చేసేవి వారి చిత్రాలలోని గీతాలు. అటువంటిదే ఓం నమశ్శివాయ అనే గీతం. వేటూరి వారికి సాగరసంగమంలో ఆ సందర్భానికి ఇటువంటి గీతాన్ని రాయమని చెప్పటం విశ్వనాథ్ గారి కళాత్మక దృష్టిని,ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తుంది.

నెలవంక చంద్రుని శిరసుపై గల సహృదయుడవు, పరిపూర్ణమైన కళలకు నిలయమైన వాడవు, లయ యందు నివసించే వాడవు అయిన శివా! నమస్కారములు. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు ఐదు ముఖములుగా (సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు), ఆరు ఋతువులు ఆభరణములైన ఆహార్యముగా, ప్రకృతి రూపిణియైన పార్వతి నీతో నడిచే అడుగులే సప్తస్వరాలు. నీ చూపులే అష్ట దిక్కులు, నీ పలుకులు నవరసాలు. నీవు తాపసులలో శ్రేష్ఠుడవు. నీ మౌనం నుండే ఉపనిషత్తులు ఈ భువిలో వెలసాయి. ఓ పరమశివా! నీకు నమస్కారములు. మూడు కాలములు నీ మూడు కళ్లుగా, నాలుగు వేదాలు నీ నివాసమైన కైలాసానికి ప్రాకారాలుగా, గణపతి, కుమారస్వామి మొదలైన ప్రమథ గణాలు నీ సంకల్పాన్ని అమలు చేసే ఋత్విజ శ్రేష్ఠులై, అద్వైత భావనతో నీ యోగము సనాతనమై, నీ  లయలు కాలానికి ముందడుగులై నీ గానం వాయిద్యములతో జంత్రగాత్రమై శృతిలో పలికినావు. ఓ కైలాసవాసా! నీకు నమస్కారములు.

సృష్టి స్థితి లయములలో లయకారకుడు శివుడు. ఆ లయానికి నాదం మూలం. నిరంతర నాద పరివేష్టితుడైన పరమ శివుడు ఆనంద తాండవంతో పాటు విలయతాండవం కూడా చేస్తూ నిరంతరం ధ్యానంలో ఉంటాడని మన వేద వాఙ్మయం ఘోషిస్తోంది. ఆ పరమశివుని కైలాస ప్రస్తారాన్ని ఒక్కసారి కళ్ల ముందుంచే ప్రయత్నం వేటూరి వారు ఈ గీతం ద్వారా చేశారు. సాహిత్యంలోని భావాన్ని పరిశీలిస్తే శివతత్త్వం ప్రస్ఫుటమవుతుంది. నీ మౌనమే దశొపనిషత్తులై ఇల వెలయ అని గీతాన్ని ముగించారు వేటూరి వారు. మౌనమేమిటి ఉపనిషత్తులేమిటి అని ప్రశ్న రావచ్చు. దక్షిణామూర్తి ఎవరు? శివుడే కదా? మౌనంతో ఋషులకు జ్ఞానబోధ చేసిన ఆ పరమశివుని సంకల్పం అద్భుతం. ఇటువంటి తత్త్వం వింటేనే మనసు పులకరిస్తుంది.

ఇళయరాజా గారి సంగీతం, వేటూరి వారి సాహిత్యం, జానకి గారి గాత్రంలో ఈ గీతం అజరామరమైంది. సాగర సంగమం చిత్రానికి ఇళయరాజా గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం లభించింది. వేటూరి గారికి, విశ్వనాథ్ గారికి, ఇళయరాజా గారికి ఇటువంటి గీతాన్ని అందించినందుకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి