29, జులై 2017, శనివారం

రారా కృష్ణయ్య - దాశరథి గీతం



దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు 
దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నము వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా

రారా కృష్ణయ్య రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రారా

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపము నీవే
అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా నీవే కృష్ణా నీవే కృష్ణా

కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికి జ్ఞానమొసుగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం

కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూచి బాధలన్నీ మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా
కృష్ణా కృష్ణా రారా కృష్ణా 

శరణాగతితో ఆర్తితో వేడుకుంటే బ్రోచే కరుణామయుడు పరమాత్మ. ఈ సత్యాన్ని ఎన్నో ఉదాహరణలుగా మనకు సనాతన ధర్మ ప్రవాహంలోని వేద వాఙ్మయం, పురాణాలు, ఇతిహాసాలు, గాథలు ఘోషించాయి. కలియుగంలో కూడా సద్గురువుల కృపతో పరమాత్ముని అనుగ్రహం మనకు అంది అద్భుతాలు జరుగుతున్నాయి. బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలు, బ్రతకడు అనుకున్న బిడ్డ పూర్ణాయుష్మంతుడు కావడం, మూగవానికి మాటలు రావటం వంటివెన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే తిరుమల స్వామి దర్శనం తరువాత మాట వచ్చిన మూగవాడే ఈ పరమాత్మ అనుగ్రహానికి సాక్షి. ఇసద్గురువుల అనుగ్రహంతో వైద్యులు పిల్లలు పుట్టరు అన్నవారికి పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో నాకు తెలుసు. అటువంటి వాటిని చలన చిత్రాలు కూడా ప్రస్తావించాయి. వాటిలో 1968లో విడుదలైన రాము చిత్రంలోని బాలుడి పాత్ర, రారా కృష్ణయ్యా అనే గీతం.

దేవాలయాలు సందర్శన కోసమే కాదు సత్పురుషుల, యోగుల సాంగత్యానికి కూడా అని మనకు కొన్ని చలనచిత్రాలు అద్భుతంగా తెలిపాయి. అప్పటి చిత్రాలలో దేవాలయ సన్నివేశాలు తప్పకుండా ఉండేవి. దీక్షతో, మంత్ర జప సాధనతో, అధివాసములతో, యంత్ర మహిమతో ప్రతిష్ఠించబడిన దేవాలయ మూర్తులు పరమాత్మ ప్రతిబింబాలు. అటువంటి దేవాలయాలు యోగులకు, సాధువులకు, భక్తులకు ఆలవాలమై పవిత్రమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అక్కడ దివ్యత్వం నిండి ఉంటుంది.  మన పాపాలను, మనసులలోని మలినాలను ప్రక్షాళన చేసుకునే అవకాశాన్ని దేవాలయాలు కలిగిస్తాయి. అటువంటి సన్నివేశమే రాము చిత్రంలోని ఈ గీత నేపథ్యం. తల్లి మంటలలో చిక్కుకొని మరణించటం చూస్తూ ఆ బాలుడు మాట కోల్పోతాడు. ఆ తండ్రి ఆవేదనతో డాక్టర్లకు చూపించగా అతనికి మాట వచ్చే అవకాశం లేదని చెబుతారు. అప్పుడు ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోబోతాడు. తండ్రి కూడా నిరాశతో కొడుకుతో కలిసి సముద్రంలో మునిగిపోయే ప్రయత్నం చేయబోగా ఓ మందిరంలో కృష్ణుని రారా అని పిలుస్తున్న ఓ సాధువు పాట విని తండ్రీ కొడుకులు అక్కడికి వెళ్లి ఆ కృష్ణుని ప్రార్థిస్తారు. ఆ పరమాత్మ అనుగ్రహంతో మళ్లీ మరో అగ్నిప్రమాద సన్నివేశంలో బాలుడికి మాటలు వస్తాయి. అమ్మలా ప్రేమించే టీచరమ్మ మంటల్లో చిక్కుకోగా బాలుడు మాట్లాడే ప్రయత్నం చేసి అమ్మా అని పిలిచి సఫలమవుతాడు.

దాశరథి గారి గీతానికి ఆర్.గోవర్ధనం గారు సంగీతం అందించగా ఘంటసాల మాష్టారు ఈ భక్తి గీతాన్ని అద్భుతంగా పాడారు. పరమాత్మ సన్నిధే మనకు శరణు అన్న భావన ఈ గీతం కలిగిస్తుంది. ఇహపరాలు రెండిటిలోనూ మనలను తరించేది పరమాత్మే అన్నది ఈ గీతం ద్వారా దాశరథిగా చక్కగా తెలియజేశారు. ఘంటసాల మాష్టారు గళంలో భక్తివిశ్వాసాలు, శరణాగాతి సుస్ఫష్టంగా, భావరాగ యుక్తంగా మన హృదయాలను హత్తుకుంటాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి