5, మార్చి 2017, ఆదివారం

జగమే రామమయం మనసే అగణిత తారకనామమయం


రామనామం రుచి ఒక్కసారి చవి చూసిన వారికి ఇంక వేరే ఏమీ రుచించదు. ఆ రాముని భక్తి సామ్రాజ్యంలో ప్రవేశించిన వారికి ఇంక వేరే ఏమీ అక్కర ఉండదు. రాముని సేవే భృతి, ద్యుతి. ఆయనకు శరణాగతితో సేవ చేసి, ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండటంలోనే వారికి సర్వస్వం. ఏ రాజుల ఆశ్రయం రుచించదు, ఎవ్వరినీ పొగడ మనస్కరించదు. అలా రామభక్తిలో తరించిన మహానుభావులలో పోతన, రామదాసు, త్యాగయ్య మొదలైన వారితో పాటు ఆతుకూరి మొల్ల కూడా ఉన్నారు. కడప జిల్లా బద్వేలు సమీపంలోని గోపవరం గ్రామానికి చెందిన కేసన శెట్టికి మొల్ల 1440వ సంవత్సరంలో జన్మించిందని చారిత్రకుల అభిప్రాయం. అన్నమాచార్యుల వారి భార్య తిమ్మక్క తరువాత మొల్ల తెలుగులో రెండవ కవయిత్రిగా చెప్పుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుని కొలిచే కేసన తన బిడ్డకు ఆ శివునికి ప్రియమైన అడవి మల్లె పేరు మొల్ల అని పెట్టుకున్నాడు. శివునే తన గురువుగా భావించిన మొల్ల ప్రభావితమై సంస్కృత రామాయాణాన్ని తెలుగులోకి అనువదించింది. పోతనకు ఈమె సమకాలీకురాలు కావచ్చు. వీలైనంత తెలుగుపదాలలోనే రామాయణాన్ని రచించాలన్న సంకల్పాన్ని ఆమె తన రామయణంలోని మొదటి పద్యాలలో వెలిబుచ్చింది. అదే విధంగా రచన చేసింది. పోతనలాగానే ఈమె తన రచనలను రామునికి తప్ప ఎవ్వరికీ అంకితం చేయకూడని నిర్ణయించుకుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాను రచించిన రామాయణాన్ని పలికే అవకాశం ఆమెకు కలిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. మొల్ల రామాయణంలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. మచ్చుకు కొన్ని పద్యాలు:

కామారి వినుత నామా!
సామీరికృతప్రణామ! సంహృతరక్షో
గ్రామా! వర్షా మేఘ
శ్యామా! సంగ్రామ భీమ! జానకిరామా!

విమల సుధాకర వదనా!
సుమనశ్చేతోబ్జసదన! సుస్థిర కదనా!
కమనీయరదన! శత్రు వి
షమ! రఘుకుల సార్వభౌమ! జానకిరామా!

కువలయదళనేత్రా! కోమల స్నిగ్ధ గాత్రా!
భవముఖనుతిపాత్రా! భక్త వృక్షాళి చైత్రా!
రవిశతసమధామా! రక్షితాక్షాంఘ్రి భామా!
కవిజననుతనామా! కావుమా మమ్ము రామా!

ఈ కవయిత్రి మొల్లపై ఇంటూరి వేంకటేశ్వరరావు గారు కుమ్మరి మొల్ల అనే నవల రచించారు. ఈ నవల ఆధారంగా ప్రఖ్యాత హాస్యనటులు బసవరాజు పద్మనాభంగారు 1970లో కథానాయిక మొల్ల చిత్రాన్ని ఆవిష్కరించారు. ఆ చిత్రంలో మొల్లగా వాణిశ్రీ నటించారు. చిత్రం పతాక సన్నివేశంలో మొల్ల గానం చేసినట్లుగా ఈ రాముని గీతాన్ని అందించారు. గీతాన్ని డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు రచించగా ఎస్పీ కోదండపాణి గారు సంగీతం అందించారు. పూలపాక సుశీలమ్మ గారు అద్భుతంగా రామగానం చేశారు.

రఘుకుల తిలకా నీ ఆనతి
రచియించితి రామాయణ సత్కృతి
ఆ కృతి వరియించినాపతివి నీవే
అతులిత కైవల్య గతివి నీవే

జగమే రామమయం మనసే అగణిత తారకనామ మయం

నీలజలద రమణీయ రూపం
నిగమాంచల మందిర మణిదీపం
సుందర జానకి వందిత చరణం
సురముని శరణం భవ తాప హరణం

ఆ చిరునవ్వే అమృతపు జల్లు
అఖిల జగములేలు ఆ చేతి విల్లు
అతని గానమున అలరారు కావ్యం
అన్ని యుగాలకు నవ్యాతి నవ్యం

ఎవని కమల కమనీయ పదము చూపించె అహల్యకు ముక్తి పదము
ఎవని చంద్రికా మృదుల కరము అందించె శబరికి దివ్య వరము
ఎవని ఏలుబడి ఇంటికొక్క గుడి నిలిపెనో
ఎవని రాజ్యమే రామరాజ్యమై వెలసెనో
ఆ రాముడు నా అంతరంగమున నిండగా
అహము మరచి ఈ ఇహము మరచి జన్మాంతర బంధములెల్ల విడచి
ఆ మహజ్జ్యోతిలో లీనము కానా రాం రాం
ఆ మహాప్రభునిలో ఐక్యము కానా రాం రాం
ఓ రామా రఘురామా కైవల్య నామా రాం రాం

ఆ రామును ఆజ్ఞతోనే తన కావ్యం అని మొల్ల ఈ గీతాన్ని ఆరంభించిన రీతి రామభక్తుల విశ్వాసాన్ని సూచిస్తుంది. తన కృతిని రామునికే అంకితం చేస్తున్నానని అందరి సమక్షాన ప్రకటిస్తుంది. తనకు ఆ రాముడే కైవల్యమని చాటుతుంది. ఎలా? ఆమెకు ప్రపంచమంతా రాముడే. మనసునిండా అనతమైన మహిమ గల తారక నామం.

ఆ రాముడి రూపం ఎటువంటిది? నీలమేఘ శరీరముతో రమణీయమైనది, వేదశాస్త్రముల అంచులలో ప్రకాశించే మణి ఆ రాముని తత్త్వం. అందమైన సీత నమస్కరించిన పాదాలు ఆ రామునివి. దేవతలకు, మునులకు శరణం ఆ చరణాలు, మానవుని పాపములను, తాపమును హరించేవి ఆ చరణాలు. ఆ రాముని చిరునవ్వు అమృతము కురిసినట్లుగా ఉంటుంది. ఆ చేతి విల్లు సమస్త జగాలను శాసిస్తుంది. అతని వర్ణనే రామాయణంగా అలరారుతుంది. ఆ రామాయణం ఎన్ని యుగాలు గడిచినా నిత్య నూతనమే. అతని అందమైన పదకమలములు అహల్యకు ముక్తి పథాన్ని చూపించాయి. అతని పూవులవలె మృదువైన చేతులు శబరికి దివ్యమైన వరాలు అందించాయి. అతని రాజ్యంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారింది. అతని రాజ్యం రామరాజ్యంగా చెప్పబడింది. అటువంటి రాముడు నా అంతరంగములో నిలిచి ఉండగా, నేను అనే అహాన్ని విడిచి, దేహ స్ఫురణ మరచి, జన్మ జన్మల బంధాలు వీడి ఆ మహాజ్యోతిలో లీనము కానా? ఆ మహాప్రభువులో ఐక్యము కానా? అని అద్భుతంగా గానం చేస్తూ, రామ నామ స్మరణ మధ్య తన దేహాన్ని త్యజించి జీవాత్మను ఆ పరమాత్మలో ఏకం చేస్తుంది.

మొల్ల రామాయణాన్ని తెలుగులోకి అనువదించి తరిస్తే ఆమె వ్యక్తిత్వాన్ని ఈ గీతంతో అనుసంధానం చేసి రామ తత్త్వాన్ని మరింత ప్రజలలోకి తీసుకువెళ్లారు సి. నారాయణరెడ్డి గారు. రామభక్తి గీతలను గమనిస్తే అన్నింటికీ కొన్ని సారూప్యాలుంటాయి - మొదటిది రామనామ మహిమ, రెండవది రాముని గుణరూపవైభవ వర్ణన, మూడవది శరణాగతి. రామభక్తిలో ముక్తి ఆఖరి సోపానమైతే దానికి పునాదులు దృధమైన రామనామ స్మరణము, తద్వారా భవ పాపహరణం. నారాయణరెడ్డి గారి గీతాలలో తెలుగుదనం అందరికీ తెలిసిందే. ఆ తెలుగుదనానికి భక్తి సుగంధం అలదితే? దానికి రామభక్తి పారిజాత పరిమళం సమీరంలా సోకితే? ఈ గీతం అలాంటిదే. నీలమేఘశ్యాముని సుందరం రూపాన్ని కాంచి, వేదవేదాంగాలలో చెప్పినది ఆ తత్త్వమే అని గ్రహించి, జానకి కొలిచినది ఆయన పాదములే అని తలచి, అందరి ఆర్తిని తొలగించంది ఆ రాముని పాదములే అని మొల్ల వంటి మహాభక్తురాలు, కవయత్రి పాత్ర ద్వారా మనకు తెలియజేశారు కవి. మొదటి చరణంలోని పద ప్రయోగం ఆయన ప్రతిభకు, భక్తికి తార్కాణాలు. రెండవ చరణంలో ఇంకొక అడుగు ముందుకు వేసి రాముని మనోహరమైన చిరునవ్వును, అతి శక్తివంతమైన కోదండమును, అతని గుణాలను, నడవడికను తెలిపే రామాయణాన్ని ప్రస్తావించి ఆ గాథను ఎప్పటికీ ఇగిరిపోని గంధంగానే పలికారు. రామాయణంలో రాముని మహిమలు తెలిపే కొన్ని కీలకమైన ఘట్టాలు అహల్యా శాపవిమోచనం, శబరికి మోక్షం, రామరాజ్య స్థాపనను ప్రస్తావించారు. అటువంటి రాముడు మనసులో స్థిరమైతే, ఆయన తారక నామమే అంతరంగంలో నిలిచిపోతే మరి దేహము స్ఫురణ దూరమై, అహంకారం పటాపంచలై కైవల్యప్రదమవుతుంది. మొల్ల వంటి కవయిత్రికి, రామభక్తురాలికి ఇటువంటి భావనతో నిండిన గీతం ఎంతో సముచితం. నారాయణరెడ్డి గారి భావగర్భితమైన గీతం పతాక సన్నివేశాన్ని రామభక్తి ప్రవాహంతో తడిపి పునీతం చేస్తుంది. సుశీలమ్మ గానం, కోదండపాణి గారి సంగీతం ఈ పాటకు మరింత పవిత్రతను చేకూర్చాయి.

శ్రీరామ జయరామ జయ జయ రామ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి