26, మార్చి 2017, ఆదివారం

రామకథా సుధా రసపానము - త్యాగరాజస్వామి భక్తి సోపానము


సీతా రాముల చరిత్ర అతి పావనము. రాముని నామము సకల క్లేశ హరణము, భవాబ్ధి తారకము, మోక్ష కారకము. సీతారాముల నడవడిక అన్ని యుగాలకు ఆదర్శ ప్రాయము. వీరి కథను ఎందరో మహానుభావులు అనేక విధాలుగా నుడివి, ప్రచారం చేసి, దానిలోనే తరించారు. ఆదికవి మొదలు నేటి కవుల వరకు రామకథామృతంతో ముక్తిని పొందిన వారే. సద్గురువు త్యాగరాజ స్వామి వారు ఆ సీతారాముల చరిత్ర యొక్క మహత్తును తెలిపే కృతులను ఎన్నో రచించారు. వాటిలో రామకథా సుధా రస పానమొక రాజ్యము అనే కీర్తన ఒకటి. వివరాలు:

రామ కథా సుధా రస పానమొక రాజ్యము చేసునే 

భామామణి జానకి సౌమిత్రి 
భరతాదులతో భూమి వెలయు శ్రీ

ధర్మాద్యఖిల ఫలదమే మనసా 
ధైర్యానంద సౌఖ్య నికేతనమే 
కర్మ బంధ జ్వలనాబ్ధి నావమే 
కలి హరమే త్యాగరాజ నుతుడగు

అర్థము:

ఓ మనసా! రామకథ అనే అమృతాన్ని సేవించటమనేది ఒక సామ్రాజ్యము. నారీశిరోమణి అయిన సీత, భరతలక్ష్మణాదులతో ఈ భూమిపై వెలసిన సీతారాముల కథ అత్యంత పవిత్రమైనది. ధర్మార్థ కామ్య మోక్షములనే చతుర్విధ పురుషార్థముల ఫలమునిచ్చేది ఈ సీతారాముల సత్కథ. ధైర్యానికి, ఆనందానికి, సుఖానికి సూచిక ఈ రామకథ. కర్మబంధములనుండి విముక్తి పొందటం ఓ పెద్ద సాగరాన్ని దాటటం వంటిదే. ఆ తారకానికి నావ రామకథ. శివునిచే నుతించబడిన ఆ రాముని కథకలియుగములో సమస్త పాపాలను హరించేది.

వివరణ:

శ్రీమద్రామాయణ పారాయణ భక్తితో, శరణాగతితో, శుద్ధ అంతఃకరణముతో చేసే భక్తులకు త్యాగయ్య భావన తప్పక అనుభూతిగా కలుగుతుంది. రామాయణంలో ఉన్న గొప్పతనం ప్రతి అడుగులోనూ సీతారాములలో ఉన్న ధర్మాచరణం. రాజధర్మంతో పాటు, పుత్ర ధర్మం, సోదర ధర్మం, పతి ధర్మం, స్నేహ ధర్మం, శత్రు ధర్మం...ఇలా అన్ని పాత్రలలోనూ తన ధర్మాన్ని ఆచరించి దివ్యత్వాన్ని ఎలా పొందాలో రాముడు మానవజాతికి తెలిపాడు. ఆయన ఔన్నత్యం ఎటువంటిది అంటే ఆయన గురించి తెలిసిన వారందరూ నిరంతరం ఆయనను చూడాలని తహతహలాడే వారు, ఆయననే ధ్యానించే వారు. ధర్మాచరణతోనే అర్థములు పొందిన వారు సీతారాములు. తండ్రి మాటకై రాజ్యాన్ని వదులుకొని వనవాసం చేయటమంటే మాటలు కాదు. ఆ పితృవాక్య పరిపాలన, పతిని అనుగమించటం అనే ధర్మాలను పాటించి తద్వారా లభించిన అర్థాన్ని మాత్రమే స్వీకరించారు. అలాగే ఎన్ని లోభాలు ఎదురుగా నిలచినా ధర్మాచరణమే వారి నడవడికగా నిలిచింది. ధర్మార్థములతోనే తమ కామ్యములను సిద్ధింపజేసుకున్నారు. అడుగడుగునా దీనిని నిరూపించి అవతార సమాప్తి గావించారు. ఈ విధంగా చతుర్విధ పురుషార్థముల ఫలములను సామాన్య మానవుల రూపంలో పొందారు. అందుకే రామ కథామృతం ధర్మాద్యఖిల ఫలదము అని త్యాగరాజస్వామి చెప్పారు.

శ్రీమద్రామాయణంలో మానవునికి భవసాగరంలో కలిగే కష్టాల ప్రస్తావన, వాటిని ఎలా దాటవచ్చో మనకు సుస్పష్టంగా తెలియజేశారు. ధర్మాచరణ, కర్మానుష్ఠానం, గురువులను ఆశ్రయించటం, సత్సాంగత్యం, సన్మిత్రాన్వేషణ, ఆశ్రిత జన పాలన, రాజనీతి, సుయోచన చేయగలిగే వారిని అర్థించటం, దైవభక్తి..ఇలా ఆధ్యాత్మిక సోపానంలో మనకు అనాదిగా చెప్పబడిన సాధనాలన్నిటినీ సీతారాములు ఆచరించి మనకు మార్గదర్శకులైనారు. అరణ్యవాస ఆరంభంలో అత్రి-అనసూయల బోధ, తదుపరి అనేక ఋషుల ఆశీర్వచనములు, జటాయు-సంపాతిల సహాయము, సుగ్రీవాదులతో మైత్రి, జాంబవంతుని జ్ఞానం, హనుమంతుని అపారమైన బుద్ధిర్బలాలు, విభీషణుని సహాయం..ఇలా అడుగడుగునా వనవాసంలో సమిష్టి కృషితోనే రాముడు ధర్మ స్థాపన చేశాడు. అలాగే తన ధర్మాన్ని నిర్వర్తించి తన బంధు మిత్ర ఆశ్రిత గణాలకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని కలిగించాడు. అందుకే రామకథా సుధ ధైర్యానంద సౌఖ్యాలకు సూచికగా త్యాగరాజస్వామి పలికారు.

ఇక రామ నామము భవ తారకమనేది జగద్విదితమే. సృష్టి యొక్క స్థితి లయములకు కారకులైన నారాయణుడు, శివుని యొక్క నామములనుండి ఉద్భవించిన రామ నామము అత్యంత శక్తివంతమైనది. ఆ నామానికి ఉన్న మహత్తును స్వయంగా సదాశివుడు పార్వతికి తెలియజేశాడు. "కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుం మిచ్ఛామ్యహం ప్రభో" (స్వామీ! శ్రీహరి వేయి నామాలను పఠించిన కలిగే ఫలము ఏ లఘు ఉపాయముతో పండితులు నిత్యం పఠించి పొందుతున్నారు, వినాలని ఉంది చెప్పండి) అని అడుగగా ఆ పరమేశ్వరుడు "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే" (ఓ పార్వతీ! శ్రీరామ రామ రామ అన్న పఠనం ఆ శ్రీహరి వేయి నామాలను పలికినంత ఫలము) అని తెలిపాడు. నామస్మరణే కలియుగంలో తారకం అని వేద సమస్త వాఙ్మయాలు ఘోషిస్తున్నాయి. అందుకే త్యాగరాజ స్వామి రామకథామృతాన్ని కర్మ బంధనాలను తొలగించుకునే బృహత్సాగర తారకానికి నావగా, కలి దోష హరణంగా చెప్పారు.

ఇటువంటి కీర్తనలను పరిశీలించినప్పుడు నాదోపాసన అనేది ఎంత గొప్పదో అర్థమవ్తుంది. జీవనశైలి-అనుభూతులు-భావ గోచరం-సంగీతం ద్వారా ఆ భావాన్ని వ్యక్తపరచటం...పరిపూర్ణమైన ఆధ్యాత్మిక యానమే. సాద్గుణ్యముతో సాఫల్యాన్ని పొంది సాయుజ్యాన్నిచ్చే శక్తివంతమైన సాధన ఈ నాదోపాసన. ఆ నాదోపాసనలో రామకథామృతం మహత్తును మనకు తెలియజేసిన మహనీయుడు త్యాగరాజు. ఆ సద్గురువులకు నా నమోవాకములు.

మధ్యమావతి రాగంలో త్యాగయ్య ఈ కీర్తనను కూర్చగా ఓ యువ గాయకుడు కృష్ణ నారాయణన్ అద్భుతంగా దానిని ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి