29, మార్చి 2017, బుధవారం

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి - భద్రాద్రి వైభవము




చైత్ర శుద్ధ పాడ్యమి అయిన ఈరోజు భద్రగిరిపై వెలసిన సీతారామలక్ష్మణులకు బ్రహ్మోత్సవాలు ఆరంభం. భద్రాద్రి రాముని వైభవం ఏమని చెప్పను? 17వ శతాబ్దంలో జీవించిన రామభక్తుడు, యోగి కంచెర్ల గోపన్న తన కృతులలో ఆ రాముని, ఆ క్షేత్రాన్ని గురించి ఎన్నో అద్భుతమైన సంకీర్తనల ద్వారా వర్ణించారు. ఆ సీతారాములను నమ్ముకొని ఆయన జీవితంలో ఎదురైన కష్టాలన్నిటినీ దాటి మోక్షాన్ని పొందాడు. భక్త రామదాసుగా పేరొందాడు. తన అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన యానంలో రాముని వేనోళ్ల నుతించాడు. పాహి రామప్రభో అన్నాడు, పలుకే బంగారమాయెనా అని ప్రశ్నించాడు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే అని వేడుకున్నాడు, చరణములే నమ్మితి అని శరణాగతి పలికాడు. ఏతీరుగ నను చూచెదవో అని కష్టాల కడలిని దాటించమని కోరాడు. నను బ్రోవమని చెప్పవే అని సీతమ్మ ద్వారా అర్జీ పెట్టాడు. ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు అని నిందించాడు, వెంటనే దెబ్బలకోర్వక అబ్బా తిట్టితినయ్యా అని ప్రార్థించాడు. తారక మంత్రము కోరిన దొరికెను అని రామ నామ మహిమను చాటాడు. శ్రీరామనామం మరువం అని భజన సాంప్రదాయంలో గానం చేశాడు. ఇలా వేల సంకీర్తనలతో రాముని నుతించాడు. రామనామ స్మరణతో ఈ కర్మభూమి వైభవాన్ని మరింత పవిత్రం చేశాడు.

ఆ రామదాసు భద్రాచల క్షేత్రాన్ని వివరిస్తూ ఇదిగో భద్రాద్రి అన్న సంకీర్తనను మనకు అందించారు. వివరాలు:

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి 

ముదముతో సీతా ముదిత లక్ష్మణులు  కలిసి కొలువగా రఘుపతి యుండెడి

చారు స్వర్ణ ప్రాకార గోపుర 
ద్వారములతో సుందరమై యుండెడి 

అనుపమానమై అతి సుందరమై 
దనరు చక్రము ధగ ధగ మెరిసెడి 

కలి యుగమందున ఇల వైకుంఠముగా
అలరుచున్నది నయముగ మ్రొక్కుడి 

పొన్నల పొగడల పూపొదరిండ్లను 
చెన్ను మీగడను శృంగారంబడు 

శ్రీకరముగ రామదాసును 
ప్రాకటముగ బ్రోచే ప్రభు వాసము 

అర్థము:

గౌతమీ నదీ తీరాన ఉన్న భద్రాద్రి క్షేత్రాన్ని చూడండి! ఆనందముతో సీత, లక్ష్మణుడు కలిసి కొలువగా యున్న రామచంద్రుడెండడి భద్రాదిని చూడండి. అందమైన బంగారు గోపురంతో, ప్రాకారములతో, ద్వారములతో శోభిల్లుతున్న భద్రాద్రి క్షేత్రాన్ని కాంచండి. అనుపమానమై, అత్యంత సుందరమై ధగ ధగ ప్రకాశించే చక్రముతో ఉన్న భద్రాద్రిని చూడండి. కలియుగములో ఈ భువిపై వైకుంఠముగా అలరారే భద్రాద్రి క్షేత్రాన్ని భక్తితో మ్రొక్కండి. పున్నాగ, పొగడ పూల పొదరిళ్లతో మీగడలా అందాన్ని విరజిమ్ముతున్న భద్రాద్రిని దర్శించండి. శుభకరమై రామదాసును ప్రత్యక్షముగా బ్రోచే ఆ రామచంద్రుని వాసమైన భద్రాద్రిని దర్శించండి.



భద్రాద్రి క్షేత్రం:

భద్రుని బ్రోచేందుకు భువిపై ఆ శ్రీహరి వెలసినందుకు ఈ క్షేత్రానికి భద్రాద్రి అని పేరు వచ్చింది.
ప్రస్తుతం తెలాంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. హైదరాబాదునుండి 304 కిలోమీటరలో దూరంలో ఈ క్షేత్రం ఉంది. భద్రాద్రి క్షేత్ర సౌందర్యం, పవిత్రత అనుభవైకవేద్యం. ముఖ్యంగా శరత్తు, శిశిర, హేమంత ఋతువులలో అక్కడి ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతం. పవిత్రమైన గోదావరీ తీరాన సీతారాముల క్షేత్రాన్ని ఆ కంచెర్ల గోపన్న భవ్యమగా నిర్మించాడు. ఆ దేవాలయ నిర్మాణానికైన ఖర్చు కోసం జైలుపాలై, ఆ సీతారాముల అనుగ్రహంతో విముక్తుడై ఈ భద్రాచల క్షేత్రాన్ని, ఆ రాముని మహిమను ఎల్లెడలా చాటాడు. తానీషా ప్రభువు కూడా ఈయన రామభక్తి మహిమను స్వయంగా అనుభూతి చెంది తరించాడు. ఆ రామదాసు నిర్మించిన క్షేత్రం రాముని జన్మ తిథియైన చైత్ర శుద్ధ నవమి నాడు లోకకళ్యాణార్థమై జరిగే సీతారాముల కళ్యాణానికి ప్రసిద్ధి. దశమి నాడు పట్టాభిషేకం జరుగుతాయి. పాలకుల తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఈ కళ్యాణ సమయంలో రామదాసు సమయం నుండి ఉంది. అలాగే, ధనుర్మాస ఉత్సవాలకు కూడా భద్రాద్రి ప్రసిద్ధి. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇక్కడ వైభవోపేతంగా జరుపబడుతుంది. ఈ సందర్భంగా జరిగే పదిరోజుల పండువను అధ్యయనోత్సవాలు అంటారు. ఇదే సందర్భంగా భక్త రామదాసు గౌరవార్థం వాగ్గేయకార ఉత్సవాలు కూడా ఈ క్షేత్రంలో జరుగుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో స్వామికి గోదావరిలో తెప్పోత్సవం కూడా జరుగుతుంది.  ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత సీతాదేవి రాముని వామాంకముపై కూర్చుని ఉంటుంది. ఈ దేవాలయం వెనుక భాగంలో రామకోటి రాసినవారు తమ పుస్తకాలను భద్రపరచే వసతి ఉంది. ఈ రామకోటి పుస్తకాలను నిత్యపూజ చేసి తరువాత గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ప్రతి శనివారం ఉదయం 8:30 గంటలకు సీతారాములకు సువర్ణ తులసి అష్టోత్తరనామార్చన, ప్రతి ఆదివారం నాడు ఉదయం 8:30 గంటలకు సువర్ణ పుష్ప అష్టోత్తరనామార్చన భక్తులు చేసుకోవచ్చు. భద్రాచలానికి 32 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఒడ్డున దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల తప్పక దర్శించవలసిన ప్రదేశం.


భద్రాద్రి ప్రస్తావన:

భక్తరామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న తెలుగుగడ్డపై జన్మించి, అమృత తుల్యమైన సంకీర్తనలను అందించటంతో పాటు ఈ క్షేత్ర నిర్మాణం చేసి రామభక్తి సామ్రాజ్యంలో ఈ దేవస్థానానికి శాశ్వత స్థానాన్ని కలిగించాడు. ఈ భద్రాద్రి రాముని గురించి శ్రీరామకర్ణామృతంలో కూడ ప్రస్తావించారు.

శ్లోకం:

వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే 
చక్రంచోర్ధ్వ కరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

అర్థం:

ఎడమ తొడపై కూర్చుని సీత సేవించగా, ప్రకాశించే కోదండం ఒక చేత, పైచేతిలో చక్రము, కుడిచేతులలో శంఖమును, బాణములను ధరించిన, కలువరేకులవంటి కన్నులు కలిగిన, భద్రాద్రి కొండపై వెలసిన, భుజకీర్తులు మొదలగు వానిచే అలంకరించబడిన, నీలమేఘ శ్యాముడైన రామచంద్రుని భజిస్తున్నాను.

రామదాసుగారు తన దాశరథీ శతకంలో ఈ భద్రగిరి రామునిపై అద్భుతమైన పద్యాలను రచించారు. ఈ శతకంలోని అనేక పద్యాలలో భద్రగరి దాశరథీ కరుణాపయోనిధీ అన్న ముద్రను ఉపయోగించారు. దాశరథీ శతకంలోని మొదటి పద్యం:

శ్రీరఘురామ! చారు తులసీదళ ధామ! శమ క్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజగన్నుత శౌర్య రమా లలామ! దు
ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ! భద్రగిరి దాశరథీ! కరుణా పయోనిధీ!

అర్థం:

ఓ శ్రీరామా! అందమైన తులసిమాలలు ధరించిన, శమదమాది శృంగార గుణములతో ప్రకాశించే, మూడు లోకాలచే నుతించబడిన పరాక్రమ గుణములు కల్గిన, సీతాదేవికి పతియైన, దుష్టులైన కబంధాది రాక్షసులను సంహరించిన, ఈ లోకంలో ప్రజలను కల్మషమనే సాగరాన్ని దాటించే తారక నామము కలిగిన, భద్రగిరిపై వెలసిన కరుణాసముద్రుడవైన దశరథ రామా! నీకు మంగళము.

ఇలా శతకంలోని అన్ని పద్యాలలోనూ ఆ రాముని ఎంతో వైభవంగా వర్ణించారు రామదాసు.  భద్రాచల రామదాసుని, ఆ క్షేత్రాన్ని సద్గురువులు త్యాగరాజస్వామి కూడ తమ సంకీర్తనలలో ప్రస్తావించారు. క్షీర సాగర శయన అనే కీర్తనలో "ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా రామా!" అని రామదాసు తానీషా బందీగా ఉండగా మారువేషంలో సీతారాములు వచ్చి కప్పము చెల్లించి బంధవిముక్తుడిన గావించిన అద్భుతమ మహిమను నుతించారు. అలాగే, త్యాగరాజస్వామి వారి సమాధికి పదిరోజుల ముందు భద్రాద్రి రాముడే స్వప్నంలోకి వచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అభయమిచ్చాడు అని ఆయన "(భద్ర) గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి" ఒక కృతిని రచించారు. అందులో "పదిపూటల పై గాచెదనను  త్యాగరాజ వినుతుని" అని స్పష్టంగా పలికారు. దీనిని బట్టి భద్రాద్రి రాముడు త్యాగరాజస్వామి అవసాన దశలో ఆయనకు స్వప్న సాక్షాత్కారమిచ్చి మోక్షాన్ని కలిగించాడని తెలుస్తోంది.

ముగింపు:

భద్రాద్రి సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలకు ఎంతో మహత్తు ఉంది. ఈ తలంబ్రాలను శిరసున దాల్చిన వారికి పాపక్షయమై దేహాత్మలు శుద్ధి పొందుతాయని అనుభవ పూర్వకంగా పెద్దలు చెప్పారు. అలాగే, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే ఈ కళ్యాణంలో పాల్గొన్నా, కాంచినా కడు పుణ్యమని చెప్పారు. ఒకవేళ భద్రాద్రి వెళ్లటం కుదరకపోయినా, మీకు దగ్గరలో ఎక్కడ సీతారాముల కళ్యాణం జరిగినా, ఆ ఉత్సవంలో పాల్గొని ఆ తలంబ్రాలను శిరసున దాల్చటం సకల శుభకరం. వీలున్నప్పుడు గౌతమీ నది తీరాన ఉన్న భద్రాద్రి రాముని దర్శించి తరించండి!

రామదాసు కీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటనికి బాలమురళీకృష్ణగారు, నేదునూరి కృష్ణమూర్తిగారు, శోభారాజు గారు, మల్లాది సోదరులు వంటి ఎందరో కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఎనలేని కృషి చేశారు. వీరిలో బాలమురళీకృష్ణ గారు పాడిన రామదాసు కీర్తనలు ఎంతో ప్రచారం పొందాయి. ఇదిగో భద్రాద్రి కీర్తనను ఆయన గళంలో వినండి.

శ్రీరామ రామ రామ!







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి