యథో హస్త తథో దృష్టి
యథో దృష్టి తథో మనః
యథో మనః తథో భావ
యథో భావ తథో రసః
చేతులు ఎటువైపు ఉంటాయో దృష్టి అటువైపు; దృష్టి ఎటువైపు ఉంటుందో మనసు అటువైపు. మనసు ఎటువైపు ఉంటుందో భావం అటువైపు. భావం ఎటువైపు చూస్తుందో రసం ఆ భావనతోనే పెల్లుబుకుతుంది.
- నాట్యశాస్త్రం.
నాట్యకళలో ఆంగికం, ఆహార్యం, మనస్సు, భావము, రసము అన్నీ ఏకమై అంశంలో లీనమైతేనే అది రసికుల హృదయాలను తాకి రంగమంటపంపై దివ్యత్వాన్ని రాజిల్లజేస్తుంది. చప్పట్లపైన, పారితోషకం పైన, అవార్డులపైన, ఫోటోలు, వీడియోలపైన దృష్టి కలిగి ఉండే కళాకారులు చేసే నాట్యంలో ఈ దివ్యత్వం ఉండదు. కళ జీవరసంతో ఉట్టిపడదు. అందుకే కళారాధనలో తనను తాను మర్చిపోయి రమించాలి అని సద్గురువులు చెప్పారు. అది భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, ఒడిస్సీ, మణిపురీ, మోహినిఆట్టం వంటి ఏ కళైనా కావచ్చు. కానీ, కళాకారుడు కళలో, భావంలో, స్వరంలో, లయలో తాదాత్మ్యత చెందకపోతే యాంత్రికమైన నృత్యమే అవుతుంది. ఆ నృత్యం కుప్పిగంతులతో సమానమవుతుంది. భారతీయ నృత్యకళలకు ఉన్న ప్రత్యేకత సనాతన ధర్మంలో అంతర్భాగమై ఇహ పరాలను సమానంగా ప్రస్తావించే అంశాలను ప్రదర్శించే అవకాశాన్ని కళాకారులకిస్తాయి. తద్వారా వారి వ్యక్తిత్వాలను పై మెట్టుకు తీసుకువెళతాయి. నేను అన్న భావన కోల్పోయిన అ కళాకారులు పాత్రలో జీవించి భవంతో నర్తించి రసాన్ని అభినయం ద్వారా ప్రవహింపజేస్తారు. అందుకే, ప్రతి ఒక్క అంశమూ కూడా దివ్యత్వాన్ని పొంది రంగస్థలాన్ని ఓ దేవాలయంగా మారుస్తాయి. దీనికి ప్రధన సాధనం గురువు, గురు పరంపర. ఏదో నాలుగు ముద్రలు నేర్పి ఓ రెండు మూడు అంశాలు భావం తెలియజేయకుండా నేర్పే గురువులు ఈరోజు చాలా మంది కనిపిస్తున్నారు. కాస్త గుర్తింపు రాగానే వాళ్లే న్యాయనిర్ణేతలు. వారి శిష్యులకు అసలు కళ, భావం, ఆ కళలోని పవిత్రత, ఆ కళకు మూలాలు తెలియజేసే గురువులు కరువయ్యారు. ఓ నాట్యగురు కావాలంటే నాట్యయోగంలో సిద్ధించాలి. వ్యక్తిత్వం స్థితప్రజ్ఞత పొందాలి. నవరసాలను అలవోకగా ఒలికించగలగాలి. పాషణమైన మనుషుల హృదయాలను కరిగించి మానవత్వాన్ని నింపాలి. మనుషులను ఏకం చేయగలిగే శక్తికి ఇటువంటి గురువులకు, వారికి నైపుణ్యం గల కళలలో ఉంది. నాట్యవిద్యను వ్యాపారధోరణితో కాకుండా ఓ సనాతన పవిత్ర కళగా భావించి తరువాతి తరాలకు ఈ గురువులు అందిస్తే ఈ రసప్రవాహం శాశ్వతమవుతుంది. లేకపోతే భారతీయ నాట్య కళలు రూపాంతరం చెంది సహజమైన శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ సమస్యను కళాతపస్వి కే విశ్వనాథ్ గారు సాగరసంగమం, స్వర్ణకమలం చిత్రాల ద్వారా మనకు చాలా చక్కగా తెలియజేశారు. మన నాట్యకళలకు ఉన్న చరిత్ర, దివ్యత్వం మరే ప్రపంచ కళలకు లేదంటే అతిశయోక్తి కాదు. నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం అన్నారు వేటూరి వారు. నిత్యనర్తనుడైన శివుని పూజకు చివురించిన కళలు వ్యాపారధోరణి పట్టి ప్రమాణాలను కోల్పోకూడదు. దీని గురుతర బాధ్యత నాట్య శాస్త్ర గురువులపైనే ఉంది. పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవటం ప్రధాన లక్ష్యం కాకుండా కళను ఆరాధించి భావాన్ని ఆకళింపు చేసుకొని ఆహార్యంలో గుప్పించగలిగే శిక్షణా పద్ధతిని పునరుద్ధరించి కొనసాగించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి