RightClickBlocker

2, జులై 2016, శనివారం

గంగా స్తోత్రం - గంగమ్మ మహాత్యం రెండవ భాగం


సతోపనాథ్ భాగీరథ్ ఖరక్ హిమానీనదాల కలయిక వద్ద ఉత్తరాఖండ్‌లో పుట్టిన అలకనంద పవిత్ర బదరీనాథ్ క్షేత్రం గుండా ప్రవహిస్తూ దాదాపు 190 కిలోమీటర్ల పాటు హిమాలయాలలో తన హొయలు ఒలికిస్తూ ఉంటుంది. దీని ఉపనదులు నందాకిని, మందాకిని, పిందర్. గర్వాల్ ప్రాంతంలోని ఐదు ప్రాంతాలలో ఐదు ఉపనదులను కలుపుకుంటుంది. అవి విష్ణుప్రయాగ వద్ద ధవళగంగ, నందప్రయాగ వద్ద నందాకిని, కర్ణప్రయాగ వద్ద పిందర్, రుద్రప్రయాగ వద్ద మందాకిని, దేవప్రయాగ వద్ద భాగీరథి నదులు. ఈ పంచ సంగమ క్షేత్రాలు ఉత్తరాఖండ్ గంగాయనంలో పవిత్రమైనవి. దేవప్రయాగ వద్ద భాగీరథితో కలసిన తరువాత అలకనంద గంగానదిగా పిలువబడుతుంది. హిమాలయ పర్వతాల గుండా దాదాపు 250 కిలోమీటర్లు ప్రవహించి ఋషీకేష్ వద్ద మైదాన ప్రాంతాలలో ప్రవేశిస్తుంది. ఈ మొత్తం దూరమూ గంగమ్మ ఎత్తైన పర్వతాల మధ్య చాలా లోతైన లోయలలో మెలికలు తిరుగుతూ నాగకన్యలా ఉంటుంది. పల్లం కావటంతో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. హృషీకేశ్ నుండి హరిద్వార్, అక్కడినుండి ఉత్తరప్రదేశ్‌లో 800 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ పావన గంగ మహాత్యం వివరాలు మరిన్ని తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్‌లోని దేవభూమిలో అలకనంద-భాగీరథుల ప్రవాహం చూస్తే మీకు గంగమ్మ ఎందుకు ప్రత్యేకమైనదో అర్థంవుతుంది. ఇక్కడి చాలా ప్రాంతాలకు ఇంకా రోడ్లు లేవు. యోగులు, సిద్ధులు, సన్యాసులు, బైరాగులు ఈ ప్రాంతాలలో హాయిగా తిరుగుతూ ఈ గంగమ్మ జడపాయల సోయగాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పలేనన్ని జలపాతాలు, అనంతమైన ప్రకృతి సౌందర్యాలు.  మంచి, చలి, వాన లెక్క చేయక వీళ్లు వందల కిలోమీటర్లు కొండలు ఎక్కుతూ దిగుతూ అడవుల గుండా నడుస్తూ ఉంటారు. ఆ భూమే వారి నివాసం. ఆ గంగమ్మ ఆనవాళ్లే వారికి భృతి ద్యుతి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ దేవభూమిలో నివసిస్తారు. అంతటి మహోన్నతమైన ప్రాకృతిక జీవనానికి మూలం గంగానది.

హరిపాదాన పుట్టావంటే గంగమ్మ శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మ
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా! కడలి కౌగిలిని కరిగావంటే గంగమ్మా!
నీ రూపేదమ్మా! నీ రంగేదమ్మా! నీ రూపేదమ్మా! నీ రంగేదమ్మా!
నడిసంద్రంలో నీ గడపేదమ్మా! గంగమ్మా!
నీలాల కన్నుల్లో సంద్రమే! నింగి నెలవంక సంద్రమే!

అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గంగమ్మను వర్ణిస్తూ అద్భుతమైన గీతాన్ని శుభసంకల్పం చిత్రానికి అందించారు. ఆ హారి పాదాన పుట్టిన గంగ, శివుని శిరమున నిలచి, భువిలో అవతరించి  మనలను తరిస్తోంది. గంగమ్మను నుతిస్తూ అనేక స్తోత్రాలు మన కాలగమనంలో వచ్చాయి. అటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం ఈ పోస్టులో. దీనిని ఆదిశంకరులు రచించారు అని చాలా చోట్ల చెప్పబడింది. కానీ, శంకరులు తమ ఇతర రచనలలో ఎక్కడా పేరును ఉపయోగించలేదు. ఈ స్తోత్రంలో ఉంది. స్తోత్ర ధార మరియు భావం కూడా శంకరుల రచనలా అనిపించటం లేదు. ఆయన శిష్య పరంపరలో ఎవరైనా రచించారేమో అనుకుంటున్నా. అయినా, అద్భుతమైన స్తోత్రం.


దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే
శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే

భాగీరథి సుఖదాయిని మాతః తవ జల మహిమా నిగమే ఖ్యాతః
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం

హరిపదపాద్య తరంగిణి గంగే హిమవిధుముక్త ధవళ తరంగే
దూరీ కృత మమ దుష్కృతి భారం కురు కృపయా భవసాగరపారం

తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః

పతితోద్ధారిణి పావని గంగే ఖండిత గిరివరమండిత భంగే
భీష్మజనని హే మునివర కన్యే పతిత నివారిణి త్రిభువన ధన్యే

కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే
పారావారిణి విహరిణి గంగే విముఖయువతికృతతరళాపాంగే

తవ చేన్మాతః స్తోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే

పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే
ఇంద్రమకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే

రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపం
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే

అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే
తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః

వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః
అథవా శ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః

భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే
గంగాస్తవమివమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యం

యేషాం హృదయే గంగా భక్తిః తేషాం భవతి సదా సుఖముక్తిః
మధురాకాంతా పజ్ఝటికాభిః పరమానంద కలిత లలితాభిః

గంగాస్తోత్రమిదం భవసారం వాంఛిత ఫలదం విమలం సారం
శంకరసేవక శంకరరచితం పఠతి సుఖీ స్తవ ఇతి చ సమాప్తః

ఓ సుర గంగా! భగవతీ! నీ ప్రవహించే తరంగాలతో ముల్లోకాలనూ తరించే తల్లీ! శంకరుని శిరమున విహరించే విమల గంగా! నా మనసు ఎల్లప్పుడూ నీ పదకమలములనే ధ్యానించు గాక!

ఓ భాగీరథీ! అందరికీ సుఖమును కలిగించే మాతా! నీ జలము యొక్క మహిమ వేదములలో నుతించబడినది. నీ మహిమ నాకు తెలియదు. అజ్ఞానునడైన నాపై కరుణ కురిపించి కాపాడుము!

శ్రీహరి పాదముల వద్ద పాద్యమైన ఓ గంగా!  మంచు వలె, చంద్రుని వలె, ముత్యము వలె ధవళకాంతితో ప్రకాశించే తరంగాలు కలిగిన అమ్మా! నా పాపములన్నిటినీ తొలగించి ఈ సంసార సాగరాన్ని దాటేలా అనుగ్రహించు!

ఓ గంగా మాతా! నీ శుద్ధమైన జలాన్ని స్వీకరించిన వారికి ముక్తి తప్పక లభిస్తుంది. నీ భక్తులను యమ ధర్మరాజు కూడా ఏమీ చేయలేడు.

ఓ జాహ్నవీ! పతితులను ఉద్ధరించే తల్లివు నువ్వు. హిమాలయాలను ఛేదిస్తూ ప్రవహించే నీ శోభ ఎంతో గొప్పది. భీష్ముని తల్లి, జహ్ను మహర్షి కుమార్తె అయిన నీవు ముల్లోకవాసులను భ్రష్టుత్వం బారి నుండి కాపాడుతున్నావు.

ఓ గంగా! నిన్ను పూజించే వారి కామ్యములను తీర్చే కల్పవృక్షానివి నీవు. నీ శరణు కోరేవారికి శోకమే ఉండదు. ప్రియుని చేర తపించే ప్రేయసిలా సాగరంలో కలువటానికి నీ పరుగులు సాగుతుంటాయి.

నిన్ను దర్శించి, స్తుతించి, నీ పావన జలతరంగాలలో స్నానం చేసిన వారికి మరల జన్మ లేదు. నరక ప్రాప్తిని నివారణ మరియు దోషాలను తొలగించే మహత్తు కల తల్లివి నీవు.

ఓ కరుణామయి గంగా! నీవు పుణ్యమైన తరంగాలనే అవయవములు కలదానవు. నీ పాదములు ఇంద్రుని కిరీటముచే అలంకరించబడినవి. నీ శరణు కోరిన వారికి సుఖము, శుభము కలిగించెదవు.

ఓ భగవతీ! నాలోని రోగాలను, శోకాన్ని, తాపమును, పాపములను, దుష్ట బుద్ధిని హరింపజేయుము. ముల్లోకములకు సారము నీవు, ఈ ధాత్రికి హారము వంటి దానవు. ఈ సంసార సాగరాన్ని దాటటానికి నీవే దిక్కు.

ఓ అలకనందా! పరమానందము కలిగించే తల్లీ! భీతావహులను కరుణతో అనుగ్రహిస్తావు. నీ ఒడ్డున నివసించే వారు వైకుంఠంలో నివసించే వారితో సమానం.

నీ నీటిలో తాబేలు లేదా చేపలా, నీ ఒడ్డున పేదవానిగా జీవించటం నీకు దూరంగా రాజువలె జీవించటం కన్నా ఎంతో ఉత్తమం.

ఓ భువనేశ్వరీ! జాహ్నవీ! నీవు పుణ్యకారిణివి, ధన్యవు. నీ స్తోత్రాన్ని పఠించే వారికి విజయం తథ్యము.

మనసులో గంగ పట్ల భక్తి కలిగియున్న వారికి సుఖము మరియు ముక్తి కలుగుతాయి. సుందరమైన, లలితమైన ఈ పదఝటి పరమానంద కారకము.

శివభక్తుడైన శంకరాచార్యులచే రచించబడిన ఈ గంగాస్తోత్రం కోర్కేలను తీర్చేది, విమలమైనది, సారవంతమైనది. పఠించేవారికి సుఖాన్ని కలిగించేది.

శివకేశవుల శక్తి కలిగినది కాబట్టే గంగ అంత పవిత్రమైన నదిగా అనాదిగా ఈ కర్మభూమిని కాపాడుతోంది. భగవతి అని ఆమెను కొలిచారంటేనే పరాశక్తిగా ఆమెను గుర్తించినట్లే కదా! మన సాంప్రదాయంలో పుణ్యవతులైన స్త్రీలను గంగాభాగీరథీ సమానురాలుగా చెప్పటం గంగమ్మకు మన జీవనశైలిలో ఉన్న స్థానాన్ని చెబుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో గంగా-దశహరా అని నవరాత్రులు జరుపుకుంటారు. మనలోని పదిరకాల పాపాలను తొలగించే తల్లిగా ఆమెను కొలుస్తారు. గంగానదికి భారతీయ సనాతన ధర్మంలో ఉన్న స్థానం ఆ నదీ పరీవాహక ప్రాంతాలు పర్యటిస్తే తెలుస్తుంది. ఆ వివరాలు తరువాయి భాగాలలో తెలుసుకుందాం.

ఆకాశవాణి భక్తిరంజనిలో దశాబ్దాల క్రితం ప్రసారమైన ఈ గంగాస్తోత్రం శ్రవణం వినండి. దీనిని ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారిణులు అరుంధతి సర్కార్, ఇందిరా కామేశ్వరరావు, సునందా శాస్త్రి, జోగుళాంబ గారు ఆలపించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి